ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న తమ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు డిమాండ్ చేశారు.
తమ బకాయిల కోసం వందలాది మంది ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు, అధికారులు గురువారం(2026 జూన్ 18)నాడు ఒక్క రోజు ఉపవాస దీక్షకు పూనుకున్నారు.
పదకొండు సభ్యులతో ఏర్పాటైన సారధ్య కమిటి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ ఆర్టీసీ) ప్రధాన కార్యాలయం బస్ భవన్ వద్ద ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులందరూ దీక్షకు దిగారు.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చిన వందలాది మంది విశ్రాంత ఉద్యోగులు, అధికారులు ఈ దీక్షలో పాల్గొన్నారు. “మేము బ్రతికి ఉన్నప్పుడే బకాయిలు చెల్లించాలని” అనే ప్లకార్డులను పట్టుకోని నినాదాలు చేశారు.
తొమ్మది సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ బకాయిలను, 2017 నుంచి బకాయిపడ్డ పే-స్కేల్, డీఏ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాడ్యుటీ వంటి తదితర వాటిని చెల్లించాలన్నారు.
సారధ్య కమిటీ సభ్యులు, రిటైర్డ్ ఆఫిసర్ పట్టాభి లక్ష్మయ్య ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.
బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, గడచిన రెండు సంవత్సరాలలో బస్‌భవన్ వద్ద జరిపిన కార్యక్రమాలలో ఇది మూడవదని గుర్తు చేశారు.
సంస్థ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ విశ్రాంత ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని అన్నారు. గతంలో ఒకసారి చర్చలకు పిలిచి అవమానించేలా మాట్లాడారని లక్ష్మయ్య చెప్పుకొచ్చారు.
“విశ్రాంత ఉద్యోగులు, అధికారులకు చట్ట ప్రకారం రావల్సిన బకాయిలు చెల్లించేది లేదు. ఆ బకాయిలను మర్చిపోండి, అవి ఇవ్వడం సాధ్యపడదు” అంటూ యాజమాన్యం మాట్లాడటాన్ని సారధ్య కమిటీ మరో సభ్యులు, రిటైర్డ్ ఆఫిసర్ చంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు.
ఈ విశ్రాంత ఉద్యోగుల దీక్షకు తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవీందర్ రెడ్డి, టీఎంయూ ప్రధాన కార్యదర్శి జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి మద్దతు తెలిపారు. దీక్షలో సారధ్య కమిటీ సభ్యులు రంగా రావు తదితరులు పాల్గొన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
