కొన్నిరోజుల క్రితం న్యాయవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని ఒక న్యాయమూర్తి పెద్ద చర్చకు కారణమయ్యారు. కేవలం రెండేళ్ల ప్రాక్టీస్ ఉన్న ఒక యువ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసి, ఆయనను జైలుకు పంపాలని ఆదేశించడంతో ఈ వివాదం మొదలయ్యింది.
దీనిపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి తీర్మానాలు/లేఖల ద్వారా భారత ప్రధాన న్యాయమూర్తి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాయి.
అనంతరం సుప్రీంకోర్టు స్వయంగా ఈ అంశాన్ని స్వీకరించి, రెండు రిట్ పిటిషన్లు నమోదు చేసిన తర్వాత, న్యాయపరంగా ఈ వ్యవహారాన్ని ముగిస్తూ- “ఏ స్థాయిలోనైనా, న్యాయవ్యవస్థలోని సభ్యులందరూ సహనం, కరుణ – ముఖ్యంగా యువ న్యాయవాదుల పట్ల ప్రోత్సాహ భావనతో వ్యవహరించాలి. (న్యాయవాదులలో) క్రమశిక్షణ, వృత్తి నైతికత, నిరంతర అధ్యయనం వంటి విలువలను పెంపొందించటం ప్రధానంగా బార్‌లోని సీనియర్ సభ్యుల బాధ్యత అయినప్పటికీ, ఆ బాధ్యత వారికి మాత్రమే పరిమితం కాదు. ప్రతి న్యాయవాదికి (యువ న్యాయవాదులతో సహా) తాము ముందుగా కోర్టు అధికారులు అనే భావన కలిగేలా వారిలో బాధ్యత-నైతికత పెంపొందించటం బెంచ్ (జడ్జీల) బాధ్యత కూడా” అని వ్యాఖ్యానించింది.
బెంచ్‌పై వేధింపులు, రిటైర్మెంట్ తర్వాత పరిస్థితి..
ఇదే వారం, జమ్మూ కాశ్మీర్‌తోపాటు లడఖ్ హైకోర్టు కూడా కక్షిదారుల పట్ల గానీ, లాయర్ల పట్ల గానీ, సాక్షుల పట్ల గానీ అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని, ఒకవేళ అలా చేయాల్సి వచ్చినా, అది కేసు తీర్పుకు అవసరమైనప్పుడు మాత్రమే – వారి పక్షాన్ని పూర్తిగా విన్న తర్వాతనే చేయాలని సూచించింది.
యాదృచ్ఛికంగా, భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తాను రచించిన “ది బెంచ్, ది బార్ అండ్ ది బిజార్” అనే పుస్తకాన్ని విడుదల చేశారు. అందులో “Bullies on the Bench”(బెంచ్ పై వేధించు వారు) అనే అధ్యాయాన్ని ప్రత్యేకంగా చేర్చారు.
అయితే, ఆయన జడ్జీల నియామకాలలో కూడా పాత్ర కలిగి ఉన్న స్థాయి వ్యక్తి అయినప్పటికీ – జడ్జీలలో అలాంటి వేధింపులకు/అవమానాలకు గురిచేసేవారి పేర్లు చెప్పేందుకు ఆయన కూడా సాహసం చేయలేదు; తాను ఇంకా ప్రాక్టీస్ కొనసాగించాల్సి ఉందని పేర్కొన్నారు.
కొన్ని సంఘటనలు అతిశయోక్తిగా ప్రచారం పొందినా, చాలా చిన్న శాతం జడ్జీల ప్రమేయమే అయినా, న్యాయమూర్తుల దుర్వ్యవహారం దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉంది. సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి దుర్వ్యవహార స్వభావం కలిగిన న్యాయమూర్తులు ఉన్నారు.
అయితే పదవీ విరమణ అనంతరం ఢిల్లీలోనే ఉంటున్న కొందరు న్యాయమూర్తులు గతంలో తాము అవమానించిన న్యాయవాదుల నిరాదరణను చూస్తున్నారు.
“ఒకప్పుడు నన్ను “మై లార్డ్” అని గౌరవించిన న్యాయవాదులచే అగౌరవాన్ని ఎదుర్కోలేక నేను ఇప్పుడు న్యాయవాదుల కార్యక్రమాలకు వెళ్లడం మానేశాను” అని వాపోతూ, బెంచి మీద అనుచిత ప్రవర్తనలో సుప్రసిద్ధునిగా పేరొందిన కేరళ హైకోర్టుకు చెందిన ఓ రిటైర్డ్ న్యాయమూర్తి ఒకరు మరో రిటైర్డ్ జడ్జికి చెప్పిన మాటలివి.
అనుభవజ్ఞులైన న్యాయవాదులెవరూ ఒక జడ్జిని గౌరవించేది ఆయన ఇచ్చే తీర్పుల ఆధారంగా మాత్రమే కాదు. కేసు పూర్వాపరాలను బట్టి చాలా మంది కేసు ఫలితం ఏమవుతుందో ముందుగానే అంచనా వేయగలరు. కానీ, కోర్టులో జడ్జీలు తమతో గౌరవంగా ప్రవర్తించాలని మాత్రం ఆశిస్తారు.
నేను జస్టిస్ మార్కండేయ కట్జూకి న్యాయమూర్తిగా గానీ, వ్యక్తిగతంగా గానీ అభిమానిని కాను. అయినప్పటికీ, ఆయన వినయాన్ని ప్రశంసించాల్సిందే. ఒకసారి కోర్టులో ఆయనతో నాకు చిన్నపాటి ఘర్షణ జరిగింది. కోర్టు సమయం ముగిసిన తర్వాత, అప్పట్లో నేను జూనియర్ న్యాయవాదిని అయినప్పటికీ, జడ్జిగారి కార్యదర్శి ద్వారా కాకుండా స్వయంగా నన్ను ఫోన్ చేసి తన ప్రవర్తనకు క్షమాపణ చెప్పారు. నేను కూడా నా ప్రవర్తనకు క్షమాపణ చెప్పాను.
బార్ అసోసియేషన్ల పాత్ర, మౌనం..
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా కొన్నిసార్లు జోక్యం చేసుకొని మరీ కొందరు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రవర్తనను నియంత్రించాలని వినతిపత్రాలు ఇవ్వాల్సి వచ్చింది. కోర్టులో అవమానించే జడ్జికి ఎదురు చెప్పడం అనేది ఒక ప్రాక్టీసింగ్ న్యాయవాదికి చాలా కష్టం.
ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి ఎదురు మాట్లాడితే, ఆ కోర్టులో వారి భవిష్యత్తు దాదాపు ముగిసినట్టే! జడ్జిల ప్రవర్తనను సరిదిద్దాల్సిన సీనియర్ న్యాయవాదులు సైతం చాలా సందర్భాల్లో మౌనం పాటిస్తారు.
ఎందుకంటే వారి వృత్తిపరమైన ప్రయోజనాలు ఎంతో పెద్దవి కాబట్టి. కేసులో గెలుపోటములు – కోర్టులో న్యాయవాదికి, జడ్జికి మధ్య కనిపించే స్నేహపూర్వక ప్రవర్తన, వ్యవహారశైలిపై ఆధారపడి ఉంటాయి అని అక్కడి ఇతర న్యాయవాదులకు కూడా “ఎవరికీ అనుకూల ఆదేశాలు వస్తున్నాయి?” అన్న అభిప్రాయం కలిగిస్తుంది.
అందుకే చాలామంది “జడ్జిని విరోధించవద్దు” అనే సక్సస్ మంత్రంతో ముందుకు సాగిపోవడానికి మొగ్గుచూపుతారు తప్ప ఇతర నైతిక అంశాలకు నిలబడటం లేదు. చాలాసార్లు బార్ అసోసియేషన్లే ఇలాంటి జడ్జీల ప్రవర్తనకు ప్రధాన కారణమని నేను భావిస్తాను.
బార్ అసోసియేషన్లు రూపురేఖలు లేని సంస్థలేమి కావు; అదే జడ్జిల ఎదుట ప్రతిరోజూ ప్రాక్టీస్ చేసే ఎందరో ధ్యేయం కలిగిన న్యాయవాదులతో కూడి ఉంటాయి. అందువల్ల, సమస్యలు సృష్టించే న్యాయమూర్తులతో వ్యవహరించేటప్పుడు, వారు తమకు వ్యక్తిగత నష్టం గానీ, వృత్తిపరమైన పరిణామాలు గానీ లేని కారణాల కోసం మాత్రమే పోరాడే తిరుగుబాటుదారులుగా మారాలి.
న్యాయస్థానాల్లో దుర్వ్యవహారం/అనుచిత ప్రవర్తన కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు; అది ప్రపంచవ్యాప్తంగా కనిపించే సమస్య. భారత న్యాయవ్యవస్థలో ఇలాంటి జడ్జిలపై ఎక్కువ సాహిత్యం అందుబాటులో లేకపోయినా, విదేశాల్లో మాత్రం ఈ అంశంపై విస్తృతంగా రచనలు ఉన్నాయి.
ఈ దుర్వ్యవహారం, కోర్టు తన అధికారాన్ని దుర్వినియోగం చేసే ఒక వ్యవస్థాత్మక సమస్యను బయటపెడుతుంది. అంతేకాదు – లాయర్లకు శిక్షణాత్మకంగా కాక మానసిక క్షోభకు గురిచేస్తుంది.
న్యాయవాదులపై అసహనం – దుర్వ్యవహార రూపాలు..
దుర్వ్యవహారం అనేక రూపాల్లో కనిపిస్తుంది. కొందరు జడ్జిలు “కాస్ట్స్ వేస్తాను” అని బెదిరించడం ద్వారా న్యాయవాదులను నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. న్యాయవాది వాదన కొనసాగిస్తే వారిపై కాస్ట్ విధిస్తానని హెచ్చరిస్తారు. ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది.
మంచి జడ్జిల చేతిలో ఇది సమర్థవంతమైన నియంత్రణ పద్ధతిగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కొందరు న్యాయవాదులు తమ కేసుపై అపారమైన నమ్మకంతో కోర్టు తిరస్కరించినా గంటలకొద్దీ వాదిస్తుంటారు. విలువైన కోర్టు సమయాన్ని వృథా చేస్తుంటారు.
అయితే సహనం లేని, అసహనంతో కూడిన జడ్జిల చేతిలో ఇదే పద్ధతి హానికరమవుతుంది. వారు వేలం పాటలో ధరలు పెంచినట్టు “కాస్ట్స్” మొత్తాన్ని పెంచుతూ, సరైన వాదనలకు సైతం అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటారు.
ఇంకా అత్యంత హేయమైన ప్రవర్తన న్యాయవాదులను బహిరంగంగా అవమానించడం. పొరపాటున ఒక తప్పు పదం దొర్లినా, దానిని ఆధారం చేసుకుని కొందరు జడ్జిలు ఉపన్యాసమే ఇస్తారు. “మా కాలంలో బార్ ఇలా ఉండేది” అంటూ ఆ న్యాయవాదిని వృత్తికి అనర్హుడిగా తనకు తాను భావించుకునే విధంగా మాట్లాడుతారు.
సుప్రీంకోర్టు నుంచి మెజిస్ట్రేట్ కోర్టు వరకు, విషపూరిత ప్రవర్తనకు పేరొందిన న్యాయమూర్తుల గురించి అనేక న్యాయవాదుల అనుభవాలు ఉంటాయి.
రోజుకు వందల పేజీలు చదవాల్సి వచ్చే జడ్జిలు కొన్ని అంశాలను విస్మరించడం సహజం. అవి చాలాసార్లు లాయర్ల ద్వారా కోర్టులో వాదనల సమయంలోనే స్పష్టమవుతాయి. కానీ అతివిశ్వాసం లేదా అహంకారం కారణంగా, కొందరు జడ్జిలు న్యాయవాదులను వాదనలు కొనసాగించనివ్వరు. మొదటి మూడు లేదా నాలుగు నిమిషాలు ప్రశాంతంగా విని, తర్వాత ప్రశ్నలు అడగాలి అని నా అభిప్రాయం.
లేనిపక్షంలో, కోర్టు న్యాయం కోసం – సరైన పక్షం కోసం చేసే విచారణ కాకుండా, జడ్జి – న్యాయవాది మధ్య వాగ్వాదంగా మారిపోతుంది. ఒక న్యాయవాది మరొక నిమిషం కూడా వాదించకూడదని – ఐదు నిమిషాలకుపైగా న్యాయవాదిని వారించే జడ్జిలను నేను చాలా చూశాను.
పూర్వ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ చెప్పినట్టు, మనకు “మేధావి” అయిన జడ్జిలకంటే “సహనం, సానుభూతి కలిగిన” జడ్జిలు అవసరం. అసహనం, రూఢత్వం కలిగిన ప్రతిభావంతుడైన జడ్జి, ప్రశాంతంగా విని తీర్పు చెప్పే సాధారణ జడ్జికంటే న్యాయవ్యవస్థకు ఎక్కువ నష్టం కలిగించగలడు అని వేణుగోపాల్ అన్నారు.
న్యాయవాదుల ప్రవర్తన కూడా ఆందోళనకరమే..
న్యాయమూర్తుల ప్రవర్తనపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఈ సమయంలో, న్యాయవాదుల ప్రవర్తన కూడా అంతే ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా జిల్లా కోర్టులలోని బార్ అసోసియేషన్ పదవుల్లో ఉన్న కొందరు న్యాయవాదులు, తమకు అనుకూల తీర్పులు రాకపోతే నానా ఇబ్బందులు పెడుతుంటారు.
క్షేత్ర స్థాయి/జిల్లా జడ్జీలపై ఫిర్యాదులు చేస్తారు; మరికొందరిని అనామక ఫిర్యాదులు పంపేలా ప్రోత్సహిస్తారు. దీని వల్ల చాలామంది జిల్లా జడ్జిలు- ఇతర న్యాయాధికారులు భయాందోళనల మధ్య పనిచేయాల్సి వస్తోంది.
న్యాయవాదుల సంతకాల సేకరణలు లేదా కోర్టు బహిష్కరణకిచ్చే పిలుపులలో చాలా వరకు వ్యవస్థపరమైన లోపాల కంటే వ్యక్తిగత కక్షసాధింపులే కనిపిస్తాయి.
అధికార గర్వం, వివక్ష..
అసహన ప్రవర్తన ఒక మానసిక సంబంధిత సమస్య. కొంత సౌమ్యం & అసహన నియంత్రణ ఉంటే అనేక ఘర్షణలు నివారించవచ్చు. కోర్టు మర్యాద అనేది రెండు వైపులా ఉండాలి.
అనేక సందర్భాల్లో తప్పు పూర్తిగా న్యాయవాది వైపే ఉండదు; కొందరు ప్రతిస్పందిస్తారు కూడా. నిరంతర అవమానాలను(జడ్జీల వైపు నుంచి) సహించడానికి తాము అందరమూ సిద్ధంగా లేమని వ్యక్తపరచడానికి అలా చేస్తుంటారు. అసలు మానవ ప్రవర్తనలోనే సమస్య ఉంది.
న్యాయవాదులు జడ్జిలుగా ఎదిగిన తర్వాత, అకస్మాత్తుగా వచ్చిన అధికారం వారి స్వభావాన్ని మార్చేస్తుంది. తాము ఒక రోజు తిరిగి సాధారణ పౌరులుగా సమాజంలో కలిసిపోవాల్సిందే అన్న విషయాన్ని వారు మరచిపోతారు.
ఇంకా ఒక గమనించదగ్గ విషయం ఏమిటంటే, జడ్జీల అనుచిత వ్యవహార శైలికి పేరుగాంచిన జడ్జిలు అందరితో ఒకేలా ప్రవర్తించరు. పేరున్న సీనియర్ అడ్వొకేట్లు లేదా ఇతర జడ్జిల బంధువుల వంటి వారు ఇలాంటి అవమానాలకు గురికావడం అరుదు. బాధితులు ఎక్కువగా యువ న్యాయవాదులు, సామాజికంగా వెనుకబడినవారు, చిన్న పట్టణాలు లేదా గ్రామాల నుండి వచ్చినవారే అయివుంటారు.
ప్రవర్తనా నియమావళి, పారదర్శకత ఆవశ్యకత..
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, ఇక “లిఖితపూర్వకంగా లేని ప్రవర్తనా నియమావళి” మీద ఆధారపడటం సాధ్యం కాదనిపిస్తోంది. మెజిస్ట్రేట్ల నుంచి సుప్రీంకోర్టు జస్టిస్‌ల వరకు అందరికీ ఒకేలా వర్తించే స్పష్టమైన, అమలు చేయదగిన న్యాయ ప్రవర్తనా నియమావళి అవసరం.
అలాగే, ప్రతీకార భయం లేకుండా న్యాయవాదులు న్యాయమూర్తుల దుర్వ్యవహారాన్ని ఫిర్యాదు చేయగల వ్యవస్థ కూడా ఉండాలి.
ఆన్లైన్లో కోర్టులు వచ్చినప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు మరింత బయటకు రావటం ఒకందుకు మంచిదే. ఆన్లైన్లో కోర్టు వ్యవహారాలు ప్రసారం చేయడమనేది కత్తికి రెండు వైపులా పదునున్న పద్ధతి. కోర్టులో అసలు తప్పు ఎవరిదో పరిశీలించే అవకాశం ఉంది.
ఒకవైపు అది పారదర్శకతను పెంచి, న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రజల పరిశీలనలో ఉన్నారనే అవగాహన కలిగిస్తుంది.
మరోవైపు, దుర్వ్యవహారంతోపాటు పైపై విచారణలను బహిర్గతం చేసి, ప్రజల దృష్టిలో న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది.
భారతీయ కోర్టుల వైవిధ్యం – సమన్వయ సంస్కృతి..
భారతదేశం భిన్నమైన సమూహాలు కలిగిన దేశం. దాని కోర్టులు కూడా ఆ వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా అందరినీ కలుపుకుపోతుందనే భావన కలిగించాలి.
అత్యంత ఖరీదైన విద్యాసంస్థలలో చదివిన న్యాయవాదుల నుంచి, వసతులు లేని ప్రదేశాల నుంచి వచ్చినవారి వరకు అందరూ కోర్టుల్లో ఉంటారు. వారి ప్రవర్తన, సంస్కారం, మాట్లాడే తీరు భిన్నంగా ఉంటుంది.
కొందరు ఇప్పటికే మెరుగుపడినవారు; మరికొందరు ఇంకా నేర్చుకునే దశలో ఉంటారు. వారు సామాన్య ప్రజల సమస్యలను, ప్రపంచంలోని మరే న్యాయస్థానాలు ఎదుర్కోని అనేక సంక్లిష్ట అంశాలను కోర్టుకు తీసుకువస్తారు. వారు న్యాయం కోసం వస్తారు. కానీ కొందరు జడ్జిలు ఇది భారతీయ కోర్టు అన్న విషయాన్ని మరిచి, యూరోపియన్ స్థాయి న్యాయపరమైన సంస్కారం ఆశిస్తారు.
యువ న్యాయవాదులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు గుర్తుచేసిన తీర్పు ఆహ్వానించదగినది. అయితే ఇది ఆచరణాత్మకంగా మారాలంటే, బెంచ్- బార్ రెండూ తమ లోపాలను అంగీకరించి, పరస్పర గౌరవ సంస్కృతికి కట్టుబడాలి.
వ్యాస రచయిత పీవీ దినేష్ సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న సీనియర్ న్యాయవాది. ఈ వ్యాసంలో వ్యక్తమైన అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతవే.
స్వేచ్ఛానువాదం: శ్రీకాంత్ చింతల, తెలంగాణ హైకోర్టు న్యాయవాది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
