బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైన నితిన్ నబిన్ బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం బంకీపూర్ విధాన సభకు ఉప ఎన్నికలు నిర్వహించింది. ఈ ఉప ఎన్నికల కౌంటింగ్ ఈరోజు జరుగుతోంది.
ఓటర్ల వివరాలు, బరిలో అభ్యర్థులు..
బంకిపూర్ శాసనసభ నియోజకవర్గంలో మొత్తం మూడు లక్షల 78,268 మంది ఓటర్లు ఉన్నారు.
అందులో 1,99,591 మంది పురుషులు, 178,653 మహిళా ఓటర్లు నమోదుకాగా 24 మంది థర్డ్ జెండర్ ఓటర్లుగా నమోదయ్యారు.
ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
అయితే ప్రధాన పోటీ మాత్రం ప్రశాంత్ కిషోర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జన స్వరాజ్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్‌ల మధ్య ఉంటుందని ఎన్నికల పరిశీలకులు అంచనా వేశారు.
నితిన్ నబిన్ జైత్రయాత్ర..
2010 అసెంబ్లీ ఎన్నికల నుండి ఈ స్థానంలో నితిన్ నబీన్ వరుసగా తన జైత్రయాత్ర కొనసాగిస్తూ వచ్చారు.
2010లో ఎన్నికల రంగంలో అడుగుపెట్టిన నితిన్ నబీన్ ఆర్జేడీ అభ్యర్థి బీకే శ్రీవాత్సవపై 60 వేల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.
2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన కుమార్ ఆశిష్‌పై 39,767 ఓట్ల తేడాతో విజయం సాధించగా 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 59.5 శాతం ఓట్లు పొందిన నితిన్ గెలుపొందారు.
2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇదే స్థానం నుండి నబీన్ కాంగ్రెస్ అభ్యర్థి లవ్ సింహాను 39,036 ఓట్ల తేడాతో ఓడించారు. 2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఇదే స్థానం నుండి బీజేపీ అభ్యర్థి నితిన్ నబీన్ ఆర్జేడీకి చెందిన రేఖ కుమారిపై 53,936 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
తగ్గిన పోలింగ్ శాతం..
2025 అసెంబ్లీ ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో 41 శాతం ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనగా ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలలో కేవలం 34.31 శాతం మాత్రమే ఓటర్లు ఎన్నికలలో పాల్గొన్నారు.
ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం – ఖాయమైన విజయం..
ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం జన స్వరాజ్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ 59,213 ఓట్లతోనూ, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ 39,794 ఓట్లతోనూ, ఆర్జేడీ అభ్యర్థి రేఖ కుమారి 1360 ఓట్లతోనూ బరిలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం, ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
