An elderly woman performs prayers on the banks of the river Ganga on a winter morning during the Magh Mela festival, at Sangam, in Prayagraj on January 9, 2026. Photo: PTI.
భారతదేశంలో ఒక అదృశ్య సంక్షోభం నెలకొని ఉంది
జాతీయ నేరాల రికార్డుల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) గణాంకాల ప్రకారం, కేవలం 2023 మరియు 2024 మధ్య కాలంలోనే వృద్ధులపై వేధింపులు, నేరాల కేసులు 17 నుండి 18 శాతం పెరిగాయని ఆందోళన వెల్లడైంది. జాతీయ ఎల్డర్ లైన్ హెల్ప్‌లైన్‌కు వస్తున్న కాల్స్ సంఖ్యలో కూడా ఇదే ధోరణి ప్రతిబింబిస్తోంది.
2009లో వచ్చిన మలయాళ సంకలన చిత్రం ‘కేరళ కేఫ్’లోని మరపురాని ‘బ్రిడ్జ్’ అనే భాగంలో, ఇటీవల మరణించిన జాతీయ అవార్డు గ్రహీత, నటుడు సలీం కుమార్, మణికందన్ అనే పాత్రను పోషించారు. అతను ఒక పేద, నిస్సహాయుడైన కొడుకు, తన బలహీనమైన, వృద్ధురాలైన తల్లిని రద్దీగా ఉండే నగర వీధిలో వదిలివేస్తాడు. అతను తిరిగి వస్తానని వాగ్దానం చేస్తాడు. కానీ బదులుగా ఒక వంతెన దాటి శాశ్వతంగా అదృశ్యమవుతాడు.
శాంతదేవి తల్లి పాత్రను అత్యంత హృద్యంగా పోషించారు. తాను పెంచి పోషించిన బిడ్డ వల్లే తన ప్రపంచం ముక్కలై, పూర్తిగా ప్రకృతికి వదిలి వేయ బడుతుంది. కేఫ్ వరండాలో, ఆమెకు వదిలి వేయబడిన, ఒంటరిగా తిరుగుతున్న ఒక పిల్లికూన తారసపడుతుంది. వారి నిశ్శబ్ద సహవాసంలో, ఈ చిత్రం అమానవీయ చర్యలకు అద్దం పట్టింది. ప్రేమకు, నిర్లక్ష్యానికి మధ్య దూరం ఒక వంతెన వలె చిన్నదిగా, క్షమించరానిదిగా ఉంటుందనే బాధాకరమైన సత్యాన్ని ఇది తెలియజేస్తుంది.
ప్రపంచ అవగాహనకు ఆవల
వృద్ధులపై హింస నివారణను విజయవంతం చేయడం’ అనే ప్రపంచవ్యాప్త ఇతివృత్తంతో ప్రపంచ వృద్ధుల పై హింస అవగాహన దినోత్సవాన్ని (WEAAD) 2026 జరుపుకుంటున్న తరుణంలో, ఈ విషాద గాథ ఆధునిక భారతీయ జీవితంపై తీసిన ఒక డాక్యుమెంటరీలా అనిపిస్తుంది.
ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం (UN DESA) ఈ సమస్యను కేవలం గుర్తించడంతో సరిపెట్టకుండా, పటిష్టమైన సంస్థలు, చట్టపరమైన రక్షణలు, సామాజిక సంరక్షణ వ్యవస్థలను నిర్మించే దిశగా మనం ముందుకు సాగాలని నొక్కి చెబుతోంది. వృద్ధులపై వేధింపులు పైకి కనిపించని తీవ్రమైన మానవ హక్కుల సంక్షోభం.
అయితే, భారతదేశం అంతటా, వయో వృద్ధుల రక్షణకై ఉద్దేశించిన సామాజిక, భావోద్వేగ/భద్రతా కవచాలు, జనాభా మార్పుల కారణంగా భారంగా మారుతున్న సామాజిక విలువలు వేగంగా బలహీనపడుతున్నాయి. వృద్ధాప్య జనాభాను రక్షించడంలో ఒక నయా ఉదారవాద రాజ్యం ఎంతవరకు వెళ్ళగలదు? అనేది ఒక కీలకమైన ప్రశ్న.
వేగంగా పెరుగుతున్న వృద్ధుల జనాభా:
బహుశా, భారతదేశం అనూహ్యమైన జనాభా మార్పు కు లోనవుతోంది. జాతీయంగా వృద్ధుల జనాభా (60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) వేగంగా పెరుగుతోంది. జనాభా పై సాంకేతిక బృందం అంచనా ప్రకారం, 2036 నాటికి వయోవృద్ధుల సంఖ్య 23 కోట్లు దాటుతుంది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2025-26 వార్షిక నివేదిక ప్రకారం, భారతదేశంలో ఇప్పటికే 10 కోట్లకు పైగా వృద్ధులు ఉన్నారు. వీరు మొత్తం జనాభాలో దాదాపు 9%.
సంఖ్యాపరంగా చూసినప్పుడు ఈ అంకెలు పెరుగుతున్నప్పటికీ, ఈ పెరుగుదల దేశంలో ఉత్తర-దక్షిణ ప్రాంతాల మధ్య తీవ్రమైన జనాభా విభజన, ప్రముఖంగా కనిపిస్తోంది. మధ్య, తూర్పు రాష్ట్రాలలో యువ జనాభా ఎక్కువగా ఉండగా, దక్షిణ రాష్ట్రాలు, ఎంపిక చేసిన ఉత్తర రాష్ట్రాల కొండ ప్రాంతాలలో వృద్ధుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. ఉదాహరణకు, 2036 నాటికి ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో వృద్ధ జనాభా వాటా సుమారు 12%గా ఉంటుందని అంచనా వేయగా, కేరళలో ఇది 23% వరకు చేరుకుంటుందని అంచనా. భారతీయ కుటుంబాలు సహజంగానే తమ పెద్దలను ఆదరించి, సంరక్షిస్తాయనే సాంస్కృతిక కథనం ఉన్నప్పటికీ, వాస్తవ గణాంకాలు దీనికి పూర్తిగా భిన్నమైన నిజాన్ని చూపిస్తున్నాయి. హెల్ప్‌ఏజ్ ఇండియా నిర్వహించిన ఒక దేశవ్యాప్త సర్వే ఒక ఆందోళనకరమైన వైరుధ్యాన్ని వెల్లడించింది: దాదాపు 82% మంది వృద్ధులు తమ కుటుంబాలతో నివసిస్తున్నప్పటికీ, వేధింపులకు ప్రధాన వేదికగా తరచుగా వారి ఇళ్లే ఉంటున్నాయి. ఆ అధ్యయనంలో, వేధింపులకు గురైన వృద్ధులలో 35% మంది తమ కుమారులనే ప్రధాన నేరస్థులుగా గుర్తించగా, ఆ తర్వాతి స్థానాల్లో కోడళ్ళు ఉన్నారని తేలింది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నుండి వచ్చిన డేటా ప్రకారం, కేవలం 2023-24 మధ్య కాలంలోనే వృద్ధులపై వేధింపులు, నేరాల కేసులు 17 నుండి 18% వరకు పెరిగాయని వెల్లడైంది. జాతీయ ఎల్డర్‌లైన్ హెల్ప్‌లైన్‌కు వస్తున్న కాల్స్ సంఖ్యలో కూడా ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది.
20 నగరాల్లో 5,000 మందికి పైగా వృద్ధులపై జరిపిన 2024 హెల్ప్‌ఏజ్ ఇండియా జాతీయ సర్వే ప్రకారం, 65% మంది వృద్ధ భారతీయులు ఆర్థికంగా అభద్రతతో ఉన్నారని తేలింది. ప్రతి ముగ్గురిలో ఒకరికి గత సంవత్సరంలో స్వంత ఆదాయం లేదు, ఈ లోటు పురుషులకంటే (27%) మహిళలో (38%) ఎక్కువగా ఉంది. అంతేకాకుండా, 54% మంది వివిధ రకాల వ్యాధులతో బాధపడు తున్నారు, కేవలం 31% మంది మాత్రమే ఏదో ఒక రకమైన ఆరోగ్య బీమాను కలిగి ఉన్నారు.
వృద్ధాప్యం వైపు పయనిస్తున్న భారతదేశం:
భారతదేశం తన జనాభా భవిష్యత్తును చూడాలను కుంటే, అది కేరళ వైపు చూడాలి. దశాబ్దాలుగా సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉండటం, యువకులు, పని చేసే సామర్థ్యం కల వారు ఉపాధి కోసం తరాలుగా విదేశాలకు వలస వెళుతున్న కారణంగా, కేరళ రాష్ట్రం దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధాప్యం వైపు పయనిస్తోంది. అక్కడ నివసించే వారిలో వృద్ధులు దాదాపు ఐదవ వంతు. ఈ నిష్పత్తి అభివృద్ధి చెందిన పాశ్చాత్య, తూర్పు ఆసియా సమాజాలను ప్రతిబింబి స్తుంది. రాష్ట్రంలో, వృద్ధుల సంఖ్య అసమానంగా ఉంది.
కేరళలో వృద్ధాప్యం:
లింగపరమైన పునఃసమీక్ష’
(2025) అనే ఒక సమగ్ర అధ్యయనం ప్రకారం, పతనంతిట్ట వంటి జిల్లాల్లో వృద్ధుల సాంద్రత అత్యధికంగా ఉంది. ఇక్కడ జనాభాలో 18% నుండి 20% వరకు వృద్ధులు ఉన్నారు. ఈ సంఖ్య 2051 నాటికి 34% కంటే ఎక్కువగా పెరుగుతుందని అంచనా. దీనికి విరుద్ధంగా, అధిక మొత్తం సంతానోత్పత్తి రేటు కారణంగా మలప్పురంలో వృద్ధుల నిష్పత్తి అత్యల్పంగా ఉంది. కానీ మానవ అభివృద్ధి, అధిక అక్షరాస్యత, భౌతిక జీవన ప్రమాణాలలో కేరళ సాధించిన ప్రశంస నీయమైన విజయాల వెనుక ఒక కలవరపరిచే నైతిక సంక్షోభం దాగి ఉంది. గురువాయూర్ వంటి ప్రధాన పుణ్యక్షేత్రాల నుండి వచ్చిన మునుపటి నివేదికలు ఒక బాధాకరమైన దృగ్విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. ఆధ్యాత్మిక యాత్రకు తీసుకెళ్తున్నామనే నెపంతో పిల్లలు తమ వృద్ధ తల్లిదండ్రులను ఆలయ ప్రాంగణంలోనే వదిలి వేయడం. తిరువనంత పురానికి చెందిన పద్మావతి అనే వృద్ధురాలి ఉదంతం దీనికి ఒక స్పష్టమైన నిదర్శనం. ఆమెను ఆమె పిల్లలే గురువాయూర్ ఆలయం వద్ద వదిలివేసి వెళ్ళిపోయారు. ఆలయ పరిసరాల్లో నివసిస్తున్న సుమారు వంద మంది నిరాశ్రయులైన వృద్ధుల మాదిరిగానే, ఆమెను కూడా వదిలివేసే ముందే ఆమె ఆస్తిని పద్ధతి ప్రకారం ఆమె నుంచి లాగేసుకున్నారని విచారణలో తేలింది.
ఏడుగురు పిల్లల తల్లి అయిన 82 ఏళ్ల వృద్ధురాలు ఒకరు మలప్పురంలోని కేరళ మహిళా కమిషన్‌ను ఆశ్రయించినప్పుడు, ఈ సమస్య ఎంత విస్తృతమైనదో మరింత స్పష్టమైంది. నిరంతర గృహ హింస కారణంగా తనను కొడుకు, కోడలి వద్దకు తిరిగి పంపవద్దని ఆమె అధికారులను వేడుకున్నారు. ఈ ఘటన తర్వాత, కేవలం మూడు నెలల వ్యవధిలోనే వృద్ధులను వదిలివేయడం, వారిని దుర్భరంగా చూడటం వంటి దాదాపు 300 ఫిర్యాదులు తమకు అందాయని కమిషన్ పేర్కొంది.
న్యాయపరమైన క్లిష్ట పరిస్థితి:
ఈ సామాజిక మహమ్మారి న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవలసి వచ్చేలా చేసింది. అయినప్పటికీ చట్ట పరిమితులు స్పష్టంగానే ఉన్నాయి. డాక్టర్ ప్రమోద్ జాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (2024) అనే చారిత్రాత్మక తీర్పులో, కేరళ హైకోర్టు, తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007లోని సెక్షన్ 24 కింద ‘విడిచిపెట్టడం’ అనే నేరానికి చట్టపరమైన పరిమితిని స్పష్టం చేసింది.
కుటుంబ వివాదాలు లేదా తల్లిదండ్రులను పిల్లల మధ్య వంతులు వేసకుని మార్చడం వంటివి వాటంతట అవే నేరపూరిత దృష్టి తో విడిచి వేయటం తో సమానం కావని కోర్టు తీర్పు ఇచ్చింది. దానికి బదులుగా, బాధ్యత, సంరక్షణను పూర్తిగా వదులుకోవాలనే స్పష్టమైన ఉద్దేశ్యంతో ” పూర్తిగా పరిత్యదించటానికి” చేసినట్లు రుజువు చూపితేనే అది నేరంగా పరిగణించ బడుతుంది.
ఈ తీర్పు సంక్లిష్టమైన కుటుంబ వ్యవస్థ లో క్రిమినల్ చట్టం దుర్వినియోగం కాకుండా కాపాడు తున్నప్పటికీ, ఇది ఒక సామాజిక వాస్తవాన్ని కూడా ఎత్తి చూపుతుంది. వృద్ధులపై జరిగే అకృత్యాల లో అత్యధిక భాగం మాటలతో అవమానించడం, మానసిక ఒంటరితనానికి లోను చేయటం ,ఒంటరిగా ఉంచటం, దోపిడీ, వ్యవస్థాగత నిర్లక్ష్యం లాంటివి ఇంటి లోపలే జరుగుతాయి. సామాజిక కళంకం, భయం, మానసికంగా ఆధారపడటం వంటివి చట్టపరమైన నిర్వచనాల నుండి తప్పించుకుంటూ, నివేదించబడకుండానే మిగిలిపోతున్నాయి. ఇది తీవ్రమైన అంశం.
ప్రపంచ, జాతీయ స్థాయి ఆధారాలు:
వృద్ధులపై వేధింపుల సమస్య ఏమాత్రం భారతదేశానికే ప్రత్యేకమైనది కాదు. ఇది ప్రపంచవ్యాప్త ప్రజారోగ్య ప్రాధాన్యత అంశం. BMC పబ్లిక్ హెల్త్‌లో ప్రచురితమైన, ‘ఎల్డర్ అబ్యూస్ వితౌట్ బోర్డర్స్ (2025)’ అనే పేరుతో జరిగిన ఒక సమగ్ర, నిర్ధారిత మెటా విశ్లేషణ, 35 దేశాలలోని 94 అధ్యయనాలను పరిశీలించింది. ప్రపంచ వ్యాప్తంగా వృద్ధులలో ఆశ్చర్యకరంగా 27.6% మంది అంటే నలుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది ఏదో ఒక రకమైన వేధింపులకు గురవుతున్నారని ఇది నిర్ధారించింది.
ఈ అధ్యయనం ప్రకారం, భావోద్వేగ, మానసిక వేధింపులు అత్యంత విస్తృతంగా ఉన్నాయని, ఆ తర్వాతి స్థానాల్లో నిర్లక్ష్యం, ఆర్థిక దోపిడీ ఉన్నాయని వెల్లడైంది. ప్రాంతాల వారీగా చూస్తే, దక్షిణ అమెరికాలో అత్యధికంగా 42% ఉండగా, ఆసియాలో 36%తో ఆ తర్వాతి స్థానంలో ఉంది. సాంప్రదాయ ఆసియా కుటుంబ విలువలు వృద్ధులను సహజంగానే హాని నుండి కాపాడతాయనే సాంస్కృతిక వాదనను ఇది నేరుగా సవాలు చేస్తోంది. ఈ గణాంకాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వారి ‘వృద్ధుల వేధింపులపై వాస్తవ పత్రం’లోని సమాచారంతో సరిపోలుతున్నాయి. ఆ పత్రం ప్రకారం, సమాజంలో నివసించే వృద్ధులలో 15.7% మంది వేధింపులను ఎదుర్కొంటుండగా, నర్సింగ్ హోమ్‌లు, దీర్ఘకాలిక సంరక్షణ కేంద్రాల వంటి సంస్థాగత ప్రదేశాలలో ఈ సంఖ్యలు ఆందోళనకరంగా 64.2%కి పెరుగుతున్నాయి.
2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన వారి జనాభా రెట్టింపు అయి 2 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో, వ్యవస్థాగత జోక్యం లేకుండా ప్రపంచవ్యాప్తంగా వృద్ధులపై జరిగే వేధింపుల వల్ల బాధితుల సంఖ్య 32 కోట్లకు పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది.
స్థానికంగా, జర్నల్ ఆఫ్ అడ్వాన్స్డ్ హెల్త్ రీసెర్చ్ & క్లినికల్ మెడిసిన్ (2025)లో ప్రచురితమైన “కేరళలోని గృహ వాతావరణంలో వృద్ధులపై వేధింపుల పరిశీలన ఒక కొత్త సాధనం. అభివృద్ధి” అనే ఒక సంచలనాత్మక అధ్యయనం, ఎల్డర్ మిస్ ట్రీట్మెంట్ స్క్రీనింగ్ టూల్ (EMST)ను అభివృద్ధి చేసింది. స్థానిక కుటుంబాలలో ఈ 15-అంశాల స్కేల్‌ను ధృవీకరించడంలో, కేరళలో వృద్ధులపై వేధింపులు బహిరంగ శారీరక హింస రూపంలో అరుదుగా ఉంటాయని పరిశోధకులు నిర్ధారించారు. దానికి బదులుగా, ఇది నిగూఢమైన మానసిక వేదన. వ్యక్తిగత ఎంపికలపై బలవంతపు నియంత్రణ. అగౌరవం, ఆర్థికంగా పూర్తిగా ఆధారపడటం వంటి రూపాల్లో వ్యక్తమవుతుంది. వలసలు, ఆర్థిక ఒత్తిడి తరాల మధ్య బంధాలను ప్రాథమికంగా ఎలా తిరగరాస్తున్నాయో ఇది చూపిస్తుంది.
సిల్వర్ ఆర్థిక వ్యవస్థ ను విప్పి చూద్దామా?
వ్యవస్థాగత నిర్లక్ష్యం నుండి క్రియాశీల రక్షణ వైపు మనం ఎలా పయనించాలి? ఈ పరిష్కారానికి దృక్పథంలో ప్రాథమిక మార్పు అవసరం. చాలా కాలంగా, రాష్ట్ర, కేంద్ర విధానాలు రెండూ వృద్ధాప్యాన్ని కేవలం సంక్షేమ ఆధారిత, పెత్తందారీ దృష్టితో చూస్తున్నాయి. సీనియర్ సిటిజన్లను తక్కువ పెన్షన్లు, వైద్య సహాయం పొందే నిష్క్రియ లబ్ధిదారులుగా మాత్రమే పరిగణిస్తున్నాయి.
నీతి ఆయోగ్ యొక్క ‘సీనియర్ కేర్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా ‘రీఇమాజినింగ్ ది సీనియర్ కేర్ పారాడిం (2024)’ అనే పొజిషన్ పేపర్ లో ఆరోగ్యం, సామాజిక సమ్మిళితం, ఆర్థిక సాధికారత, డిజిటల్ యాక్సెస్ అనే నాలుగు కీలక స్తంభాలపై నిర్మించబడిన సమీకృత సీనియర్ కేర్ పర్యావరణ వ్యవస్థ వైపు భారతదేశం తప్పనిసరిగా మారాలని గట్టిగా భావిస్తుంది. వృద్ధాప్య జనాభాను సామాజిక ఆర్థిక భారంలా చూడటానికి బదులుగా, భారతదేశం తన సీనియర్ సిటిజన్లను అభివృద్ధి చెందుతున్న సిల్వర్ ఎకానమీకి ఒక కీలకమైన మూలస్తంభంగా గుర్తించాలి. “భారతదేశ సిల్వర్ ఎకానమీ ప్రస్తుతం సుమారు రూ. 10,000 కోట్ల విలువైనది. దీనికి కారణం, గణనీయమైన కొనుగోలు శక్తి, ప్రత్యేక ఉత్పత్తులు, సేవల కోసం విభిన్న డిమాండ్లు కలిగి, ఆర్థికంగా సురక్షితమై, విస్తరిస్తున్న పదవీ విరమణ పొందిన వారి సమూహం.” వృద్ధుల భద్రత, గౌరవాన్ని కాపాడటానికి, నీతి ఆయోగ్ మూడు కోణాలలో చర్యలను సిఫార్సు చేస్తోంది.
ఆర్థిక సమైక్యత: 70% మంది వృద్ధ భారతీయులు ఇతరులపై ఆధారపడటం, 78% మందికి పింఛన్లు లేకపోవడం వంటి వాస్తవాలను ఎదుర్కోవ డానికి, పదవీ విరమణ అనంతర వ్యవస్థలను, “గ్రే ఇంటర్న్‌షిప్‌లను” ప్రవేశపెట్టాలి. తప్పనిసరి పొదుపు, అందుబాటు ధరలలో వృద్ధాప్య బీమా ఆర్థిక దుర్వినియోగాన్ని తగ్గిస్తాయి.
లాంఛన ప్రాయ సంరక్షణ ఆర్థిక వ్యవస్థ:
ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా నియంత్రిత దీర్ఘకాలిక సంరక్షణ మౌలిక సదుపాయాలను నిర్మించడం, వృద్ధుల సంరక్షణ కై చేసే ఉత్పత్తులపై పన్నులను తగ్గించడం ద్వారా యువత వలసలను పరిష్కరించాలి.
సమాజ రక్షణ: ఒంటరిగా ఉన్న వృద్ధులను పర్యవేక్షించ డానికి, చట్టపరమైన మద్దతును క్రమబద్ధీకరించ డానికి స్థానిక జాగ్రతా కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా, 59% మంది వృద్ధులను మినహాయిస్తున్న డిజిటల్ అంతరాన్ని ఎదుర్కోవాలి. బహుశా, నీతి ఆయోగ్ వ్యూహం సంక్షేమ ఆధారిత నమూనాకు అతీతంగా, భారాన్ని ప్రభుత్వం నుండి సమాజానికి బదిలీ చేస్తుంది.
బ్రిడ్జ్’ చిత్రంలో ఒక నగర వీధిలో ఒంటరిగా కూర్చున్న తల్లి యొక్క హృదయ విదారక దృశ్యం సామాజిక పురోగతిపై ఒక తీవ్రమైన విమర్శగా నిలుస్తుంది. మన అభివృద్ధి నమూనా వృద్ధులను కేవలం పారవేయ దగిన మూలధనంగా పరిగణిస్తే, అధిక అక్షరాస్యత, ఆర్థిక వృద్ధి, సాంకేతిక పురోగతికి పెద్దగా అర్థం ఉండదు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి ప్రపంచ సంస్థల నుండి, అలాగే నీతి ఆయోగ్ వంటి దేశీయ సంస్థల నుండి వచ్చే సందేశాలు, వాటి వ్యూహాలలో తేడాలు ఉన్నప్పటికీ, ఒకే విధంగా ఉన్నాయి. అయినప్పటికీ, వయోవృద్ధులకు అనుకూల మైన మౌలిక సదుపాయా లను నిర్మించడం, చట్టపరమైన జవాబుదారీ తనాన్ని విస్తరించడం,
వృద్ధాప్య జనాభాను ఉత్పాదక, చైతన్యవంతమైన ‘సిల్వర్ ఎకానమీ’గా మార్చడం ద్వారా మాత్రమే మన పెద్దలు స్వాతంత్ర్యంతో, గౌరవంతో జీవించేలా మనం నిర్ధారించగలం. నిర్లక్ష్య వ్యవస్థలను కూల్చివేసి, సానుభూతి, గౌరవం, సామూహిక సంరక్షణ అనే వారధిని పునర్నిర్మించాల్సిన సమయం ఆసన్నమైంది. అత్యధిక వృద్ధ జనాభా ఉన్న భారతదేశం వంటి దేశంలో ప్రభుత్వ పాత్రను వదులు కోలేము, వదులు కోకూడదు.
రచయిత: కె.ఎం. సీతి, కేరళలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (MGU)లో ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్కు డైరెక్టర్‌గా, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ స్టడీస్‌కు అకడమిక్ అడ్వైజర్‌గా ఉన్నారు. ఆయన MGUలో ICSSR సీనియర్ ఫెలోగా, అంతర్జాతీయ సంబంధాల సీనియర్ ప్రొఫెసర్‌గా, సోషల్ సైన్సెస్ డీన్‌గా కూడా పనిచేశారు.
స్వేచ్ఛానువాదం: సుబ్రమణ్యం
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
