బెంగాల్, అస్సాంలలో బీజేపీ చెప్పుకోదగ్గ విజయాలు సాధించినప్పటికీ, ప్రతిపక్ష రాజకీయాలకు బలమైన కోటలుగా ఉన్న తమిళనాడు, కేరళలలో మాత్రం ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది.
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికలు భారత రాజకీయాల్లో ఒక కీలకమైన మలుపును సూచిస్తున్నాయి.
ఇవి కేవలం సాధారణ ఎన్నికలు మాత్రమే కాదు; భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకత్వంలో బహుళ సంఖ్యాకవాద(మెజారిటేరియన్) రాజకీయ వ్యవస్థ బలోపేతం అవుతోందని సూచించే పరిణామాలుగా కూడా కనిపిస్తున్నాయి.
జాతీయ రాజకీయాల్లో లోతైన భావజాల మార్పు..
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) ఎదుర్కొన్న పరాజయాలు కేవలం శక్తివంతమైన ప్రాంతీయ పార్టీలకు తగిలిన ఎదురుదెబ్బలు మాత్రమే కాదు; జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో భారత రాజకీయాలను పునర్నిర్మిస్తున్న ఒక లోతైన భావజాల మార్పుకు కూడా ఇవి నిదర్శనాలు.
బీజేపీ ఇప్పుడు భారతదేశం అంతటా ఒక నిర్మాణాత్మక రాజకీయ ఆధిపత్యాన్ని నెలకొల్పింది. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా, ఉత్తర, తూర్పు, పశ్చిమ ప్రాంతాలన్నింటిలోనూ దాని ప్రభావం విస్తరించింది.
ముఖ్యంగా అస్సాం, ఒడిశా, బెంగాల్‌లలో ఆ పార్టీ విస్తరించడంతో, తూర్పు భారతదేశం బీజేపీ అధికారానికి ఒక ముఖ్యమైన పునాదిగా మారింది.
హిందూ ఓటు బ్యాంకు ఏకీకరణ – పోలరైజేషన్ వ్యూహం..
ఈ ఆధిపత్యం హిందూ ఓటు బ్యాంకును భారీ స్థాయిలో ఏకీకృతం చేయడంపై ఆధారపడి ఉంది. కేవలం ప్రభుత్వ వ్యతిరేకత(యాంటీ-ఇంకంబెన్సీ), సంక్షేమ పథకాలు లేదా మహిళల మద్దతు వంటి సాంప్రదాయ కారణాలతో మాత్రమే దీనిని పూర్తిగా వివరించలేము.
ముస్లింలపై అనుమానం, అభద్రతాభావం పెంచే ప్రచారాలు, వారిని వేరుగా చూపించే రాజకీయాల ద్వారా బీజేపీ హిందూ ఓటర్లను తనవైపు సమీకరించుకుంది.
దక్షిణాది రాష్ట్రాలు మినహా, చాలా రాష్ట్రాల్లో సగానికి పైగా హిందూ ఓటర్లను తన వైపుకు తిప్పుకోవడంలో బీజేపీ విజయం సాధించింది.
ఈ పరిస్థితి అస్సాం, బెంగాల్‌లలో చాలా స్పష్టంగా కనిపించింది. అక్కడ మతపరమైన విభజనే బీజేపీ ఎన్నికల ప్రచారానికి కేంద్ర బిందువుగా మారింది.
పాలనా వైఫల్యాలు, నిరుద్యోగం, వలసలు, అవినీతి, హింస వంటి దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ హిందూ మెజారిటీ కోణంలోనే చూపించారు. ఈ ప్రచారంలో “చొరబాటుదారులు”, “అక్రమ చొరబాట్లు” అనే అంశాలే ఎన్నికల ముఖ్యాంశాలుగా మారాయి.
సంస్థాగత అధికారాల వినియోగం – పారదర్శకతపై ఆందోళనలు..
అదే సమయంలో ఎన్నికల సంఘం, ఇతర ప్రభుత్వ సంస్థలతో సహా సంస్థాగత అధికారాన్ని బీజేపీ విస్తృతంగా వినియోగించడం ఎన్నికల ప్రక్రియను, వాటి ఫలితాలను రెండిటినీ ప్రభావితం చేసింది.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ, పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు, నియోజకవర్గాల పునర్విభజన వంటి చర్యలు ఈ వివాదాస్పద ధోరణిని మరింత బలపరిచాయి.
ఈ ఎన్నికలు, ఎన్నికల పారదర్శకతపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తించాయి. బెంగాల్లో సుమారు 27 లక్షల మంది ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తొలగించబడ్డాయని చెప్పబడుతున్న నేపథ్యంలో, ప్రజాస్వామ్య మూల సూత్రాలపై జరిగిన ఈ తీవ్రమైన దాడి పట్ల సుప్రీంకోర్టు ఉదాసీన వైఖరిని అవలంబించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘ఏకాభిప్రాయం’ నుంచి ‘మెజారిటీ వాదం’ వైపు..
మొత్తంమీద, బెంగాల్ ఒక్కటే వేరుగా లేదు. భారత రాజకీయాల్లో వస్తున్న విస్తృతమైన మార్పుకు ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. ఇది కేవలం ఒకే పార్టీ ఆధిపత్యాన్ని మాత్రమే కాదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఒంటరిగా పాలించిందో, దానికి పూర్తిగా భిన్నంగా ఇప్పుడు ఒక తీవ్ర మితవాద(రైట్ వింగ్) కూటమి ఆధ్వర్యంలో ఈ మార్పు జరుగుతోంది.
ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త రజ్నీ కొఠారి కాంగ్రెస్‌ను ఒకప్పుడు “ఏకాభిప్రాయ పార్టీ”గా అభివర్ణించారు. విభిన్న సైద్ధాంతిక, సామాజిక, ఆర్థిక వర్గాల ప్రయోజనాలను తనలో కలుపుకొని ముందుకు సాగిన పార్టీగా ఆయన దానిని వివరించారు.
అయితే కాంగ్రెస్‌కు భిన్నంగా, బీజేపీ గత దశాబ్ద కాలంలో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఒక మెజారిటీ వాద రాజకీయ కూటమిని నిర్మించగలిగింది. ముస్లిం వ్యతిరేక రాజకీయాలను కేంద్రంగా చేసుకున్న భావజాల చట్రంలో, ప్రజల గుర్తింపులను ఒకే విధంగా మలచడం ద్వారా ఈ కూటమి మరింత బలోపేతమైంది.
ఈ పరిణామానికి మూలాలు 2014 వరకూ వెళ్తాయి. అప్పట్లో చాలా మంది విశ్లేషకులు ఆ విజయాన్ని ప్రధానంగా అభివృద్ధి (“అచ్ఛే దిన్”), ప్రభుత్వ వ్యతిరేకత(యాంటీ-ఇంకంబెన్సీ), అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణల కోణంలోనే చూశారు.
కానీ వెనక్కి తిరిగి చూస్తే, 2014 కేవలం ఎన్నికల విజయం మాత్రమే కాదు, అది ఒక లోతైన భావజాల మార్పుకు ప్రారంభం అయింది.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సాధించిన విజయం కేవలం ఎన్నికల విజయమే కాదు, అది భారతీయ రాజకీయాలలో ఒక విస్తృతమైన పునర్నిర్మాణానికి నాంది పలికింది.
ప్రముఖ రాజకీయ పరిశోధకులు, V-Demవంటి సంస్థలు పేర్కొన్నట్లుగా, దేశంలో కేవలం ‘ఎన్నికల ప్రజాస్వామ్యం’ నుంచి ‘ఎన్నికల నియంతృత్వం’ వైపు మాత్రమే మార్పు జరగలేదు, అంతకంటే ఎక్కువగా ఒక ‘మెజారిటీ వాద ప్రజాస్వామ్యం’ వైపు పరిణామం చెందింది.
ఇందులో దేశంలోని మెజారిటీ సమాజమే క్రమంగా ఆ రాజ్య వ్యవస్థకు రాజకీయ పునాదిగా మారుతోంది.
పశ్చిమ బెంగాల్లో సాధించిన విజయంపై, “పశ్చిమ బెంగాల్ విజయం చాలా కీలకమైనది, ఎందుకంటే వందేళ్ల సైద్ధాంతిక కొనసాగింపు తర్వాత, ఇప్పుడు గంగోత్రి నుంచి గంగా సాగర్ వరకు ప్రతి రాష్ట్రంలో మా ప్రభుత్వాలు ఉన్నాయి” అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
బెంగాల్ వంటి రాష్ట్రాల్లోని అత్యధిక శాతం ఓటర్లు బహిరంగంగా మతతత్వ రాజకీయాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండటం చూస్తుంటే, ఈ మార్పు కేవలం ఎన్నికల పరమైనది మాత్రమే కాదు. సామాజిక, భావజాల పరమైనది కూడా అని స్పష్టమవుతోంది.
ఎన్నికల ఆధిక్యత, సంస్థాగత అధికారం, సైద్ధాంతిక బలోపేతం ఇవన్నీ పరస్పరం ఒకదానికొకటి తోడవుతూ మరింత పటిష్టంగా మారుతున్నాయి.
ప్రాంతీయ పార్టీల వైఫల్యం – ప్రతిపక్షాల బలహీనత..
నిజానికి ఈ కొత్త రాజకీయ వాస్తవాన్ని అర్ధం చేసుకోవడంలో ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయి. అవి ఇప్పటికీ బీజేపీని కేవలం ఎన్నికల పనితీరు, వ్యవస్థల దుర్వినియోగం అనే కోణంలోనే చూస్తున్నాయి. కానీ ఆ పార్టీకి సమాజంలో ఉన్న లోతైన మద్దతును అవి తక్కువగా అంచనా వేస్తున్నాయి.
తమ సొంత రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బీజేపీని నిలువరించగలవు అనే నమ్మకం ఇప్పుడు తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తుంది.
బెంగాల్లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే, బీహార్‌లో రాష్ట్రీయ జనతా దళ్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కొన్న పరాజయాలు శక్తివంతమైన ప్రాంతీయ పార్టీల బలహీనతలను బయటపెట్టాయి. మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలోని ప్రముఖ నాయకులైన మమతా బెనర్జీ, ఎంకె స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్ ముగ్గురూ తమ స్థానాలను కోల్పోవడం మరింత ఆశ్చర్యకరమైన అంశం.
ప్రతిపక్షం బలహీనపడటానికి కారణం బీజేపీకి ఉన్న అసాధారణమైన నిర్మాణాత్మక ఆధిక్యతలు. అపారమైన ఆర్థిక వనరులు, శక్తివంతమైన ఎన్నికల యంత్రాంగం, మీడియాపై ఆధిపత్యం, అలాగే కీలక ప్రభుత్వ సంస్థలపై సంపూర్ణ నియంత్రణ దీనికి కారణాలుగా ఉన్నాయి.
ప్రత్యామ్నాయ భావజాలం లేమి – కాంగ్రెస్ ముందున్న సవాళ్లు..
కానీ కేవలం ఈ నిర్మాణాత్మక అసమానతలు మాత్రమే ప్రతిపక్షాల బలహీనతను పూర్తిగా వివరించలేవు. అంతే ముఖ్యమైన ఇంకో విషయం ఏమిటంటే, చాలా ప్రాంతీయ పార్టీలు ప్రజలను ఆకర్షించే బలమైన ప్రత్యామ్నాయ సైద్ధాంతిక దృక్పథాన్ని అందించలేకపోయాయి.
ఒకప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడంలో ఎంత సమర్థంగా వ్యవహరించాయో, ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవడంలో అంతగా విజయవంతం కాలేకపోతున్నాయి.
అంతేకాకుండా, ప్రాంతీయత లేదా కుల ఆధారిత గుర్తింపు రాజకీయాలను దాటి ముందుకు వెళ్లడంలో కూడా అవి విఫలమయ్యాయి.
బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్‌పైనా దీని ప్రభావాలు తీవ్రంగానే ఉన్నాయి. కేవలం ప్రభుత్వ వ్యతిరేకత (యాంటీ-ఇంకంబెన్సీ) మాత్రమే తన రాజకీయ పునరుజ్జీవనానికి దోహదపడుతుందని కాంగ్రెస్ ఇకపై భావించలేదు. అలాగే కేవలం కుల ఆధారిత లేదా మైనారిటీ సమీకరణలపై మాత్రమే ప్రధానంగా ఆధారపడలేదు.
కాంగ్రెస్ రాజకీయంగా తన ఉనికిని కొనసాగించాలంటే, పెరుగుతున్న అసమానతలతో కూడిన ఈ దేశంలో రాజ్యాంగ బహుళత్వాన్ని, రాష్ట్రాల హక్కులను, ఆర్థిక సమానత్వాన్ని రక్షించగల నిజమైన ప్రజాస్వామ్య కూటమిని నిర్మించాల్సి ఉంటుంది. దానికి భావజాల స్పష్టత, సంస్థాగత పునర్నిర్మాణం, ప్రాంతీయ శక్తులపై ఆధిపత్యం చెలాయించకుండా వాటిని కలుపుకుని వెళ్లే సంసిద్ధత అవసరం.
ఐక్యతే ఏకైక మార్గం – వామపక్షాల పాత్ర లేమి..
2024 లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి ఐక్యంగా పోరాడి, బీజేపీ సీట్ల సంఖ్యను 303 నుంచి 240కి తగ్గించినప్పుడు ప్రతిపక్షాలకు అత్యంత కీలకమైన విజయం లభించింది అనేది ఇక్కడ గమనార్హం.
ప్రతిపక్షాల ఐక్యత బీజేపీ ఆధిపత్యానికి గండి కొట్టగలదని ఆ ఫలితం సూచించింది.
అయితే ప్రాంతీయ ఆశయాలు, స్థానిక ప్రత్యర్థిత్వాలు, నాయకత్వ విభేదాలతో కూడిన భారత రాజకీయ వ్యవస్థ కారణంగా, రాష్ట్ర స్థాయిలో అలాంటి ఐక్యతను కొనసాగించడం కష్టతరంగా మారుతోంది.
జాతీయ స్థాయిలో సమన్వయం అవసరం కావడం, మరోవైపు ప్రాంతీయ విభజనలు కొనసాగడం మధ్య ఉన్న ఈ వైరుధ్యం భారతదేశంలో ప్రతిపక్ష రాజకీయాల అసమాన ప్రయాణాన్ని అర్థం చేసుకోవడంలో కీలక అంశంగా ఉంది.
ఇతర కొన్ని దేశాల్లోని ప్రతిపక్ష పార్టీలతో పోలిస్తే, భారత ప్రతిపక్ష పార్టీలు తీవ్ర మితవాద(ఫార్-రైట్) రాజకీయాలు కలిగించే ప్రమాదాలను ఇంకా పూర్తిగా అదే స్థాయిలో గుర్తించలేకపోయాయి.
అయినప్పటికీ, బీజేపీ ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి ప్రతిపక్ష ఐక్యతే ఇప్పటికీ అత్యంత సాధ్యమైన మార్గంగా ఉంది.
వామపక్షాల బలహీనత ఈ విభజనను మరింత తీవ్రతరం చేసింది. 2004లో UPA ఏర్పాటు నుంచి 2023లో INDIA కూటమి వరకు, హర్కిషన్ సింగ్ సుర్జీత్, సీతారాం ఏచూరి వంటి వామపక్ష నాయకులు కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలను ఒక ఉమ్మడి కార్యక్రమం చుట్టూ ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక మధ్యవర్తులుగా వ్యవహరించారు.
ప్రస్తుతం వామపక్షాల ప్రభావం గణనీయంగా తగ్గిపోవడంతో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల మధ్య ఒకే రాజకీయ వేదికపై సమన్వయాన్ని, రాజకీయ విశ్వాసాన్ని కొనసాగించగల అలాంటి సమానమైన శక్తి ఇప్పుడు కనిపించడం లేదు.
అయినప్పటికీ, ఈ విడత అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడిన ఓటర్ల మారుతున్న ధోరణిని ఒక ఐక్య ప్రతిపక్షం ఇప్పటికీ తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది. బెంగాల్, అస్సాంలలో బీజేపీ చెప్పుకోదగ్గ విజయాలు సాధించినప్పటికీ, ప్రతిపక్ష రాజకీయాలకు బలమైన కోటలుగా ఉన్న తమిళనాడు, కేరళ వంటి రెండు రాష్ట్రాల్లో మాత్రం అది ఇప్పటికీ ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది.
రాబోయే సంవత్సరాల్లో కొత్త రాజకీయ సమీకరణలు, చర్చలు రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో, ఈ రాష్ట్రాల ప్రతిఘటన మరింత విస్తృతమైన బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు పునాదిగా మారే అవకాశం ఉంది.
అనువాదం: దేవి పోలిన
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
