రామ మందిరం విరాళాల అవకతవకలపై ఆరోపణలకు సంబంధించి చెలరేగిన వివాదం చివరికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గడపకు చేరుకుంది.
మోదీని మందిర ట్రస్టు అధిపతిగా నియమించాలని బీజేపీ-ఆర్ఎస్ఎస్కు చెందిన ప్రముఖుడు ఒకరు డిమాండ్ చేయగా, సీబీఐ, ఈడీ లేదా కాగ్ దర్యాప్తు చేయాలన్న ఆలోచనను అనేక మంది సమర్థిస్తున్నారు.
న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరానికి వచ్చిన విరాళాలలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు కాషాయ శిబిరంలో అంతర్గతంగా అశాంతిని పెంచుతున్నాయి. మందిరాన్ని నిర్వహించే ట్రస్టు ఈ అంశాన్ని అపారదర్శకంగా వ్యవహరించడం అనేక అనుమానాలు, అపోహలను సృష్టిస్తోంది.
వివాదం- వివరణ..
అధికార భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో సంబంధం ఉన్న కనీసం ఇద్దరు వ్యక్తులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యాన్ని కోరగా, మందిరంతో సంబంధం ఉన్న ఒక ప్రముఖ హిందూ స్వామీజీ(యోగి) ట్రస్టు సభ్యుల నిజాయితీనే ప్రశ్నిస్తూ, దర్యాప్తు నిర్వహించే వారే అవినీతిపరులని ఆరోపించారు.
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ‘ఎక్స్’ వేదికగా ఈ ఆరోపణలు చేసిన తర్వాత జూన్ 7న వివాదం చెలరేగింది. దీనికి స్పందిస్తూ, శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ద్వారా కేవలం ఒక వివరణను మాత్రమే జారీ చేసింది.
విశ్వహిందూ పరిషత్ సీనియర్ నాయకుడైన రాయ్ మాట్లాడుతూ, తమ పనులపై ట్రస్టు క్రమం తప్పకుండా అంతర్గత ఆడిట్‌ను చేపడుతుందని, ప్రస్తుతం అలాంటి ప్రక్రియే కొనసాగుతోందని చెప్పారు.
అయితే “ప్రముఖంగా గమనించదగింది” ఏదీ ఇంతవరకు వెలుగులోకి రాలేదని ఆయన అన్నారు.
మోదీకి లేఖ
ఈ వివరణ ప్రతిపక్షాన్ని, అలాగే కాషాయ శిబిరం సభ్యులను ఒప్పించడంలో విఫలమైంది.
అయోధ్యకు చెందిన బీజేపీ నాయకుడు, దంత వైద్యుడు రజనీష్ సింగ్ మోదీకి లేఖ రాశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి ఉన్నత-స్థాయి స్వతంత్ర ఏజెన్సీ ద్వారా దర్యాప్తు జరిపించాలని అందులో డిమాండ్ చేశారు.
ట్రస్టు బ్యాంక్ అకౌంట్లో విరాళాల డిపాజిట్, రవాణా, లెక్కింపు, వసూలు తదితర మొత్తం పక్రియపై ప్రత్యేక ఆడిట్‌ను కూడా సింగ్ డిమాండ్ చేశారు.
“ట్రస్టు మౌనం అనేక అనుమానాలను లేవనెత్తుతోందని, ఏదో ఒక రూపంలో అవకతవకలు కచ్చితంగా జరిగాయి. దర్యాప్తు జరగాల్సిందే” అని సింగ్ ‘ది వైర్’కు చెప్పారు.

ఈ ఆరోపణల గురించి తొలుత తాను ఏమీ కచ్చితంగా నమ్మలేదని, కానీ ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ వారసుడు కమల్ నయన్ దాస్ బహిరంగ ప్రకటన తర్వాత తన అనుమానాలకు బలం చేకూరిందని సింగ్ అన్నారు.
దర్యాప్తుపై అనుమానాలు..
ఈ అంశంలో దర్యాప్తు జరగాల్సిందేనని అభిప్రాయపడిన నయన్ దాస్, దర్యాప్తు చేస్తున్న ట్రస్టు సభ్యులపైనే జూన్ 10న స్థానిక మీడియాతో మాట్లాడుతూ అనుమానాలు వ్యక్తంచేశారు.
“దర్యాప్తు జరిపే వ్యక్తులే నిజాయితీ లేనివారైతే, అక్కడ ఏ రకమైన దర్యాప్తు జరుగుతుంది? వారంతా నిజాయితీ లేని వారు” అని నయన్ దాస్ పేర్కొన్నారు.
“గగ్గోలు పెడుతున్న ఈ ప్రజలు కడిగిన ముత్యాలా? ఎవరు దర్యాప్తు చేస్తారు? కేవలం దేవుడు మాత్రమే దర్యాప్తు చేస్తాడు” అని ఆయన అన్నారు.
నయన్ దాస్ గురువారం పీటీఐ, ఐఏఎన్ఎస్ వార్తా సంస్థలతో మాట్లాడుతూ తన వైఖరిలో కాస్త మెత్తబడినట్లు కనిపించినా, సరైన పద్ధతిలో “తగిన చర్యలు” తీసుకోవాలని పట్టుబట్టారు. ఎవరి పేరునూ ప్రస్తావించకుండా, గతంలో రిక్షా లేదా సైకిల్‌పై వెళ్లడానికి కూడా స్తోమతలేని కొంత మంది వ్యక్తులు ఇప్పుడు పెద్ద కార్లకు, పెద్ద ఇండ్లకు యజమానులయ్యారని ఆరోపించారు.
రామ మందిర్ ట్రస్టు అధిపతిగా మోదీని నియమించాలని డిమాండ్..
నయన్ దాస్ ప్రకటన చూస్తే సరైన దర్యాప్తు జరగాల్సిందేనని, అందులో ఎలాంటి అనుమానం లేదని సింగ్ చెప్పారు.
భగవాన్ రామ భక్తుల్లో విశ్వాసాన్ని, నమ్మకాన్ని పునరుద్ధరించాలంటే దర్యాప్తు నివేదికను బహిరంగపర్చాలని కూడా మోదీకి రాసిన లేఖలో సింగ్ డిమాండ్ చేశారు.
విరాళాల అవకతవకలు, అక్రమ వినియోగాలపై ఉన్నత-స్థాయి కేంద్ర ఏజెన్సీ ద్వారా నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని బీజేపీ సభ్యుడైన అలహాబాద్ హైకోర్టు న్యాయవాది మురళీధర్ సింగ్ కూడా మోదీకి రాసిన లేఖలో డిమాండ్ చేశారు.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా చేత ఆడిట్ జరిపించాలని కూడా న్యాయవాది కోరారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో 1982 నుంచి భాగంగా ఉన్న మురళీధర్ సింగ్ రామ మందిర్ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. రామ మందిర్ నిర్మాణ సమయంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున మీడియా నిర్వహణ ఇన్ఛార్జిగా ఉన్నట్లు ఆయన చెప్పారు.
గుజరాత్‌లోని సోమనాథ్ మందిరం మాదిరిగా రామ మందిర్ ట్రస్టు అధిపతిగా మోదీని నియమించాలని ‘ది వైర్’తో మాట్లాడుతూ ఆయన డిమాండ్ చేశారు.
2021లో మోదీ ఏకగ్రీవంగా సోమనాథ్ దేవాలయం ట్రస్టు చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారని, ఈ పదవి చేపట్టిన రెండవ ప్రధాన మంత్రి ఆయనేనని ఆయన గుర్తుచేశారు.

ఉత్తర ప్రదేశ్ ఎటాలో జరిగిన ఒక వేడుకలో బద్రీనాథ్ జ్యోతిష్ పీఠానికి చెందిన హిందూ స్వామీజీ స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి మాట్లాడుతూ, అవకతవకల ఆరోపణలపై రాయ్ వైపు వేలెత్తి చూపారు.
తరచుగా బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించే అవిముక్తేశ్వరానంద్.. శంకుస్థాపన చేసిన నాటి నుంచి దేవాలయంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, విరాళాల డబ్బులు మాయం అవ్వడం సుదీర్ఘ జాబితాలో ఇదో మచ్చుతునక లాంటిదని ఆరోపించారు.
దర్యాప్తు ఎవరు చేపట్టాలని ప్రశ్నించగా రాయ్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగారు.
“ఈ తాజా దొంగతనం- ఇవన్నీ ఎప్పటి నుంచో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. చంపత్ రాయ్ అక్కడ అధ్యక్షత వహిస్తున్నాడు. ‘చంపత్’ అంటే అర్థం ఏమిటో మీకు తెలుసా? ‘చంప్’ అనే మూల పదం నుంచి ఇది వచ్చింది, సంస్కృతంలో ‘చంప్’ అంటే అర్థం ఏదో ఒకటి తీసుకొని పారిపోవడం, ‘చంపత్ హో జానా’ అంటే ఏదైనా తీసుకొని పారిపోవడం. చంపత్ రాయ్ అనే పేరున్న వ్యక్తిని ప్రథమ స్థానంలో (ప్రధాన కార్యదర్శిగా) కూర్చోబెడితే కచ్చితంగా ఏమి జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాలి” అని అవిముక్తేశ్వరానంద్ అన్నారు.
అయితే, ఈ మఠాధిపతి తన ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాలు లేదా వివరాలను అందించలేదు. అవిముక్తేశ్వరానంద్ వ్యాఖ్యలపై రాయ్ స్పందించలేదు.
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ యాదవ్ జూన్ 7న ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ, రామ మందిరానికి విరాళంగా ఇచ్చిన “కోట్ల రూపాయలు” మాయమైనట్లు గుర్తించబడిందని ఆరోపిస్తూ, ఈ అంశంపై కోర్టులు సుమోటోగా (తమకు తాము స్వయంగా) చొరవ తీసుకొని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మరోపక్క హుండీ లెక్కింపు గది అంతర్గత ఆడిట్‌ను ట్రస్టీలు, ట్రస్టు వర్కర్లు, భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు సంయుక్తంగా చేపడుతున్నారని రాయ్ తెలియజేశారు.
అప్పటి నుంచి తదుపరి వివరాలు ఏవీ బయటకు రాలేదు.
ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే రిటైర్డ్ బ్యూరోక్రాట్, దేవాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఢిల్లీ నుంచి అకస్మాత్తుగా (షెడ్యూల్ లేకుండా) అయోధ్యను సందర్శించడంపై అనేక ఊహాగానాలు చెలరేగాయి.
సాధారణ ఆర్థిక నేరాలు కావన్న రజనీశ్ సింగ్..
అంతర్గత దర్యాప్తు, ఆరోపణలపై నివేదికను కోరుతూ ప్రధాన మంత్రి కార్యాలయం మిశ్రాను అయోధ్యకు పంపి ఉండొచ్చని బుధవారం నాడు హిందీ దినపత్రిక ‘దైనిక్ జాగరణ్’ ఊహించింది. అయితే నిర్మాణ పనులకు సంబంధించే తాను పర్యటిస్తున్నట్లు మిశ్రా స్పష్టం చేశారు.
మిశ్రా సోమవారం సాయంత్రం నలుగురు ట్రస్టు సభ్యులతో సమావేశమయ్యారని ఆ వార్తా పత్రిక కథనం తెలియజేసింది.
అయోధ్యలో దేవాలయ నిర్మాణ కమిటీ ముఖ్యమైన సమావేశం జూన్ 13న జరగవచ్చని భావిస్తున్నారు.
రామునికి ఇచ్చిన కానుకల నిర్వహణలో అవకతవకల ఆరోపణలు, దేవాలయ సిబ్బంది ప్రమేయంపై వస్తున్న కథనాలు కోట్ల మంది భక్తుల విశ్వాసానికి దెబ్బ అని మురళీధర్ సింగ్ అన్నారు.
రజనీశ్ సింగ్ కూడా అలాంటి భావాన్నే వ్యక్త పరిచారు. ఆరోపణలు వాస్తవమని రుజువైతే అవి సాధారణ ఆర్థిక నేరాలు కావన్నారు.
“లక్షలాది మంది హిందువుల విశ్వాసానికి, భక్తికి, నమ్మకానికి శ్రీ రామ దేవాలయం కేంద్రం. దేశవిదేశాల నుంచి భక్తులు వారి విశ్వాసం ప్రకారం విరాళాలు ఇస్తుంటారు. విరాళాల దుర్వినియోగం, అక్రమ వినియోగం, ఆర్థిక అవకతవకలు నిజమని తేలితే, అది కేవలం ఆర్థిక నేరమే కాదు, లక్షలాది మంది రాముని భక్తుల మతపరమైన భావోద్వేగాలను తీవ్రంగా గాయపరచడమే అవుతుంది” అని ఆయన ప్రధాన మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
(ఒమర్ రషీద్ స్వతంత్ర జర్నలిస్టు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
