నాడు స్వాతంత్య్ర సమరంలో యావత్ భారతదేశం సైమన్ గో బ్యాక్ అంటూ గర్జించింది. అయితే సిద్ధాంతపరంగా ఆ నినాదం దళితులకు వ్యతిరేకంగా అగ్రవర్ణాలు చేసిన కుట్ర అని అంబేడ్కర్ ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించారనుకోండి- అది వేరే విషయం. సమకాలీన భారతదేశంలో ఆ గోబ్యాక్ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని యావత్ భారతం “అదానీ గో బ్యాక్” అని నినాదించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇందుకు నాందీవాచకంగా విశాఖ జిల్లా పెదగంట్యాడ ప్రజానీకం దేశానికి దిశానిర్దేశం చేసింది.
పెదగంట్యాడలో సెప్టెంబరు 8న అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయసేకరణ నిమిత్తం వేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదికలో స్థానిక ప్రజానీకం అదానీ గోబ్యాక్ అంటూ పెద్దపెట్టున నినదించారు. ఒక్కొక్కరు జూలు విదిల్చిన సింహాల్లా తిరగబడ్డారు. మహిళలు సైతం ఉగ్రకాళికలయ్యారు. వేదికపై ఏర్పాటు చేసిన బల్లల్ని, కుర్చీలను ధ్వంసం చేశారు. జనావాసాల మధ్య సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తి లేదని బల్లగుద్ది చెప్పారు.
ఖాకీ బలగాలకు సైతం ఏమాత్రం భయపడకుండా తెగించిన ధైర్యంతో తిరగబడ్డారు. చావో బతుకో తేల్చుకుందామన్నంత తెగింపు వారిలో కనపడింది. భావి భారతానికి వారు దిక్సూచిల్లా ఆ రోజు చేసిన పోరాటం; ఆంధ్రప్రదేశ్‌లోనూ, దేశంలోనూ- అదానీలు, అటువంటి కార్పొరేట్లకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాడటానికి ప్రాణవాయువుని అందించింది.
“ప్రజల అవసరాల కోసం కట్టిన కర్మాగారం ప్రజాస్వామ్యానికి తోడ్పడుతుంది. కానీ లాభాల కోసం కట్టిన కర్మాగారం ప్రకృతినీ, ప్రజలనూ దోచుకుంటుంది”అని ఫ్రెడ్రిక్ ఏంగెల్స్ అన్నారు. “ప్రజల మనసుల్లో నిరసనాగ్ని రాజుకున్నప్పుడు, ఏ కంపెనీ గోడలూ వాటిని ఆపలేవు” అని చేగువేరా తెలియజేశారు. ప్రస్తుతం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.
తమ జీవితాలను నాశనం చేసి, భావి భవిష్యత్తును అంధకారం చేసే పెట్టుబడిదారుల కుట్రలకు వ్యతిరేకంగా ప్రజలు గళం ఎత్తుతున్నారు. కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా ఒక్కటై నిలుస్తున్నారు. ఎదుటి వారు ఎంత పెద్దవారైనా, ఎంత ధనబలం ఉన్నవారైనా, ప్రజలు ఉద్యమిస్తే వారు తోక ముడవక తప్పదు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజా పోరాటాలకు, ఉద్యమాలకు పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తుతున్నారు. ప్రజాభిప్రాయం పేరుతో ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజావంచన కార్యక్రమాలను ప్రజలు నమ్మటం లేదు. ఇప్పుడు పెదగంట్యాడలోనూ అదే జరిగింది.
అదాని కంపెనీకి వ్యతిరేకంగా పోలీసులపై తిరుగుబాటు..
ఉమ్మడి విశాఖ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలు అనేకం ఉన్నాయి. అనకాపల్లి జిల్లా బయ్యవరం సమీపాన రామ్ కో, సాగర్ సిమెంట్స్, ఎలమంచిలి వద్ద మై హోమ్ తదితర కంపెనీలు సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇవి నివాస ప్రాంతాలకు దూరంగా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నాయి.
సిమెంట్ ఫ్యాక్టరీలను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలి. కానీ అదానీ సంస్థ పెదగంట్యాడలో నివాసాలకు దగ్గరగా ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాలను కాలుష్యంతో ముంచెత్తుతుంది. ఆ విషయమే ఇక్కడ ప్రజల తిరుగుబాటుకు కారణమైంది.
గంగవరం పోర్టుకు అనుబంధంగా ఉంటుందని..
గంగవరం పోర్టును హస్తగతం చేసుకున్న అదానీ కంపెనీ ఇక్కడ ఉత్పత్తిని ఇతర రాష్ట్రాలకు తన పోర్టు ద్వారా ఎగుమతి చేసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. పెదగంట్యాడ గ్రామం సర్వే నంబర్లు 97పీ, 98, 99పీ, 101పీలలో సుమారు 20 ఎకరాల్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాంగానికి ప్రతిపాదనలు వచ్చాయి. గుజరాత్లో అదానీకి అనుబంధ సంస్థ అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ పేరుతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ‘గంగవరం సిమెంట్ గ్రైండింగ్ యూనిట్’గా దీనిని పిలిస్తున్నారు.
వేయి కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నట్టు నివేదించారు. ఏడాదికి రెండు యూనిట్ల ద్వారా 40 లక్షల టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇది స్లాగ్ సిమెంట్ అని, ఎన్టీపీసీ, హిందూజా పవర్ ప్లాంట్ల నుంచి ఫ్లైయాష్ తీసుకొని దాంతో సిమెంట్ ఉత్పత్తి చేస్తారని చెబుతున్నారు. ఎన్టీపీసీ, హిందూజా థర్మల్ విద్యుత్ కేంద్రాల వల్ల, వాటి నుంచి వచ్చే ఫ్లైయాష్‌తో పాలవలస, దాసరిమెట్ట, పిట్టవానిపాలెం, చేపలపాలెం తదితర గ్రామాల ప్రజలు ఇప్పటికే కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి ఆ ఫ్లైయాష్‌ను నిత్యం లారీలతో తీసుకువచ్చి పెదగంట్యాడలో నిల్వ చేసి, గ్రైండింగ్ యూనిట్ల ద్వారా సిమెంట్ తయారు చేస్తారు. దీంతో కాలుష్యం మరింత పెరుగుతుంది.
ఏడాదికి 40 లక్షల టన్నుల సిమెంట్‌ను లారీల ద్వారా తరలిస్తారు. దీనివల్ల విపరీతమైన ధూళి రేగుతుంది. దీనిపై అక్టోబర్ 8న ప్రజాభిప్రాయసేకరణ చేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించింది. ప్రజాభిప్రాయ సేకరణను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న వేదిక వద్ద స్థానికులు నిరసన చేపట్టారు. దీంతో, స్థానికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులపైకి స్థానికులు తిరగబడ్డారు. పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకుని నిరసనలు తెలుపుతూ కుర్చీలను విసిరేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ, చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రజాభిప్రాయసేకరణ నిలిచిపోయింది.
అదానీపై యావత్ భారతంలో చెలరేగిన రణభేరి..
అదానిపై ప్రజలు రణభేరి మోగిస్తున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని అదానికి ప్రభుత్వాలు మద్దతు పలుకుతున్నప్పటికీ, అన్ని ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని విస్మరించి కంపెనీల పేరుతో తీవ్ర కాలుష్యానికి కారణమౌతున్న అదాని కంపెనీలను ప్రతిఘటిస్తున్నారు.
తెలంగాణలో సైతం ఏపీలో తరహా పరిస్థితి నెలకొంది. సరిగ్గా ఏడాది కిందట అక్టోబర్ 23వతేదీ అదాని కంపెనీ తెలంగాణలో ప్రజాగ్రహాన్ని చవిచూసింది. అప్పట్లో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో అదానీకి చెందిన అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్(గ్రూప్ కంపెనీ ఆఫ్ అదానీ) కంపెనీ ఫ్యాక్టరీ ఏర్పాటుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆద్యంతం ఒక్కటే నినాదం మార్మోగింది. “అదానీ గోబ్యాక్- అంబుజా సిమెంట్స్ గోబ్యాక్” అంటూ స్థానిక జనం చేసిన నినాదాలతో ప్రజాభిప్రాయ సేకరణ ప్రాంతమంతా హోరెత్తింది.
ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన ప్రజలంతా నల్లబ్యాడ్జీలు, నల్లజెండాలతో పట్టుకుని ‘అంబుజా సిమెంట్స్ మా కొద్దు- అదానీ గ్యోబ్యాక్’ అంటూ ప్లకార్డులు, పోస్టర్లను ప్రదర్శించి నిరసన తెలిపారు. ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ స్థలం ఎదురుగా బైఠాయించి పెద్దఎత్తున ధర్నాకు దిగారు. 2019- 20 మధ్య సెకి ఒప్పందమేగాక రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్లాంట్లు, విశాఖలో డేటా సెంటర్, గంగవరం పోర్టు వంటి వివిధ ప్రాజెక్టులను అదానీ గ్రూపు సంస్థలతో నాటి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని ప్రభుత్వ ఆస్తులను, ప్రజల సంపదను వారికి ధారాదత్తం చేశారని ఆరోపిస్తూ సీపీఎం గతంలో పలు ఆందోళనలు నిర్వహించింది.
అదానికి వ్యతిరేకంగా ప్రధానంగా లద్దాఖ్, మణిపూర్, శ్రీలంక, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాలలో ఆందోళనలు చోటు చేసుకున్నాయి. లద్దాఖ్ ప్రాంతంలో మోదీ సర్కార్ అదానీకి చెందిన సోలార్ కంపెనీకి 48వేల ఎకరాల భూమిని కేటాయించింది. 2026 నాటికి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లద్దాఖ్ ప్రాంత ప్రజలు శతాబ్దాలుగా ‘ఉన్ని’పై ఆధారపడి జీవిస్తున్నారు. గొర్రెల పెంపకం వారి జీవితంలో ఓ భాగం. ఇప్పుడు ఆ గొర్రెల్ని మేపుకొనే పచ్చిక బయళ్ల ప్రాంతాలన్నింటినీ అదానీకి ఇచ్చేశారు. దీంతో స్థానిక ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది.
మణిపూర్‌లో కూడా అక్కడి కొండ ప్రాంతాల్లోని భూగర్భ ఖనిజాలను అదానీ కంపెనీకి కేటాయించిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతాల నుంచి మణిపూర్ ట్రైబల్స్‌ను వెళ్లగొట్టేందుకు రెండేండ్లుగా ఆ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారు. వందలాది ప్రాణాలు తీశారు. అయినా అక్కడి ప్రజలు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో శ్రీలంకలో అదానీ ప్రాజెక్టులపై ప్రజాగ్రహం వ్యక్తమైంది. ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు గళమెత్తారు.
అంతా ఒకే తానులో..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు మారినా వారి ఆలోచనా విధానం మారటం లేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంగాని, నాటి వైసీపీ ప్రభుత్వం కానీ అదానికి దాసోహం అన్న వారే. విచిత్రమేమిటంటే ప్రభుత్వాల లక్ష్యం ఒకటే అయినా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఆదానికి తాము దూరం అన్నట్లు వ్యవహరించటం గమనార్హం.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అదాని కంపెనీతో కుదుర్చుకున్న స్మార్ట్ మీటర్ల ఏర్పాటును అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రజాభీష్టం మేరకు వ్యతిరేకించింది. కాని అధికారంలోకి వచ్చిన వెంటనే స్మార్ట్ మీటర్లు బిగింపును వేగవంతం చేసింది.
జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘అదానీప్రదేశ్’గా మార్చేసిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేశారు. భారీ పోర్టుల నుంచి ఇళ్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రాజెక్టు వరకు అన్నీ అదానీ పరం చేసింది. ఐదేళ్లలో పోర్టులు, పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టులు(పీఎస్పీ), సౌర విద్యుత్ ప్రాజెక్టులు, డేటా సెంటర్లు, ఇళ్లకు స్మార్ట్ మీటర్లు, చివరకు థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా టెండర్లనూ గంపగుత్తగా అదానీ సంస్థకు కట్టబెట్టిందని, ఐదేళ్లలో ఒకే సంస్థకు జగన్ ప్రభుత్వం కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ రూ 2,76,333 కోట్లు అని టీడీపీ లెక్కలు వేసింది.
కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్ పాలనలోని అక్రమ నిర్ణయాలన్నీ రద్దు చేస్తారని అందరూ భావించారు. ఇందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించటం విశేషం. దీనికి ఉదాహరణగా స్మార్ట్ మీటర్లను పేర్కొనవచ్చు.
బీచ్‌శాండ్ తవ్వకాల టెండర్లను కూడా అదానీ గ్రూప్ కంపెనీకి కట్టబెట్టడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం పిలిచిన టెండర్లను ఇప్పుడు కూటమి సర్కారు ఖరారు చేసింది. నాడు జగన్ కోరుకున్నట్లుగానే రెండు టెండర్లూ అదానీ కంపెనీకే దక్కాయి. ప్రస్తుతం ఈ ఫైలు ప్రభుత్వానికి చేరింది. విజయవంతమైన బిడ్డర్‌గా అదానీ గ్రూప్ కంపెనీని ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇవ్వడమే మిగిలింది.
అయితే గతంలో డెవలపర్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు ఆ టెండర్లనే ఖరారు చేయడం ప్రశ్నార్థకంగా మారింది. బీచ్‌శాండ్ మినరల్స్‌కు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ప్రైవేటు కంపెనీలు మైనింగ్ చేయడానికి వీల్లేదని కేంద్రం 2019 మార్చి 1న నిషేధం విధించింది. కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలే తవ్వకాలు చేపట్టాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర అణుఇంధన శక్తి విభాగం మార్గదర్శకాలు జారీ చేసింది. అదానికి దీన్ని కట్టబెట్టడానికి నిబంధనలు సైతం కూటమి ప్రభుత్వం మార్చివేసిందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాలో 250 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ సంస్థ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దోడియం, వడ్డిరాల గ్రామాల్లో 1200 ఎకరాల భూమిని అదానీ సంస్థకు 33ఏళ్లకు లీజు ప్రాతిపదికన కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రజాగ్రహ లావాలో కాలి బూడిదవ్వాల్సిందే..
మొత్తం మీద అదానిపై ప్రభుత్వాల అవ్యాజానురాగమైన ప్రేమ ప్రజల తిరుగుబాటుకు దారి చూపుతోంది. ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు విరుద్ధంగా ఆర్థిక వ్యవస్థ పనిచేస్తే అది నిజమైన అభివృద్ధి కాదని, అలాంటి వ్యవస్థ కేవలం సంపదను కొందరికే పరిమితం చేసి, పేదరికాన్ని, అసమానతలను పెంచుతుందని స్పష్టం అవుతుంది. ప్రజల సంక్షేమం, సమానత్వం, అందరికీ వనరులు అందడం వంటివి అభివృద్ధికి కీలకమని, కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే సరిపోదని పలువురు ఆర్థికవేత్తలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పిల్లిని తలుపులు మూసి కొడితే పులవుతుంది. ప్రభుత్వాలు కార్పొరేట్ల ముందు సాగిలపడితే ప్రజల గుండెల్లో నుంచి విప్లవాగ్నులు ప్రజ్వరిల్లి పెనుమంటలు సృష్టిస్తాయి. ప్రజాగ్రహం లావాలా ఉప్పొంగుతుంది. ఆ లావాలో ఎంత లావుపాటి వారైనా కాలి బూడిద కాక తప్పదని చరిత్ర గతంలో చాలాసార్లు రుజువు చేసింది. చరిత్ర పునరావృతం కాక మానదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
