మహిళల రిజర్వేషన్ల అమలుకు లోక్‌సభ సీట్ల సంఖ్యను 850కి పెంచే రాజ్యాంగ సవరణ బిల్లును ఏకమై పోరాడిన ప్రతిపక్ష పార్టీలు తిరస్కరించాయి.
న్యూ ఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును మళ్ళీ పార్లమెంటులో ప్రవేశపెడితే డీఎంకే(ద్రావిడ మున్నేట్ర కజగం) ఏ వైఖరి అవలంబిస్తుందనే ఊహాగానాల మధ్య- ప్రస్తుత రూపంలో ఉన్న ఆ బిల్లును తాము ఇంకా వ్యతిరేకిస్తున్నామని డీఎంకే ప్రకటించింది.
న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ సభ్యుడు ఏ రాజా మాట్లాడుతూ “ప్రస్తుత రూపంలో ఉన్న డీలిమిటేషన్ బిల్లును సూత్రప్రాయంగా మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాము” అని చెప్పారు.
అలాగే రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
పత్రికతో మాట్లాడుతూ.. “మా డిమాండ్లు యథాతథంగా ఉన్నాయి, వారు కొత్త బిల్లును ఏ విధంగా తీసుకొస్తారో మేము చూడాలి” అని రాజా అన్నారు.
మారిన రాజకీయ సమీకరణాలు..
ఇటీవల డీఎంకే ఇండియా కూటమి నుంచి వైదొలిగిన తరువాత ఆ పార్టీ డీలిమిటేషన్‌పై తీసుకునే వైఖరి ప్రత్యేకంగా చర్చనీయాంశం అయింది.
ఇందుకు కారణం కాంగ్రెస్ పార్టీ టీవీకే(తమిళగ వెట్రి కజగం)తో పొత్తు పెట్టుకోవడమే. ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతి పెద్ద పార్టీగా అవతరించి కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ప్రతిపక్షాల ఐక్యతతో వీగిన బిల్లు..
ఏప్రిల్ నెలలో గత 12 సంవత్సరాలలో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేయడంలో విఫలమైంది.
మహిళల రిజర్వేషన్‌ను ప్రయోగంలోకి తేవడానికి లోక్‌సభ సీట్ల సంఖ్యను 850కి పెంచాలని ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఏకీకృతమైన ప్రతిపక్షం ఓడించింది.
ది వైర్ నివేదించిన ప్రకారం రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు 2026 దానితో పాటు వచ్చిన డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభ బలాన్ని 850కి పెంచడమే కాకుండా పార్లమెంటరీ సమీకరణాలను ప్రాథమికంగా మార్చి కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మార్చే భారీ మార్పులను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఆ సమయంలో కాంగ్రెస్‌తో పొత్తులో ఉండి ఇండియా కూటమిలో భాగమైన డీఎంకే ఆ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది.
మూడో కూటమి దిశగా అడుగులు..
“మేము ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చామన్న కారణంతో బీజేపీతో పొత్తు పెట్టుకోబోము” అని ఒక సీనియర్ డీఎంకే నాయకుడు అన్నట్లు న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.
ప్రతిపక్ష పార్టీలతో డీఎంకే సంప్రదింపులు జరుపుతోందని, మూడో కూటమిని ఏర్పాటు చేసేందుకు చురుకుగా కృషి చేస్తోందని ఆ నాయకుడు తెలిపారు.
ప్రధాన డిమాండ్..
డీఎంకే ప్రధాన డిమాండ్ ఏమిటంటే, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ప్రస్తుత జనాభా గణాంకాలతో ముడిపెట్టకూడదు. అలా చేయడం వల్ల జనాభాను చురుకుగా నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించినట్టే అవుతుంది.
“జనాభాను 1971 నుంచి ప్రామాణికంగా తీసుకోవాలి, కేంద్రం ఈ నిలుపుదలను మరో 25 సంవత్సరాల పాటు పొడిగించాలి” అని ఒక డీఎంకే ఎంపీ వార్తాపత్రికకు తెలిపారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
