విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ గత 20 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్ష వల్ల తీవ్రంగా బరువు తగ్గారని, ఆయనతో పాటు దీక్షలో కూర్చున్న విద్యార్థుల ప్రాణాలు సైతం “ప్రమాదంలో” పడ్డాయని ప్రముఖ విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షలు, ఫలితాలు, ఇతర పరీక్షల నిర్వహణలో వైఫల్యానికి ప్రభుత్వంలో భాగంగా నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) మాజీ ప్రొఫెసర్లు, పలువురు ప్రముఖ విద్యావేత్తలు, రచయితలు, సామాజిక కార్యకర్తలు కోరారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఈ మేరకు వారు ఒక బహిరంగ లేఖ రాశారు.
జేఎన్‌యూ ప్రొఫెసర్ ఎమిరిటస్ రొమిలా థాపర్, ప్రభాత్ పట్నాయక్, ఉత్సా పట్నాయక్, జోయా హసన్, మాజీ ప్రొఫెసర్లు నీరా చండోక్, సీపీ చంద్రశేఖర్, సునంద సేన్, రచయిత, సామాజిక కార్యకర్త జాన్ దయాళ్ తదితరులు ఈ లేఖ రాసినవారిలో ఉన్నారు.
ప్రాణాపాయ స్థితిలో వాంగ్‌చుక్..
నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో సోనమ్ వాంగ్‌చుక్ తీవ్రంగా బరువు తగ్గారని, ఆయనతో పాటు దీక్షలో చేరిన విద్యార్థుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడ్డాయని విద్యావేత్తలు గుర్తు చేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత నెల కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనలో వాంగ్‌చుక్ కూడా చేరారు.
మంత్రికి రాసిన బహిరంగ లేఖ సారాంశం..
నీట్, ఇతర పరీక్షల నిర్వహణలో అవకతవకలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ, దానికి ప్రతీకగా విద్యామంత్రిగా మీ రాజీనామాను కోరుతూ గత 20 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మీకు సుపరిచితులే.
ఆయన దాదాపు 10 పౌండ్ల బరువు తగ్గారు. దేశానికి ఎంతో విలువైన ఆయన ప్రాణం ఇప్పుడు ప్రమాదంలో పడింది. అనేక మంది విద్యార్థులు కూడా దీక్షలో ఉన్నారు. వారి ప్రాణాలు సైతం ప్రమాదంలో ఉన్నాయి.
వారికేమైనా హాని జరిగితే భవిష్యత్తు తరాలు మిమ్మల్నే బాధ్యులను చేస్తాయి. విలువైన ప్రాణాలను బలిపెట్టి మీరు ఇంకా పదవిని అంటిపెట్టుకుని ఉండటం అత్యంత అగౌరవంగా ఉంటుంది.
మరోవైపు, ప్రభుత్వ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తే అది ఎంతో గౌరవప్రదంగా ఉంటుంది.
రాజీనామా చేయకుండా మీరు పార్టీ, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నట్లుగా భావించవచ్చు. కానీ అంతిమ విశ్లేషణలో ఎవరైనా తమ సొంత చర్యలకు నైతిక బాధ్యత నుంచి తప్పించుకోలేరు.”
ఇప్పటికైనా గౌరవప్రదమైన నిర్ణయం తీసుకుని, ప్రభుత్వ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహించి మీ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. తద్వారా వాంగ్‌చుక్‌తో పాటు దీక్ష చేస్తున్న ఆదర్శవంతులైన విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని మేము కోరుతున్నామని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
