జనాభాలో 80-90% ఉన్న శ్రామిక ప్రజల సగటు వాస్తవ ఆదాయం, మొత్తం జనాభా సగటు ఆదాయం కంటే మెరుగైన సూచికగా ఉంటుంది.
1776లో ఆడమ్ స్మిత్ తన గ్రంథంలో సంపద పెరుగుదలను ఒక దేశం అనుసరించే విధాన ఆవశ్యకతగా పేర్కొన్నప్పుడు, వివిధ వర్గాల మధ్య ఆదాయ పంపిణీకి ప్రాముఖ్యత లేదని ఆయన సూచించలేదు.
అదేవిధంగా, డేవిడ్ రికార్డో కూడా కార్మికుల జీవన పరిస్థితుల మెరుగుదల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యంగా లేరు.
కానీ స్మిత్, రికార్డో అనే ఈ ఇద్దరు ఆర్థికవేత్తలు, ఒక దేశ సంపద పరిమాణంపై మాత్రమే దృష్టి పెట్టడానికి ఆదాయ పంపిణీని విస్మరించారు.
ఎందుకంటే వారి దృష్టిలో ఆదాయ పంపిణీ అనేది ఒక విధానపరమైన అంశం కాదు.
వాస్తవానికి, సాంప్రదాయ రాజకీయ ఆర్థిక శాస్త్రం సాధారణంగా వేతనాలను జీవనాధార స్థాయికి ముడిపడి ఉన్నవిగా చూసింది.
ఎందుకంటే అది, మాల్తూసియన్ జనాభా సిద్ధాంతం ప్రకారం, జీవనాధార స్థాయి కంటే వేతనాలు పెరిగితే జనాభా పెరుగుదల ఎక్కువ అవుతుందని, తద్వారా డిమాండ్‌కు అనుగుణంగా కార్మిక సరఫరా పెరిగి వేతనాలను తిరిగి జీవనాధార స్థాయికి తీసుకువస్తుందని నమ్మింది.
దీంతో, ఆదాయ పంపిణీలో మెరుగుదల అనేది శ్రామిక జనాభా అలవాట్లపై ఆధారపడి ఉంటుంది కానీ అది ప్రభుత్వ విధానానికి సంబంధించిన విషయం కాదు.
ప్రభుత్వం కేవలం మూలధన నిల్వను, తద్వారా ఆదాయాన్ని పెంచడానికి మాత్రమే దోహదపడగలదు.
నయా-ఉదారవాద పెట్టుబడిదారీ విధానం – కార్మిక వ్యతిరేక ధోరణి..
సంపద, ఆదాయాన్ని ఆకాంక్షనీయమైనవిగా భావించే సాంప్రదాయవాద దృష్టి, ఆదాయ పంపిణీ విషయంలో రాజ్యం పెద్దగా ఏమీ చేయలేదనే నమ్మకంపై ఆధారపడి ఉంది.
ఆదాయ పంపిణీని ప్రభావితం చేయగలిగినప్పటికీ, రాజ్యం కేవలం ఆదాయ పరిమాణం గురించే ప్రత్యేకంగా ఆందోళన చెందాలి.
నిజానికి, మొత్తం ఆదాయాన్ని పెంచే అవకాశాలను మెరుగుపరిస్తే, ఆదాయ పంపిణీని మరింత దిగజార్చేలా కూడా చేయాలనే అభిప్రాయం ఇటీవలి కాలానికి చెందినది.
వాస్తవానికి, ఇది నయా-ఉదారవాద పెట్టుబడిదారీ విధానపు భావజాలాన్ని వ్యక్తపరుస్తుంది. దీనికి ఏమాత్రం సాంప్రదాయవాద మూలాలు లేవు.
నయా-ఉదారవాదం కింద మూలధనం ప్రపంచీకరణ చెందుతుండగా, శ్రమ నిర్దిష్ట దేశాలకే పరిమితమై ఉన్నందున, ఇతర దేశాలతో పోలిస్తే అధిక మూలధన సంచయనం జరగాలంటే మూలధనానికి మరింత ఆకర్షణీయమైన వాతావరణాన్ని సృష్టించడం అవసరమని భావిస్తారు.
ఈ మరింత ఆకర్షణీయమైన వాతావరణంలో తక్కువ వేతనాలు ఒక ప్రధాన అంశంగా ఉంటాయి.
నయా-ఉదారవాద పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించే దేశాలు, అధిక జీడీపీ వృద్ధిని సాధించడం కోసం, కార్మికుల వేతనాలను తగ్గించి, వారి హక్కులను అణచిపెట్టేందుకు తప్పనిసరిగా కార్మిక వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తాయి.
జీడీపీ వృద్ధి రేటే అభివృద్ధికి గీటురాయి కాకూడదు..
స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి పరంగా మాత్రమే ఆర్థిక అభివృద్ధిని నిర్వచించడం అనేది సాంప్రదాయ రాజకీయ ఆర్థిక శాస్త్రం ప్రకారం సమర్థించబడదు.
అలాగే అది అధికశాతం ప్రజల ప్రయోజనాలకు కూడా అనుకూలమైనది కాదు.
ఇది కేవలం ఏకస్వామ్య పెట్టుబడి సిద్ధాంతాన్ని, తద్వారా ఏకస్వామ్య పెట్టుబడి సర్వోన్నతంగా ఉండే నయా-ఉదారవాద పెట్టుబడిదారీ విధానాన్ని మాత్రమే సూచిస్తుంది.
జీడీపీ వృద్ధినే ఆర్థికాభివృద్ధిగా గుర్తించడమనే ఈ సైద్ధాంతిక వైఖరిని బ్రెటన్ వుడ్స్ సంస్థలు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు పట్టుదలతో ప్రోత్సహించాయి.
దాని ఆధిపత్యమే, వారు ప్రారంభించిన అభివృద్ధి అర్థశాస్త్రంలోని సైద్ధాంతిక ప్రతి-విప్లవానికి కీలకమైంది.
అయితే విషాదం ఏమిటంటే, సాంప్రదాయ అర్థశాస్త్రం బోధించింది ఇదేననే తప్పుడు అభిప్రాయంతో, చాలా మంది ప్రగతిశీల ఆర్థికవేత్తలు సైతం ఈ ఉచ్చులో పడ్డారు.
దీంతో, జీడీపీ వృద్ధిని ఆర్థికాభివృద్ధిగా గుర్తించడాన్ని తిరస్కరించడమే ఏ నిష్పాక్షిక విమర్శనాత్మక ఆలోచనకైనా మొట్టమొదటి అడుగు కావాలి.
అర్థమేంటంటే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలే కాకుండా, గ్లోబల్ సౌత్ ప్రభుత్వాలు కూడా దేశాల ఆర్థిక “విజయాన్ని” అంచనా వేసే ప్రమాణాన్ని పూర్తిగా తిరస్కరించడమే.
పెరుగుతున్న ఆదాయ అసమానతలు, అదృశ్యమవుతున్న పేదరిక లెక్కలు..
నయా ఉదారవాద యుగంలోని భారత ప్రభుత్వాలు, ఆర్థిక “విజయాన్ని” అంచనా వేయడానికి జీడీపీ వృద్ధిని ఏకైక ప్రమాణంగా ఉపయోగించుకున్నాయి.
అంతేకాక, నయా ఉదారవాద పాలనలో జీడీపీ వృద్ధి రేటు వేగవంతమైందనే కారణంతో, దానికి ముందున్న నియంత్రిత పాలనపై తమ పాలన ఆధిక్యతను ప్రకటించుకున్నాయి.
నయా ఉదారవాద పాలనలో ఆదాయ అసమానతలు, చివరికి సంపూర్ణ పోషకాహార లోపం కూడా బాగా పెరిగినప్పటికీ వారు ఈ విధంగా చేశారు.
ఉదాహరణకు వరల్డ్ ఇనీక్వాలిటీ డేటాబేస్ ప్రకారం, స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశ జనాభాలోని అగ్రశ్రేణి 1% వాటా జాతీయ ఆదాయంలో 12%గా ఉంది.
నియంత్రిత పాలన కాలమైన 1982 నాటికి అది 6%కి పడిపోగా, నయా-ఉదారవాద కాలంలో అది 2022-23 నాటికి 23%కి పైగా పెరిగింది.
గత వంద సంవత్సరాలలో ఇదే అత్యధిక స్థాయి.
అదేవిధంగా, భారతదేశంలో పేదరికంపై అధ్యయనాలు ప్రారంభమైన 1973-74 నుంచి 1993-94 మధ్య, గ్రామీణ పేదరికాన్ని నిర్వచించడానికి నాటి ప్రణాళికా సంఘం ప్రమాణంగా నిర్దేశించిన రోజుకు ఒక వ్యక్తికి 2,200 కేలరీలు అందుబాటులో లేని గ్రామీణ జనాభా నిష్పత్తి దాదాపు స్థిరంగా ఉంది.
ఇది 1993-94లో 58% నుంచి 2011-12లో 68%కి, 2017-18కి 80%ని కూడా మించిపోయింది.
పేదరికం ఆ విధంగా అత్యధికంగా పెరగడంతో భారత ప్రభుత్వం ఆ సంవత్సరానికి సంబంధించిన డేటాను పబ్లిక్ డొమైన్ నుంచి ఉపసంహరించుకుని, భవిష్యత్ డేటా సేకరణ పద్ధతిని పూర్తిగా మార్చేసింది.
పట్టణ పేదరికాన్ని నిర్వచించడానికి ఒక ప్రామాణిక కొలమానమైన, రోజుకు ఒక వ్యక్తికి 2,100 కేలరీలు అందుబాటులో లేని పట్టణ జనాభా వాటా 1993-94లో 57% నుంచి 2011-12లో 65%కి పెరిగింది(ఉత్సా పట్నాయక్, ఎక్స్‌ప్లోరింగ్ ది పావర్టీ క్వశ్చన్).
ఏదేమైనప్పటికీ ఈ పరిశోధనలన్నీ, నయా-ఉదారవాద కాలంలో భారతదేశం చాలా ఆకట్టుకునే “ఆర్థిక అభివృద్ధి”ని సాధించిందనే వాదనకు ఎటువంటి తేడాను కలిగించవు!
బంగ్లాదేశ్ తలసరి జీడీపీ వృద్ధి – ఒక అసంబద్ధ ఉదాహరణ..
ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీపీ వృద్ధిపై భారత ప్రభుత్వం నొక్కి చెప్పడంలోని అసంబద్ధత మరో విషయం ద్వారా వెల్లడవుతుంది.
బంగ్లాదేశ్ తలసరి జీడీపీ భారతదేశం కంటే స్వల్పంగా ఎక్కువగా ఉందని ఐఎంఎఫ్ తన అంచనాను వెలువరించింది.
ఆర్థికాభివృద్ధిని నిర్వచించే దాని ప్రమాణం ప్రకారం, బంగ్లాదేశ్ నేడు భారతదేశం కంటే కొంచెం ఎక్కువ అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు.
అయినప్పటికీ, ప్రధానమంత్రి నుంచి మొదలుకొని హిందుత్వ వర్గాలన్నీ భారతదేశంలోకి బంగ్లాదేశ్ చొరబాటుపై గొంతు బొంగురు పోయేలా అరుస్తున్నాయి.
కొందరు చొరబాటుదారులను బంగ్లాదేశ్‌లోకి “తిరిగి నెట్టివేయాలి” అని కూడా డిమాండ్ చేస్తున్నారు.
అంటే ఎక్కువ అభివృద్ధి చెందిన దేశం నుంచి తక్కువ అభివృద్ధి చెందిన దేశానికి, లేదా దాదాపు ఒకే స్థాయి అభివృద్ధి ఉన్న ఒక దేశం నుంచి మరొక దేశానికి పెద్ద ఎత్తున చొరబాటుదారులు ఎందుకు వస్తారు? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.
కాబట్టి, బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి పెద్ద ఎత్తున చొరబాటు జరుగుతోందన్న హిందుత్వ శక్తుల వాదనలు తప్పు, లేదా ప్రభుత్వం చెప్పే తలసరి జీడీపీ ఆర్థికాభివృద్ధికి ఏమాత్రం సరిపోని సూచిక.
నిజమైన ఆర్థికాభివృద్ధికి సూచిక ఏమిటి?
అప్పుడు ఆర్థిక అభివృద్ధికి సూచిక ఏమిటి? అనే ప్రశ్న తలెత్తుతుంది. మేము
ఈ ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఇవ్వము. కానీ ఉదాహరణ కోసం, బ్రెట్టన్ వుడ్స్ సంస్థలు ప్రస్తుతం ప్రోత్సహిస్తున్న, భారత ప్రభుత్వం ఆమోదించిన తలసరి జీడీపీ కంటే స్పష్టంగా మెరుగైన ఒక స్పష్టమైన సూచికను మాత్రమే ప్రస్తావిస్తాము.
ప్రజాస్వామ్య రాజ్యాంగం ఉన్న దేశంలో, రాజకీయ అధికారాన్ని ప్రజల చేతుల్లో ఉంచుతుంది.
ప్రజల ఆర్థిక సాధికారత సమాంతర ప్రక్రియ ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన ఏ భావనకైనా సారాంశం అయి ఉండాలి.
జనాభాలో అత్యధిక మెజారిటీగా ఉన్న శ్రామిక ప్రజల సగటు ఆదాయం, మొత్తం జనాభా సగటు ఆదాయం కంటే ఎక్కువగా ఉంటుంది.
ఎందుకంటే ఎలాంటి నియంత్రణ లేని పెట్టుబడిదారీ విధానంలో, దేశ జనాభాలో 1% లేదా 10%గా ఉన్న సంపన్నులకు, మిగిలిన వారికి మధ్య పెరుగుతున్న భారీ వ్యత్యాసాన్ని సగటు ఆదాయం కప్పిపెడుతుంది. శ్రామిక ప్రజల సగటు ఆదాయాన్ని అంచనా వేయడంలో అనేక సమస్యలు ఉంటాయి.
అయితే వీటిని అధిగమించవచ్చు. ప్రారంభంగా, మనం జనాభాలో దిగువ 80% లేదా 90% మంది సగటు వాస్తవ ఆదాయంలో పెరుగుదలను ఒక దేశం ఆర్థిక అభివృద్ధికి సూచికగా తీసుకోవచ్చు.
దీన్ని ఒక ఉదాహరణ ద్వారా చూడవచ్చు. 1982 నుంచి 2022-23 మధ్య 40 సంవత్సరాల కాలంలో జాతీయ ఆదాయం సగటున 6.5% వార్షిక వృద్ధి రేటును సాధించింది అనుకుందాం.
వరల్డ్ ఇనీక్వాలిటీ డేటాబేస్ అంచనా వేసిన ఆదాయ పంపిణీ సరైనదని భావిస్తే, అప్పుడు జనాభాలోని అగ్రశ్రేణి 1% వారి తలసరి ఆదాయ వార్షిక వృద్ధి రేటు 5.5% కాగా, దిగువ 99% వారిది కేవలం 1.5% మాత్రమే ఉంటుంది. అప్పుడు మొత్తం జనాభా సగటు 2%గా ఉంటుంది.
ఈ విధంగా అల్పాదాయం కలిగిన 90 శాతం ప్రజల 1.5% ఆదాయాన్ని, సంపన్న వర్గాల 5.5% ఆదాయాన్ని కలిపి జీడీపీ పూర్తి రేటుగా పరిగణించడం తప్పుదోవ పట్టించడమేనని స్పష్టంగా అర్థం అవుతున్నది.
రాజకీయ ప్రజాస్వామ్యానికి పొంచివున్న ముప్పు – డా బీఆర్ అంబేద్కర్ హెచ్చరిక..
ప్రజలకు రాజకీయంగా అధికారం కల్పించే రాజ్యాంగంపై ప్రమాణం చేసి, ప్రజలను ఆర్థికంగా శక్తిహీనులను చేసినప్పటికీ, విజయవంతమైన ఆర్థిక అభివృద్ధిని సాధించినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు.
శ్రామిక ప్రజల సగటు వాస్తవ ఆదాయంలో పెరుగుదలను అభివృద్ధికి సూచికగా తీసుకున్నట్లయితే మన దేశం వాస్తవంగా ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లుగా భావించబడతామా? శ్రామిక వర్గం దీన్ని అర్థం చేసుకోవాలి.
బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగాన్ని సమర్పిస్తూ రాజ్యాంగ సభలో చేసిన తన చివరి ప్రసంగంలో, ఈ వైరుధ్యాన్ని ఎత్తిచూపి, దీనిని అధిగమించకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని సరిగ్గానే హెచ్చరించారు.
ఈ వైరుధ్యాన్ని అధిగమించే దిశగా వేయగల మొట్టమొదటి అడుగు, దేశ ప్రజల మధ్య జరిగే చర్చలో ఆర్థికాభివృద్ధికి సంబంధించిన సరైన భావనను ప్రవేశపెట్టడమే అవుతుంది.
(రచయిత డాక్టర్ ప్రభాత పట్నాయక్, న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఆర్థిక అధ్యయనాలు, ప్రణాళికల కేంద్రంలో ప్రొఫెసర్ ఎమెరిటస్. ఈ అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతమైనవి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
