అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల అస్త్రాన్ని ప్రయోగిస్తే, ప్రపంచ దేశాలన్నీ గగ్గోలు పెట్టాయి.
ప్రతిగా చైనా “అరుదైన ఖనిజాల” అస్త్రాన్ని సంధించింది. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద తన అధికారాలను అతిక్రమించారని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
వసూలు చేసిన సుంకాలలో 166 బిలియన్ల డాలర్లను వాపసు ఇవ్వాలని అమెరికా అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం ట్రంప్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వెనిజులా దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన సతీమణిని 2026 జనవరి 3న కారకాస్‌లోని వారి నివాసంపై సైనిక ఆపరేషన్ ద్వారా కిడ్నాప్ చేసి, ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా అపఖ్యాతిని మూటగట్టుకున్నారు.
ఇరాన్‌పై దాడి – వ్యూహాత్మక పరిణామాలు..
అమెరికా – ఇజ్రాయెల్ యుద్ధోన్మాదంతో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి, ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దుర్మార్గంగా సైనిక దాడి చేశాయి.
ఇరాన్ సుప్రీం లీడర్‌తో పాటు పసిపిల్లలతో సహా వేలాది మందిని చంపి, విధ్వంసం సృష్టించారు. ఇరాన్ సమర్థవంతంగా ప్రతిఘటించి; చౌకైన డ్రోన్స్, క్షిపణులతో విరుచుకుపడింది.
గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ధ్వంసం సృష్టించింది. హోర్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా ఇరాన్ ఒక వ్యూహాత్మక ఆయుధాన్ని ప్రయోగించింది.
ఇరాన్ ఓడరేవుల నుంచి నౌకల రాకపోకలను అమెరికా దిగ్బంధన చేసింది. తద్వారా అమెరికాతో సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. దేశాల వృద్ధి రేట్లు పతనమయ్యాయి.
పెట్రోల్ – డీజిల్ – గ్యాస్, ఎరువుల కొరత, ధరల పెరుగుదలతో ప్రజలపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడింది.
ఈ సంఘర్షణతో తమకు ఎలాంటి సంబంధం లేదని నాటో మిత్రదేశాలు ప్రకటించడంతో ట్రంప్ వారిపై కారాలు మిరియాలు నూరారు.
అమెరికా చట్టసభలు ఇరాన్‌తో యుద్ధానికి ఆమోదం తెలపలేదు. ప్రజల మద్దతు లభించలేదు. ఫలితంగా, స్వదేశంలోనే ట్రంప్ ప్రతిష్ట బాగా పడిపోయింది.
అమెరికా చట్టసభలు; కాంగ్రెస్, సెనేట్‌కు మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీ ఓటమి పాలైతే, ట్రంప్ అధ్యక్ష పదవిలో కొనసాగినా, తాను ఆశించిన విధానాలను అమలు చేయలేని స్థితిలోకి నెట్టబడతారు.
యూదు జాత్యాహంకార ఇజ్రాయెల్‌కు వత్తాసు పలికి, పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందజేసి, ఇరాన్‌పై యుద్ధం చేయడంపై ప్రత్యర్థుల విమర్శల దాడిని ఎదుర్కోవాల్సి వస్తున్నది.
ఇరాన్‌తో ట్రంప్ కుదుర్చుకుంటున్న తాత్కాలిక ఒప్పందంపై, తన చెప్పుచేతల్లో ఉన్నాడనుకున్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు భిన్నస్వరం వినిపిస్తున్నారు.
జీ-7 సదస్సు – తెరవెనుక భౌగోళిక రాజకీయాలు..
ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7(అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఇటలీ, జపాన్) శిఖరాగ్ర సమావేశం ప్రధానంగా సెమీకండక్టర్లు, డిజిటల్ పరికరాలు, పునరుత్పాదక ఇంధన సాంకేతికతల తయారీకి అవసరమైన “అరుదైన లోహాలు, ఖనిజాల” సమస్యపై చర్చించినట్లు అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అలాగే, భౌగోళిక రాజకీయ సంఘర్షణలపై కూడా చర్చించుకున్నారని భావిస్తున్నారు. ఈ సమావేశానికి భారత్, బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియా దేశాలను ప్రత్యేకంగా ఆహ్వానించడంలోని ఆంతర్యమేమిటో.
“భారత్‌కు మేమున్నాం – ఎవరైనా దాడి చేస్తే అడ్డుకుంటాం” అని ట్రంప్ చెప్పారట. ఈ మాటలు పరోక్షంగా చైనాను ఉద్దేశించే కావచ్చు.
అమెరికా, చైనాల మధ్య శీతల సంఘర్షణ..
నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా- చైనా మొదటి, రెండవ స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య తీవ్రమైన శీతల సంఘర్షణ కొనసాగుతోంది.
అయితే, ఇది ఒక సైద్ధాంతిక పోరాటం కాదు. గతంలో సోవియట్ యూనియన్, అమెరికా మధ్య నెలకొన్న “ప్రచ్ఛన్న యుద్ధం” వంటిదీ కాదు.
అమెరికా, చైనాల దృక్పథాలు భిన్నంగా ఉన్నందున, వాటి సంబంధాలు సంఘర్షణలతో నిండి ఉండడం సహజం.
ట్రంప్ ఇటీవల చైనా పర్యటన సందర్భంగా, ఆ దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్ “శాంతియుత సహజీవనం”కు పిలుపిచ్చారు.
సామరస్యపూర్వక సంబంధాలు, శాంతి, స్థిరత్వం, అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.
తైవాన్ విషయంలో ఎలాంటి జోక్యం అయినా ఇరు దేశాల మధ్య ఘర్షణకు దారితీస్తుందని కూడా స్పష్టం చేశారు.
ట్రంప్ అమెరికాకు తిరిగి వెళ్ళాక ఒక విలేకరి ప్రశ్నకు సమాధానంగా, యుద్ధం చేయడానికి 9,500 మైళ్లు ప్రయాణించే ఉద్దేశం అమెరికాకు లేదని చెప్పారు.
దీంతో, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, దాని మిత్రదేశాలు, శక్తివంతమైన చైనాతో యుద్ధాన్ని కోరుకోవడం లేదన్న విషయం స్పష్టమవుతున్నది. ఇది అంతర్జాతీయ సమాజానికి మంచి సంకేతమే.
సామ్రాజ్యవాద వ్యూహాలు – క్వాడ్ కూటమి..
అమెరికా ఆర్థికంగా, సైనికంగా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం.
రెండవ ప్రపంచ యుద్ధం నుండి, ఐరోపా, మధ్యప్రాచ్యం, ఆసియా-పసిఫిక్ మరియు లాటిన్ అమెరికా అంతటా సుమారు 800 సైనిక స్థావరాలను స్థాపించి, సైన్యాన్ని మోహరించింది.
హిందూ మహాసముద్రంలోని డియాగో గార్సియాలో కూడా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నది. వీటి లక్ష్యం ప్రపంచ ఆధిపత్యాన్ని స్థాపించడమే. తత్ఫలితంగా, ఆసియా-పసిఫిక్, మధ్యప్రాచ్య ప్రాంతాలను అశాంతి – అభద్రతకు నిలయాలుగా మార్చింది.
చైనాను ఒక భూతంలా చిత్రీకరిస్తూ, తామే ఏకైక రక్షకులమనే భ్రమను సృష్టించడం ద్వారా, అమెరికా ఒక సామ్రాజ్యవాద శక్తిగా ఆధిపత్యాన్ని కోరుకుంటున్నది.
ఈ వ్యూహంలో భాగంగానే అమెరికా, భారతదేశం, ఆస్ట్రేలియా, జపాన్ల మధ్య చతుర్భుజ భద్రతా సంభాషణ(క్వాడ్) కూటమి స్థాపించబడింది.
ఈ దౌత్య, భద్రతా భాగస్వామ్యం పైకి స్వేచ్ఛాయుత, సమ్మిళిత ఇండో-పసిఫిక్‌ను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఈ ప్రాంతంలో ఒక ప్రధాన భౌగోళిక, ఆర్థిక శక్తిగా ఆవిర్భవించిన చైనాను కట్టడి చేయాలనే రహస్య ఎజెండాను ఇది కలిగి ఉందనేది బహిరంగ రహస్యమే.
మారుతున్న ప్రపంచ అధికార సమతుల్యత..
చైనా ఎదుగుదల ప్రపంచ శక్తి సమతుల్యతపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. అమెరికా, చైనాల మధ్య సైనిక బలం, సామర్థ్యాలలో అంతరం తగ్గుతోంది.
ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకంగా ఆసియా-పసిఫిక్, మధ్యప్రాచ్య ప్రాంతాలలో అమెరికా వ్యూహాత్మక ఆధిపత్యం ఇకపై కొనసాగే అవకాశాలు తగ్గిపోతున్నాయి.
దీని అర్థం అమెరికా ఆధిపత్యం పూర్తిగా కనుమరుగవుతుందని కాదు.
చైనా ఎదుగుదలను ఎదుర్కోవడానికి, అడ్డంకులు సృష్టించడానికి, తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి అమెరికా నిస్సందేహంగా వ్యూహాలను రూపొందిస్తూనే ఉంటుంది.
అయితే, నేడు భౌగోళిక రాజకీయ దృశ్యం మారిపోయింది.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో ఓటమితో రెండవ ప్రపంచ యుద్ధానంతర(1945) కాలం నుండి నేటి వరకు ఆసియా-పసిఫిక్ మరియు మధ్యప్రాచ్య ప్రాంతాలలో అమెరికా చెలాయించిన ఆధిపత్యం ఇకపై కొనసాగించలేదు.
అధికార సమతుల్యత గుణాత్మకమైన మార్పుకు లోనవుతోంది. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్న చైనా, రష్యాతో పాటు భౌగోళికంగా కీలకమైన ప్రాంతంలో ఉన్న ఇరాన్ జతకలిసింది. ఈ ప్రాంతాలలోని దేశాల మధ్య సంబంధాలలో భవిష్యత్తులో పెనుమార్పులకు అవకాశాలు ఉన్నాయి.
అనారోగ్యకరమైన, తీవ్రమైన పోటీతో ముడిపడి ఉన్న వ్యూహాత్మక సంబంధాల వల్ల ఊహించని రీతిలో సంఘర్షణలు తలెత్తే అవకాశాలు కూడా లేకపోలేదు. అమెరికా, చైనాల మధ్య మారుతున్న అధికార సమతుల్యత ఈ ప్రాంతాలలో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని పెంపొందిస్తుందా లేదా అనేది అనేక ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
దీర్ఘకాలంగా అమెరికాపై ఆధారపడి, దానితో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు, అలాగే చైనా మరికొన్ని పొరుగు దేశాలు తాజా పరిణామాలతో ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది.
ఆయుధ పోటీ – పెరిగిన రక్షణ వ్యయం..
గత కొన్ని దశాబ్దాల చరిత్రను అధ్యయనం చేస్తే, సామ్రాజ్యవాద అమెరికా ఆసియా-పసిఫిక్, మధ్యప్రాచ్య ప్రాంతాలలో (గల్ఫ్ దేశాలు, భారత్-పాకిస్తాన్, ఉత్తర-దక్షిణ కొరియా వంటివి) సంఘర్షణలను ప్రేరేపించడం, ప్రోత్సహించడం ద్వారా, అలాగే వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఇప్పుడు ఇరాన్‌పై యుద్ధాలు చేయడం ద్వారా అంతర్జాతీయ చట్టాలను, న్యాయ సూత్రాలను ఉల్లంఘించిందని వెల్లడవుతుంది.
సరిహద్దు వివాదాలు, సైనిక చొరబాట్లు, దాడులతో సహా, చైనా తన పొరుగు దేశాల పట్ల ప్రవర్తించిన తీరు అపనమ్మకాన్ని పెంచిందనడంలో కూడా సందేహం లేదు.
అయితే చైనా ప్రధానంగా నేడు వృద్ధిపై దృష్టి పెట్టిందనేది ప్రబలమైన అభిప్రాయం. తన ఆర్థిక శక్తితో పాటు, చైనా సైన్స్, టెక్నాలజీ, సైనిక ఆధునీకరణలో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది.
అణ్వాయుధాలు కలిగిన దేశాలలో అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే, భారతదేశం, పాకిస్తాన్, ఉత్తర కొరియా మరియు ఇజ్రాయెల్(అనధికారికంగా) ఉన్నాయి.
ఒక దేశం దౌత్య విధానం, రక్షణ అవసరాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, వ్యూహాలు, ఎత్తుగడలు నిర్దిష్ట పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. అవి స్థిరంగా ఉంటాయని ఆశించలేం. పాలక శక్తులు, వ్యక్తులు తరచుగా మారుతుంటారు. దానికి అనుగుణంగా దౌత్య విధానాలు కూడా మారుతుంటాయి.
గతంలో భారతదేశం సుదీర్ఘకాలం పాటు అలీన విధానాన్ని అనుసరించింది. ప్రస్తుత మోదీ ప్రభుత్వం “వ్యూహాత్మక మౌనం లేదా తటస్థ వైఖరి”ని భారతదేశ దౌత్యనీతిగా మార్చింది.
భారత నౌకాదళం ఆహ్వానంపై విశాఖపట్నంలో నిర్వహించిన నౌకాదళ విన్యాసాలలో పాల్గొని స్వదేశానికి తిరిగి వెళుతున్న ఇరాన్ నౌకాదళ నౌకను శ్రీలంక సమీపంలో అమెరికా నౌకాదళం ముంచివేసి, పలువురి మరణానికి పాల్పడినా ఖండించలేని స్థితి.
యుద్ధాలు – భౌగోళిక అస్థిరత..
ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత వచ్చిన అమెరికా అధ్యక్షులందరూ ఆసియా – పసిఫిక్, మధ్యప్రాచ్య ప్రాంతంలో అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తూనే ఉన్నారు.
యుద్ధాలు, అనిశ్చితి, భౌగోళిక రాజకీయ అస్థిరత పెరిగింది. ప్రపంచ రక్షణ వ్యయం 2025లో 2.89 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అమెరికా ఒక్కటే 954 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. 2027 కోసం 1.45 ట్రిలియన్ల డాలర్లను కేటాయించమని అమెరికా చట్టసభకు విజ్ఞప్తి చేసింది.
చైనా 2025 రక్షణ బడ్జెట్ 249 బిలియన్ డాలర్లు. భారతదేశ రక్షణ కేటాయింపు 92.1 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాల్లో అధిక భాగం ఆసియా-పసిఫిక్, మధ్యప్రాచ్య ప్రాంతంలోనే ఉన్నాయి.
ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన 1991 నుంచి గడచిన 35 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా యుద్ధాలు, భారీ అంతర్గత సంఘర్షణలు జరిగాయి.
మధ్యప్రాచ్యం, ఆసియా-పసిఫిక్ ప్రాంతాలలో 15కు పైగా యుద్ధాలు జరిగాయి. గల్ఫ్ యుద్ధం(1991), ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం (2001–2021), ఇరాక్ యుద్ధం (2003–2011), ఇరాక్, సిరియాలలో ఐసిస్‌కు వ్యతిరేకంగా జోక్యం (2014-ప్రస్తుతం), సిరియా అంతర్యుద్ధం (2014-ప్రస్తుతం), ఇప్పుడు ఇరాన్‌పై యుద్ధం- వీటిలో అమెరికా తన సైనిక బలగాలతో ప్రత్యక్షంగా పాల్గొన్నది.
మరొకవైపు, చైనా గణనీయమైన శక్తి ప్రదర్శన సామర్థ్యం గల ఆధునిక నౌకాదళాన్ని నిర్మిస్తోందని; 5,000 నుంచి 8,000 కిలోమీటర్ల పరిధి గల భారీ సుదూర, హైపర్సోనిక్ ఆయుధాలను ఉపయోగించి ఆస్ట్రేలియాపై ప్రత్యక్ష క్షిపణి దాడులు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో పనిచేయగల ‘బ్లూ-వాటర్ నేవీ’ని కూడా అది అభివృద్ధి చేస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని కాపాడటానికి ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి ద్వారా పటిష్టమైన చర్యలను అమలు చేయడమే ఏకైక మార్గం.
విద్యార్థి ఉద్యమ అనుభవాలు – శాంతి ఆకాంక్ష..
నేను తిరుపతి కేంద్రంగా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్(ఏఐఎస్ఎఫ్)లో పని చేస్తున్నప్పుడు, “డియాగో గార్సియాలోని అమెరికా సైనిక స్థావరాన్ని తొలగించాలని, హిందూ మహాసముద్రాన్ని శాంతి ప్రాంతంగా పరిరక్షించాలని”, 1978లో మద్రాసులో అంతర్జాతీయ సదస్సు జరిగింది. దానికి నేను హాజరయ్యాను.
1985-91 మధ్య కాలంలో నేను ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో, ‘ఏషియన్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్’ (ఏసిక్) కన్వీనర్‌గా కూడా వ్యవహరించాను.
ఆ కాలంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, సహకారం, అభివృద్ధిపై దృష్టి సారించి అనేక కార్యక్రమాలను నిర్వహించాం.
“ఆసియా భద్రత, సహకారం” అంశంపై 1985లో విజయవాడలో ప్రాంతీయ సదస్సును, 1986లో లక్నోలో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ స్టూడెంట్స్(ఐయుఎస్) సహకారంతో “నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, సమగ్ర అభివృద్ధి, ప్రపంచ శాంతి పోరాటంతో వాటికున్న సంబంధాలు” అంశంపై అంతర్జాతీయ విద్యార్థి సదస్సును, 1987లో “భారత ఉపఖండంలో ఉన్నత విద్య ప్రస్తుత స్థితి, విద్యార్థుల పరిస్థితులు” అంశంపై ఢిల్లీలో ఉప-ప్రాంతీయ విద్యార్థి సదస్సును నిర్వహించాము.
అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) భాగస్వామ్యంతో, ‘వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డెమోక్రటిక్ యూత్'(వుప్డీ) మద్దతుతో, 1987లో బొంబాయిలో “అణు ఆయుధ రహిత ఆసియా-పసిఫిక్, శాంతియుత హిందూ మహాసముద్రం కోసం ఉమ్మడి విద్యార్థి – యువజన కార్యాచరణ” అంశంపై అంతర్జాతీయ సదస్సును, ‘ఏషియన్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్’, ‘డెమోక్రటిక్ యూత్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్’ సంయుక్తంగా కాబూల్ (1988)లో “విద్య – అభివృద్ధి – సమాజం: విద్యార్థి దృక్పథం” అంశంపై సదస్సును నిర్వహించాం.
“ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని విద్యార్థి సంఘాల మధ్య స్నేహం, సహకారం, సంఘీభావంపై చర్చలు, సంప్రదింపుల ద్వారా కార్యాచరణ ప్రణాళిక”ను రూపొందించే లక్ష్యంతో బ్యాంకాక్ (థాయిలాండ్, 1989), ఉలాన్బాటర్ (మంగోలియా, 1987); నికోసియా (సైప్రస్, 1989) రాజధానులలో సమావేశాలు జరిగాయి.
మాస్కో (1985), ప్యోంగ్యాంగ్ (డీపీఆర్ కొరియా, 1989)లలో జరిగిన “ప్రపంచ యువజన, విద్యార్థుల ఉత్సవం” (వరల్డ్ ఫెస్టివల్ ఆఫ్ యూత్ & స్టూడెంట్స్), క్యూబా రాజధాని హవానాలో జరిగిన ఐయుఎస్ 15వ మహాసభ (1987) సమయంలోనూ ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక చర్చా వేదికలు నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొన్న వ్యక్తిగా ఆసియా-పసిఫిక్, మధ్యప్రాచ్యం ప్రాంతంలోని ప్రస్తుత పరిస్థితిని ఒక సానుకూల పరిణామంగా భావించి ఈ వ్యాసాన్ని రాశాను.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
