తాజా నిర్ణయంతో రాష్ట్రంలో 17 శాతంగా ఉన్న ఓబీసీ జనాభా ఇప్పుడు ఏడు శాతానికి పడిపోనున్నది
పశ్చిమ బెంగాల్ శాసనసభ సోమవారం నాడు ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి రెండు బిల్లులు ఆమోదించింది. పలు ముస్లిం ఉప కులాలను ఓబీసీ జాబితా నుండి తొలగించడమే ఈ బిల్లుల సారాంశం. 2024 మేలు కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ బిల్లులను రూపొందించి శాసనసభలో ఆమోదించినట్టు హిందూస్తాన్ టైమ్స్ కథనం వెల్లడించింది.
ఈ సవరణలతో బెంగాల్ లో ఓబీసీ జనాభా వాటా 17 శాతం నుండి ఏడు శాతానికి పడిపోనున్నది. తదనుగుణంగా పశ్చిమ బెంగాల్ వెనకబడిన తరగతుల కమిషన్ బిల్లు ను కూడా సవరించారు.
ఇప్పటివరకు పశ్శిమ బెంగాల్ లో మొత్తం 113 కులాలను వెనబడిన తరగతులకు చెందిన కులాలుగా గుర్తించారు. ఇందులో 77 కులాలు ముస్లిం ఉపకులాలు. తాజా నిర్ణయంతో ఈ 77 కులాలను వెనకబడిన తరగతుల జాబితా నుండి తొలగిస్తారు. అంటే ఆయా కులాలలో ఉన్న జనాభా ప్రత్యేకించి విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు, వివిధ స్థాయి ఉద్యోగాల్లో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న వారూ ఆయా ప్రయోజనాలను కోల్పోతారు.
కలకత్తా హైకోర్టు 2024 లో ఇచ్చిన తీర్పును మమత బెనర్జీ ప్రభుత్వం అప్పట్లో సుప్రీం కోర్టు లో సవాలు చేసింది.
294 మంది ఉన్న అసెంబ్లీ లో రాష్ట్ర వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రవేశ పెట్టిన ఈ బిల్లుకు 186 మంది అనుకూలంగా ఓటు వేశారు. 17 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే ఆరుగురు ఏం ఎల్ ఏ లు ఓటింగ్ లో పాల్గొనలేదని న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ చేసింది.
తృణమూల్ తిరుగుబాటు వర్గంలో కొందరు శాసనసభ నుండి వాకౌట్ చేసినట్టు హిందూస్తాన్ టైమ్స్ కథనం చెప్తోంది.
గత ప్రభుత్వం ఎటువంటి సర్వే చేయకుండా కేవలం ముస్లిం లకు లబ్ధి కలిగించటమే లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని సంబంధిత శాఖ మంత్రి గౌరీశంకర్ ఘోష్ అన్నారు.
సర్వే తర్వాత ఈ జాబితాలో చేర్చబడిన 66 కులాలను వెనకబడిన కులాలుగా కొనసాగిస్తున్నామని ఆయన వివరించారు.
తాజా చట్ట సవరణతో వెనకబడిన కులాల గుర్తింపు కోల్పోయిన కులాల్లో పహాడి ముస్లింలు, ఫకీర్, జోలా వంటి కులాలు ఉన్నాయి.
వెనకబడిన కులాల గుర్తింపు కోరుతున్న కులాల స్థితి గతులు అధ్యయనం చేసేందుకు రాష్ట్ర వెనకబడిన తరగతుల కమిషన్ సర్వే చేపట్టనున్నట్టు మంత్రి ఘోష్ తెలిపారు.
గత ప్రభుత్వం పూర్తిగా వెనకబడిన తరగతుల కమిషన్ ను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకున్నదని మంత్రి ఆరోపించారు. ఈ బిల్లులు ఆమోదం పొందిన తర్వాత నకిలీ ఓబీసీ సర్టిఫికెట్లు జారీ అయ్యే ప్రసక్తి లేదని ఆయన అన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
