బీఎల్ఓ మూడు సార్లు సందర్శించినప్పటికీ తనకు, తన భార్యకు నోటీసులు అందజేశారని మాజీ నేవీ చీఫ్ అడ్మిరల్(రిటైర్డ్) అరుణ్ ప్రకాశ్ అసహనం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: గోవా రాష్ట్రంలో ఎన్నికల సంఘం ప్రత్యేక విస్తృత సవరణ(Special Intensive Revision – SIR) ప్రక్రియను చేపట్టింది.
ఈ నేపథ్యంలో, ఓటర్ల జాబితాలో కొనసాగడానికి తమ అర్హతలను నిరూపించుకోవాలని కోరుతూ మాజీ నావికా దళాధిపతి అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్, ఆయన భార్యకు స్థానిక బూత్ స్థాయి అధికారి(బీఎల్ఓ)నోటీసులు అందజేశారు.
దీనిపై స్పందించిన అడ్మిరల్, అంతకుముందే అధికారులు మూడుసార్లు తమ ఇంటిని సందర్శించిన విషయాన్ని గుర్తు చేశారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, తను లేదా తన బంధువులు నమోదిత ఓటర్లుగా ఉన్నారో లేదో గోవా ప్రధాన ఎన్నికల అధికారి నిర్ధారించలేకపోతున్నారని ఆ నోటీసులో పేర్కొన్నట్టు ప్రకాశ్ తెలిపారు.
అంతేకాకుండా, అవసరమైన అన్ని పత్రాలతో ఎన్నికల అధికారుల ముందు హాజరై తమ గుర్తింపును నిరూపించుకోవాలని కోరినట్టు పేర్కొన్నారు.
తనలాంటి ఉన్నత హోదాలో ఉన్నవారు కూడా గుర్తింపును నిరూపించుకోవాల్సి రావడంపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు.
తనకు ఎటువంటి “ప్రత్యేక హక్కులు” అవసరం లేదని, నోటీసులకు కట్టుబడి ఉంటానని చెప్పారు.
అయితే, ఎస్ఐఆర్ ప్రక్రియలో మెరుగుదలకు అవకాశం ఉందని తన అనుభవం సూచిస్తోందని అడ్మిరల్ అభిప్రాయపడ్డారు.
“ఒకవేళ ఎస్ఐఆర్ పత్రాలు సరైన సమాచారాన్ని సేకరించలేకపోతుంటే, ఆ పద్ధతిని సవరించాలి” అని తన ‘ఎక్స్’ వేదికగా ఎన్నికల సంఘాన్ని కోరారు.
“మా బూత్ స్థాయి అధికారి మూడు సార్లు మా ఇంటికి వచ్చారు. కావాల్సిన అదనపు సమాచారం అడిగి తెలుసుకోవచ్చు. మేము 82, 78 ఏళ్ల వయసున్న వృద్ధ దంపతులము. 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్యాలయానికి వేర్వేరు తేదీల్లో హాజరుకావాలని ఆదేశించారు” అని పేర్కొన్నారు.
అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్ 1968లో తొలిసారిగా గోవాకు బదిలీపై వచ్చారు. ఆ తర్వాత ఐదు వేర్వేరు పోస్టింగుల్లో గోవాలో పనిచేసి, 2009లో శాశ్వతంగా స్థిరపడ్డారు.
“ఇంతకాలం ఇక్కడే ఉన్నా, అధికారులను నేను ఒప్పించలేకపోతే ఏం జరుగుతుంది?” అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
జనవరి 17న అడ్మిరల్, జనవరి 19న తన భార్య కుంకుం పత్రాలతో హాజరుకావాలని అధికారులు ఆదేశించారు.
కుంచించుకుపోయిన ఓటర్ల జాబితా
ప్రస్తుతం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండో దశ ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది.
గోవాలో ఓటర్ల జాబితా దాదాపు 8.5% తగ్గింది.
సవరణకు ముందు 11.85 లక్షల మంది ఓటర్లు ఉండగా, తాజా ముసాయిదా జాబితాలో ఆ సంఖ్య 10.84 లక్షలకు పడిపోయింది.
షెడ్యూల్ ప్రకారం, ముసాయిదా జాబితాను డిసెంబర్ 16న విడుదల చేశారు.
అభ్యంతరాల స్వీకరణ గడువును జనవరి 15 నుంచి జనవరి 19 వరకు పొడిగించారు.
తుది జాబితా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రకారం- పేర్లు చేర్చడానికి అర్హులను నిర్ధారించడానికి విచారించేకంటే ముందు “మునుపటి ఎస్ఐఆర్ ఎన్నికల జాబితాతో అనుసంధానం చేయడానికి వీలు కాలేదు” అని పేర్లు నమోదు కానీ వారికి ఖచ్చితంగా నోటీసులను అందించాల్సి ఉంటుంది.
గోవా ఎస్ఐఆర్లో తాను ” పూర్తి వివరాలు నింపలేదని” పేర్కొంటూ, తనకు కూడా నోటీసు జారి చేసినట్టు దక్షిణ గోవా కాంగ్రెస్ ఎంపీ విరియాటో ఫెర్నాండెజ్ తెలిపారు. తనకు సంబంధించి లేదా తన బంధువుల విషయంలో “మునుపటి ఎస్ఐఆర్ జాబితాతో” తమందరిని అనుసంధానం చేయాలని అన్నారు.
“ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించడానికి ముందు- పేరును సరిగా పరిశీలించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, నాతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన వారందరికి ఈ నోటీసులు అందాయి”అని ఫెర్నాండెజ్ తన ఎక్స్ ఖాతాలో రాశారు.
“ఫెర్నాండెజ్ వివరాలను బూత్ స్థాయి అధికారి సరిగా అడిగి తెలుసుకోవాల్సి ఉంది. కానీ తనతో పొరపాటు జరిగింది”అని గోవా ఎన్నికల ప్రధాన అధికారి టైమ్స్‌కు చెప్పారు.
2025 జూన్- సెప్టెంబర్ మధ్య బీహార్‌లో జరిగిన ఎస్ఐఆర్లానే- 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతల్లో ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ కూడా వివాదస్పదమవుతోంది. ఈ ప్రక్రియకు తక్కువ సమయం నిర్ణయించడంతో బూత్‌స్థాయి అధికారులు తీవ్ర ఒత్తిళ్ళకు లోనవుతున్నారని, ఇది భరించలేక కొన్నిచోట్ల వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనలను మార్చే ఆలోచనలో ఎన్నికల సంఘం ఉంది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
