జంతర్ మంతర్ నిరాహార దీక్షా శిబిరం నుంచి వాంగ్చుక్ను బలవంతంగా తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ చేపట్టేందుకు ఒక రోజు ముందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నిరాకరించారు.
న్యూఢిల్లీ: “ఈ వ్యవహారాలన్నింటిలోకి కోర్టును లాగొద్దు” అని ఢిల్లీ హైకోర్టు ఈ రోజు (జులై 21) వ్యాఖ్యానించింది. నిరసనకారులపై పోలీసులు మితిమీరిన బలాన్ని ఉపయోగించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను లిస్ట్ చేసి, వెంటనే విచారణ చేపట్టాలని ఒక పిటిషనర్ విజ్ఞప్తి చేయగా కోర్టు పై విధంగా స్పందించింది.
ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ పిటిషనర్ న్యాయవాదితో ఈ వ్యాఖ్యలు చేసినట్లు ‘బార్ అండ్ బెంచ్’ కథనం తెలియజేసింది.
మైనర్లపై పోలీసుల అసాధారణ హింస..
దేశ విద్యా వ్యవస్థ స్థితిగతులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ పార్లమెంట్ మార్చ్‌కు ప్రయత్నించిన నిరసనకారులపై (వీరిలో అనేక మంది మైనర్ విద్యార్థులు ఉన్నారు) పోలీసులు అసాధారణ హింసకు పాల్పడ్డారని ‘ది వైర్’ తో సహా ఇతర పత్రికల కథనాలు స్పష్టం చేశాయి.
పరీక్షా పత్రాల వరుస లీకేజీలపై ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలు జంతర్ మంతర్ నుంచి మార్చ్‌కు పిలుపునిచ్చారు.
ప్రభుత్వంతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ అనేక మంది గత 22 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు.
24వ రోజుకు చేరిన వాంగ్‌చుక్ దీక్ష..
విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ తన దీక్షను ఇంకా కొనసాగిస్తున్నారు. ఆయన పస్తులుండటం ఇది 24వ రోజు.
జంతర్ మంతర్ దీక్షా శిబిరం నుంచి సోనమ్ వాంగ్చుక్ను బలవంతంగా తొలగించడం గురించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై(పిల్) వెంటనే విచారణ చేపట్టాలని కోరగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ ఒక రోజు ముందే నిరాకరించారు.
“ఇందులో అత్యవసరం ఏముంది? అది అక్రమం అని బుధవారం కూడా ప్రకటించవచ్చు. ఎల్లుండి కూడా చేయాల్సిన ప్రకటనను ఇప్పుడే కోరుతున్నారా?” అని ప్రధాన న్యాయమూర్తి ఉపాధ్యాయ ప్రశ్నించారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
