దశాబ్దానికి పైగా మోదీ తన పాలనకు దాదాపు ఎలాంటి అడ్డంకులు లేకుండా భారత్‌ను పాలిస్తున్నారు. మోదీకి దేశంలో, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిళ్ల కారణంగా, చివరకు ఆయన రాజకీయ కూటమిలో చీలికలు వస్తున్నాయనే సంకేతాలు వస్తున్నాయి.
ప్రతి వ్యక్తికి, తన పనికి తగిన ప్రతిఫలంగా లాభం లేదా నష్టం పొందుతామని అనుకుంటాము. కానీ, ప్రపంచ మానవ చరిత్ర అంతా అందుకు భిన్నంగా ఉన్నది. మానవ చరిత్ర ఆ విధంగా ముందుకు సాగటంలేదు.
కొందరికి నిత్యం బాధలు, కష్టాలతో నిండిన జీవితం మిగిలింది. అందుకే మతం అనే “మత్తుమందు” ఈ అసమానతల ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు దేవుని, కర్మ సిద్ధాంతం, మరణానంతర స్వర్గం వంటి భావనలను ముందుకు తెచ్చింది. “స్వర్గం వెళ్లినవారు, తిరిగి రారని, ఆ తెలియని లోకం” గురించి వర్ణించింది.
మనుషుల జీవితంలోని అనిశ్చితి, యాదృచ్ఛికత గురించి, చాలా కాలంగా తత్వవేత్తలు, కవులు ఆలోచిస్తున్నారు. మనుషుల పరస్పర విరుద్ధ ఆలోచనలను షేక్స్పియర్ లాగ బహు కొద్దిమంది మాత్రమే గుర్తించారు. మనిషి జీవితం ఎంత అన్యాయంగా ఉన్నదో, సంక్షిప్తంగా ప్రభావవంతంగా షేక్స్పియర్ చెప్పారు. “కొంతమంది అన్యాయంగా పైకి ఎదుగుతారు. మరికొందరు న్యాయం అంటూ కూలిపోతారు.”
ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వ ధోరణులు..
డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ వంటి నాయకులు ప్రపంచ రాజకీయాలను మరింతగా ప్రభావితం చేస్తున్న ఈ కాలంలో, అణచివేత, మోసం, అవినీతి, అసత్యాల ద్వారా ఎదుగుతున్నవారి వలన వచ్చే కష్టాలు, నష్టాలు సాధారణ ప్రజలే మోయాల్సి వస్తోంది.
ప్రపంచాన్ని కష్టాల్లోకి నెట్టేసి, అధికారాన్ని అన్యాయంగా తమ చేతుల్లో ఉంచుకున్న నాయకులను పరిశీలిస్తే, వారిలో చాలామంది ఇప్పటికీ ఎలాంటి బాధ్యత వహించకుండా కొనసాగుతున్నారని స్పష్టమవుతుంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 25 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నారు. బెంజమిన్ నేతన్యాహు, రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్, కిమ్ జాంగ్ ఉన్, మహ్మద్ బిన్ సల్మాన్, అలాగే తమను తాము “విశ్వగురు”గా ప్రకటించుకున్న మోదీ. వీరందరూ దాదాపు దశాబ్ద కాలంగా తమ దేశాల్లో నిర్బంధం లేని అధికారాన్ని కొనసాగిస్తూ, పౌర స్వేచ్ఛలను- న్యాయపాలనను క్రమంగా బలహీనపరిచారు. ట్రంప్ అయితే కేవలం 15 నెలల వ్యవధిలోనే అంతర్జాతీయ వ్యవస్థను గణనీయంగా దెబ్బతీశారు.
ఇటీవల పోప్ లియో మాట్లాడుతూ, “కొద్ది మంది నియంతల చేతిలో నాశనమవుతున్న ప్రపంచాన్ని, అనేక మంది సోదరులు- సోదరీమణులు పరస్పర సహకారంతో నిలబెడుతున్నారు” అని వ్యాఖ్యానించారు. ఇది ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని కొంత ఉదారంగా, కొంత కచ్చితంగా అంచనా వేసిన వ్యాఖ్యగా చెప్పవచ్చు.
ప్రజాస్వామ్యం వెనుకంజ – నివేదికల వాస్తవాలు..
179 దేశాల్లో ప్రజాస్వామ్య స్థితిగతులపై V-Dem ఇన్స్టిట్యూట్ చేసిన విశ్లేషణ ప్రకారం, నియంతృత్వ ధోరణులు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.
2026 నివేదికలో 92 దేశాలను పూర్తిస్థాయి, లేదా ఎన్నికల ఆధారిత నియంతృత్వ పాలనలుగా గుర్తించింది.
జనాభా పరంగా చూస్తే, ప్రపంచ జనాభాలో సుమారు ఆరు బిలియన్ల మంది, అంటే దాదాపు 74 శాతం ప్రజలు నియంతృత్వ పాలన కింద జీవిస్తున్నారు.
కేవలం 29 దేశాలకే స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశాల హోదా లభించడం, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం వెనుకంజ వేస్తోందనే విషయాన్ని స్పష్టంగా సూచిస్తోంది.
ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, అలాగే ఫ్రీడమ్ హౌస్ కూడా ఇదే తరహా నిర్ధారణకు వచ్చాయి. 1990ల పరిస్థితులతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన దృశ్యం.
ఆ కాలంలో అమెరికా రాజనీతి శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ ఫుకుయామా ఉదార ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా మార్కెట్, పెట్టుబడిదారీ విధానం, మానవ రాజకీయ పరిణామంలో తుదిదశ పాలనా వ్యవస్థగా ఉంటుందని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు.
కాని ప్రస్తుత భారత రాజకీయ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. భారత్ ఒకప్పుడు ప్రజాస్వామ్యానికి ప్రతీకగా, “మహాత్ముడి నేల”గా గుర్తింపు పొందిన దేశం.
భారతదేశంలో బలహీనపడుతున్న ప్రజాస్వామ్య పునాదులు..
భారతదేశ ప్రజాస్వామ్య పునాదులు క్రమంగా బలహీనపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
వారికి సిద్ధాంతపరంగా అనుకూలంగా ఉన్న న్యాయమూర్తుల నియామకం, కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం, కార్పొరేట్ మీడియా ఒత్తిడులు, ఉద్యోగుల పదోన్నతులు, ఉద్యోగ భద్రత కోసం పాలకుల విధేయతకు అలవాటు పడిన అధికార యంత్రాంగం, పాలకులకు అనుకూలమైన కార్పొరేట్ వర్గాలకే అధిక లాభాలు చేకూర్చే క్రమంలో ప్రజలను మోసం చేయడం, ప్రభుత్వ విద్యా, సాంస్కృతిక సంస్థల్లో విధేయులను నియమించడం, ఇవన్నీ కలిసి ప్రజా జీవితంలో దీర్ఘకాలిక “కాషాయీకరణ”కు దారితీశాయని వారు ఆరోపిస్తున్నారు.
విభజన రాజకీయాల ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం నేటి పాలకుల మంత్రంగా మారింది.
ముఖ్యంగా హిందూ-ముస్లిం విభజన రాజకీయాల ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవడం ఇప్పుడు ప్రధాన పాలనా మంత్రంగా మారింది.
ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను ఐక్యం చేసి, అధికారం నిలబెట్టుకోవడం, నేటి పాలకుల లక్ష్యం.
ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ (సవరణ) చట్టం అమలు, మతమార్పిడి వ్యతిరేక చట్టాల ద్వారా హిందూ–ముస్లిం వర్గాల మధ్య విభేదాలను మరింతగా పెంచుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.
ఉధృతమైన మత జాతీయవాదం దేశాన్ని క్రమంగా తన ఆధీనంలోకి తీసుకెళ్లిందని, అది ముఖ్యంగా ముస్లిం ప్రజలను, కొంతవరకు క్రైస్తవ ప్రజలను కూడా ప్రత్యర్థులుగా చిత్రీకరిస్తోంది.
ప్రచార వ్యవస్థల మాయాజాలం..
ప్రజలలో వ్యూహాత్మక అనైక్యత సృష్టిస్తున్న వారిలో మోదీదే కీలక పాత్ర. అటువంటి మోదీని, దూరదృష్టి గలవాడని, ఏ తప్పు చేయని గొప్ప నాయకుడిగా ప్రజల్లో ప్రతిష్ఠించేందుకు, వారి ప్రచార సంస్థల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు కోట్లాది మంది అనుచరుల నుంచి మద్దతు కూడా లభిస్తోంది.
India Today సర్వే ప్రకారం అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధానమంత్రిగా పేర్కొన్నారు. Morning Consult వంటి అంతర్జాతీయ సర్వే సంస్థ, 2026 ప్రారంభం నాటికి ప్రపంచంలో 68% ప్రజాదరణ గల నాయకుడిగా మోదీని పేర్కొన్నాయి.
మోదీ ప్రజాదరణ ఆశ్చర్యకరం కాదు. ఎందుకంటే ఆయన చుట్టూ నిర్మించబడిన ప్రచార వ్యవస్థ పెద్ద ఎత్తున విస్తరించింది.
నోట్ల రద్దు సంక్షోభం, కోవిడ్-19 మహమ్మారి నిర్వహణలో ఎదురైన తీవ్ర విమర్శలు, 2014లో రూ 55 లక్షల కోట్లుగా ఉన్న ప్రభుత్వ అప్పు, నేడు రూ 200 లక్షల కోట్లకు పైగా పెరిగినప్పటికీ ఆయన ప్రజాదరణ పెద్దగా తగ్గలేదు.
ఉచిత రేషన్, సంక్షేమ పథకాలు, మోదీ ప్రజలకు ఇచ్చిన వ్యక్తిగత బహుమతులుగా ప్రజలను నమ్మించడంలో విజయవంతమయ్యారని విమర్శకులు అంటున్నారు.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని తానే ఆపి భారతీయులను యుద్ధ ప్రాంతం నుంచి తరలించాననే భావనను ప్రజలకు కలిగించి, అతిశయోక్తితో కూడిన రాజకీయ ప్రచారం చేయించారని కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆయనను “జాదూగర్” (మాంత్రికుడు)గా అభివర్ణించడం సబబుగా ఉన్నది.
మహిళా రిజర్వేషన్ బిల్లును, మహిళా సాధికారత కోసం చేసిన “మహోన్నత ప్రయత్నం”గా, ప్రతిపక్షాలు మహిళలకు వ్యతిరేకంగా నిలిచాయని మోదీ చేసిన మోసపూరిత రాజకీయ ప్రచారం ప్రజల మేధస్సును అవమానపరుస్తుందనే విమర్శలు వచ్చాయి.
అయినప్పటికీ, ఆ వ్యూహం విస్తృత స్థాయిలో పనిచేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను రాజకీయంగా వినియోగించడం ద్వారా, ఇంతకాలం అందని ద్రాక్షగా భావించిన పశ్చిమ బెంగాల్లో విజయాన్ని సాధించేందుకు సహాయపడిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, గత 12 ఏళ్ల భారత రాజకీయ పరిణామాలలో భారత ప్రజల విశ్వాసం విషాదభరితం. ఇవి ఒక మోసపూరిత రాజకీయంగా మారిపోయాయని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అంతర్జాతీయ ఒత్తిళ్లు – దౌత్య సవాళ్లు..
“మోదీకి తిరుగులేదు” అనే భావన తగ్గడం ప్రారంభమైంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన వాణిజ్య నిబంధనలకు మోదీ తలొగ్గటం.
ఆ ఒప్పందాలు భారత రైతులకు, వస్త్ర పరిశ్రమ కార్మికులకు, పాదరక్షల తయారీ పరిశ్రమలకు, విలువైన రత్నాల పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయి.
రష్యా, ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించాలని ట్రంప్ చేసిన ఒత్తిడికి మోదీ ప్రభుత్వం అంగీకరించిందనే విమర్శలు సంఘ్ పరివార్ వర్గాల నుంచే వినిపించాయి.
వాషింగ్టన్లో జరిగిన “న్యూ ఇండియా కాన్ఫరెన్స్”లో రామ్ మాధవ్ ఈ అంశాన్ని ప్రస్తావించడం, ప్రభుత్వంపై పరోక్షంగా మందలింపుగా భావిస్తున్నారు.
మోదీ వ్యక్తిగత రాజకీయ వైఫల్యాలకు, భారత్ మూల్యాన్ని చెల్లిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
భారత్, బీజింగ్‌తో మరింత సాన్నిహిత్యానికి ప్రయత్నిస్తూ వాణిజ్య, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితులను సడలించింది.
దాంతో భారత్‌కు చైనాతో ఉన్న వాణిజ్య లోటు భారీగా 116 బిలియన్ డాలర్లకు చేరిందని పేర్కొంటున్నారు.
అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్‌తో జరిగే యుద్ధం నేపథ్యంలో సాగుతున్న దౌత్య పరిణామాల్లో భారత్ కాకుండా పాకిస్థాన్ కీలక మధ్యవర్తిగా ఎదిగిందని చెబుతున్నారు.
కొందరు దీనిని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద అంతర్జాతీయ సంక్షోభంగా అభివర్ణిస్తున్నారు.
ఆర్థిక వాస్తవాలు, వెలుగులోకి వస్తున్న వివాదాలు..
భారత్ ఆర్థిక అభివృద్ధిలో మోదీ చేసిన ప్రకటనలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. భారత్‌ను ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దామన్న మోదీ ప్రచారాన్ని IMF విడుదల చేసిన తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదిక ఖండించినట్టయింది. ఆ నివేదిక ప్రకారం భారత్ ప్రస్తుతం 6వ స్థానంలో ఉంది.
మోదీకి అతిపెద్ద సవాలుగా మారే అంశం.. మోదీకి మద్దతుగా ఉన్న న్యాయవ్యవస్థ, అనుకూల మీడియా కవచంలో దాగి ఉన్న వివాదాలే మోదీని జయిస్తాయి.
ఎప్స్టీన్ ఫైల్స్ వివాదం నేపథ్యంలో అనిల్ అంబానీ, హర్దీప్ పూరి వంటి ఆయన సన్నిహితుల పేర్లు వెలుగులోకి వచ్చాయని, అంతేకాదు మోదీ పేరు కూడా అందులో ప్రస్తావించబడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో, గతంలో ఆయనకు మద్దతుగా నిలిచిన ఇద్దరు మాజీ మిత్రులు కూడా ఇప్పుడు ఆయన వ్యవహార శైలిపై బహిరంగ విమర్శలు చేయడం పరిస్థితిని మరింత అసౌకర్యకరంగా మార్చింది.
ప్రతీకార న్యాయం అమలయ్యే సమయం నిజంగా వచ్చిందా లేదా అన్నది మాత్రం ఇంకా చూడాల్సి ఉంది.
అనువాదం: జె.నాగేశ్వరరావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
