2026 ఆగస్టు 11న ఉమర్ ఖాలిద్ పుట్టినరోజు. అతను తన జీవితంలో ఆరో పుట్టినరోజును కూడా కటకటాల వెనుకే గడిపారు. ఆగస్టు 10న ఆయన మాతృసంస్థ అయిన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు కలిసి మాజీ విద్యార్థి ఉమర్ ఖాలిద్ రాసిన “ఫ్రాక్చర్డ్ కమ్యూనిటీస్: ఆదివాసి హిస్టరీస్ అండ్ ది పాలిటిక్స్ ఆఫ్ పవర్” అనే పుస్తకంపై బహిరంగ చర్చను నిర్వహించాయి.
విశ్వవిద్యాలయ యంత్రాంగం ఇండోర్ ఎస్ఎస్ఎస్-1 ఆడిటోరియం బుకింగ్‌ను రద్దు చేసినప్పటికీ వారు ఈ కార్యక్రమాన్ని జరిపారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లు, అధికార యంత్రాంగం సాగిస్తున్న నిరంతర అణచివేతకు వ్యతిరేకంగా బలమైన తిరుగుబాటు ధోరణి గత దశాబ్దాలుగా జేఎన్‌యూతో పాటు ఇతర కేంద్ర విశ్వవిద్యాలయాల ప్రత్యేకతగా నిలిచింది.
ముఖ్యంగా 2014 తర్వాత గడిచిన దశాబ్ద కాలంలో, జేఎన్‌యూ, ఇతర యూనివర్సిటీలు దాడులకు వ్యతిరేకంగా ప్రత్యేక నిరసనలను చవిచూశాయి.
క్యాంపస్‌లలోకి చొరబడిన సైద్ధాంతిక దాడులు..
దీనికి కారణాలు వేరే వెతకనవసరం లేదు. ఒక దశాబ్దం క్రితం 2015-2016లో, జాతీయంగా, అంతర్జాతీయంగా నిరంకుశ, ప్రోటో-ఫాసిస్టు ప్రభుత్వంగా ముద్రపడిన ఈ పాలన తొలి విడత అధికారంలోకి వచ్చిన కేవలం ఒకటి రెండు సంవత్సరాలకే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, చెన్నైలోని అంబేడ్కర్-పెరియార్ సర్కిల్స్‌పైనే అధికారిక, సైద్ధాంతిక దాడులు మొదలయ్యాయి.
కేంద్ర ప్రభుత్వ మంత్రులు స్వయంగా రంగంలోకి దిగి, రోహిత్ వేముల లాంటి దళిత(అంబేడ్కరిస్ట్) వామపక్ష భావజాలం గల విద్యార్థులు అర్హతతో సంపాదించుకున్న ఫెలోషిప్‌లు/స్కాలర్షిప్లను మొదట నిలిపివేశారు.
ఆ తర్వాత లైబ్రరీలు, హాస్టల్ వసతులను పరిమితం చేయడం ద్వారా వారిని అవమానించారు. ఉమర్ ఖాలిద్, నజీబ్ అహ్మద్ వంటి ముస్లిం విద్యార్థి స్కాలర్లు ప్రత్యేక లక్ష్యంగా మారారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తలతో ముందు రోజు జరిగిన గొడవ తర్వాత, 2016 అక్టోబర్ 15న నజీబ్ జేఎన్‌యూలోని తన గది నుండి “మాయమయ్యాడు”. ఆ ఘర్షణలో ఆయన గాయపడ్డారని, సాక్షుల కథనం ప్రకారం వైద్యులు సకాలంలో చికిత్స చేయడానికి నిరాకరించారని తెలిసింది.
అత్యంత బాధాకరమైన విషయమేమిటంటే, ఆయన తల్లి ఎంతో పట్టుదలతో పోరాడిన ఈ కేసును 2025లో రౌస్ అవెన్యూ కోర్టు “మూసివేసింది”.
ఈ సమకాలీన విషాదాన్ని, ఈ ప్రభుత్వం మన జ్ఞాపకాల నుంచి చెరిపేయాలనుకుంటున్న వాస్తవాన్ని ‘అమ్మి'(2019), ‘వేర్ ఈజ్ నజీబ్?’ (2022) అనే రెండు సినిమాలు భద్రపరిచాయి.
రోహిత్ వేముల సంస్థాగత హత్య – ఎగిసిపడిన నిరసనలు..
హెచ్‌సీయూలో ‘ముజఫర్‌నగర్ బాకీ హై’ ప్రదర్శించడానికి సాహసించినందుకు విశ్వవిద్యాలయ యంత్రాంగం కక్ష సాధింపునకు గురిచేసిన ప్రతిభావంతుడైన విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు పురిగొల్పబడ్డారు.
2016 జనవరి 17, ఆదివారం జరిగిన ఈ సంఘటనను ఉద్యమం “సంస్థాగత హత్య”గా అభివర్ణించింది. ఆ రాత్రే జేఎన్‌యూ విద్యార్థులు రోహిత్ మరణాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు, ఆ ఉద్యమ అలలు భారతదేశమంతటా వ్యాపించాయి.
అణచివేతపై అరుదుగా మాత్రమే రోడ్లెక్కి నిరసన తెలిపే ముంబై నగరంలో పది వేల మందికి పైగా విద్యార్థులు, కార్యకర్తలు బైకుల్లా నుంచి సీఎస్టీ వరకు ప్రదర్శన నిర్వహించి రోహిత్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అసమ్మతిని నేరంగా మార్చిన పాలకులు..
అప్పారావు పొదిలే(హెచ్‌సీయూ), ఎం జగదీశ్ కుమార్(జేఎన్‌యూ) వంటి వైస్-ఛాన్సలర్ల ఉదాసీన వైఖరితో కూడిన క్రూరమైన అధికారం, రెండు క్యాంపస్‌లలోకి పోలీసుల హింసాత్మక ప్రవేశాన్ని, జోక్యాన్ని అనుమతించింది.
తద్వారా విద్యార్థులను శారీరకంగా హింసించడమే కాకుండా అసమ్మతిని నేరంగా చిత్రించింది. కేసులు నమోదయ్యాయి, ఉమర్ ఖాలిద్, కన్హయ్య కుమార్‌లను నెల రోజుల పాటు జైలులో పెట్టారు.
అధికార మధాంధుల కక్ష సాధింపు చర్యల వల్ల ఎఫ్టీఐఐకి చెందిన 35 మంది విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరాలను కోల్పోయి పోరాడాల్సి వచ్చింది.
పాయల్ కపాడియా తీసిన ‘ఎ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ (2021) సినిమా యువ భారతీయులు ఎదుర్కొన్న కష్టాలను బహుళ-స్థాయి కథనంలో చిత్రీకరిస్తుంది. 2016 నాటి పరిస్థితులు ఎంత ముఖ్యమైనవో, 2026 కూడా అలాగే నిరూపితం కావచ్చు.
సంస్థాగత వైఫల్యాలు, పక్షపాత మీడియా..
అలాంటప్పుడు మన ప్రజాస్వామ్య స్పృహ ఎందుకింత తక్కువగా ఉంటుంది, మన స్పందన కేవలం అప్పుడప్పుడు మాత్రమే ఎందుకుంటోంది? న్యాయస్థానాలతో సహా మన రాజ్యాంగ సంస్థల సంస్థాగత వైఫల్యం, జ్ఞాపకశక్తి లోపం, సంప్రదాయ వాణిజ్య మీడియా ఉద్దేశపూర్వక లొంగుబాటు కారణంగానే విద్యార్థి నాయకులు, ఆందోళనకారులపై బాధ్యతారహితమైన నిందలు పడ్డాయి.
స్పష్టంగా చెప్పాలంటే, యువకులు, స్వతంత్రంగా ఆలోచించే, ప్రవర్తించే విద్యార్థులే ప్రత్యేక లక్ష్యాలుగా మారారు. వామపక్ష, దళిత నేపథ్యాలకు చెందిన సంస్థలు, వ్యక్తులు ప్రధాన లక్ష్యాలుగా మారగా, వారిపై మోపిన కేసులు మరింత కక్షసాధింపు ధోరణితో కూడుకున్నవిగా ఉన్నాయి.
బాధ్యతారహితమైన, జవాబుదారీతనం లేని మీడియా సంస్థలు ఉమర్‌ను “దేశద్రోహి”గా ముద్రవేశాయి. రోహిత్ ప్రతిభను ప్రశ్నించారు, అతని కుల గుర్తింపును బోనులో నిలబెట్టారు.
2016కి ముందు లేదా ఆ తర్వాత కూడా ముస్లిం విద్యార్థుల పట్ల వేధింపులు ఆగలేదు. ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అర్మాన్ ఇక్బాల్ ఖత్రీ (ఏప్రిల్ 2023), దర్శన్ సోలంకి (ఫిబ్రవరి 2023) మరణాలు, బీవైఎల్ నాయర్ ఆసుపత్రిలో వైద్య విద్య అభ్యసించిన పాయల్ తద్వి (మే 2019) మరణం అన్నీ లక్షిత హింసకు బలైనవే.
న్యాయస్థానాల వంటి దిద్దుబాటు రాజ్యాంగ సంస్థలు కూడా తగిన ఉపశమనం అందించడంలో ఆలస్యం చేశాయి.
క్యాంపస్‌లలో ఎగిసిపడిన నిరసన జ్వాలలు..
2026లో కూడా అదే మీడియా, అదే అధికార శక్తులు, దాని తాబేదారు సంస్థలు జెన్-జీ పై “పశ్చిమ దేశాల ప్రభావం గల యువత”, “దేశద్రోహి” అనే ముద్రలను వేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
అయితే ఉమర్, రోహిత్ వంటి మేధావులు, స్పష్టమైన వామపక్ష భావజాలం గల స్కాలర్లపై మాత్రం ఇలాంటి నిందలు నిరంతరాయంగా కొనసాగించారు.
విద్యార్థి, యువతరం నడవడి, ఆలోచనలు, భావాలను నియంత్రించాలని కృత నిశ్చయంతో తీవ్రంగా ప్రయత్నించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక దశాబ్దం క్రితం హెచ్‌సీయూ, జేఎన్‌యూతో పాటు మరో రెండు డజన్ల ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థులు చేపట్టిన నిరసనలు ప్రభావవంతమైన సవాళ్లు విసిరాయి.
ఆ తర్వాత కొద్ది నెలలు, సంవత్సరాలలో భారతదేశంలోని అనేక క్యాంపస్‌లలో ఈ నిరసనలు చెలరేగాయి. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ, కాశ్మీర్, అసోం, పుదుచ్చేరి వంటి అన్ని చోట్లా ఉత్సాహపూరితమైన నిరసనలు వ్యక్తమయ్యాయి.
బీహార్‌లోని పాట్నా యూనివర్సిటీ, పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ, బెంగళూరులోని నేషనల్ లా స్కూల్, ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో కూడా అణచివేతకు వ్యతిరేకంగా ఇలాంటి పోరాటాలే జరిగాయి.
కక్షసాధింపు చర్యలు, దాడులు..
రోహిత్ వేముల “సంస్థాగత హత్య”(జనవరి 17, 2016, ఆదివారం) జరిగిన తొమ్మిది నెలల తర్వాత, లక్నోలోని బాబాసాహెబ్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎనిమిది మంది లా విద్యార్థులు నిరసన తెలిపారు. వారిలో ఇద్దరు పీహెచ్డీ ప్రవేశ పరీక్షలో మొదటి, రెండు ర్యాంకులు సాధించిన టాపర్లు కాగా, వారిపై కక్షసాధింపు చర్యలు చేపట్టారు.
ప్రభుత్వం, ప్రొఫెసర్ల కులతత్వ ప్రవర్తనను వారు నిరసించినందుకు, యూనివర్సిటీ యంత్రాంగం, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(ఎంహెచ్ఆర్డీ) ఆ ప్రొఫెసర్లను వెనకేసుకొస్తున్నాయని ఆరోపించినందుకు, ఎటువంటి తగిన ప్రక్రియ లేకుండానే ఆ విద్యార్థులను సస్పెండ్ చేసి ఆ తర్వాత యూనివర్సిటీ నుండి బహిష్కరించారు.
సబ్రంగ్ ఇండియాలో ప్రచురితమైన ఒక వ్యాసంలో ప్రథమ బెనర్జీ(2016లో) గ్వాలియర్‌లో జరిగిన ఒక సంఘటనను నివేదించారు.
జేఎన్‌యూకి చెందిన అంబేడ్కరిస్ట్ ప్రొఫెసర్ వివేక్ కుమార్‌తో కలిసి అంబేడ్కర్ మంచ్ నిర్వహించిన సమావేశంపై ఏబీవీపీ సభ్యులు దాడి చేశారు. వారు గుమిగూడిన జనాలపై కాల్పులు జరపడమే కాకుండా, అర్ధ శతాబ్దం క్రితం అంబేడ్కర్ మనుస్మృతిని దహనం చేసినందుకు ప్రతీకారంగా భారత రాజ్యాంగాన్ని కూడా దహనం చేశారు.
ప్రభుత్వ విద్యపై దాడులు, విద్యార్థుల సంఘటితం..
సిలబస్‌లలో సైద్ధాంతిక మార్పుల నుండి, మహిళలు తమకు నచ్చిన దుస్తులు ధరించే, మాంసాహారం తినే హక్కుల వరకు, ఎఫ్టీఐఐ డైరెక్టర్‌గా గజేంద్ర చౌహాన్ వంటి ఏ మాత్రం అర్హత లేని వ్యక్తుల సందేహాస్పద నియామకాల వరకు, విద్యార్థులు, యువకులు తమ మనుగడకు, స్వయంప్రతిపత్తికి ముప్పు వాటిల్లినప్పుడు ముందుగా స్పందించి సంఘటితమయ్యారు.
2016 చివరి నాటికి, మోదీ 1.0 ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యపై దాడి కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు చెందిన దాదాపు 20,000 స్కాలర్షిప్లను రద్దు చేసే స్థాయికి చేరింది. దానికి కొనసాగింపుగా మునుపటి యూపీఏ-2 ప్రభుత్వం ప్రవేశపెట్టిన మైనారిటీ స్కాలర్‌షిప్‌లన్నీ ఉపసంహరించబడ్డాయి.
కాబట్టి 2026 నాటి జెన్-జీ నిరసనలు పోరాటాలతో అలసిపోయిన ప్రజలకు తాజా గాలిని పీల్చినట్లు అనిపించినప్పటికీ, మన విద్యార్థులు, యువకులు, విద్యావేత్తల మద్దతుతో, ఒక దశాబ్ద కాలంగా ఈ ప్రజాస్వామ్య సవాలులో ముందంజలో ఉన్నారు.
రాజకీయ ప్రతిపక్షం తనకున్న తక్కువ సంఖ్యాబలంతోనైనా, పార్లమెంటులో ఈ గొంతులను, వీరి కోర్కెలను 2016 నుండి పదే పదే బలపరిచి ఉంటే పరిస్థితి ఇవాళ్టి కంటే చాలా భిన్నంగా ఉండేది కదా. మహా అయితే ఏం జరిగి ఉండేది? అధికార పీఠం నుండి ఎదురు దాడిని ముందే చవిచూసి ఉండేదా?
ఏకీకృత భావజాలంపై పోరాటం..
నిజమైన ఏ ప్రజాస్వామ్య సమాజంలోనైనా, విశ్వవిద్యాలయమే వర్ధమాన యువ మేధో అభిప్రాయాలకు నిలయంగానూ, తీవ్రమైన, విమర్శనాత్మక భిన్నాభిప్రాయాలకు వేదికగానూ ఉంటుంది.
2014 నుంచి భారతదేశం ఏకీకృత భావజాలాన్ని(హోమోజెనిజేషన్), మెజారిటీ వాదాన్ని బలవంతంగా రుద్దే తీవ్ర ప్రయత్నాన్ని ఎదుర్కొంటోంది. విద్యను వాణిజ్యీకరణ, ప్రైవేటీకరణ చేయడం ద్వారా కావచ్చు, లేదా భారత రాజ్యాన్ని, దేశాన్ని “ఒకే భాష, ఒకే సంస్కృతి” తో సమానం చేసే సాంస్కృతికంగా ఏకరూపత గల ప్రపంచ దృక్పథాన్ని రుద్దడం ద్వారా కావచ్చు పౌరసత్వ బహుళత్వాన్ని నిరాకరిస్తోంది.
ఈ పోకడలు ప్రమాదకరమైనవి మాత్రమే కాదు, రాజ్యాంగ గణతంత్ర రాజ్యంగా భారతదేశ మూలాలకే సవాలు విసురుతున్నాయి. భారతీయ ప్రజాస్వామ్యాన్ని, అది కట్టుబడిన విలువలన్నింటినీ పరిరక్షించడానికి మన దేశంలోని ఉన్నత విద్యా కేంద్రాలే రణరంగంగా మారాయి.
విశ్వవిద్యాలయాల్లో వైవిధ్యం, సమానత్వం..
2014కి ముందు, 1960, 1970 దశకాలలో—హైదరాబాద్ యూనివర్సిటీ చట్టం-1974, జవహర్లాల్ నెహ్రూ చట్టం-1966, నార్త్-ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ చట్టం-1973 వంటి కీలక చట్టాల ద్వారా ఏర్పడిన ఈ కేంద్ర విశ్వవిద్యాలయాలలో నిదానంగా అయినా క్లిష్టతరమైన ప్రక్రియ ద్వారా- ఉపాధ్యాయుల సంఘాలు, అసోసియేషన్ల ద్వారా సానుకూల చర్యల దిశగా వేసిన చిన్న అడుగులు – విద్యార్థులలో నిజమైన వైవిధ్యాన్ని ప్రోది చేశాయి.
గ్రామీణ, అణగారిన, వివక్షకు గురైన నేపథ్యాల నుండి వచ్చిన విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థలలోకి ప్రవేశించగలిగారు. అందుకే మన ఉమర్‌లు, నజీబ్లు, రోహిత్‌లు ధైర్యంగా సవాలు చేసినా లేదా త్యాగం చేసినా ఇంటింటి పేర్లుగా నిలిచారు. అంతకు ముందు డబ్బున్నవారికి మాత్రమే అక్కడ ప్రవేశం లభించేది.
ప్రజాస్వామ్య ఉద్యమ కేంద్రాలుగా క్యాంపస్‌లు..
అయితే మూడవ విడతలోకి అడుగుపెట్టిన ఈ ప్రభుత్వ హయాంలో, విద్యా సంస్థలలో స్కాలర్షిప్లను కోత కోసిన నయా-ఉదారవాద విధానాల దాడి, నయా-ఫాసిస్టు నిరంకుశ స్వభావం గల సైద్ధాంతిక దాడితో కలిసి భారతదేశంలోని క్యాంపస్‌లను పునరుజ్జీవింపబడిన ప్రజాస్వామ్య ఉద్యమానికి కేంద్రాలుగా మార్చాయి.
మెజారిటీ వాద దృష్టికి తలొగ్గని విద్యార్థి నాయకులు, సంఘాలు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. వాటిలో అత్యంత దారుణమైనది దేశద్రోహ చట్టం (సెక్షన్ 124-ఏ). కొద్ది రోజుల క్రితం కూడా, గతంలో ప్రతిష్టాత్మకమైన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విద్యార్థిగా ఉన్న వ్యక్తికి, దివంగత విద్యావేత్త జీఎన్ సాయిబాబాకు మద్దతుగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారనే నెపంతో బెయిల్ నిరాకరించబడింది.
యువత తిరుగుబాటుకు నివాళి..
జవాబుదారీతనం లేదా అసమర్థత ఆరోపణల విషయానికి వస్తే, ఈ పాలన నిఘా లేదా కక్షసాధింపు చర్యల నుండి వెనక్కి తగ్గే అవకాశం లేదు.
కేంద్ర ప్రభుత్వాన్ని వణికించడంలో తమ విజయానికి సంతోషిస్తున్న జెన్-జీ తరానికి, నిరంతర శిక్షలను ఎదుర్కొనే వారి దృఢత్వం త్వరలో పరీక్షించబడవచ్చు.
ఒక దశాబ్దం క్రితం లేని విధంగా వయసుమళ్లిన భారతీయులు, స్వతంత్ర మీడియా పెద్ద ఎత్తున చూపిన సంఘీభావం నిలకడగా ఉంటే, విజయం మనదే కావచ్చు. అయినప్పటికీ మనం సిద్ధంగా ఉండాలి.
ఈ ఆత్మవిమర్శ క్షణంలో, ఇది నా వినయపూర్వకమైన నివాళి. భారతదేశ యువత సాగించిన స్ఫూర్తిదాయకమైన, దశాబ్దానికి పైగా సాగిన విశ్రాంతి లేని తిరుగుబాటుకు ఇది అంకితం.
[పాద సూచిక: 2016లో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) వైస్-ఛాన్సలర్‌గా ఎం జగదీశ్ కుమార్ ఉన్నారు. ఆయన విద్యార్థులపై దాడులు, అరెస్టులకు నెల రోజుల ముందు, 2016 జనవరి 28న బాధ్యతలు స్వీకరించారు. ఆయన సుధీర్ కుమార్ సోపోరి తర్వాత ఆ పదవిని చేపట్టారు. 2022 ఫిబ్రవరి వరకు సేవలందించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం మాజీ వైస్-ఛాన్సలర్ అప్పారావు పొదిలేకు 2017లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా లైఫ్ సైన్సెస్‌లో సాధించిన విజయాలకు గాను ‘మిలీనియం ప్లేక్స్ ఆఫ్ హానర్’ లభించింది.]
(మధురైలో నిర్వహించిన కేజీ కన్నభిరాన్ స్మారకోపన్యాసం సందర్భంగా తీస్తా సెతల్వాద్ చేసిన ప్రసంగ పాఠం – సబ్ రంగ్ వెబ్ పత్రిక నుంచి)
తీస్తా సెతల్వాద్
అనువాదం: కే సత్యరంజన్..
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
