12 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలకు రూ 670 కోట్లకు పైగా సీఎస్ఆర్ నిధులు ఇచ్చిన ఓఎన్జీసీ. ఓఎన్జీసీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సామాజిక బాధ్యత) వార్షిక నివేదికల ప్రకారం, దాని మొత్తం సీఎస్ఆర్ వ్యయంలో దాదాపు 14.7 శాతం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలకే వెళ్లింది.
భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన ఇంధన దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ), 2013-2025 మధ్య రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో సంబంధం ఉన్న 20 సంస్థలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధుల కింద దాదాపు రూ 671 కోట్లను మళ్లించినట్లు ‘ది న్యూస్ మినిట్’ ప్రచురించింది.
ఈ 12 ఏళ్ల కాలంలో ఓఎన్జీసీ ఈ సంస్థలకు మొత్తం రూ. 670.97 కోట్లను విరాళంగా ఇచ్చిందని ఆ నివేదిక పేర్కొంది.
ఏటా దేశవ్యాప్తంగా సామాజిక సంక్షేమం, విద్య, వైద్యం, సమాజ అభివృద్ధి కార్యక్రమాలకు భారీ నిధులను కేటాయించే ఓఎన్జీసీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ సంస్థలకు తన సీఎస్ఆర్ నిధుల నుంచి ఈ విరాళాలు ఇచ్చింది.
నివేదికలో వెల్లడైన కీలక అంశాలు..
ఓఎన్జీసీ వార్షిక నివేదికల ప్రకారం, 2015 మొదటి త్రైమాసికం నుంచి 2025 మొదటి త్రైమాసికం మధ్య దేశవ్యాప్తంగా 2,000 సంస్థలు, ప్రాజెక్ట్‌లకు సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ 4,531 కోట్లను విరాళంగా ఇచ్చింది.
ఇందులో దాదాపు రూ 668 కోట్లు, మొత్తం నిధులలో సుమారు 14.7 శాతం ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నవిగా గుర్తించిన 20 సంస్థలకు వెళ్లినట్లు ‘ది న్యూస్ మినిట్’ పేర్కొంది.
ఆ సంస్థలను మూడు రకాలుగా వర్గీకరించింది. తొమ్మిది సంస్థలు నేరుగా ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్నవి.
తొమ్మిది సంఘ్‌తో అనుబంధం ఉన్న వ్యక్తులచే స్థాపించబడినవి లేదా వారి నేతృత్వంలో నడుస్తున్నవి. రెండు సంస్థలు ఆర్ఎస్ఎస్తో కలిసి పనిచేసినవి.
అతిపెద్ద విరాళాలు పొందిన సంస్థలు..
అతిపెద్ద విరాళం పొందిన వాటిలో అస్సాంలోని శివసాగర్ జిల్లాలో ఉన్న 300 పడకల మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రి ‘స్వర్గదేవ్ సియు-కా-ఫా హాస్పిటల్’ ఒకటి. ఈ ఆసుపత్రిని ఓఎన్జీసీ, ఔరంగాబాద్‌కు చెందిన ‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ వైద్యకీయ ప్రతిష్ఠాన్'(బీఏవీపీ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. బీఏవీపీ తన సాహిత్యంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల నుంచి ప్రేరణ పొందినట్లు వర్ణించుకుంటుంది.
1989లో స్థాపించబడిన బీఏవీపీ, ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవార్ పేరు మీదుగా ఔరంగాబాద్‌లో ఏర్పాటు చేసిన డాక్టర్ హెడ్గేవార్ ఆసుపత్రితో సహా పలు వైద్య సంస్థలను నిర్వహిస్తోంది. ఈ ఆసుపత్రి ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవకులచే నడుపబడుతోందని ఆర్ఎస్ఎస్ ప్రచురణలలో పేర్కొన్నారు.
ఈ నివేదికలో గుర్తించిన రెండవ అతిపెద్ద విరాళం పొందిన సంస్థ నాగపూర్ స్థావరంగా ఉన్న ‘డాక్టర్ ఆబాజీ థాటే సేవా ఔర్ అనుసంధాన్ సంస్థ’. ఇది మాజీ ఆర్ఎస్ఎస్ అధినేత ఎంఎస్ గోల్వాల్కర్‌కు అత్యంత ఆప్తుడి పేరు మీదుగా ఏర్పాటు చేయబడింది.
నాగపూర్‌లో నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయడం కోసం 2017-2022 మధ్య ఓఎన్జీసీ ఈ ట్రస్ట్‌కు రూ 140 కోట్లు అందించినట్లు నివేదిక పేర్కొంది.
ఇతర లబ్ధిదారులలో బెంగళూరుకు చెందిన ‘స్వామి వివేకానంద యోగ అనుసంధాన సంస్థ'(ఎస్-వ్యాస) అనే డీమ్డ్ యూనివర్సిటీ కూడా ఉంది.
కర్ణాటక, ఒడిశా, అస్సాంలలో హాస్టల్ నిర్మాణాలు, యోగా సంబంధిత కార్యక్రమాల కోసం ఇది రూ 15.53 కోట్లను పొందింది.
ఆర్ఎస్ఎస్ సామాజిక సేవా నెట్వర్క్ రాష్ట్రీయ సేవా భారతిలో భాగమైన ‘సేవా భారతి’ వివిధ విభాగాలు, వరద సహాయక చర్యలు, వైద్య పరికరాల సేకరణ, యోగా కేంద్రాల నిర్మాణం, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు లాంటి కార్యకలాపాల కోసం రూ 13.95 కోట్లను పొందాయి.
‘ఏకల్ విద్యాలయ ఫౌండేషన్’ నిర్వహించే పాఠశాలలు రూ 8.69 కోట్లను పొందినట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది.
ఈ ఫౌండేషన్ విద్యా నమూనా మాజీ ఆర్ఎస్ఎస్ అధినేత బాలాసాహెబ్ దేవరస్ సోదరుడైన భౌరావ్ దేవరస్ ప్రోత్సహించిన ఆలోచనల నుంచి ప్రేరణ పొందిందని చెబుతారు.
చట్టపరమైన హోదాపై మళ్లీ మొదలైన చర్చ..
ఈ విషయాలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వ రంగ సంస్థల సీఎస్ఆర్ నిధుల వినియోగంపై, ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలు ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న సంస్థలకు నిధులు సమకూర్చవచ్చా అనే దానిపై చర్చకు దారితీశాయి.
విమర్శకులు ఇటువంటి నిధుల లభ్యత ఔచిత్యాన్ని ప్రశ్నించగా, సీఎస్ఆర్ కేటాయింపులు సిద్ధాంతపరమైన అనుబంధాలతో సంబంధం లేకుండా విద్య, వైద్యం, సామాజిక సేవా కార్యక్రమాలలో నిమగ్నమైన సంస్థలకు అందించబడతాయని మద్దతుదారులు వాదిస్తున్నారు.
ఈ అంశం రిజిస్టర్ కాని స్వచ్ఛంద సంస్థగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ చట్టపరమైన హోదాపై చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(సీ) ప్రకారం, పౌరులకు సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది. అలాంటి సంస్థలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు.
అధికారిక రిజిస్ట్రేషన్ అవసరం లేదని ఆర్ఎస్ఎస్ నాయకులు చెబుతున్నారు. తమ సంస్థ పారదర్శకంగా పనిచేస్తుందని, ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న ఒక లిఖితపూర్వక నిబంధనావళి కలిగి ఉందని, నమోదిత ట్రస్ట్‌లు, అనుబంధ సంస్థల నెట్వర్క్ ద్వారా తన ఆస్తులు, సంస్థాగత కార్యకలాపాలను నిర్వహిస్తుందని ఆ సంస్థ పేర్కొంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
