నవంబర్ 1989 ఎన్నికలలో, బీజేపీ లోక్‌సభలో తన స్థానాలను 2 నుంచి 88కి పెంచుకుంది; అది గెలిచిన అనేక నియోజకవర్గాలు హింసకు గురైనవే.
1990లలో, ఇదే వ్యూహం అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సహాయపడింది – ఈ పరిణామం దేశ రాజకీయ యవనికను తీవ్ర మార్పుకు గురిచేసింది.
హిందూ జాతీయవాదులు ముస్లింలపై ప్రయోగించే హింస వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మారుతుంది.
బీజేపీ ఇంకా పరిపాలించని రాష్ట్రాల్లో తప్ప, ఓటర్లను ధ్రువీకరించడానికి ఇది వారికి అంతగా ఉపయోగపడదు. మిగతా చోట్ల, ఈ తర్కం మూడు భిన్నమైన మార్గాల్లో అభివృద్ధి చెందుతుంది.
మతకల్లోలాలు జాతి నిర్మూలన లక్ష్యంగా పోగ్రోమ్లుగా మారవచ్చు; ఇది, దాని అత్యంత సాధారణ రూపంలో, హింస, చట్టం ద్వారా ఘెట్టోయిజేషన్ సాధారణీకరణకు దారితీస్తుంది; చివరగా, రోజువారీ వేధింపుల రూపాలు పెరుగుతున్నాయి.
1995 నుంచి హిందుత్వ ప్రయోగశాలగా మారిన గుజరాత్లో ఈ మూడు పరిణామాలు మనం గమనించవచ్చు.
మతకల్లోలం నుంచి పోగ్రోమ్ వరకు – జాతి నిర్మూలన వరకు..
మతకల్లోలం నుంచి పోగ్రోమ్కు మారడం అనేది అంత సులువైన విషయం కాదు. బాధితుల సంఖ్య ఒక క్లూ ఇస్తుంది, కానీ ఇతర రెండు ప్రమాణాలు మరింత నిర్ణయాత్మకమైనవి.
మొదటిది బాధితులలో ఎక్కువ మంది ఒకే సమాజానికి, సాధారణంగా మైనారిటీ వర్గానికి చెందినవారై ఉంటారు.
రెండవది రాజ్యం, దాని కనుసన్నల్లో మెలిగే పోలీసు ఆ హింసలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగం అవుతుంది లేదూ అది పెచ్చరిల్లడానికి ఊతమిస్తుంది.
ఈ ప్రాతిపదికన, 2002లో గుజరాత్లో జరిగిన హింసను పోగ్రోమ్గా వర్గీకరించవచ్చు. ఖచ్చితంగా, ఈ హింసాత్మక మతకల్లోలానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి.
ముఖ్యంగా, స్థానిక స్థాయిలో పదేపదే ఓటములను చవి చూస్తున్నా, ముఖ్యంగా బీజేపీ ఓడిపోయే ప్రమాదం ఉంటే ఆ ఎన్నికలలో గెలవడానికి ఇది మార్గం సుగమం చేసింది.
నిజానికి ఈ పోగ్రోమ్ ధ్రువీకరణ పాత ఇన్స్ట్రుమెంటల్ తర్కంలోకి సరిపోతుందనేది 2001 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ, ‘హిందూ ఓటు’ను ఉపయోగించుకోవడానికి రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయడానికి చూపిన ఉత్సాహం ద్వారా స్పష్టమవుతుంది.
వాస్తవానికి 2002 ఎన్నికలలో, మత హింస అత్యంత తీవ్రంగా ఉన్న ప్రాంతాలలోనే బీజేపీ ఎక్కువ స్థానాలను గెలుచుకుంది.
కానీ హింస ఇన్స్ట్రుమెంటల్ తర్కానికి మించి పోగ్రోమ్ స్థాయికి చేరుకుంది, ఎందుకంటే రాష్ట్రంపై బీజేపీ నియంత్రణ ఉంది, అహ్మదాబాద్ తదితర ప్రాంతాలలో ‘ముస్లిం పాకెట్స్’పై జరిగిన దాడుల క్రూరత్వమే దీనికి నిదర్శనం.
ఒక సమాజాన్ని భౌతికంగా నిర్మూలించే లక్ష్యంతో మహిళలు, పిల్లలపై మారణహోమం జరిగింది, ఇందులో 2,000 కంటే ఎక్కువ మంది హత్య చేయబడ్డారు.
మసీదులు, దర్గాలు, ఖబరస్థాన్ తదితర ప్రదేశాలను ధ్వంసం చెయ్యడం ద్వారా అహ్మదాబాద్ లాంటి నగరం అనేక కట్టడాలకు రుణపడి ఉన్న ఇస్లామిక్ సంస్కృతిని తుడిచిపెట్టాలనే కోరికను ప్రతిబింబిస్తుంది.
నిర్బంధపు ఘెట్టోయిజేషన్..
హిందూ జాతీయవాద మూలాలు కలిగిన పోగ్రోమ్లు ముస్లింలను మిశ్రమ పరిసరాలను వదిలి ఘెట్టోలలో చేరేలా నిర్బంధం చేయడం ద్వారా వారిని సాధారణ జనజీవితంలో కనిపించకుండా చేయడానికి కూడా ఉపయోగపడతాయి.
ఇక్కడ కూడా మతకల్లోలానికి, పోగ్రోమ్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడం అంత తేలిక కాదు, అహ్మదాబాద్ ఉదాహరణ దీనిని ధృవీకరిస్తుంది.
జుహాపురా, ముస్లిం ఘెట్టోగా మారిన ఒక నో మ్యాన్స్ లాండ్ – ఇది నగరం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది.
2002లో జాతి హత్యాకాండ జరగక ముందు కాలంలో అంటే 1969, 1985, 1992ల నాటి మత హింస బాధితులతో నిండిపోయింది.
కానీ 2002 పోగ్రోమ్ను మునుపటి సంఘటనల నుండి వేరు చేసేది దాని జనాభా సంఖ్య మాత్రమే కాదు – ఇది ఆ ‘ప్రాంతం’ జనాభాను 400,000 మార్కును దాటించింది – కానీ వారి సామాజిక హోదా కూడా.
మొదటిసారిగా, అహ్మదాబాద్‌లోని ముస్లిం ధనిక/ఉన్నత వర్గం సభ్యులు మునుపటి మతకల్లోలాలలో తమను వదిలిపెట్టిన హింస నుంచి తప్పించుకోవడానికి జుహాపురాలో ఆశ్రయం పొందారు, అక్కడే స్థిరపడ్డారు.
ఒక పోగ్రోమ్ సమయంలో, సామాజిక వర్గం కంటే మతపరమైన గుర్తింపుకే ప్రాధాన్యత ఉంటుందని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
అధికారంలోకి వచ్చిన తర్వాత, కల్లోలిత ప్రాంత చట్టాన్ని(డిస్టర్బ్డ్ ఏరియాస్ యాక్ట్) ఉపయోగించి బీజేపీ డీ ఫాక్టో(వాస్తవ) ఘెట్టోయిజేషన్ నుంచి డీ జ్యూర్ (చట్టపరమైన) ఘెట్టోయిజేషన్‌కు చేపట్టింది, దీని ప్రకారం ఒక మత సమాజానికి చెందిన సభ్యులు పరిపాలనా అనుమతి లేకుండా మరొక సమాజానికి చెందిన వ్యక్తికి ఆస్తులు అమ్మడానికి అనుమతించబడరు.
ఈ నిబంధనకు లోబడి ఉన్న గుజరాత్ రాష్ట్రంలోని అనేక నగరాలలో మిశ్రమ పరిసరాలలో ఉన్న హిందువులు తమ ఆస్తిని ముస్లింలకు అమ్మలేరని అనుభవం చూపిస్తుంది. 2026లో రాజస్థాన్‌లో కూడా ఇలాంటి చట్టాన్నే తీసుకువచ్చారు.
పగ తీర్చుకునే పేరుతో రోజువారీ వేధింపులు..
2014 నుంచి, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో ముస్లింలు అనుభవిస్తున్న రోజువారీ వేధింపుల ద్వారా మత హింసను అనుభవించడం మరింత స్పష్టమైన రీతిలో పోస్ట్-ఇన్స్ట్రుమెంటల్ యుగంలోకి నడిపించింది.
చట్టవిరుద్ధమని భావించే మతపరమైన లేదా ఇతర భవనాల కూల్చివేత, ప్రార్థన ముగించుకుని తిరిగి వస్తున్న వ్యక్తి లేదా పశువులను రవాణా చేస్తున్న రైతుపై మూక దాడి, లేదా ముస్లిం వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఆర్థిక బహిష్కరణ చేయడం – ముఖ్యంగా వారు హిందూ పండుగ రోజున మాంసం విక్రయిస్తే, లేదా ముస్లిం విద్యార్థుల పట్ల వివక్ష చూపడం – వారిని తరగతి గదిలో దుర్భాషలాడటం లేదా వారి దుస్తుల కారణంగా పాఠశాలలోకి ప్రవేశించకుండా నిరోధించడం, లేదా ఒక పవిత్ర స్థలం యాజమాన్యం లేదా వినియోగాన్ని ప్రశ్నించడం, లేదా ప్రార్థన సమయంలో ఖాళీ స్థలం లేదా పార్కుల ప్రాప్యతను నిరోధించడం వంటి సంఘటనలను సోషల్ మీడియా నివేదించని రోజంటూ లేదు.
భౌతిక, సంకేత హింస సాధారణీకరణ హిందూ జాతీయవాద ఉద్యమాలు నిర్వహించిన ప్రచారాలను అనుసరిస్తుంది.
ఈ ప్రచారాలు కొత్తవి కాకపోయినా, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పరిధి పెరిగింది.
సెప్టెంబర్ 2014లో ప్రారంభమైన ‘లవ్ జిహాద్’కు వ్యతిరేక సమీకరణ దీనికి ఒక ఉదాహరణ.
హిందూ అమ్మాయిలను, మహిళలను ముస్లిం యువకులు లోబరుచుకుని, వివాహం చేసుకుని, మతం మార్చడానికి చేసే ప్రయత్నాల పట్ల తమ సమాజాన్ని హెచ్చరించడమే హిందూ జాతీయవాదుల లక్ష్యం.
ఈ ప్రచారం తర్వాత ‘ఘర్ వాప్సి'(హిందూ మతంలోకి తిరిగి రావడం) అనే మరొక ప్రచారం జరిగింది, ఇది ముస్లింలు, క్రైస్తవులను తిరిగి హిందూమతంలోకి మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది, ఆపై ఆవు పవిత్రత సాకున, గో రక్షణ పేరిట ముస్లిం వ్యతిరేక ఆందోళనలు ముమ్మరమయ్యాయి.
ఇది రాజకీయ ప్రయోజనాల కోసం భారతీయ సమాజాన్ని ధ్రువీకరించడం గురించి కాదు, మైనారిటీలపై సాధ్యమైనంత సంపూర్ణమైన ఆధిపత్యాన్ని చెలాయించడం లక్ష్యంగా సాగింది.
అధికారంలో ఉన్నవారి ప్రేరణ ఇక ఎంత మాత్రం ఇన్స్ట్రుమెంటల్(సాధనం) కాదు, అది పూర్తిగా సైద్ధాంతికపరమైనది.
ముస్లిం దండయాత్రలతో ప్రారంభమైన 1,200 సంవత్సరాల బానిసత్వ అధ్యాయాన్ని ముగించాలని తాను కోరుకుంటున్నట్లు నరేంద్ర మోదీ వివరించారు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చరిత్రపై పగ తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
“మన గ్రామాలు తగులబెట్టబడ్డాయి. మన నాగరికత నాశనమైంది. మన దేవాలయాలు లూటీ చేయబడ్డాయి. మనం నిస్సహాయంగా నిశ్శబ్ద ప్రేక్షకులుగా చూశాము. ఈ గత చరిత్ర ఈ రోజు భారతదేశంలోని ప్రతి యువకుడిలో నిప్పులు చెరిగేలా ఒక సవాలును మన ముందు ఉంచుతుంది. ‘పగ’ అనే పదం ఆదర్శవంతమైనది కాదు, కానీ పగ అనేది ఒక శక్తివంతమైన శక్తి. మన చరిత్రకు మనం పగ తీర్చుకోవాలి(హసన్ 2026)”- ఇదీ బీజేపీ ఎంచుకున్న హిందూత్వ ఔన్నతీకరణకు మార్గం.
ఒక ‘డీపర్ స్టేట్’ రూపకల్పన: మత విద్వేషం రాజేసేవారు, పోలీసులు ‘కుండను ఉడికిస్తూ ఉంటారు’..
ముస్లింలపై రోజువారీ వేధింపులు అధికారంలో ఉన్నవారి ఆశీస్సులతో జరుగుతున్నప్పటికీ, ఇది ప్రాథమికంగా ప్రైవేట్ సైన్యాలు అలాగే వీధుల్లో ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా, ఆవుల రక్షణలో సాంస్కృతిక పోలీసింగ్‌ను అమలు చేసే ‘విజిలెంట్’ మిలీషియాల పని.
బజరంగ్ దళ్‌తో ప్రారంభమయ్యే ఈ సమూహాలు సంఘ్ పరివార్‌కు చాలా చేదోడు వాదోడుగా ఉంటాయి. ఎందుకంటే అవి భారతీయ సమాజంలో మత విద్వేషాన్ని స్థిరపరిస్తాయి.
గుజరాత్లో ఉద్భవించిన ఒక ‘డీపర్ స్టేట్’ నమూనాను సృష్టిస్తాయి(జాఫ్రెలాట్ 2024, అధ్యాయం 4). ఈ సామాజిక పరిమాణం బిజెపికి చాలా అవసరం.
ఎందుకంటే హిందూ జాతీయవాద ఉద్యమ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), అనివార్యంగా పెళుసైన రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడం కంటే సమాజవ్యాప్తంగా తన స్థానిక ఉనికి గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తుంది.
‘చట్టబద్ధమైన పాలన’ పేరిట పోలీసుల జోక్యం నుండి తన కార్యకర్తలను రక్షించడానికి అనుమతిస్తేనే దానికి రాష్ట్ర నియంత్రణపై ఆసక్తి ఉంటుంది.
ఈ సమూహాలు ముస్లింలపై దాడులు, వేధింపులను పెంచడం ద్వారా భారతీయ సమాజాన్ని నిరంతర ఉద్రిక్తతలో ఉంచుతాయి.
దీనిని సుధా పాయ్, సజ్జన్ కుమార్ ‘కుండను ఉడకబెట్టే’ ప్రయత్నంగా(సమస్యను సజీవంగా ఉంచడం) అభివర్ణించారు(పాయ్, కుమార్ 2018).
ఆ విధంగా రోజువారీ ఒత్తిడికి గురవుతూ, ముస్లింలు బాధలను భరించవలసి వస్తుంది, లేదా వారి అస్థిత్వాన్ని వదులుకోవాల్సి వస్తుంది.
కొందరు ఇప్పటికే గడ్డం ఉంచుకోవడానికి, ప్రార్థన తర్వాత స్కల్‌క్యాప్ (టోపీ) ధరించడానికి లేదా బహిరంగంగా ఉర్దూ మాట్లాడటానికి వెనుకాడుతున్నారు.
ఎథ్నోగ్రాఫిక్ కోణం నుంచి నేడు హిందూ-ముస్లిం మత హింసను అర్థం చేసుకోవడం..
నిదా కైజర్ 2014 నుంచి రాజకీయ వ్యవస్థలో వచ్చిన మార్పుల వెలుగులో హిందువులు, ముస్లింల మధ్య హింస రూపాంతరాన్ని వివరించారు.
మతపరమైన ఎథ్నోక్రసీ స్ఫటికీకరణ కొత్త దృగ్విషయాలకు ఒక చట్రాన్ని అందించింది.
రాజ్యం భాగస్వామ్యం – పోలీసులు ముస్లింలపై దాడి చేసినా లేదా విజిలెంట్లను అలా చేయడానికి అనుమతించినా – కొత్త కానప్పటికీ, కొత్తదనం ఏమిటంటే ‘ఈ పద్ధతులు ఎంత బహిరంగంగా, వ్యవస్థీకృతంగా మారాయి’ అనేదే, అలాగే రెండు ఇటీవలి పరిణామాలు దీనికి తోడయ్యాయి.
మొదటిది హిందూ తీవ్రవాదుల దాడులకు గురయ్యే ముస్లింలకు ఇప్పుడు బాధితుల హోదా నిరాకరించబడుతోంది: పోలీసులు ఫిర్యాదులను నమోదు చేయడానికి నిరాకరించడం, ఫిర్యాదులు దాఖలు చేసినప్పుడు, నేరస్థులను శిక్షించడానికి న్యాయవ్యవస్థ వెనుకాడటంలో ‘బాధితుడి నిర్మూలన’ స్పష్టంగా కనిపిస్తుంది.
రెండవది దీనికి సంబంధించి, ముస్లింలను బాధితులుగా చిత్రీకరించడం సాధ్యం కాదు ఎందుకంటే వారిని అంతర్గత భద్రతకు ముప్పుగా చూపడం, తద్వారా నేరస్థీకరణ ప్రక్రియ ద్వారా హిందువుల ‘ఉనికికి ముప్పు’గా నిరంతరం చిత్రీకరించబడుతున్నారు.
నరేంద్ర మోదీ పదవీకాలం ప్రారంభంలో, 2015లో జరిగిన మహ్మద్ అఖ్లాక్ మూక హత్య ఆధారంగా కైజర్ ఈ అత్యంత సంక్లిష్టమైన వాస్తవికతను పరిశీలించారు.
ఈ వ్యాసం మూడు భాగాలుగా ప్రచురితమవుతుంది. ఇది రెండవ భాగం, మొదటి భాగం కోసం క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
