ఒక దశాబ్దం పాటు అన్యాయంగా నిర్బంధానికి గురై, నిరుడు చనిపోయిన ప్రొఫెసర్ సాయిబాబా జ్ఞాపకార్థం నిర్వహించిన కార్యక్రమంలో పోస్టర్లను పట్టుకొని క్యాంపస్‌లో మామూలుగా కలుసుకున్నామని విద్యార్థులు తెలియజేశారు.
ముంబయి: ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ప్రథమవర్ధంతి సందర్భంగా అక్టోబరు 13న నగరంలోని టాటా ఇస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టీఐఎస్ఎస్) విద్యార్థులు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను ముంబయి పోలీసులు నిర్బంధించి, వారి మీద కేసులను నమోదు చేశారు.
తాము క్యాంపస్‌లో సాధారణంగా గూమిగూడి, సాయిబాబా పోస్టర్లను పట్టుకొని కొవ్వత్తులను మాత్రమే వెలిగించామని విద్యార్థులు తెలియజేశారు.
క్యాంపస్‌లో చట్టవ్యతిరేకంగా గుమిగూడి రెండు సమూహాల మధ్య శతృత్వాన్ని పెంచే విధంగా ఉన్నందుకుగాను, విద్యార్థులోంచి కనీసం పది మందిపై “జాతి పట్ల పక్షపాతాన్ని చూపుతున్నారని” పేర్కొంటూ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసులను నమోదుచేసినట్టు ఒక అధికారి తెలియజేసినట్టుగా ఇండియన్ ఎక్స్ప్రెస్వెల్లడించింది.
నిషేధిత భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు)తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ, 90% వికలాంగుడై చక్రాల కుర్చీలోనే జీవితాన్ని వెల్లదీస్తున్న సాయిబాబాను దాదాపు దశాబ్దం పాటు నిర్భంధించారు. నిరుడు ఈ ఆరోపణల నుంచి ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. అప్పటికే ఆరోగ్యం క్షీణించడంతో బయటకు వచ్చిన కొన్ని నెలల్లోనే 2024 అక్టోబరు 12న ఆయన చనిపోయారు.
టీఐఎస్ఎస్ క్యాంపస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కొంతమంది వచ్చి ఒక దగ్గర చేరామని విద్యార్థులు తెలియజేశారు. “కార్యక్రమంలో ఎటువంటి నినాదాలు ఇవ్వలేదు. ప్రసంగాలు కూడా చేయలేదు. మేము కొద్దిసేపు నిల్చున్నాం అంతే” అని గుమిగూడిన వ్యక్తులలో ఒక విద్యార్థి చెప్పారు.
ఆ తర్వాత, కొద్దిసేపట్లోనే ప్రజాస్వామ్య లౌకిక విద్యార్థి సంఘంతో సంబంధమున్న మితవాద అనుకూల విద్యార్థులు వచ్చి సాయిబాబా ఫొటోలను చించివేశారు.
“మమ్మల్ని దూషిస్తూ, మా సమూహంలోని కొంతమంది ఫొటోలను తీసుకుంటూ సాయిబాబా ఫొటోలను చించివేశారని” మాస్టర్స్ విద్యార్థి ఒకరు పేర్కొన్నారు.
ఇదంతా కొనసాగుతుండగానే, తీసిన ఫొటోలను క్రియాశీల మితవాద సామాజిక మాధ్యమ ఖాతాదారులు సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. అంతేకాకుండా ముంబయి పోలీసులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఆ ఫొటోలను సామాజికమాధ్యమంలో ట్యాగ్ చేశారు. ఎక్స్పోస్టుపై ముంబయి పోలీసులు వెంటనే స్పందించారు.
ముంబయి త్రాంబే పోలీసు పరిధిలోని టీఐఎస్ఎస్ క్యాంపస్‌కు చాలా వాహానాలు వచ్చి క్యాంపస్ చుట్టూ తిరగడం మొదలుపెట్టాయని విద్యార్థులు తెలిపారు. ఆ తర్వాత కూడా క్యాంపస్‌లోనే ఉండి, కొంతమంది విద్యార్థులను పోలీసులు ప్రశ్నించారు.
“నలుగురు విద్యార్థులను నిర్బంధించారు. మిగితా విద్యార్థుల చిరునామాలు అడిగారు”అని క్యాంపస్‌లో ఒక విద్యార్ధి ది వైర్‌కు తెలియజేశారు. నిర్బంధించిన విద్యార్థుల ల్యాప్‌టాప్‌లు, ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు మరో విద్యార్థి చెప్పారు.
సోషల్ మీడియా పోస్టుల ద్వారానే టీఐఎస్ఎస్ పాలనా యాంత్రాంగం ఈ కార్యక్రమం గురించి తెలుసుకుందని ఎక్స్‌ప్రెస్ తెలియజేసింది. పోలీసుల నుంచి సరైన అనుమతులను తీసుకోలేదని యాజమాన్యం ఆరోపించింది.
ఢీల్లీ అల్లర్ల కేసులో 2020 నుంచి సుదీర్ఘ నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు మద్దతుగా విద్యార్థులు నినాదాలు చేశారని కథనం వాదిస్తుంది. కార్యక్రమంలో ఎలాంటి నినాదాలు చేయలేదని, పోలీసులు అనవసరంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని విద్యార్థులు అన్నారు.
పోలీసులు వారంట్‌తో వచ్చి నిర్బంధంలో ఉన్న వారిలోంచి ఒక విద్యార్థికి ఆ వారెంట్‌ను అందచేశారని, అరెస్టు చేయడానికా లేక శోధించడానికా అనేదానిపై ఆ వారెంట్ స్పష్టత ఇవ్వలేదని ఒక విద్యార్థి పేర్కొన్నారు.
నిర్బంధించిన విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ హాస్టల్ బయట గూమిగుడిన విద్యార్దుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
