భారతదేశంలో హిందువులు, ముస్లింల మధ్య హింస సాంప్రదాయకంగా ఒకే రూపాన్ని – మతకల్లోలాన్ని – కలిగి ఉంటుందని అర్థం చేసుకున్నప్పటికీ, సామాజిక శాస్త్రవేత్తలు ఈ అంశం మీద చేస్తున్న వ్యాఖ్యానం కాలక్రమేణా మారింది.
చాలా కాలం పాటు, ఇది ఆదిమవాదంగా(‘ప్రిమోర్డియలిజం’గా) భావించారు. ఈ రెండు వర్గాల మతపరమైన గుర్తింపులు ఎంతగానో భిన్నంగా ఉన్నాయి కాబట్టే ఉద్రిక్తతలు అనివార్యమని భావించేవారు(డుమోంట్ 1988 [1966], 321-322). అందువల్ల ప్రాథమికవాదులు(ప్రిమోర్డియలిస్టులు) హిందువులు, ముస్లింల మధ్య జరిగే ఘర్షణలను స్వయంప్రేరిత హింసాత్మక విస్ఫోటనాలుగా చూశారు.
అస్థిత్వ రాజకీయాల ప్రతిపాదకులు ఈ విధానాన్ని సవాలు చేశారు, వీరు వర్గాల సరిహద్దులు, వాటి ఉనికిని చాటుకునే చిహ్నాలు నిర్దిష్ట ప్రయోజనాల కోసం, చాలా తరచుగా అధికారం సాధించడం కోసం రాజకీయ, మత పెద్దలచే రూపుదిద్దబడ్డాయన్న వాదన తీసుకువచ్చారు.
ప్రిమోర్డియలిస్టులు – ఇన్స్ట్రుమెంటలిస్టుల మధ్య చర్చ 1977లో ఫ్రాన్సిస్ రాబిన్సన్ – పాల్ బ్రాస్ల మధ్య జరిగిన వివాదంతో పరాకాష్టకు చేరింది(బ్రాస్ 1977; రాబిన్సన్ 1977).
తదుపరి కాలంలో బ్రాస్ ఈ అధ్యయన రంగంపై తన ముద్ర వేసినప్పటికీ, సిద్ధాంతాన్ని ప్రస్తుత వాస్తవికతకు అనుగుణంగా సవరించడానికి సరికొత్త జ్ఞానమీమాంస పునరుద్ధరణ అవసరమయ్యింది.
మతకల్లోలాల వెనుక ఉన్న హేతుబద్ధత..
‘కాంగ్రెస్ వ్యవస్థ’ యుగంలో, ఆ తర్వాత స్థానిక అధికార పార్టీ/కూటమికి వ్యతిరేకంగా పాల్ బ్రాస్ మొదట ఉపయోగితావాద నమూనాను 1961 మీరట్ మతకల్లోలానికి అన్వయించారు.
ఇది – అదే సంవత్సరంలో అలీఘర్, జబల్పూర్లలో జరిగిన ఘర్షణలతో పాటు – 1950ల నాటి ఒక ప్రశాంతమైన దశాబ్దం తర్వాత ‘మత హింస’ పునరాగమనానికి సూచిక.
ఈ మతహింస రాజకీయ ప్రేరేపితమైనదని ఆయన నిరూపించారు: 1962 సార్వత్రిక ఎన్నికలకు దారితీసిన నెలల్లో, అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ప్రత్యర్థులు, శాంతిభద్రతలను కాపాడటంలో దాని అసమర్థతను ఎండగట్టడం ద్వారా దాన్ని బద్నాం చేయాలని చూశారు(బ్రాస్ 2006, 70-71).
బ్రాస్ అప్పుడు ఒక సంపూర్ణ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు, అదే వ్యవస్థీకృత మతకల్లోలాల విధానం. ఇది నిపుణుల సమూహాల మధ్య శ్రమ విభజనపై ఆధారపడిన రాజకీయ ప్రేరేపిత యంత్రాంగంగా నిర్వచించబడింది.
నిప్పు రాజేసేవారు..
రకరకాల రెచ్చగొట్టుడు చర్యల ద్వారా వేర్వేరు మత సమూహాల మధ్య ఉద్రిక్తతలను సజీవంగా ఉంచుతారు; మత మార్పిడుల నిష్ణాతులు సంభావ్య అల్లరిమూకలను నడిపిస్తూ, హింస ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభం కావాలో సంకేతాలు ఇస్తారు.
హింసను అమలు చేయడానికి నేరస్థులను – సమాజంలోని అత్యంత పేద వర్గాలు – రిక్రూట్ చేసుకుంటారు, వారికి తగిన ప్రతిఫలం ముట్టచెబుతారు.
రాజకీయ నాయకులు, స్థానిక మీడియా, హింసాత్మక ఘటనల సమయంలోనూ ఆ తర్వాతా హింసకు గల కారణాన్ని రెచ్చిపోయిన సామాన్య ప్రజలపైకి నెట్టడం ద్వారా అసలు నేరస్థుల నుంచి దృష్టిని మళ్లిస్తారు(బ్రాస్ 2006, 4-5).
సమీప గత చరిత్రలో ఈ నమూనా విభిన్న రూపాలు మనం గమనించవచ్చు. దేశంలోని కొన్ని రాష్ట్రాలలో, మతకల్లోలాల వెనుక ఉన్న ప్రత్యర్థులు కొన్నిసార్లు అధికార పార్టీ అయిన కాంగ్రెస్కు చెందినవారే అయినప్పటికీ, ముఖ్యమంత్రి వర్గాన్ని అస్థిరపరచాలని చూసే మరొక అసంతృప్త వర్గానికి అనుబంధంగా ఉండేవారు. ఈ వ్యూహాలు ఆ పార్టీలోని అంతర్గత కలహాల స్థాయిని ప్రతిబింబిస్తాయి. ఇది రజనీ కొఠారి ‘కాంగ్రెస్ వ్యవస్థ’ విశ్లేషణలో సూచించినట్లుగా, చాలా కాలంగా ఒకే పార్టీలోని ప్రత్యర్థి వర్గాలు రేపెట్టినవి.
ఈ పద్ధతుల విస్తృతిని స్టీవెన్ విల్కిన్సన్ అపూర్వమైన స్థాయిలో గణాంక డేటాను క్రోడీకరించిన పుస్తకంలో నిరూపించారు.
‘మతకల్లోలాలు, మరణాలు’ రెండూ ఎన్నికలకు ముందు నెలల్లో కేంద్రీకృతమై, ఎన్నికలు ముగిసిన తర్వాత గణనీయంగా తగ్గుముఖం పడతాయని 1950 నుంచి 1995 వరకు జరిగిన మతకల్లోలాలను కవర్ చేసే డేటాబేస్ ఆధారంగా అశుతోష్ వర్ష్నేతో కలిసి విల్కిన్సన్ వివరించి చెప్పారు(విల్కిన్సన్ 2000, 132).
ఈ పరిశోధన హిందువులు, ముస్లింల మధ్య మతకల్లోలాలను దేశ వ్యాప్తంగా విస్తరించడాన్ని ధృవీకరిస్తుంది. 1980లు, ఆ తరువాతి కాలంలో ప్రధానంగా కనిపించిన మరొక దృగ్విషయం మత ప్రాతిపదికన హింసను రేకెత్తించి తద్వారా ఓటర్లను ధ్రువీకరించడం.
ధ్రువీకరణ – జాతీయవాదం..
1980లలో హిందువులు, ముస్లింల మధ్య హింసకు సంబంధించిన అధ్యయనాలలో ‘ధ్రువీకరణ’ కీలక పదంగా మారింది.
సంఘ్ పరివార్ 1984, 1989 ఎన్నికలకు ముందు బాబ్రీ మసీదు సమస్యను ఉపయోగించుకుని ముస్లింలకు వ్యతిరేకంగా మెజారిటీ హిందూ మత సమూహాలను సమీకరించాలని చూసింది. ఇక్కడ, మతకల్లోలం ద్వారా హిందూ ఓటర్లను – హింసను సాకుగా చూపి ‘కట్టర్ హిందూవులుగా’ మార్చడం ద్వారా – బీజేపీకి మద్దతు ఇచ్చేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికల తర్కం కొనసాగినప్పటికీ, అది మతపరమైన రంగును సంతరించుకుంది.
రెచ్చగొట్టే ఆచారాలు – ఊరేగింపులు..
మతకల్లోలాల వెనుక ఉన్న రాజకీయ వ్యాపారులకు హింసను ప్రేరేపించడానికి ‘రెచ్చగొట్టే ఆచారాలు’ అవసరమయ్యాయి. ఇవి దాదాపు పూర్తిగా మతపరమైన స్వభావాన్ని కలిగి ఉండేవి, ఎందుకంటే పవిత్రమైన వాటిపై దాడులు చేయడం అనేది ఆగ్రహాన్ని కలిగించడానికి ఉత్తమమైన మార్గం(గాబోరియో 1985, 9-10).
ఈ ఆచారాలలో సాధారణంగా ఎదుటి సమాజం గౌరవించే చిహ్నాలను అగౌరవపరచడం ఉంటుంది, ఉదాహరణకు హిందువులు విగ్రహాలు, దేవాలయాలు, ఆవును ఎలా పవిత్రంగా భావిస్తారో, ముస్లింలు ఖురాన్, ప్రవక్త, ఆయన అవశేషాలు, మసీదులు, సూఫీ సాధువుల సమాధులు, షరియా చట్టాన్ని పవిత్రంగా భావిస్తారు.
ఒక మత సమూహ విశ్వాసంలోని పవిత్రమైన అంశాన్ని అగౌరవపరచడం ద్వారా ఎదుటివారిని రెచ్చగొట్టడం లేదా అలాంటి అవమానం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేయడం ఈ పద్ధతిలో కీలకాంశం.
ఆ విధంగా, మసీదులో పంది తల కనిపించడంతో 1980లో మొరాదాబాద్ మతకల్లోలానికి బీజం పడింది (హసన్ ఎన్డీ, 8, 14), ఒక ఆవు, సాధువు పట్ల అనుచితంగా ప్రవర్తించారనే పుకార్ల మూలంగా 1969లో అహ్మదాబాద్ మతకల్లోలం చెలరేగింది(రెడ్డి 1971).
రాజకీయ నాయకులతో సంబంధం ఉన్న లేదా సంచలనాత్మకత కోసం ఆరాటపడే మీడియా సంస్థలు వ్యాప్తి చేసే పుకార్లు, తప్పుడు సమాచారం ఈ అన్ని సందర్భాల్లోనూ భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో కీలక పాత్ర పోషించాయి.
ఇక్కడ పవిత్ర చిహ్నాల వినియోగం ఇన్స్ట్రుమెంటలిస్ట్ సిద్ధాంతాన్ని పునఃసమీక్షించేలా చేస్తుంది, ఎందుకంటే సామూహిక గుర్తింపులు పూర్తిగా రాజకీయ శక్తులచే సృష్టించబడినవైతే, వారు మార్చాలని చూసే ఆ చిహ్నాలకు అంతటి మానసిక శక్తి ఉండేది కాదు.
మతకల్లోలాలకు ఉత్ప్రేరకంగా మతపరమైన ఊరేగింపుల వినియోగాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఈ తర్కం వర్తిస్తుంది(జాఫ్రెలాట్ 1998, 58-92). చారిత్రకంగా, హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణలకు ఊరేగింపులు ప్రాథమిక వాహకాలుగా ఉన్నాయి.
బ్రిటీష్ పాలన కాలంలో హిందూ-ముస్లిం మతకల్లోలాలపై సాండ్రియా ఫ్రీట్యాగ్ జరిపిన అధ్యయనంలో ఊరేగింపులు నిర్వహించడం మతకల్లోలాన్ని ప్రేరేపించడానికి అనుకూలమైన పరిస్థితులను ఎలా సృష్టించిందో ఎత్తి చూపారు(ఫ్రీట్యాగ్ 1990, 138).
ఆమె విశ్లేషణ ఎక్కువగా వీ టర్నర్ అభివృద్ధి చేసిన ‘కమ్యూనిటాస్’ భావనపై ఆధారపడింది, ఇది ఊరేగింపుల వంటి ఉత్సవాల గురించి వివరిస్తుంది– ఇక్కడ సామాజిక ‘నిర్మాణం’ హోదా పరంగా వైవిధ్యంగా ఉన్నప్పటికీ, ఒక ‘అభేద సమూహంగా’ మారుతుంది(టర్నర్ 1974, 237).
మతపరమైన వేడుకల సమయంలో జరిగే ఊరేగింపులు కుల వ్యవస్థలో అంతర్గతంగా ఉన్న తీవ్రమైన సామాజిక వ్యత్యాసాలు, విభేదాలను అధిగమించడానికి ఎలా దోహదపడతాయో పరిశీలిస్తే హిందువుల ఊరేగింపుల్లో ఇవి స్పష్టంగా కనిపిస్తాయి.
‘మనం’ అంటే హిందువులు, ‘వాళ్ళు’ అంటే ముస్లింలు అన్న పేరిట హింసాత్మక వ్యతిరేకత సృష్టించడంకోసం ఊరేగింపుల్లో ఇటువంటి సమగ్ర, ఏకీకృత లక్షణాల పదాలు పదేపదే వాడతారు (కాకర్ 1990, 143). ఈ తర్కం 1989 నాటి మతకల్లోలాల వెల్లువలో పరాకాష్టకు చేరింది (పాండే 1991, 561).
అయోధ్య ఉద్యమం – 1989 మతకల్లోలాల వెల్లువ..
1989 ఎన్నికలకు ముందు భారతదేశాన్ని చుట్టుముట్టిన మతకల్లోలాల వెల్లువ ధ్రువీకరణ, జాతీయవాదాన్ని కలిపిన ఒక కొత్త యుగానికి నాంది పలికింది.
సంవత్సరాంతపు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, హిందుత్వ శక్తులు 1989 జనవరిలో అయోధ్యలోని రాముడి జన్మస్థలంగా భావించే స్థలంలో 1989 నవంబర్ 9న రామమందిర శంకుస్థాపన చేస్తామని ప్రకటించాయి. దాని ఉగ్రగామి నెట్వర్క్, మత పెద్దలు నిధులు సేకరించడానికి వేలాది గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో ఆలయం కోసం ఉపయోగించే ఇటుకలను సేకరించారు.
రామ్ శిలాన్యాస్(‘రామ్’ అని ముద్రించిన ఇటుకల సేకరణ) పేరిట ఈ తతంగం అంతా బీజేపీ నిలబెట్టిన అభ్యర్థుల ద్వారా చేపట్టేలా చూసారు. తద్వారా హిందూమత రక్షకులుగా వారి ప్రతిష్ట పెరిగింది.
మత ప్రాతిపదికన ఓటర్లను ధ్రువీకరించడానికి, తద్వారా హిందూ సమాజం తనను తాను గుర్తించుకుని చివరికి ‘హిందూవుగా ఓటు వేసేలా’ ప్రోత్సహించడానికి ఈ వ్యూహంలో మత హింస ఒక పరిపూరకరమైన అంశంగా ఉపయోగపడింది. ఆ రకంగా ఊరేగింపుల ఉపయోగం చాలా కీలకమని నిరూపితమైంది.
1989లో సెప్టెంబర్ మధ్య నుంచి నవంబర్ ప్రారంభం వరకు, డజన్ల కొద్దీ ఎన్నికల ముందస్తు మతకల్లోలాలు ప్రతి సందర్భంలోనూ ఒకే విధమైన నమూనాతో చెలరేగాయి.
బల ప్రదర్శనకు ఉద్దేశించిన ఒక ఊరేగింపు, కొన్నిసార్లు 10,000 కంటే ఎక్కువ మందితో, కిలోమీటర్ల మేర సాగింది; ఇందులో సాధారణంగా పూజించిన ఇటుకలను పట్టుకున్నవారు పాల్గొంటారు. దీనికి కార్యకర్తలు, రాజకీయ నాయకులతో పాటు మత పెద్దల హాజరు కావడం ద్వారా వీటికి బలం చేకూరింది; స్థానిక అధికారుల సిఫార్సులు, నిషేధాలను ధిక్కరిస్తూ, వారు ముస్లిం పరిసరాల్లోకి ప్రవేశిస్తారు, అక్కడ వారు ‘ముస్లింలకు రెండే స్థలాలు, పాకిస్తాన్ లేదా స్మశానం'(పాకిస్తాన్ ఔర్ కబ్రిస్తాన్) వంటి నినాదాలు చేస్తారు;
ఈ రెచ్చగొట్టే చర్యలు నివాసితులను వారి ఇళ్ల నుంచి రాళ్లు రువ్వేలా చేస్తాయి, దానికి ఊరేగింపు సభ్యులు – వీరు తరచుగా ఆయుధాలు కలిగి ఉంటారు – హింసాత్మక దాడులతో ప్రతిఘటిస్తారు. భాగల్పూర్లో, అధికారిక లెక్కల ప్రకారం ఈ మతకల్లోలంలో సుమారు వెయ్యి మంది మరణించారు.
అనువాదం: సత్యరంజన్
ఈ వ్యాసం మూడు భాగాలుగా ప్రచురితమవుతుంది. ఇది మొదటి భాగం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
