నార్వే రాజధాని ఓస్లోలో 2025 అక్టోబర్ 10న నోబెల్ శాంతి పురస్కార విజేతను ప్రకటించారు. ఈసారి ఈ పురస్కారం వెనిజులా నేత మరియా కొరినా మచాడోకు వరించింది. నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పురస్కారం గురించి తెలియజేశారు.
ప్రతీ ఏడాదిలానే ఈసారి కూడా నోబెల్ పురస్కారం కోసం చాలా పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. కానీ, చివరికి మచాడోను మాత్రమే పురస్కారానికి అర్హురాలిగా సంస్థ సభ్యులు పరిగణించారు. నోబెల్ పురస్కారం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ నానా యాతనలుపడ్డ అమెరికా అధ్యక్షులు ట్రంప్‌కు పురస్కారం దక్కలేదు.
అహింస ద్వారానే మార్పు..
మచాడో పేరును ప్రకటిస్తూ, “ఈ పురస్కారం ధైర్యవంతురాలైన మహిళలకు ఇవ్వడం జరుగుతోంది. అలుముకుంటున్న గాడాంధకారంలో సైతం ప్రజాస్వామ్య వెలుగును ప్రసరింపజేశారు”అని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో నోబెల్ సంస్థ తెలియజేసింది. అంతేకాకుండా, “మరియా కొరినా మచాడో ప్రజాస్వామ్య విధానమే శాంతికు సరైన దారని రుజువు చేశారు. వెనిజులాలాంటి సంక్లిష్ట దేశంలో తను ప్రజల హక్కుల గురించి నిరంతరాయంగా పోరాడారు. అహింస విధానాల ద్వారా మార్పు కోసం ప్రయత్నించారు” అని సంస్థ పేర్కొన్నది.
తన రాజకీయ జీవితంలో మచాడో అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. కానీ దృఢసంకల్పంతో మొక్కవోని దీక్షతో తన లక్ష్యాన్ని చేరుకునే దారి నుంచి మాత్రం వెనుకడుగు వేయలేదు. హింసతో కాదు- ప్రజాస్వామ్య సిద్ధాంతాలతో, ప్రజా మద్దతు వల్ల అధికార మార్పిడి జరగాలని తను నిరంతరం నమ్మారు. సమాజంలో న్యాయం, సమానత్వం, స్వాతంత్ర్యం ఎప్పుడైతే స్థాపించబడుతుందో, అప్పుడే శాంతి సాధ్యమని మచాడో భావించారు.
“మచాడో పోరాటం కేవలం వెనెజులా కోసమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య- మానవహక్కుల సమర్థన కోసం ఒక ప్రేరణ” అని నోబెల్ కమిటీ పేర్కొన్నది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
