ఇంగ్లండ్‌లోని ష్రూస్‌బరీలో చార్లెస్ డార్విన్ జన్మించాడు. ఆయనకు చిన్నప్పటి నుంచి చదువు మీద కంటే ప్రకృతి పరిశీలన మీదనే ఎక్కువ శ్రద్ధ ఉండేది.
రకరకాల పురుగులను, పక్షులను, జంతువులను సేకరించి వాటి అలవాట్లను పరిశీలించేవాడు. డాక్టర్ అవ్వమని తండ్రి పంపితే మధ్యలోనే తిరిగి వచ్చాడు.
తండ్రి మందలింపుల బారి నుంచి తప్పించుకోవటానికి, వచ్చిన తర్వాత పాస్టర్ అవుదామన్న ఉద్దేశంతో ఒక బైబిల్ చేతిలో పట్టుకొని 1831లో ‘బీగిల్’ అనే ఒక ఓడ ఎక్కాడు డార్విన్.
కానీ, 1836లో డార్విన్ ఓడ దిగేటప్పటికీ అతను క్రిస్టియన్ మతానికి కొట్టిన దెబ్బకు ఆ మతం గింగిరాలు తిరిగింది.
ఈ ఐదేళ్లలో ఏమి జరిగింది? దక్షిణ పసిఫిక్ సముద్రంలోని ఈక్వెడార్ కోస్తాకు 650 మైళ్ళ దూరంలో ఉన్న గెలాపగోస్ దీవులకు ఆ ఓడ చేరింది.
ఎక్కడా కనిపించని విచిత్ర జీవజాతులు అక్కడ డార్విన్‌కు కనిపించాయి.
ముఖ్యంగా “ఫించెస్” అనబడే పిచ్చుకలను పోలిన పక్షులను, వాటి ముక్కులను పరిశీలించాడు. వాటిల్లో 14 రకాల జాతులు ఉన్నాయని గమనించాడు.
అలాగే తాబేళ్ల కవచాలను, వాటికున్న రకరకాల ఆకారాలను గమనించాడు. ఇన్ని రకాల జీవజాతులు ఎందుకు ఉన్నాయి, ఇంత వైవిధ్యం ఎందుకు ఉన్నది అని దీర్ఘంగా ఆలోచించి, లక్షకు పైగా నమూనాలను సేకరించి వాటిని పరిశోధించి డార్విన్ ఒక ప్రతిపాదన చేశాడు. అదే “న్యాచురల్ సెలక్షన్”(ప్రకృతి ఎంపిక).
లామార్క్ సిద్ధాంతం – ఆగస్ట్ వీస్మాన్ ప్రయోగం..
డార్విన్ కన్నా కాస్త ముందు లామార్క్ అనే ఫ్రెంచి శాస్త్రజ్ఞుడు ఒక జీవజాతి నుంచి మరొక జీవజాతి పరిణామం చెందింది అని దృఢంగా విశ్వసించాడు.
అయితే ఈ పరిణామం ఎలా జరిగి ఉంటుంది? దానికి ఆయన ఇలా చెప్పాడు.. లామార్క్ రోజుల్లో జిరాఫీ అనే జంతువు కొత్తగా యూరోపియన్లకు తెలిసింది. దానికి అంత పొడుగు మెడ, పొడుగు కాళ్లు ఎలా వచ్చాయి? జిరాఫీ అనే జంతువు చెట్టు కింది కొమ్మలపై నున్న ఆకులు అయిపోగా, పైకొమ్మల ఆకులను అందుకోవటానికి రోజూ మెడ బాగా చాచి ఉంటుంది.
తర్వాత ఇంకా పై కొమ్మల ఆకులను అందుకోవటానికి కాళ్ళను, మెడను ఇంకా చాచి ఉంటుంది.
కొన్ని వందల సంవత్సరాలలో అది సాగి పొడవాటి మెడ అయి ఉంటుంది అని చెప్పాడు.
అంటే, మన శరీరంలోని ఏదైనా భాగాన్ని ఎక్కువగా వాడితే ఆ భాగం బాగా అభివృద్ధి అవుతుందని ఆయన భావన.
దీనిని పరీక్షించటానికి “ఆగస్ట్ వీస్మాన్” అనే శాస్త్రవేత్త ఆడ, మగ ఎలుకలను తెచ్చి వాటి తోకలు కోసి, వాటి మధ్య సంపర్కం ద్వారా పుట్టే ఎలుకలకు తోకలు లేకుండా ఉన్నాయా అని పరిశీలించాడు.
కానీ వాటి తోకలు మామూలుగా పొడుగ్గానే ఉన్నాయి. మళ్లీ వాటి తోకలను కోశాడు. వాటి మధ్య సంపర్కం ద్వారా తోకలు లేకుండా ఏమైనా పుట్టాయా అని పరిశీలించాడు.
మళ్లీ వాటికి పొడవైన తోకలే ఉన్నాయి. ఇలా దాదాపు 25 తరాల ఎలుకల తోకలను కత్తిరించి చూశాడు. ఎలాంటి మార్పు లేదు, పొడవైన తోకలతోనే పుట్టాయి.
ఎన్ని తరాలు గడిచినా తోకలు లేని ఎలుకలు ఉత్పన్నం కావని అతడు చేసిన ప్రయోగం వల్ల నిర్ధారణకు వచ్చాడు.
అంటే ఒక జంతువు తన జీవితకాలంలో పరిసరాల అవసరాన్ని బట్టి పొందిన మార్పులు దాని సంతానానికి సంక్రమిస్తాయి అన్నది తప్పు అని తేలింది.
మనం “జిమ్”కు వెళ్లి కండలు పెంచినంత మాత్రాన అవి మన బిడ్డలకు రావాలని లేదు కదా! అలాంటప్పుడు మరి డార్విన్ చెప్పిన న్యాచురల్ సెలక్షన్ ఏంటి? వివరంగా చూద్దాం.
‘ప్రకృతి ఎంపిక’ అంటే ఏమిటి?..
న్యాచురల్ సెలక్షన్ అంటే- ఒక జీవి తన తల్లిదండ్రుల్లాగా కాకుండా భిన్నంగా లేదా కొత్త రకంగా ఉంటే, ఆ జీవి తన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోగలిగితే అది బతికి బట్టకడుతుంది.
వాతావరణానికి తట్టుకోలేకపోతే అది చచ్చిపోతుంది.
అంటే తల్లిదండ్రులకు భిన్నంగా ఉండే బిడ్డ పుడితే, ఆ పుట్టిన బిడ్డ తన చుట్టూ ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకునే లక్షణాలను పొంది ఉంటే, పొంది ఉన్న ఆ లక్షణాలను తిరిగి తన సంతానంలో చూపించగలిగితే అప్పుడు ఎవల్యూషన్లో భాగమైనట్లు.
సంతానాన్ని కనకపోతే ఆ మార్పులు ఏవైనా ఉంటే ఆ తరంతోనే అంతమైపోతుంది.
మార్పులు రావాలి, వచ్చిన మార్పులు ఉపయోగకరమైనదిగా ఉండాలి, ఆ ఉపయోగకరమైన మార్పులు తిరిగి తన సంతానంలో చూపగలగాలి.
అలా వచ్చిన మార్పుల కారణంగానే ఈ ప్రపంచంలో ఇన్ని లక్షల జీవజాతులు, ఇంత వైవిధ్యం ఏర్పడిందని డార్విన్ ప్రతిపాదించాడు.
చుట్టుపక్కల పరిసరాలతో, వాతావరణంతో సర్దుకుపోయే లక్షణం ఎక్కువగా ఉన్న ప్రాణులు జీవన సంఘర్షణలో నిలదొక్కుకుంటాయి. అలా లేనివి క్రమేపీ కనుమరుగవుతాయి.
ఉదాహరణకు ఒక పచ్చిక బయలులో పురుగులు ఉన్నాయి అనుకుందాం. ఆ పురుగుల్ని పక్షులు తింటాయి.
అయితే పచ్చిక రంగుతో కలిసిపోయే రంగు కలిగిన పురుగులు పక్షుల నుంచి తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
పచ్చికతో కలిసిపోలేని రంగు గల పురుగులు కాలక్రమంలో క్షీణించి అంతరించిపోతాయి.
వేగంగా పరిగెత్తగల జింకలు క్రూర మృగాల నుంచి ఎక్కువగా తప్పించుకోగలుగుతాయి. కనుక కొన్ని తరాల అనంతరం వేగంగా పరిగెత్తగల జింకలు మిగిలి ఉంటాయి. అలా లేనివి అంతరించిపోతాయి.
మరో ఉదాహరణ- ధ్రువ ప్రాంతంలో ఉండే ఎలుగుబంట్ల పిల్లల్లో దేనికైనా శరీరం మీద రోమ సంపద లేకపోతే అది దక్కదు.
రోమ సంపద కలిగిన ఎలుగుబంట్లు వాతావరణాన్ని ఎదుర్కొని నిలబడి తన సంతానాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాయి.
అలాగే పెద్ద తోకగలిగిన మగ నెమలి ఆడ నెమళ్లను ఆకర్షించి సంతానోత్పత్తి సాధిస్తుంది.
అలాకాకుండా అందంగా పురి విప్పలేని మగ నెమలి, ఆడ నెమళ్లను ఆకర్షించలేదు. అలా ఆకర్షించలేకపోతే దాని సంతానాభివృద్ధి తగ్గిపోతుంది. కాలక్రమంలో ఆ జాతి అంతరించిపోతుంది.
ఏ విధమైన శరీర నిర్మాణం జీవి మనుగడకు సహాయకరంగా ఉంటుందో ఆ విధమైన శరీర నిర్మాణాన్ని ప్రకృతి ఇంకా ఇంకా ప్రోత్సహిస్తుంది.
సహాయకరమైన లక్షణాలతో జన్మించిన వాటినే ప్రకృతి “సెలెక్ట్” చేసి కొనసాగిస్తుంది. డార్విన్ చెప్పిన న్యాచురల్ సెలక్షన్ సారాంశం ఇదే.
దీని ప్రకారం జిరాఫీ పరిణామ క్రమాన్ని ఇలా ఊహించవచ్చు. చెట్ల ఆకులను తిని జీవించే జింకలను పోలిన జంతువులలో కొన్నింటికి మిగిలిన వాటికన్నా పొడవైన మెడలు, పొడవాటి కాళ్లు ఉండేవి అనుకోండి.
వాటికి ఎక్కువ ఆకులు అందటం వల్ల అవి ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది. వాటికి ఎక్కువ సంతానం కలిగేది. తిరిగి ఆ సంతానంలో ఎక్కువ పొడుగు మెడలు, పొడుగు కాళ్లు కలిగినవి చెట్టు పై కొమ్మల నుంచి ఆకులను అందుకోగలిగి, ఎక్కువ కాలం జీవించి ఎక్కువ సంతానాన్ని కనేవి.
ఇలాగ చెట్ల ఆకులను అందుకోవటంలో ఎక్కువ సమర్థత కలిగిన జంతువులు వృద్ధి చెందడం వల్ల సుదీర్ఘకాలం, అసంఖ్యాక తరాలు గడిచిన తర్వాత నేటి జిరాఫీ అవతరించింది.
మనుగడ కోసం పోరాటం..
డార్విన్ చెప్పిన మరో అంశం ఏమంటే, చెట్లు కానివ్వండి, జంతువులు కానీ వాటి మానాన వాటిని వదిలేస్తే అదేపనిగా సంతానాన్ని అభివృద్ధి చేస్తూ పోతాయి.
ఏదో విధంగా ఎక్కువ భాగం నశించకపోతే వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.
అయితే భూమ్మీద నివసించడానికి ఆధారం, ఆహారం పరిమితంగా ఉంటాయి. అందువల్ల ఒకే జీవజాతికి చెందిన ప్రాణులు కానీ, భిన్న జాతులకు చెందిన ప్రాణులు కానీ స్థలం కొరకు, ఆహారం కొరకు పరస్పరం సంఘర్షిస్తాయి. ఆ సంఘర్షణలో అత్యధిక భాగం నశిస్తాయి.
కొన్ని వాతావరణంలోని మార్పులకు తట్టుకోలేక చనిపోతాయి. కొన్ని ఇతర జంతువులకు ఆహారమై నశిస్తాయి.
మిగిలినవి తమలో తాము ఆహారం కొరకు ఘర్షణ పడి నశిస్తాయి. ఒక జాతి జంతువులు ఒకరకం ఆహారానికి అలవాటు పడి ఉంటాయి కదా.
ఆ రకం ఆహారం అనంతంగా దొరకదు కనుక అవి తమలో తాము ఆహారం కై పోటీపడి చనిపోతాయి.
అంటే తిరిగి సంతానోత్పత్తి చేయకముందే నశిస్తాయి. ఈ పోటీలో జీవన సంఘర్షణలో మనుగడకు అర్హమైన శారీరిక లక్షణాలు కలిగినవే బతుకుతాయి. సంతానోత్పత్తి చేస్తాయి. అలా చేయలేనివి అంతరించిపోతాయి.
ఉదాహరణకు స్టార్ ఫిష్ ఏడాదికి 10 లక్షల గుడ్లు పెడుతుంది. కాడ్ చేప ఏటా 60 లక్షల గుడ్లు పెడుతుంది.
ఒక ఆయిస్టర్ చేప 11 కోట్ల గుడ్లు పెడుతుంది. కుందేలు ఏటా 70 పిల్లలను కంటుంది. ఒక రకం కప్ప ఏడాదికి 20 వేల గుడ్లు పెడుతుంది.
మరో రకం కప్ప ఏడాదికి వెయ్యి గుడ్లు పెడుతుంది. ఇవన్నీ బతికి బట్టకడితే ఈ భూమండలం చాలుతుందా? ఏనుగు సగటున ఆరు పిల్లల్ని కంటుంది.
ఎంత తక్కువ సంతానం కనే జంతువులను తీసుకున్నా సరే, అన్నీ బతికి బట్ట కడితే వాటికి స్థలంగానీ, ఆహారం కానీ చాలదు.
డార్విన్ను ప్రభావితం చేసిన మాల్తస్ జనాభా సిద్ధాంతం..
మానవజాతిలో జనసంఖ్య ఆహారోత్పత్తిని మించి పెరుగుతూ ఉంటుంది. ఆహార ఉత్పత్తి అర్థమెటిక్(అంకగణిత) క్రమంలో పెరుగుతుంటే, జనాభా జామెట్రిక్ (రేఖాగణిత) క్రమంలో పెరుగుతుంది.
అంటే ఆహార ఉత్పత్తి 1, 2, 3, 4, 5 ఇలా పెరుగుతుంది. జనాభా 1, 2, 4, 8, 16 ఇలా పెరుగుతుంది.
ఇందువల్ల అప్పుడప్పుడు ఘోరమైన క్షామాలు, భయంకర వ్యాధులు, దారుణ యుద్ధాలు, భూకంపాలు మొదలైనవి సంభవించి కొంత జనాభా నశించటం, దానితో ఆహారం, జనాభా ఒక సమతుల్యతకు రావటం జరుగుతుందని మాల్తస్ ప్రతిపాదించాడు.
ఆయన ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం కూడా డార్విన్ అభిప్రాయాలను ప్రభావితం చేసింది.
ప్రతి ప్రాణి జంతువు కానీ, వృక్షం కానీ తన శారీరక లక్షణాలని తన సంతానానికి సంక్రమింపచేస్తుంది. లేకపోతే ఆ జాతి కొనసాగదు.
కుక్కకు కుక్కే పుడుతుంది. కుక్కకు పుట్టే పిల్లల్లో స్వల్పమైన భేదాలు ఉంటాయి.
సృష్టిలో ఏ ఒక్క ప్రాణి మరొకదాన్ని అచ్చుగుద్దినట్లు పోలి ఉండదు. అలా పోలి ఉంటే ఒక జాతి నుంచి మరొక జాతి ఆవిర్భవించే పరిణామమే జరగదు. ఒక తల్లికి పుట్టిన సంతానంలో స్వల్పమైన తేడాలు ఉంటాయి.
ఈ తేడాలలో కొన్ని మనుగడకు సహాయకారిగా ఉంటాయి. మరికొన్ని హానికరమైనవి ఉంటాయి. హానికరమైన తేడాలు కలిగినవి నశించిపోతాయి. సహాయకరమైన తేడాలు కలిగినవి బతుకుతాయి.
అంతేకాక ఇవి సంతానోత్పత్తి చేసి తమ సహాయకరమైన తేడాలను తమ సంతానానికి అందిస్తాయి.
ఈ సంతానం మళ్లీ సహాయకరమైన, హానికరమైన తేడాలతో జన్మిస్తాయి. అందులో మళ్లీ సహాయకరమైన తేడాలు గలవే బతికి సంతానాన్ని కంటాయి.
ఇలా తరం నుంచి తరానికి ఒక జీవజాతి మార్పులు చెందుతూ కొనసాగుతూ ఉంటుంది.
అనేక తరాలు గడిచేసరికి మొదటి జంతువుకు చిట్టచివరి జంతువుకు ఎంతో తేడా కనిపిస్తుంది. కొన్ని లక్షల ఏండ్లు గడిచేసరికి ఒక కొత్త జాతి అవతరిస్తుంది.
అరిస్టాటిల్ వర్గీకరణకు, డార్విన్ సిద్ధాంతానికి ఉన్న తేడా..
గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ చిన్న కీటకాల నుంచి మొదలుపెట్టి కోతుల వరకు, కోతుల నుంచి మనిషి వరకు తనకు కనిపించిన జీవజాతులన్నింటినీ వరుసగా పేర్చి దీనికన్నా ఇది ఉన్నతమైనది, దీనికన్నా ఇది మరింత అభివృద్ధి చెందింది అని వర్గీకరించాడు.
అరిస్టాటిల్ అలా చెబితే డార్విన్ ఏమి చెప్పాడు? దీనికన్నా ఇది అడ్వాన్స్డ్, దీనికన్నా ఇది మోర్ అడ్వాన్స్డ్ అని చెప్పలా.
ఇవన్నీ కనెక్టెడ్ అని చెప్పాడు. చిన్న కీటకం నుంచి మనిషి దాకా ఒక గీత గీశాడు. అరిస్టాటిల్ జీవజాతులను నిచ్చెన మెట్ల మీద పెడితే, నిచ్చెన కింద నుంచి పై దాకా ఒకే లైన్ అన్నాడు డార్విన్.
అంటే దాని అర్థం ఇప్పుడున్న జీవజాతులన్నీ కూడా ఒక జీవి నుంచి ఆవిర్భవించినవే. కానీ ఒకేరోజు పుట్టలేదు.
కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో ఇన్ని రకాల జీవాలు పుట్టాయి. వాటిలో పరిసరాలకు అనుగుణ్యంగా ఉన్నవి బతికి ఉన్నాయి.
అలా తట్టుకోలేనివి అంతరించిపోయాయి. డార్విన్ ఒక ప్రక్రియను ప్రతిపాదించాడు. ఆ పరిణామ ప్రక్రియ ఏమంటే న్యాచురల్ సెలక్షన్.
వాలెస్ పరిశోధన… ‘ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్’ ప్రచురణ..
ఈ విషయాలన్నింటినీ డార్విన్ ఒక నోట్స్‌గా తయారు చేస్తున్నప్పుడు 1855లో ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ అనే శాస్త్రవేత్త “నూతన జాతుల ఆవిర్భావానికి ఆధార సూత్రాలు” అనే శీర్షికన ఒక వ్యాసం రాశాడు.
దానిలోని భావాలు సరిగ్గా డార్విన్ సిద్ధాంతాన్ని పోలి ఉన్నాయి.
డార్విన్ మిత్రులు “మీకు రావలసిన ఘనత మరొకరికి పోవచ్చు వెంటనే మీ గ్రంథం ప్రచురించండి” అని ఒత్తిడి చేశారు.
డార్విన్‌కు ధైర్యం చాలక ఇంకా కొత్త సాక్ష్యాలను సేకరిస్తూనే గడిపాడు.
1858 అంటే మూడేళ్ల తర్వాత ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ మరొక వ్యాసం రాసి డార్విన్‌కి పంపుతూ- “మీరు దక్షిణ పసిఫిక్ సముద్ర ప్రాంతంలోనూ, గెలాపగోస్ దీవులలో పరిశోధన చేశారు కదా, నేను సింగపూర్, మలేషియా ప్రాంతంలో తిరిగి పరిశీలన చేశాను నాకు ఇలా అనిపించింది. నా ఈ భావాలను పరిశీలించాల్సింది”గా డార్విన్ను కోరాడు.
ఆ వ్యాసాన్ని పరిశీలించిన డార్విన్ తాను 20 ఏళ్లు కష్టపడి రాసిన దానికి సంగ్రహ రూపం వలె ఉన్నట్లు అనిపించింది. వెంటనే తన గ్రంథాన్ని ప్రచురించాడు డార్విన్. అదే “జీవజాతుల పుట్టుక”. తాను ఏ సిద్ధాంతాన్ని స్వతంత్రంగా పరిశోధించి రూపొందించాడో, తనకన్నా చిన్నవాడైన ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ కూడా స్వతంత్రంగా ఆలోచించి రూపొందించాడు. అందుచేత ఆ ఘనత తమ ఇద్దరికీ సమానంగా చెందాలని భావించి తన గ్రంథాన్ని, అలాగే వాలెస్ అభిప్రాయాలను పరిశీలించమని 1858లో లండన్‌లోని లిన్నేయన్ సొసైటీకి సమర్పించాడు డార్విన్. అది డార్విన్ గొప్ప ఉదాత్తత.
డార్విన్ సిద్ధాంతంతో చర్చికి వణుకు..
డార్విన్ పరిశోధనా ఫలితాలు మేధావులకు, ప్రజలకు అందడంతో క్రిస్టియన్ చర్చి తట్టుకోలేకపోయింది. ఎందుకు? డార్విన్ చెప్పిన పరిణామ క్రమం అంతా బైబిల్ ప్రకారం 6500 సంవత్సరాల లోపు జరగాలి. బైబిల్లోని “జెనెసిస్” అనే కథలోని వర్ణనను బట్టి ప్రభువు ఆరు రోజులు కష్టపడి విశ్వాన్ని, భూమిని, సూర్యుని, చంద్రుని, చెట్టు చేమలను, నదులను, సరస్సులు, సముద్రాలను, పశుపక్షాదులను, మనుషులను సృష్టించి ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడు.
ఐరిష్ మత గురువు బిషప్ ఉషర్ అనే ఆయన ఇంకా కచ్చితంగా లెక్కలు గట్టి క్రీస్తుపూర్వం 4004లో అక్టోబర్ 9వ తారీఖున ఈ సృష్టి కార్యక్రమం ప్రారంభమైందని తేల్చాడు.
కానీ ఆ కాలంలోనే ఉన్న భూగర్భ శాస్త్రవేత్తలైన “హట్టన్”, “లయల్” లాంటివాళ్లు ఈ భూమి ఉపరితలం పొరలు పొరలుగా ఉందని, అన్నింటి కంటే పై పొర ఇటీవల కాలంలో ఏర్పడిందని, దాని కింది పొర అంతకుముందు ఏర్పడిందని, తిరిగి దాని కింద పొర ఇంకా పూర్వం ఏర్పడిందని, అట్టడుగున ఉన్నది అత్యంత ప్రాచీన కాలంలో ఏర్పడిందని, ప్రతి రాతి పొర 10 లక్షల సంవత్సరాల వయసును సూచిస్తుందని తేల్చారు.
అందువల్ల భూమి వయస్సు కొన్ని వందలు, వేల యేండ్లు కాక, కొన్ని కోట్ల సంవత్సరాలని వారు నిర్ధారించారు. ఈ ఇద్దరి శాస్త్రవేత్తల పరిశోధనలు వాస్తవానికి డార్విన్ను గొప్పగా ప్రభావితం చేసిన రచనలు.
కానీ క్రిస్టియన్ చర్చికి ఆ రోజుల్లో చాలా పవర్ ఉండేది. గెలీలియోను జైల్లో పెట్టి అప్పటికి 200 ఏండ్లు అయింది. గియోర్డానో బ్రూనోను హత్య చేసి 225 ఏండ్లు అయింది. చర్చి ఆగడాలు తట్టుకోవడానికి చాలా శ్రమ పడవలసి వచ్చింది డార్విన్‌కు, డార్విన్ అనుయాయులకు. డార్విన్ ఎవరితో పేచీ పెట్టుకోలేదు కానీ వాస్తవాల ఆధారంగా క్రిస్టియన్ మతాన్ని, మత నమ్మకాలను ఎంతో సైలెంట్‌గా చంపేశాడు.
కేవలం బైబిల్ మాత్రమే కాదు అన్ని మతాలు, మత గ్రంథాలు మేము ప్రత్యేకమైన జాతికి చెందిన వారమని చెప్పుకుంటాయి. మనదేశంలో కొంతమంది మేము ఆర్యులము అందరికన్నా శ్రేష్ఠులమని చెప్పుకోవడం మనం చూస్తున్నాం కదా. అలానే యూదులు మేము సెలెక్టివ్ పీపుల్ అని చెప్పుకోరా! అలాగే ప్రతి జాతికి ప్రాథమిక దశలో అహంకారం ఉంటుంది మేమే గొప్ప వాళ్ళం మమ్ములను ఎదిరించే వారే లేరు అని. అన్నీ మానించే నేర్చుకోవాలి అని కొందరు జాతి గర్వంతో విర్రవీగుతూ ఉండటం చూస్తాం.
సృష్టివాదంలోని డొల్లతనం… సైన్స్ అమరవీరులు..
ప్రభువు మొదట వెలుగు కమ్మన్నాడు. తర్వాత భూమి ఆకాశాన్ని సృష్టించాడు. చెట్లు చేమలను, పశుపక్షాదులను సృష్టించాడు. ఆదామును సృష్టించాడు. నాలుగవ రోజున సూర్యుని సృష్టించాడు.
మరి సూర్యుడు నాలుగో రోజున సృష్టించబడితే అంతకు ముందు వరకు రోజులు ఎలా లెక్క పెట్టారు? సూర్యుడు ఉంటేనే కదా రోజు వచ్చేది. మరి ఆయన నాలుగో రోజు వరకు రాలేదు. మరి అంతకుముందు రోజుల్ని ఎలా లెక్క పెట్టారు? పాము(సైతాన్) కేమో మాటలొచ్చు, ఆపిల్(జ్ఞానఫలం)ను తినమన్నది కదా ఆదాము, అవ్వలను.
పాముకు అంతకుముందు కాళ్ళుండేవా? ఉంటే మరి అవి ఎక్కడికి పోయాయి? ఇలాంటి ప్రశ్నలను డార్విన్ పరిశోధనా ఫలితాలతో సంధించడం మొదలుపెట్టారు జనం.
ఆదామును సృష్టించి ఆయనకు మత్తు కలిగించి ఆయన పక్కటెముకను విరిచి దాని నుంచి స్త్రీని సృష్టించాడు ప్రభువు. నరుడి నుంచి వచ్చింది కనుక నారీ అయిందని బైబిలు చెబుతుంది.
ఆండ్రియాస్ వెసాలియస్ అనే శాస్త్రవేత్త దీనిని పరిశీలించదలచి మగ, ఆడ శవాలను కోసి చూశాడు. మగవాడి పక్కటెముక ఒకదానిని తొలగిస్తే, ఒక పక్కటెముక తక్కువ ఉండాలి కదా అని. కానీ ఇద్దరికీ సమానంగానే ఉన్నాయి. ఇది చర్చికి మరింత కోపం తెప్పించింది.
బైబిల్ చెప్పింది తప్పు అయిందిగా. దానితో వెసాలియస్ను పడవ ప్రమాదంలో చనిపోయేట్టు చేసింది చర్చి, దాని మతాధికారులు.
గియోర్డానో బ్రూనో అనే ఆయన ఆకాశాన్ని పరిశీలించి, ఈ విశ్వం అనంతం అన్నాడు. ఇలాంటి విశ్వాలు చాలా ఉండొచ్చు అన్నాడు. అలా అన్నందుకు బ్రూనో చర్చి ఆగ్రహానికి బలి అయ్యాడు.
ఎందుకంటే విశ్వం అనంతమైతే దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉండి ఈ విశ్వాన్ని సృష్టించాడు? ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఈ విశ్వంలోనే ఉండి సృష్టించ లేడుగా. విశ్వం బయట ఉండి సృష్టించాలి. విశ్వం అనంతమైనప్పుడు బయట అనేది లేదు. ఇలా అన్నందుకు బ్రూనోను క్షమాపణ అడగమంది చర్చి. బ్రూనో అన్నది అబద్ధం అని చెప్పమంది.
“ముమ్మాటికీ నేను చెప్పింది సత్యం” అన్నాడు బ్రూనో. బైబిల్‌కి విరుద్ధంగా చెప్పినందుకు బ్రూనోను గుంజకు కట్టివేసి చుట్టూ మంట పెట్టి ఇప్పటికైనా తను చెప్పింది తప్పు అని ఒప్పుకోమనీ బలవంతం చేశారు.
బ్రూనో వాళ్ల కళ్ళల్లోకి కళ్ళు పెట్టి “శిక్ష విధించబడిన నాకంటే శిక్ష వేస్తున్న మీకే భయం ఎక్కువగా ఉంది” అన్నాడు. అంత మాట అంటావా అని నాలుక కోసి మరీ నిప్పుల్లో కాల్చి చంపారు. తను నమ్మిన దానిని తను చనిపోయే వరకు ఎక్కడా రాజీ పడలేదు బ్రూనో.
అంటే బైబిల్లో ఉన్న దాన్ని ప్రశ్నించినందుకు చంపేస్తున్నారు, వెలివేస్తున్నారు. ఇది ఒక క్రిస్టియన్ మతమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు విజ్ఞాన శాస్త్రాన్ని నిరోధించడానికే ప్రయత్నించాయి.
ఇలాంటి సాంప్రదాయం రాజ్యమేలుతున్న రోజుల్లో డార్విన్ తన సిద్ధాంతాన్ని వైజ్ఞానిక లోకానికి అందించాడు. ఈనాడు ఆయన సిద్ధాంతాన్ని ప్రపంచ శాస్త్రజ్ఞులు శిరోధార్యంగా గౌరవిస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
