బుధవారం 20వ తేదీ నాడు మళ్లీ పెట్రోలు డిజీల్ ధరలు పెరిగాయి. మొన్న సీఎన్జీ ధరలు మరోసారి పెరిగాయి.
దీనికంటే మూడు రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతకుముందు వంటగ్యాస్ సిలిండర్ ధర, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి.
ఫలితంగా ప్రజల జీవన పరిస్థితులు, ముఖ్యంగా పేదల పరిస్థితులు దుర్భరంగా మారాయి.
ఆయిల్ కంపెనీలకు భారీగా నష్టాలు వచ్చాయని ఫలితంగా గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ఇంకా పెరగనున్నాయని వార్తా కథనాలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ధరల పెరుగుదలకు కారణాలు, దారి తీసిన పరిస్థితులు, నివారణ మార్గాలు, తదితర అంశాలను పరిశీలిద్దాం.
ఈ సమస్య అంతటికి మూల కారణం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ కలసి ప్రారంభించిన దుర్మార్గమైన యుద్ధం. ఈ యుద్ధానికి పథక రచన ఫిబ్రవరి 10న అమెరికాలోని వైట్ హౌస్‌లో జరిగింది.
ఈ సమావేశంలో ఇజ్రాయిల్ అధ్యక్షుడు బెంజిమన్ నేతన్యాహు స్వయంగా పాల్గొని ట్రంప్, ఇతర అధికారులకు యుద్ధప్రణాళికలను, అవసరాన్ని, సాధించబోయే విజయాలను సోదాహరణంగా వివరించారు. ఈ సమావేశంలోనే ఇరాన్‌పై దాడికి నిర్ణయం జరిగింది.
ఆ తర్వాత ఫిబ్రవరి 20న భారత ప్రధాని ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లారు. ఫిబ్రవరి 28న ఇరాన్ పై దాడి మొదలైంది.
అంటే భారత ప్రధాని ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్ళినప్పుడే ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్‌పై దాడి చేయనున్నారనే విషయం నిర్ధారణ అయింది. అది భారత ప్రధానికి తెలియకుండా ఉండే అవకాశం లేదు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహిత స్నేహితుడు భారత ప్రధాని అని పెద్ద ప్రచారం ఉంది. అలాంటి భారత ప్రధాని ఇరాన్‌పై దాడిని జరగకుండా ఎందుకు నివారించలేక పోయారు? ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది.
కనీసం యుద్ధం ప్రారంభమై, ప్రపంచ ప్రజలంతా అల్లాడుతుండగా పాకిస్తాన్ ప్రభుత్వం చొరవ తీసుకొని అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు ఆతిథ్యం ఇచ్చింది.
పాకిస్తాన్ కంటే ముందు భారత ప్రభుత్వం ఆ పని చేసి ఉండాల్సింది.
పైగా బ్రిక్స్ అధ్యక్ష స్థానంలో ప్రస్తుతం భారతదేశం ఉంది. ఆ విధంగా కూడా భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అనేకమంది విశ్లేషకులు సూచించారు. కానీ భారత ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు.
ఇదంతా భారత ప్రభుత్వ వైఫల్యం తప్ప మరొకటి కాదు. ప్రభుత్వ వైఫల్యానికి ప్రజలను బలి చేయడం ఎంతవరకు సమంజసం?
చమురు ధరలు: 2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి అంతర్జాతీయ మార్కెట్లో ముడిచంబరు ధర బేరల్ కు 105 డాలర్లుగా ఉంది.
ఆనాడు దేశంలో డీజిల్ ధర లీటర్ 56 రూపాయలు. పెట్రోల్ 65 రూపాయలు. గ్యాస్ సిలిండర్ 800 రూపాయలుగా ఉన్నాయి. ఆ తర్వాత సంవత్సరాలలో ముడిచమురు ధర గణనీయంగా పడిపోయింది. ఫిబ్రవరి 28 ఇరాన్‌పై యుద్ధం తర్వాతనే తిరిగి మళ్లీ 105 డాలర్లకు చేరుకుంది.
ఈ పది సంవత్సరాల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు గణనీయంగా పడిపోయినప్పటికీ భారతదేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు పెరిగాయి?ఎలా పెరిగాయో ప్రభుత్వం ప్రజలకు సంజాయిషి ఇవ్వాలి.

మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి కాలంలో ప్రపంచంలో అనేక దేశాలు ఆదాయాలు కోల్పోయిన తమ ప్రజలకు ఆర్థిక సహాయం అందించాయి.
దీనికి భిన్నంగా ఆ కాలంలో ప్రజలపై భారాలు మోపిన ఏకైక దేశం భారతదేశం మాత్రమే.
చమురు నిల్వలు
విపత్కర, అత్యవసర సమయాలలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడడం కోసమే అన్ని దేశాలు “బఫర్ స్టాక్స్”ను ఏర్పాటు చేసుకుంటాయి.
మనదేశంలో ముడిచమురు బఫర్ స్టాక్స్ అతి తక్కువగా ఉన్నాయి. పక్కనున్న చైనా దేశంలో బఫర్ స్టాక్స్ మన కంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోయినప్పుడు మనం భారీగా దిగుమతులు చేసుకొని బఫర్ స్టాక్స్ పెట్టుకొని ఉండి ఉంటే ఇవాళ ప్రజల నడ్డి విరగగొట్టేలా ధరలు పెంచాల్సిన అవసరం ఉండేది కాదు.
ముడిచమురును శుద్ధి చేసే రిఫైనింగ్ శక్తి సామర్థ్యాలు మన దేశంలో ఎక్కువగా ఉన్నాయి. పైగా రిఫైనింగ్కి మనదేశంలో ఖర్చు కూడా ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ.
మనం దిగుమతి చేసుకున్న ముడి చమురు రిఫైనింగ్ చేసిన తర్వాత, మనం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం.
పెట్రోలియం ఉత్పత్తులు రీత్యా మన దేశం ప్రపంచదేశాల్లో 23వ స్థానం, రిఫైనింగ్‌లో 4వ స్థానం, వినియోగంలో 3వ స్థానంలో ఉంది.
ఆ విధంగా ముడి చమురు ధరలు బాగా తక్కువగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా దిగుమతి చేసుకొని మన దగ్గర రిఫైనింగ్ చేసి విదేశాలకు ఎగుమతులు చేసి ఉంటే మన విదేశీ మారక నిల్వలు గణనీయంగా పెరిగి ఉండేవి. కానీ ఆ అవకాశాన్ని ప్రభుత్వం చేజేతుల జారవిడుచుకుంది. ఇవి ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్ధత, దూరదృష్టి లోపానికి నిదర్శనాలు.
ఆత్మ నిర్భర్, మేక్ ఇన్ ఇండియా..
ఈ నినాదంతో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్భాటం చేసింది . కానీ ఆచరణ అందుకు పూర్తి భిన్నంగా ఉంది.
భారతదేశంలో ముడిచమురు ఉత్పత్తి 2014 నాటికి 30 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉంది. నేటికీ అది 25.8 మిలియన్ మెట్రిక్ టన్నులకు పడిపోయింది.
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దేశీయ ముడిచమురు ఉత్పత్తిపై ఆంక్షలు విధించి ఉండాలి. లేకుంటే ముడి చమురు ఉత్పత్తి ఎందుకు పడిపోయింది? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
ఇదే కాలంలో చమురు వినియోగం గణనీయంగా పెరిగింది. అమెరికా ఆదేశాలకు తలోగ్గి రష్యా, ఇరాన్ చమురు దిగుమతులను భారత ప్రభుత్వం యుద్ధం కంటే ముందు గణనీయంగా కుదించింది. అమెరికా నుంచి దిగుమతులు పెరిగాయి.
వాస్తవంగా రష్యా, ఇరాన్ చమురు కంటే అమెరికా చమరు ధరలు ఎక్కువ. పైగా రవాణా చార్జీలు కూడా ఎక్కువ.
అయినా దేశ ప్రజల సంక్షేమం పట్టని భారత ప్రభుత్వం అమెరికాకు అంటగాగి వారు పెట్టిన ఆంక్షలకు తలొగ్గి ఇవాళ ప్రజల నెత్తిన భారాలు మోపటం అధికారం అప్పచెప్పిన ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఇక్కడ కూడా రాజకీయ లబ్ది ఉంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే దాకా వేచి చూసి, తాము నిర్దేశించుకున్న విజయాలు సాధించుకున్న తరవాత విజయ గర్వంతో నేడు ప్రజలపై భారాలు మోపుతున్నది.
ఆయిల్ కంపెనీల నష్టాలు..
పత్రికల్లో వస్తున్న వార్త కథనాలను బట్టి ఆయిల్ కంపెనీలకి నష్టాలు రావడం లేదు. రావలసిన లాభాలు మాత్రమే రావడం లేదు.
లాభాలు తగ్గటం తప్ప నష్టాలు మాత్రం కాదు. కరోనా కాలంతోసహా గత పదకొండు సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయల లాభాలను పెట్రోలియం కంపెనీలు ఆర్జించాయి.
ఇప్పుడే భారీగా నష్టాలు వస్తున్నాయని ప్రచారం చేయడంలో అర్థం లేదు.
ఇక్కడ మరొక అంశం కూడా గమనించాలి. కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల నుంచి సాలీనా నాలుగు లక్షల కోట్ల రూపాయల దాకా ఖజానాకు జమ చేసుకుంటున్నది.

అలాగే ఆయిల్ కంపెనీలు ముఖ్యంగా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ప్రభుత్వానికి డివిడెండ్ల రూపంలో భారీ మొత్తం చెల్లిస్తున్నాయి.
ఇవన్నీ ప్రజలకు మరుగున పెట్టి, ఆయిల్ కంపెనీలకు నష్టాలని, ధరల పెంచక తప్పట్లేదని చెప్పడం ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదు.

తక్షణ పరిష్కారం: ప్రభుత్వం పెంచిన సీఎన్జీ, డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలు తక్షణం ఉపసంహ రించుకోవాలి.
అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పన్నులు తగ్గించుకోవడం లేదా డివిడెంట్లని తాత్కాలికంగా రద్దు చేసుకోవటంలాంటి చర్యలు తీసుకొని అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులను సర్దుబాటు చేసుకోవాలి.
శాశ్వత పరిష్కారాలు: బఫర్ స్టాక్స్ పెంచుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. తక్కువ ధరకు లభించే ఇరాన్, రష్యా దేశాల నుంచి ముడిచమురు దిగుమతి చేసుకోవాలి. అమెరికా ధృత్రాష్ట్ర కౌగిలిని వదిలించుకోవాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
