పర్యావరణ వేత్తలకు ఓ భయం వెంటాడుతోంది. వాళ్ళ అంచనాలు తప్పని ఎప్పుడు రుజువు అవుతాయా అన్నదే ఆ భయం. కానీ ఆ అంచనాలు అక్షరాలా రుజువైతే మాత్రం మానవాళికి మిగిలేది దుర్దశే.
నన్ను కూడా ఓ భయం వెంటాడుతోంది: ప్రపంచ ఆహార వ్యవస్థ ఎప్పుడు కుప్పకూలుతుందా అన్నదే ఆ భయం.
ఇంతటి విశాల ప్రపంచంలో జరుగుతున్న అనేక పరిణామాల్లో ఏది ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు తెచ్చిపెడుతుందో ఇదమిత్థంగా నిర్ధారించడం అంచనా వేయడం, హెచ్చరించడం మిలియన్ డాలర్ల ప్రశ్నే.
అయితే ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధం అటువంటి కారణాల్లో ఒకటయ్యే అవకాశం లేకపోలేదు.
దశాబ్దాల తరబడి సేకరించిన గణాంకాల ఆధారంగా ఇటువంటి పెను విపత్తు పొంచి ఉందని వాదిస్తూ వచ్చాను.
2023లో పర్యావరణ మార్పులు – ఆహార భద్రత అన్న అంశంపై అధ్యయనం చేస్తున్న పార్లమెంటరీ కమిటీకి సవివరమైన పత్రం సమర్పించాను.
ఆ అధ్యయనంలో నన్ను కూడా ఒక సాక్షిగా పిలిచారు.
పార్లమెంటరీ కమిటీ భావిస్తున్న పరిధి కంటే ఈ సమస్య విస్తృతి చాలా ఎక్కువ అని వివరించే ప్రయత్నం చేశాను.
ఆహార భద్రతపై ద్రవ్య పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రభావం..
ఆ అధ్యయన బృందంలో ఉన్న కొందరు నా వివరణతో ఏకీభవించినా ప్రభుత్వం సహజంగానే మన ముందున్న సవాలు తీవ్రతను అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు.
ప్రపంచ ఆహార భద్రత 2008కు ముందున్న ప్రపంచ ద్రవ్య పెట్టుబడి వ్యవస్థలాగానే చాలా పెళుసుగా మారుతోంది.
ప్రపంచ ఆహార భద్రత ఎదుర్కొంటున్న బహుముఖ సవాళ్లను అంచనా వేయడం సులభమే, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనంతో ఎరువుల సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
అదే విధంగా పర్యావరణ సమస్యలతో తలెత్తే వైపరీత్యాలు కూడా ఓ మేరకు అర్థమవుతాయి.
ఇటువంటి అవాంతరాలే యావత్ ప్రపంచాన్ని ఆహార అభద్రత వైపు నెడతాయి. కానీ అవే అసలు ముప్పు కాదు.
అసలు సమస్య ఏమిటంటే యావత్ ఆహార వలయం, దాని చుట్టూ ఏర్పరచుకున్న రక్షణ కవచం కరిగిపోవడం మొదలుపెట్టింది.
ప్రపంచ ద్రవ్య పెట్టుబడి నిర్మాణాన్ని నేలకూల్చిన అంశాలు, కారణాలే ముందుముందు ప్రపంచ ఆహార వ్యవస్థ మనుగడకు సవాలు విసరనున్నాయి.
లక్షల కోట్ల డాలర్ల విలువైన ప్రభుత్వ చేయూత లేకపోతే నేడు మనం చూస్తున్న ద్రవ్య పెట్టుబడి నిర్మాణాలు ఇలా కొనసాగేవి కాదు.
గుత్తాధిపత్యం – ఆర్థిక కేంద్రీకరణ..
తాజా సమాచారం ప్రకారం యావత్ ప్రపంచం, ప్రపంచంలోని అన్ని వ్యవస్థలు కొన్ని కంపెనీల కబంధ హస్తాల్లో బందీ అయ్యాయి, కేంద్రీకృతమయ్యాయి.
ఈ కబంధ హస్తాలు విశ్వవ్యాప్తంగా నిట్టనిలువునా సమాంతరంగా అభివృద్ధి విస్తరించాయి.
తాజాగా వెల్లడైన ఓ అధ్యయనం ప్రకారం, అమెరికాలో ఆహార సరఫరా వ్యవస్థ కూడా ద్రవ్య పెట్టుబడిదారీ వ్యవస్థ కేంద్రీకృతమైన గాఢత కంటే రెట్టింపు స్థాయిలో తీవ్రమైన గాఢతతో కేంద్రీకృతమైందని నిర్ధారణ అయ్యింది.
ఈ కంపెనీలు కేవలం ఏదో ఒక ద్రవ్య ఉత్పత్తులపై ఆధారపడి వాణిజ్యం చేసే సంస్థలుగా మాత్రమే మిగిలిపోలేదు. భారీ బ్యాంకుల అవతారం ఎత్తాయి.
కానీ బ్యాంకులకు ఉన్నన్ని కఠినమైన నియమ నిబంధనలు ఈ బహుళజాతి బడా గుత్త కంపెనీలకు లేవు.
ఫైనాన్షియలైజేషన్ ప్రక్రియ కారణంగా భారీ విపత్తులను అధిగమించే సామర్థ్యం ఉంటుందని వాదిస్తాయి ఈ కంపెనీలు. కానీ గాలివాటు వ్యవహారానికి, పణంగా పెట్టడానికి మధ్య స్పష్టమైన తేడా ఉన్నది. ఆ తేడాను అంత తేలిగ్గా గుర్తించలేము.
ఈ విధంగా పణంగా పెట్టే నిర్ణయాలు ఎంతటి తీవ్ర విషమ పరిణామాలకు దారితీస్తాయన్నది చెప్పలేము.
ఏది ఏమైనా అటువంటి విషమ పరిస్థితులు, పరిణామాలు ఆహ్వానించదగ్గవి కాదు. ఆహార ఉత్పత్తుల రంగంలో పనిచేస్తున్న అంతర్జాతీయ స్థాయి బహుళజాతి కంపెనీలు ముందుకు తెచ్చిన “అంతర్జాతీయ ఆహార నియమాలు, నియమావళి వైపు” ప్రపంచం మళ్లుతోంది.
భౌగోళిక రాజకీయ సవాళ్లు – వాణిజ్య మార్గాల దిగ్బంధనం..
ఇప్పటికిప్పుడు అవసరమైనంతవరకు సరఫరా చేసేలా ఉత్పత్తి, వాణిజ్య ఏర్పాట్లు పరిమితం చేసుకోవడం, ప్రపంచ వాణిజ్యాన్ని కొన్ని పరిమిత మార్గాల్లో సాగించేందుకు పరిమితం చేయడం వలన ప్రపంచ ఆహార భద్రత ఎదుర్కొనే ప్రమాదాలు మరింత తీవ్రతను సంతరించుకుంటున్నాయి.
హోర్ముజ్ జలసంధి మొదలు టర్కీ జలసంధి, పనామా కాలువ, సూయజ్ కాలువ, మలక్కా జలసంధి ఇవి ప్రపంచ ఆహార భద్రతను సవాలు చేసే వ్యూహాత్మక అంతర్జాతీయ వాణిజ్య మార్గాలని కొందరు భావిస్తున్నారు.
వీటిని దిగ్బంధనం చేస్తే ప్రపంచానికి కావాల్సిన ఆహారం, ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసే ఎరువులు, రసాయనాలు, చమురు, ఇతర వ్యవసాయోత్పత్తుల రవాణాకు అడ్డుకోవడం గడ్డిపోచను పక్కన పెట్టినంత తేలికవుతుంది.
డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఒంటెత్తు పోకడల వలన ఇలాంటి జలసంధుల ద్వారా జరిగే రవాణాపైనా సైనిక దాడులు జరిగే ప్రమాదం ఉందని ఏడాది క్రితం సందేహించాను.
ఇరాన్ ప్రభుత్వ అండదండలతో యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న హౌతీ సాయుధ మిలీషియా ఎర్ర సముద్రం గుండా వాణిజ్యాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తుందన్న ఆలోచనే నాకు రాత్రుళ్లు నిద్ర లేకుండా చేస్తోంది.
ఆ ఆలోచన రాగానే అర్ధరాత్రి ఉలిక్కిపడి లేస్తున్నాను.
విచ్ఛిన్నం అంచున ప్రాణనాడులు..
వీటన్నిటి సారాంశం ఏమిటి? వ్యవస్థ మనుగడకు అవసరమైన జీవనాడుల లభ్యత కుదించుకుపోవడమే.
వైవిధ్యం, వ్యవస్థ సృష్టిస్తున్న అదనపు సామర్థ్యం, మొత్తం వ్యవస్థను పరస్పరాధారితమైన చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటి మధ్య సమన్వయంతో పనిచేయడం, ఆహార వనరుల సరఫరాకు ప్రత్యామ్నాయం వెతుక్కొనే సామర్థ్యం, తక్షణ విపత్తులను అధిగమించే విధంగా వివిధ దేశాల ఆర్థిక ఆహార వ్యవస్థలు దేనికదే ఉండగల సామర్థ్యం, అనూచానంగా ప్రపంచాన్ని బంధించి ఉంచుతున్న అడ్డు అదుపులేని ఆంబోతులను(బహుళజాతి కంపెనీలతో సహా రాజ్యాలు, రాజ్యేతర శక్తులను) అదుపులో పెట్టగల నియంత్రణ సామర్థ్యం వంటివి ఈ ప్రపంచం ఇప్పుడున్న విధంగా అయినా మనుగడ సాగించేందుకు ప్రాణాధారాలు. వీటిలో ఏ ఒక్కటి చిక్కుల్లో పడ్డా మన మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది.
ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాణాధార వ్యవస్థలు నిప్పుల గుండంలో చిక్కుకున్నాయి.
సరఫరా వ్యవస్థ కుప్పకూలితే ఎదురయ్యే విపత్తు..
వ్యవస్థ తన మనుగడ కోల్పోయినప్పుడు ఎటువైపు నుంచి ఈ ముప్పుకు బలవుతుందో ఊహించడం కష్టం.
పైన ప్రస్తావించిన సమస్యల్లో ఏ సమస్య ముందుకొచ్చినా, ప్రపంచ ఆహార సరఫరా వ్యవస్థను నియంత్రిస్తున్న అంతర్జాతీయ గుత్త సంస్థల్లో ఏ ఒక్కటి దివాలా తీసినా, ఒకేసారి రెండు మూడు అంతర్జాతీయ రవాణా మార్గాలు మూసుకుపోయినా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కుప్పకూలినా, భారీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా జరిగేది ఏమిటి?
ఒకదాని వెంట ఒకటిగా ప్రపంచ ఆహార వ్యవస్థను నియంత్రిస్తున్న కంపెనీలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా దివాలా తీస్తాయి. ఆ తర్వాత జరిగే నష్టాన్ని ఎవరు ఊహించగలరు? ఆహార ఉత్పత్తుల మార్కెట్లో కీలకమైనది అమ్మకందారుడికి, కొనుగోలుదారుడికి ఉన్న సంబంధం.
ఒకసారి ఈ సంబంధం తెగిపోతే ఆహార ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఆ పరిస్థితి వస్తోందని అనుమానం వచ్చిన తర్వాత జనం అందరూ ఎగబడి సరుకులు కొంటారు. దుకాణాలు ఖాళీ అవుతాయి.
మరోవైపు రవాణా సౌకర్యం లేకపోవడంతో వ్యాపారులు వ్యవసాయోత్పత్తులు కొనరు. పంటలు చేలోనో, రేవు పట్టణంలోనో, రోడ్డు మీద నిలిచిన వాహనాల్లోనో మురిగిపోతాయి, కుళ్లిపోతాయి.
ఈ పరిస్థితులు, సంక్షోభం నుంచి బయటపడి, పరిస్థితులను తిరిగి పట్టాలెక్కించే లోపు లక్షల కోట్లమంది ఆకలి చావుల బారిన పడక తప్పదు.
మనం పెట్టుకున్న నిర్మాణాలు, వ్యవస్థలు, వాటి మధ్య ఉన్న సంక్లిష్టతలు సమాజపు అంతాన్ని వేగిరం చేస్తాయి.
వికేంద్రీకరణ – ప్రత్యామ్నాయ విధానాల ఆవశ్యకత..
ఏమి జరగాలో మనకు తెలుసు. భారీ కంపెనీలను ముక్కలు చేయాలి. ఉత్పత్తి సరఫరా వ్యవస్థలను వికేంద్రీకరించాలి. సమగ్ర నియంత్రణ పరిధిలోకి తేవాలి.
ఆహార వినిమయంలో వైవిధ్యం తేవాలి. తదనుగుణంగా వాటి ఉత్పత్తికి అవసరమైన వైవిధ్య విధానాలు రూపొందించుకోవాలి.
భారీ ఎగుమతులపై ఆధారపడే విధానాలకు స్వస్తి చెప్పాలి. వ్యూహాత్మక ఆహార నిల్వలు సిద్ధం చేసుకోవాలి. ఆహార నిల్వలు అన్ని చోట్లా ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలి.
అయితే ఇవన్నీ చేయటానికి ఓ సమస్య ఉంది. అది ట్రంప్ ఒక్కడే ఆ సమస్య కాదు. దాదాపు అన్ని ప్రభుత్వాలూ కార్పొరేట్ల చెప్పుచేతల్లో ఉన్నాయి. వాటి ఆర్థిక శక్తికి ప్రభుత్వాలు దాసోహం అంటున్నాయి.
కనీసం పైన ప్రస్తావించిన విపత్తులను నివారించేంత మేరకైనా స్వతంత్ర విధానాలు అమలు చేసే స్తోమత కలిగిన ప్రభుత్వాలు కావాలి. అయితే ఇటువంటి అంతర్జాతీయ సమస్యలపై అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని సాధించడం దాదాపుగా శూన్యమే.
వృక్ష ఆధారిత ఆహారమే భవిష్యత్తుకు భరోసా..
వీటన్నిటికీ ఏకైక పరిష్కారం ఆయా దేశాల్లో ఉన్న మంచి రాజకీయ నాయకులు. మనల్ని ఈ విపత్తులు, వైపరీత్యాల నుంచి కాపాడే సమర్థత కలిగిన నాయకులు కావాలి.
సమగ్రమైన ఆహార భద్రత సాధించాలంటే కృత్రిమ ఆహారం స్థానంలో పంటల ఆధారిత ఆహారానికి మళ్లాలి.
ఈ ప్రతిపాదన ఎంత వరకు ఆచరణ సాధ్యం అన్న ప్రశ్నలు వస్తున్నాయి కానీ అది చాలా తేలికైన పని.
పంటల ఆధారిత ఆహారం కోసం మనం ఖర్చుపెట్టే వనరులు చాలా పరిమితం.
పాశ్చాత్య ఆహారం ఉత్పత్తి చేయటానికి సాగుచేసే భూమిలో నాలుగోవంతు భూమి సాగు చేయడం ద్వారా మొత్తం మానవాళికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చుకోవచ్చు.
బొగ్గు, సహజవాయువు ఆధారిత ఇంధనాల స్థానంలో ప్రకృతి ఆధారిత ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఆధారపడటం ద్వారా మెరుగైన పర్యావరణ అనుకూల ఇంధన మార్గాలకు మళ్లినట్టుగానే, జంతు ఉత్పత్తుల ఆధారిత ఆహారం నుంచి వృక్ష ఆధారిత ఆహార ఉత్పత్తుల వైపు మళ్లడం ద్వారా మన ఆహార భద్రతను మరింత భరోసాతో సాధించవచ్చు.
ఇదేదో సాదాసీదా అభిప్రాయం అని కొట్టిపారేయకండి. జాతీయ ఆహార భద్రత సాధించే ప్రయత్నంలో ఇది అత్యంత విలువైన వ్యూహం.
ఈ అభిప్రాయాన్ని ప్రభుత్వం కోరిన మేరకే నేను సమర్పించాను కానీ ఇంతవరకు దాన్ని ప్రజల దృష్టికి రానీయకుండా ప్రభుత్వం ప్రయత్నం చేసింది.
ఎందుకంటే ఈ ప్రభుత్వాలను నడిపిస్తున్న భారీ కంపెనీలు, వాటి ఆర్థిక ప్రయోజనాలకు ఈ ప్రత్యామ్నాయాలు ఇబ్బందిగా ఉండటమే కారణం కావచ్చు.
తమ దేశపు ఆహార అవసరాల గురించి పరిశోధనలు చేసిన చైనా మేధావులు కూడా ఇదే నిర్ణయానికి వచ్చారు: జంతు ఆధారిత ఆహారోత్పత్తిపై ఎక్కువగా ఆధారపడటం వలన చైనా ఆహార భద్రత ప్రమాదంలో పడింది అన్నది వారి నిర్ధారణ.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
