తెలంగాణ హైకోర్టు కారిడార్లలో ప్రస్తుతం జరుగుతున్న ఒక పరిణామం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ న్యాయస్థాన ఆదేశాలను పదే పదే ధిక్కరించడం గురించిన విషయం మాత్రమే కాదు. ఆయన చర్యలు సమర్థించలేనివి.
న్యాయస్థానం విధించే అత్యంత తీవ్రమైన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సిందే.
అయితే, అంతకంటే ఎక్కువ ఆందోళన కలిగించే విషయం పెద్దగా చర్చకు రాకపోవడం. న్యాయస్థాన ఆదేశాలను ఐచ్ఛికంగా పరిగణించిన ఒక ప్రభుత్వ సంస్థ వ్యవహారంలో స్పందించిన జస్టిస్ జువ్వాడి అనిల్ కుమార్ స్వయంగా వ్యక్తిగతంగా ఎంతటి ప్రేరేపణ జరిగినా సరే ఏ న్యాయమూర్తి దాటకూడని రాజ్యాంగ పరిమితులను దాటారా అనే ప్రశ్న.
కోర్టు ఆదేశాల ఉల్లంఘన – వాస్తవాలు..
శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని లోతుకుంట గ్రామంలో ఉన్న 40 ఎకరాల ప్రైవేట్ భూమిలో హైడ్రా అధికారులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ప్రవేశించారని ఆరోపిస్తూ పలు మార్లు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసింది.
ఆ భూమి ప్రైవేట్ ఆస్తేనని రిట్ అప్పీల్ సహా పలు న్యాయ విచారణల్లో ఇప్పటికే నిర్ధారించబడింది.
అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో ధైర్యం పొందిన హైడ్రా అధికారులు మళ్లీ ఆ భూమిలోకి ప్రవేశించారు.
కమిషనర్ తరఫున కోర్టులో దాఖలైన అఫిడవిట్లను న్యాయస్థానం నిర్లక్ష్యపూరితమైనవి, అసంపూర్ణమైనవి, నిజాయితీగానీ, సమయోచిత క్షమాపణగానీ లేనివిగా అభివర్ణించింది. ఇది అత్యంత తీవ్రమైన ధిక్కరణ వ్యవహారమే.
ఈ నేపథ్యంలో జస్టిస్ అనిల్ కుమార్ తీవ్రంగా స్పందించడం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ సంస్థలు రాజకీయ అండతో కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తే ఏ న్యాయస్థానమూ సమర్థవంతంగా పనిచేయలేదు. అయితే, పరిష్కారం మాత్రం రాజ్యాంగ పరిమితుల్లోనే ఉండాలి.
తీవ్రమైన రాజ్యాంగ ప్రశ్నలు రేకెత్తిస్తున్న ఆదేశాలు..
జస్టిస్ అనిల్ కుమార్ జారీ చేసిన రెండు ఆదేశాలు, ఒకటి పదవి నుంచి తొలగించమనే ఆదేశం, మరొకటి సైన్యాన్ని మోహరించమనే ఆదేశం.
ఈ ఆదేశాలు తీవ్రమైన రాజ్యాంగ సంబంధిత ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అవి నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
పదవి నుంచి తొలగింపు ఆదేశం – ఒక అధికార పరిధి ప్రశ్న..
జస్టిస్ అనిల్ కుమార్ తెలంగాణ ప్రభుత్వాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో “తగిన వ్యక్తిని” నియమించాలని ఆదేశించారు. ఇది ఒక ప్రాథమిక రాజ్యాంగ ప్రశ్నను లేవనెత్తుతోంది.
ఒక అధికారి ప్రవర్తన ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, న్యాయవ్యవస్థ జోక్యం ఎంతవరకు రాజ్యాంగబద్ధంగా సమర్థించబడుతుంది? రాజ్యాంగంలోని అధికరణ 215 ప్రకారం, ప్రతి హైకోర్టు “రికార్డు న్యాయస్థానం”(కోర్ట్ ఆఫ్ రికార్డ్). అలాంటి న్యాయస్థానానికి తన ధిక్కరణకు శిక్ష విధించే అధికారం సహా అన్ని అధికారాలు ఉంటాయి.
అయితే, ఇక్కడ ముఖ్యమైన పదం “శిక్షించడం”. కోర్టు ధిక్కరణ చట్టం, 1971లోని సెక్షన్ 12(1) ప్రకారం ధిక్కరణకు విధించగల శిక్షలను స్పష్టంగా నిర్దేశించింది. అవి సాధారణ కారాగార శిక్ష(గరిష్ఠంగా ఆరు నెలలు), లేదా జరిమానా (గరిష్ఠంగా రెండు వేల రూపాయలు), లేదా రెండూ.
సెక్షన్ 12(2) ప్రకారం, ఇతర ఏ చట్టంలో ఏమి ఉన్నా, కోర్టు తన ధిక్కరణకు గానీ లేదా తనకు లోబడి ఉన్న న్యాయస్థానం ధిక్కరణకు గానీ, ఉపవిభాగం (1)లో పేర్కొన్న పరిమితికి మించిన శిక్ష విధించరాదు.
కోర్టు ధిక్కరణ చట్టం, 1971లో గానీ, భారతదేశంలోని మరే ఇతర చట్టంలో గానీ, ధిక్కరణ శిక్షగా ప్రభుత్వ అధికారిని చట్టబద్ధమైన లేదా కార్యనిర్వాహక పదవి నుంచి తొలగించే అధికారం న్యాయస్థానానికి లేదు.
చట్టం అనుమతించే శిక్షలు కారాగార శిక్ష లేదా జరిమానా మాత్రమే. పదవి నుంచి తొలగించడం ధిక్కరణ శిక్ష కాదు. అది పూర్తిగా వేరే చట్టపరమైన వ్యవస్థకు చెందిన విషయం.
రాజ్యాంగం కూడా ఈ పరిమితిని స్పష్టంగా నిర్దేశిస్తుంది-అధికరణ 311(1) ప్రకారం..
“కేంద్ర సివిల్ సర్వీసు, అఖిల భారత సర్వీసు లేదా రాష్ట్ర సివిల్ సర్వీసులో సభ్యుడైన వ్యక్తిని, లేదా కేంద్రం లేదా రాష్ట్ర పరిధిలోని ఏదైనా సివిల్ పదవిని నిర్వహిస్తున్న వ్యక్తిని, అతడిని నియమించిన అధికారికి లోబడిన అధికారి ద్వారా తొలగించరాదు లేదా పదవి నుంచి తొలగించరాదు.”
ఒక హైకోర్టుకు ఐపీఎస్ అధికారిని నియమించే అధికారం లేదు. రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ నియమించిన ప్రభుత్వ ఉద్యోగిని ముఖ్యంగా ఐపీఎస్ హోదాలో ఉన్న అధికారిని పదవి నుంచి తొలగించడం పూర్తిగా కార్యనిర్వాహక అధికార పరిధిలోకి వస్తుంది.
ధిక్కరణ అధికారాన్ని ఉపయోగించడం ద్వారా న్యాయస్థానం ఆ కార్యనిర్వాహక అధికారాన్ని తన అధికారంగా మార్చుకోలేదు.
ఈ రాజ్యాంగపరమైన హద్దును ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వర్సెస్ అసోసియేషన్ ఆఫ్ రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ ఆఫ్ అలహాబాద్(2024 ఐఎన్ఎస్సీ 4) కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా వివరించింది.
ఆ కేసులో, అలహాబాద్ హైకోర్టు ధిక్కరణ చర్యల బెదిరింపుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని నియమాలను నోటిఫై చేయమని ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు ఆ ఆదేశాన్ని రద్దు చేస్తూ ఇలా పేర్కొంది.
హైకోర్టు న్యాయాధికారాన్ని వినియోగిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన కార్యనిర్వాహక అధికారాలను ఎలా వినియోగించాలో బలవంతం చేయలేదు.
అంతేకాక, ధిక్కరణ చర్యల బెదిరింపుతో ప్రభుత్వ అధికారులను తరచూ కోర్టుకు పిలిచి ఒత్తిడి తీసుకురావడం కూడా అనుమతించదగినది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ప్రభుత్వాన్ని నియమాలను నోటిఫై చేయమని బలవంతం చేయడం హైకోర్టు ధిక్కరణ అధికార పరిధిని మించిపోతే, ప్రభుత్వంలోని అత్యున్నత అధికారుల్లో ఒకరిని పదవి నుంచి తొలగించి, తనకు అనుకూలమైన వ్యక్తిని నియమించాలని ఆదేశించడం కార్యనిర్వాహక అధికార పరిధిలోకి మరింత ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడమే అవుతుంది.
సైన్యాన్ని మోహరించాలన్న ఆదేశం – స్పష్టమైన రాజ్యాంగ ఉల్లంఘన..
జూలై 23న, వివాదాస్పద ప్రైవేట్ ఆస్తికి రక్షణ కల్పించేందుకు సైన్య సిబ్బందిని అందుబాటులో ఉంచగలరా అనే విషయాన్ని తెలుసుకోవాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను సికింద్రాబాద్ బైసన్ బ్రిగేడ్ బ్రిగేడియర్‌ను సంప్రదించమని న్యాయస్థానం ఆదేశించింది.
అయితే, అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకున్న తరువాత ఈ ఆదేశాలను అమలులో పెట్టకుండా నిలిపివేసి, జూలై 24న ఉపసంహరించుకుంది. ఆ ఆదేశాన్ని ఉపసంహరించుకోవడం గమనించదగిన విషయం. అయితే రాజ్యాంగపరమైన సమస్య కేవలం ఉపసంహరణతో ముగిసిపోదు.
42వ రాజ్యాంగ సవరణ (1976) ద్వారా చేర్చబడిన ఏడవ షెడ్యూల్లోని యూనియన్ జాబితా, ఎంట్రీ 2ఏ ప్రకారం, రాష్ట్రంలో సాయుధ దళాలను మోహరించే అధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే చెందుతుంది. దానికి అనుగుణంగా, యూనియన్ జాబితాలోని ఎంట్రీ 1 ప్రకారం, పౌర అధికారులకు సహాయంగా సాయుధ దళాలను వినియోగించడం రాష్ట్రాల అధికార పరిధిలో ఉండదు.
అధికరణ 257ఏ (42వ సవరణ ద్వారా చేర్చబడింది. తరువాత 1978లో 44వ సవరణ ద్వారా తొలగించబడింది) కూడా ఒక ముఖ్యమైన రాజ్యాంగ సూత్రాన్ని స్పష్టం చేసింది. ఒకసారి సాయుధ దళాలు మోహరించబడితే, అవి రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో కాకుండా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోనే కొనసాగుతాయి.
ఈ రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం, సాయుధ దళాల మోహరింపు అధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే చెందుతుంది. అందువల్ల, హైకోర్టు అది కేంద్ర ప్రభుత్వం కాదు, అలాగే సాయుధ దళాల నియామక అధికారం కూడా కాదు పౌర వివాదాల పరిష్కారం కోసం సైన్యాన్ని మోహరించమని లేదా సైనిక సిబ్బందిని కోరమని ఆదేశించే అధికారం కలిగి ఉండదు.
రాజ్యాంగం ఎక్కడా కూడా హైకోర్టులకు నేరుగా సైనిక అధికారులతో సంప్రదించి, ప్రైవేట్ ఆస్తులను రక్షించేందుకు సైన్యాన్ని వినియోగించే అధికారం ఇవ్వలేదు.
అలా చేయడం అనేది న్యాయపరమైన పరిధిని దాటి, కార్యనిర్వాహక అధికారాల పరిధిలోకి నేరుగా ప్రవేశించడమే.
రాజ్యాంగబద్ధమైన అధికార విభజన అవసరం..
ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ఎదుర్కొన్న అన్యాయం నిజమైనదే. న్యాయస్థాన ఆదేశాలను అమలు చేయకుండా ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తే, అది చట్ట పరిపాలనకు తీవ్రమైన దెబ్బ. అలాంటి అధికారులను కోర్టు కఠినంగా శిక్షించే పూర్తి అధికారం కలిగి ఉంది.
అయితే, రాజ్యాంగం న్యాయవ్యవస్థకు ఇచ్చిన అధికారాలు ఎంత ముఖ్యమో, వాటికి విధించిన పరిమితులు కూడా అంతే ముఖ్యమైనవి.
న్యాయస్థానాలు కార్యనిర్వాహక వ్యవస్థ రాజ్యాంగ హద్దులను దాటినప్పుడు జోక్యం చేసుకోవాలి. కానీ అదే సమయంలో, న్యాయవ్యవస్థ కూడా తన అధికారాల హద్దులను గౌరవించాల్సిన బాధ్యత కలిగి ఉంటుంది.
న్యాయస్థానాలు ప్రభుత్వ అధికారులను ధిక్కరణకు జైలుకు పంపవచ్చు. జరిమానాలు విధించవచ్చు. అవసరమైతే కఠినమైన శిక్షలు కూడా అమలు చేయవచ్చు. కానీ ఎవరు ప్రభుత్వ పదవిలో కొనసాగాలి, ఎవరిని తొలగించాలి, ఎవరిని నియమించాలి అనే నిర్ణయాలు కార్యనిర్వాహక వ్యవస్థకు చెందినవి.
అలాగే సాయుధ దళాలను ఎప్పుడు, ఎక్కడ మోహరించాలి అనే నిర్ణయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంటుంది.
ఈ రాజ్యాంగపరమైన అధికార విభజన కేవలం ఒక సాంకేతిక నిబంధన కాదు. అదే భారత ప్రజాస్వామ్యానికి పునాది.
న్యాయవ్యవస్థ చట్ట పరిపాలనను కాపాడాలంటే, ముందుగా తానే రాజ్యాంగం నిర్దేశించిన పరిమితుల్లో ఉండాలి. న్యాయస్థానం కూడా తన అధికార పరిమితులను దాటి వ్యవహరిస్తే, అది కూడా రాజ్యాంగ సమతుల్యతకు ప్రమాదం కలిగిస్తుంది.
హాన్స్ ఇండియా పత్రిక సౌజన్యంతో వ్యాస రచయిత చొల్లేటి రాసిన ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
అనువాదం: డి.వెంకన్న
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
