ఒకరోజు ముందు ఉద్ధవ్ థాక్రే, నవీన్ పట్నాయక్ లాంటి రాజకీయ నాయకులు విద్యార్థులకు మద్దతు తెలుపుతూ గళం విప్పారు.
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు జులై 20న ప్రారంభమవుతుండగా, న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ఉద్యమం చేపట్టింది.
ఇటీవల వరకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఈ పార్టీ, ఇప్పుడు ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని కోరుతోంది.
జంతర్ మంతర్ నిరసన శిబిరం వద్దకు సుమారు 50,000 మంది చేరుకోవడంతో, నిరసనలకు సంబంధించిన వార్తలు బయటకు వెళ్లకుండా ప్రభుత్వం కీలక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.
ఈ రోజు ఉదయం పార్లమెంటుకు మార్చ్ నిర్వహించాలన్న నిరసనకారుల లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 163 కింద ఢిల్లీ పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు.
“భద్రతా కారణాల” దృష్ట్యా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జన్ పథ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థ్ మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు డీఎంఆర్సీ ప్రకటించింది.
బలప్రయోగం చేయలేదన్న పోలీసుల వాదన..
కాగా, తాము ఎలాంటి బలప్రయోగం చేయలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. “జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులు చెదురుమదురు హింసకు, నిర్బంధాలకు పాల్పడినట్లు కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి” అని ఈ రోజు ఉదయం 10.43 గంటలకు వారు ట్వీట్ చేశారు.
“అలాంటి సంఘటన ఏదీ చోటు చేసుకోలేదని, నిరసనను వృత్తిపరంగానే అదుపు చేస్తున్నామని తెలియజేస్తున్నాం. పుకార్లను, తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, నిరసన స్థలం చుట్టూ శాంతిభద్రతలను కాపాడటంలో ఢిల్లీ పోలీసులకు సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం” అని వారు కోరారు.
టియర్ గ్యాస్ ప్రయోగం – బారికేడ్ల బయట ఆందోళన..
కాన్స్టిట్యూషన్ క్లబ్ ప్రాంతం సమీపంలో టియర్ గ్యాస్ ప్రయోగించడం వల్ల సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్‌ను ఉపయోగించే ప్రయాణికులపై కూడా ఆ ప్రభావం పడింది.
ఢిల్లీ పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ వల్ల గాయపడిన వారిలో ‘ది వైర్’ విలేకరి అతుల్ హోవాలే కూడా ఉన్నారు.
పోలీసుల లాఠీచార్జిలో వేలాది మంది గాయపడగా, వారిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో అనేక మంది మైనర్లు కూడా గాయపడ్డారు.
జంతర్ మంతర్ బారికేడ్ల వద్ద భారీగా పోలీసుల మోహరింపు ఉన్నప్పటికీ, పార్లమెంటు భవనం వైపు మార్చ్ చేయడానికి బారికేడ్ల బయట వేలాది మంది గుమిగూడారని క్షేత్ర స్థాయిలో ఉన్న ‘ది వైర్’ విలేకరులు తెలియజేశారు.
జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్‌కు చెందిన నిరసనకారులు తమ దీక్షను విరమించారు.
రాష్ట్రీయ జనతా దళ్ ఎంపీ మనోజ్ ఝా, సీపీఐ(ఎం) ఎంపీ అమ్రా రామ్, నటులు ప్రకాశ్ రాజ్, షబానా ఆజ్మీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ లాంటి ప్రముఖులతో కూడిన బృందం వారిని పరామర్శించింది.
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష..
ఈ రోజు మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహించడంపైనే దృష్టి పెట్టాలని సామాజిక కార్యకర్త వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
“మేము ఈ మార్చ్‌పై దృష్టి పెడతాము. ఈ రోజు మూడు ముఖ్యాంశాలున్నాయి. మొదటిది, మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహించడం. దేశానికి అత్యంత అవసరమైన విద్యా సమస్యపై బలంగా నిలబడటం, అప్రమత్తంగా ఉండటంపై మనం దృష్టి సారిద్దాం” అని ఆమె అన్నారు.
సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఉన్న పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష కీలక దశకు చేరుకుందని, “రాజకీయ నాయకులు ఆసుపత్రిలో ఆయనను కలిసి పార్లమెంట్ సమావేశాల్లో విద్యావ్యవస్థ జవాబుదారీతనం అంశాన్ని లేవనెత్తుతామని హామీ ఇచ్చినట్లయితే దీక్షను విరమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు” గీతాంజలి ఆంగ్మో తెలిపారు.
దీక్షను విరమించడానికి పెట్టిన షరతులను వాంగ్‌చుక్ ఆ తర్వాత ట్వీట్ చేశారు.
“నా ఆరోగ్యంతో సంబంధం లేకుండా, సంసద్ చలో మార్చ్ పూర్తయ్యే వరకు నా దీక్ష కొనసాగుతుంది, కింద పేర్కొన్న పరిస్థితుల్లో మాత్రమే దీక్షను విరమిస్తాను” అని ఆయన రాశారు.
ఒక టిష్యూ పేపర్‌పై చేతితో రాసిన లేఖను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. విద్యా వ్యవస్థలోని “వైఫల్యాలకు”, ముఖ్యంగా ఇటీవల జరిగిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి ప్రభుత్వం బాధ్యత వహించడం తాను దీక్ష విరమించడానికి దారితీసే మొదటి షరతు అని వాంగ్‌చుక్ అందులో పేర్కొన్నారు.
దానికి ప్రత్యామ్నాయంగా పేపర్ లీకేజీ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని రాజకీయ నాయకులు హామీ ఇవ్వాలన్నారు.
ప్రముఖ రాజకీయ నాయకులు ఆసుపత్రిలో తనను కలిసి పై రెండు షరతులపై హామీ ఇవ్వాలన్నది మూడవ షరతు అని వాంగ్‌చుక్ చెప్పారు.
కాగా, వాంగ్చుక్ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని కోరుతూ ఆదివారం ఆంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
విద్యార్థులకు మద్దతు తెలిపిన ఉద్ధవ్ థాక్రే, నవీన్ పట్నాయక్..
ఇదిలా ఉండగా, శివసేన(ఉద్ధవ్ బాల్ థాక్రే) చీఫ్ ఉద్ధవ్ థాక్రే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
జవాబుదారీతనం లేని ప్రభుత్వాన్ని మార్చడానికి ఇప్పుడు పోరాటం మొదలుపెట్టాలని ఆయన అన్నట్లు పీటీఐ కథనం పేర్కొంది.
ముంబైలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ, నీట్ పరీక్షలో అక్రమాలను, దానికి సంబంధించిన విద్యార్థుల ఆత్మహత్యలను ప్రస్తావిస్తూ ఈ ప్రభుత్వం యువత భవిష్యత్తును దొంగిలిస్తోందని ఆరోపించారు.
ఇటీవల థాక్రే పార్టీకి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు బీజేపీతో పొత్తులో ఉన్న ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రత్యర్థి శివసేన వర్గంలో చేరారు.
మరోవైపు విద్యా వ్యవస్థ, పరిపాలనలో ఉన్న సమస్యలపై రోజుల తరబడి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులతో అర్థవంతమైన చర్చలు ప్రారంభించాలని బీజూ జనతాదళ్ చీఫ్, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని కోరినట్లు పీటీఐ కథనం వెల్లడించింది.
“దేశ యువత, విద్యార్థుల పక్షాన పార్టీ బలంగా నిలబడుతుంది” అని బీజేడీ చీఫ్ చెప్పారు. దేశ విద్యా వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లిందని ఆ పార్టీ నేత ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులో పేర్కొన్నారు.
“జరిగిన నష్టం కేవలం ఒక విఫలమైన పరీక్షకే పరిమితం కాలేదు. ఇది విద్యా వ్యవస్థ పునాదులపైనే నమ్మకాన్ని పటాపంచలు చేసింది. అర్హులైన విద్యార్థుల కష్టానికి ఇకపై విలువ లేదని ఇది చెబుతోంది. దారిద్ర్యం నుంచి బయటపడేందుకు వారికి ఉన్న ఏకైక నిచ్చెనను ఇది లాగేసుకుంటోంది. ఏ దేశమైతే తన పరీక్షా వ్యవస్థ సమగ్రతపై రాజీ పడుతుందో, అది తన సొంత భవిష్యత్తుపైనే రాజీ పడుతున్నట్లు లెక్క. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేస్తున్న ఈ తీవ్రమైన అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పార్లమెంటులో చర్చించాలి.”
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
