ముంబై నగరంలోని ప్రభుత్వ రవాణా సంస్థ “బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై & ట్రాన్స్పోర్ట్” కార్మికులు 2026 జూన్ 19 నుండి 21 వరకు మూడు రోజులు సమ్మె నిర్వహించారు. మూడవరోజు ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో కొన్ని సమస్యలు పరిష్కారం అవడంతో సమ్మెను తాత్కాలికంగా విరమించారు.
సమ్మె నేపథ్యం:
సంవత్సరాల తరబడి కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదు.
చాలా సంవత్సరాలుగా వేతన సవరణ జరగలేదు.
సంస్కరణల అమలు, ఆర్థిక ఇబ్బందులు నెపంతో BEST బస్సులను క్రమంగా కుదించి “వెట్ లీజ్” పేరున ప్రైవేట్ బస్సులను ప్రవేశపెట్టారు.
ఈ బస్సులపై పనిచేసే కార్మికులను ప్రైవేటు యజమానులే నియమించు కుంటున్నారు. వీరికి కనీస వేతనాలు, ఇతరత్రా చట్టబద్ధమైన సౌకర్యాలు ఏమీ లేవు. వీరి పట్ల యజమానులు అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు.
ముంబాయి నగర జనాభా కనుగుణంగా 12 వేల బస్సులు అవసరం అవుతాయని రవాణా రంగ నిపుణుల అంచనా. కానీ BEST , వెట్ లీజ్ అన్ని కలిపి బస్సుల సంఖ్య 3000 లోపే ఉంది. జనాభా పెరుగుదలకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెరగక పోగా క్రమంగా తగ్గిపోవడంతో ప్రయాణికులు నరకయాతన అనుభ విస్తున్నారు.
ఫలితంగా ప్రయాణికులు అత్యంత రద్దీగా ఉన్న సబర్బన్ రైళ్లు, మెట్రోలు, టాక్సీలు, ఆటో రిక్షాలను ఆశ్రయించవలసి వస్తోంది.
సబర్బన్ రైళ్ల పై ఆధారపడే వారి సంఖ్య రైళ్లు భరించ రానంతగా పెరిగింది. ముఖ్యంగా రద్దీ సమయాలలో. ఇది తొక్కిసలాట, ప్రమాదాలకు దారి తీయడం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు కూడా జరిగాయి.
BEST స్థలాలను “మానిటైజేషన్” పేరుతో ప్రైవేట్ వాళ్లకి ధారాదత్తం చేయడం మొదలైంది. కేవలం కార్మికుల సమస్యలుగా మాత్రమే కాకుండా, సంస్కరణల నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా మిళితమై ఈ సమ్మెకు దారి తీసాయి. ప్రజా రవాణాను ఒక అత్యవసర ప్రజా సేవగా ప్రభుత్వం పరిగణిస్తుందా లేదా అనే విస్తృత చర్చల పరాకాష్ట సమ్మెకు దారి తీసింది.
BEST లోని 12 కార్మిక సంఘాలు “బెస్ట్ సంయుక్త కామ్‌గార్ కృతీ సమితి” పేరుతో ఐక్య కార్యాచరణగా ఏర్పడి సమ్మెకు పిలుపునిచ్చాయి. అయితే భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ సంఘం సమ్మెకు పిలుపు నివ్వలేదు. అయినా నాయకత్వ నిర్ణయాన్ని పక్కనపెట్టి ఆ యూనియన్ కార్మికులతో సహా 100% కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఆ విధంగా అద్భుతమైన ఐక్యత ఈ సందర్భంగా వెల్లడైంది. ఏళ్ళ తరబడి కార్మికులలో గూడు కట్టుకొని ఉన్న నిరాశ, నిస్పృహ, ఆగ్రహ, ఆవేశాల కారణంగా ఇంత భారీ ఎత్తున సమ్మె విజయవంతం అయింది.
కార్మిక హక్కులు, ప్రయాణికుల ప్రయోజనాలు, పట్టణ ప్రణాళిక, రవాణా విధానం వంటివి ఘర్షణ పడే ఒక ఉద్రిక్త ప్రదేశంగా ఈ సమ్మె మారింది.
ప్రధాన డిమాండ్లు:
2016 నుండి అమలులోకి వచ్చిన వేతన ఒప్పందాలు పూర్తిగా అమలు చేయాలి. ఏడవ వేతన సంఘం ప్రయోజనాలు అమలు చేయాలి. విశ్రాంత ఉద్యోగులకు 2022 నుండి చట్టబద్ధంగా చెల్లించాల్సిన బకాయిలు మొత్తం చెల్లించాలి. సంస్థలో కీలకమైన విధులు నిర్వర్తిస్తున్న వెయిట్-లిస్ట్‌లో ఉన్న కార్మికులకు కనీస వేతనాల ప్రకారం, సకాలంలో వేతనాలు చెల్లించాలి. వారందరి సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలి. బెస్ట్ బడ్జెట్ ను బీఎంసీతో విలీనం చేయాలి.
సమ్మె సన్నాహాలు:
సమ్మె ప్రారంభానికి ముందు BEST పరిధిలోని 27 డిపోలలో కార్మికుల గేటు మీటింగులు, నిరసన ధర్నా లాంటి పలు ఆందోళనలు నిర్వహించారు. ధారవిలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
అనేక దఫాలు యాజమాన్యంతో జరిగిన చర్చలలో ఎలాంటి పురోగతి లేదని, అందుకే అనివార్యంగా కార్మికులు సమ్మెలోకి నెట్టబడ్డారని యూనియన్ నేతలు విమర్శించారు.
“ఆమ్చి ముంబై – ఆమ్చి బెస్ట్“అనే ప్రజా వేదిక తో పాటు పలు కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు సమ్మెకు మద్దతును తెలియజేశాయి.
2019 నుండి 2025 మధ్యకాలంలో, బీఎంసీ (BMC) బెస్ట్‌కు ప్రత్యక్ష సబ్సిడీల రూపంలో కాకుండా, రుణాల రూపంలోనే రూ. 10,400 కోట్లకు పైగా అందించినట్లు ఆమ్చి ముంబై ఆమ్చి బెస్ట్ ఎత్తి చూపింది. ప్రజా రవాణాకు ఇచ్చే మద్దతును రుణంగా పరిగణించడం కేవలం ఆ సంస్థపై భారాన్ని మారుస్తుందే తప్ప, దాని దీర్ఘకాలిక మనుగడను బలోపేతం చేయడానికి పెద్దగా దోహద పడదని వారు విమర్శించారు.
ఒకప్పుడు సమర్థవంతమైన, విస్తృతమైన ప్రజా రవాణా వ్యవస్థకు అంతర్జాతీయ ఉదాహరణగా నిలిచిన బెస్ట్ అండర్ టేకింగ్‌ను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బలహీన పరుస్తున్న విషయంపై ఆమ్చి ముంబై వంటి పౌర వేదికలు ప్రజలలో చైతన్యం కల్పిస్తున్నారు.
రైల్వే కారిడార్లు, మెట్రో స్టేషన్లకు దూరంగా నివసించే వారికి BEST విస్తరించని కారణంగా పర్యవసానాలు మరీ తీవ్రంగా ఉంటాయి. విద్యార్థులు, వృద్ధులు, మహిళలు, వికలాంగులు, ఆసుపత్రి రోగులు, అసంఘటిత కార్మికులు, లక్షలాది మంది తక్కువ ఆదాయ వర్గాల ప్రయాణికులకు బస్సులు అత్యంత సరసమైన, అందుబాటులో ఉండే ప్రజా రవాణాను విస్తరించి అభివృద్ధి చేయాలని అనేకమంది భావిస్తున్నారు. కీలకమైన లాస్ట్ మైల్ కనెక్టి విటీని అందించే బెస్ట్ బస్సుల విషయంలో లాభనష్టాల స్కేలుతో కొలిచే భిన్నమైన ఆర్థిక విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తున్నది. దీని ఫలితమే లోటు, అప్పు పొదుపు చర్యల నిరంతర చక్రం అని కొందరు నిపుణులు విమర్శిస్తున్నారు.
ఒప్పందం:
మహారాష్ట్ర ఉప ముఖ్య మంత్రి ఏక్నాథ్ షిండేతో 21-06-2026 న జరిగిన చర్చలలో కొన్ని సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె విరమణ జరిగింది.
శాశ్వత ఉద్యోగులకు నెలకు రూ.3,000, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.2,000 వేతన పెంపునకు, అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ నుండి పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ చెల్లింపులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్లు యూనియన్ నేతలు ప్రకటించారు. ఉద్యోగుల కోసం క్యాంటీన్, వాష్‌రూమ్ సౌకర్యాలను మెరుగు పరుస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు యూనియన్ నేతలు తెలిపారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
