మోదీని ప్రశ్నించిన ఆ జర్నలిస్టే, ఆ తర్వాత “భారత్‌ను ఎందుకు విశ్వసించాలి?” అని ఒక భారతీయ దౌత్యవేత్తను అడిగారు.
అందుకు సమాధానంగా, మోదీ ప్రభుత్వం కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న తీరును, భారత్ వ్యాక్సిన్లు, మందులను ఎగుమతి చేసిన వాస్తవాన్ని, అలాగే యోగా భారత్‌లోనే ఉద్భవించిందన్న విషయాలను ఆ దౌత్యవేత్త ఉదహరించారు.
న్యూఢిల్లీ: మే 18న జరిగిన తన ఐరోపా పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే ప్రెస్ పట్ల ఆయన ప్రభుత్వానికి ఉన్న వైఖరి మరోసారి తెరపైకి వచ్చింది.
“మీడియా నుంచి ప్రశ్నలను స్వీకరిస్తారా” అని ఒక నార్వే జర్నలిస్టు మోదీని అడగ్గా, ఆయన ఎలాంటి బదులు ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ప్రధాని మోదీకి నార్వే జర్నలిస్ట్ ప్రశ్న..
ఓస్లోలో మోదీ, నార్వే ప్రధాని(ఆయన కౌంటర్ పార్ట్) జోనాస్ గార్ స్టోర్లు తమ సంయుక్త పత్రికా ప్రకటనను ముగించుకున్న వెంటనే, ‘దగ్సావిసెన్’ వార్తా పత్రిక వ్యాఖ్యాత హెల్లె లింగ్ గట్టిగా అరుస్తూ, “ప్రధాన మంత్రి మోదీ గారూ, ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన ప్రెస్ నుంచి మీరు కొన్ని ప్రశ్నలను ఎందుకు తీసుకోరు?” అని అడిగారు.
ట్వీట్: భారత ప్రధాని నరేంద్ర మోదీ నా ప్రశ్నను స్వీకరించలేదు, ఆయన తీసుకుంటారని నేను ఆశించనూ లేదు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో నార్వే మొదటి స్థానంలో ఉండగా, పాలస్తీనా, ఎమిరేట్స్ & క్యూబాతో పోటీ పడుతూ భారత్ 157వ స్థానంలో ఉంది. మనం సహకరించుకునే అధికార శక్తులను ప్రశ్నించడం మన బాధ్యత…
– హెల్లె లింగ్ మే 18, 2026.
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని తన ప్రసంగంలో పేర్కొన్న మోదీ, స్టోర్‌తో కలిసి వెళ్లిపోయారు.
అయితే, ఆ తర్వాత స్టోర్ తిరిగి వచ్చి మీడియా ప్రతినిధులకు ఇంటర్వ్యూలు ఇచ్చారని ‘ది హిందూ’ జర్నలిస్ట్ సుహాసిని హైదర్ తెలిపారు.
ప్రధాన మంత్రిగా తన దశాబ్ద కాలపు పదవీకాలంలో బహిరంగ విలేకరుల సమావేశాల్లో కేవలం రెండుసార్లు(అది కూడా విదేశాల్లోనే) మాత్రమే జర్నలిస్టుల ప్రశ్నలు స్వీకరించిన మోదీ- తన ప్రశ్నను వింటారని తాను ఆశించలేదని లింగ్ చెప్పారు.
“మనం సహకరించుకునే అధికార శక్తులను ప్రశ్నించడం మన బాధ్యత” అని ఆమె తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో నార్వే మొదటి స్థానంలో ఉండగా, మొత్తం 180 దేశాలలో భారత్ 157వ స్థానంలో ఉందని ఆమె గుర్తుచేశారు.
మానవ హక్కులపై ప్రశ్నలు..
ఎలివేటర్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో మోదీకి ఒక ప్రశ్న వేయడానికి తాను ప్రయత్నించానని, కానీ తాను ప్రశ్న పూర్తి చేయక ముందే తలుపులు మూసుకున్నాయని కూడా ఆమె రాసుకొచ్చారు.
భారత ప్రధాన మంత్రి వద్దకు వెళ్లడానికి తాను ప్రయత్నించిన వీడియోను షేర్ చేస్తూ.. “మానవ హక్కుల ఉల్లంఘనలు, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షల దృష్ట్యా తను నార్డిక్ దేశాల విశ్వాసానికి అర్హుడినే అని ఆయన భావిస్తున్నారా? అన్నదే నా సందేహం” అని ఆమె రాశారు.
అనంతరం సోమవారం సాయంత్రం, ఓస్లోలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో లింగ్‌ను ట్యాగ్ చేస్తూ, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు మోదీ పర్యటనపై జరగనున్న విలేకరుల సమావేశానికి ఆమె రావచ్చని తెలిపింది.
తాను ఆ సమావేశ వేదిక వద్దకు వెళ్లినట్లు సూచిస్తూ ఆమె తన అకౌంట్లో ఒక ఫోటోను కూడా అప్లోడ్ చేశారు.
విలేకరుల సమావేశంలో దౌత్యవేత్తల దాటవేత..
విలేకరుల సమావేశంలో, తన ప్రశ్నపై వెంటనే స్పందించాలని, ఆ తర్వాత తాను మరిన్ని సంబంధిత ప్రశ్నలు(ఫాలో-అప్ ప్రశ్నలు) అడగగలనని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి (పశ్చిమ) సిబి జార్జ్‌ను లింగ్ అభ్యర్థించారు.
జార్జ్ అందుకు నిరాకరించి మరో ప్రశ్నను తీసుకున్నారు. ఆ తర్వాత చివరకు లింగ్‌కు అవకాశం ఇచ్చారు.
లింగ్ అడుగుతూ.. “మన భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటున్న తరుణంలో నాకు కలుగుతున్న సందేహం ఏమిటంటే, మిమ్మల్ని మేమెందుకు విశ్వసించాలి? మీ దేశంలో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ఆపేందుకు ప్రయత్నిస్తామని మీరు హామీ ఇవ్వగలరా? అలాగే, భవిష్యత్తులో ఏదో ఒక దశలో భారత మీడియా నుంచి విమర్శనాత్మక ప్రశ్నలను ప్రధాన మంత్రి స్వీకరించడం ప్రారంభిస్తారా?” అని ప్రశ్నించారు.
భారత్‌ను ఎందుకు విశ్వసించాలో చెప్పేందుకు మోదీ ప్రభుత్వం కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న తీరును, భారత్ వ్యాక్సిన్లు, మందులను ఎగుమతి చేసిన వాస్తవాన్ని, యోగా భారత్‌లోనే ఉద్భవించిందన్న విషయాలను జార్జ్ ఉదాహరణలుగా చెప్పారు.
లింగ్ మరిన్ని ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించగా, ఆమె ప్రశ్నను వినడానికి ఆగేందుకు జార్జ్ నిరాకరించారు.
సోషల్ మీడియాలో జర్నలిస్ట్ పై ట్రోలింగ్..
ఆ తర్వాత, “మానవ హక్కుల ఉల్లంఘనల దృష్ట్యా మేమెందుకు భారత్‌ను విశ్వసించాలి అన్న దానిపైనా, పర్యటన గురించీ ఈ రోజు రాత్రి నా సహోద్యోగి, నేను ఇద్దరం ప్రశ్నలు అడిగాం” అని లింగ్ ఎక్స్‌లో రాశారు.
“మానవ హక్కుల గురించి ప్రత్యేకంగా వారి నుంచి సమాధానం రాబట్టడానికి నేను చాలాసార్లు ప్రయత్నించాను, కానీ సఫలం కాలేకపోయాను. అక్కడి ప్రతినిధులు కోవిడ్ సమయంలో భారత్ చేసిన కృషి, యోగా వంటి ఇతర విషయాల గురించే మాట్లాడారు. నా సహోద్యోగి వద్ద వీడియోలు ఉన్నాయి, కాబట్టి రేపు వాటిని ప్రచురించడానికి ప్రయత్నిస్తాను.”
ఆ తరువాత, బీజేపీ ప్రభుత్వ మద్దతుదారుల నుంచి ఎదురైన ట్రోలింగ్, ఆరోపణల నేపథ్యంలో- “ఇలా రాయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు, అయితే నేను ఏ విదేశీ ప్రభుత్వం పంపిన విదేశీ గూఢచారిని కాను” అని ఆమె రాశారు.
“జర్నలిజమే నా వృత్తి, ప్రస్తుతం ప్రాథమికంగా నార్వేలో పనిచేస్తున్నాను.”
ఆ తరువాత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆమెకు మద్దతు తెలుపగా, లింగ్ ఆయనను కూడా ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగారు.
డచ్ ప్రధాని వ్యాఖ్యలు, గత పరిణామాలు..
అంతకు ముందు, మీడియాతో మోదీ ప్రభుత్వ సంబంధం ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షించింది. భారత ప్రధాన మంత్రితో విందులో పాల్గొనడానికి ముందు డచ్ ప్రధాని రోబ్ జెట్టెన్ విలేకరులతో మాట్లాడుతూ- మోదీ నేతృత్వంలో పత్రికా స్వేచ్ఛతో పాటు మైనారిటీల మానవ హక్కులు, చట్టబద్ధమైన పాలనపై తనతో పాటు ఇతర ఐరోపా దేశాల ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని ప్రస్తావించారు.
శనివారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రెస్ బ్రీఫింగ్లో జెట్టెన్ వ్యాఖ్యల గురించి ఒక స్థానిక విలేకరి అడగ్గా- “అది అడిగిన వ్యక్తి అవగాహన లోపమే” అంటూ కార్యదర్శి సీబీ జార్జ్ కొట్టిపారేశారు.
అయితే, ప్రశ్నించిన వ్యక్తి సాక్షాత్తూ జెట్టెన్ చేసిన వ్యాఖ్యలనే ఉటంకిస్తున్నారని, డచ్ ప్రధానికి మరింత మెరుగైన అవగాహన ఉండాలని మీరు అంటున్నారా? అని మరో జర్నలిస్ట్ ఫాలో-అప్ ప్రశ్న అడగ్గా.. జెట్టెన్ వ్యాఖ్యలను తాను చూడలేదని ఆ దౌత్యవేత్త వాదించారు.
“ఆ ప్రకటనను నేను చూడలేదు. స్వేచ్ఛ గురించి లేవనెత్తిన ఆ అంశానికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. భారత్ ఎంతటి అందమైన దేశమో నేను ఇప్పటికే స్పష్టం చేశాననే అనుకుంటున్నాను. థ్యాంక్యూ” అని జార్జ్ బదులిచ్చారు.
గతంలో అమెరికాలో ఎదురైన ఇలాంటి అనుభవమే..
చివరిసారిగా 2023లో వాషింగ్టన్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి నిర్వహించిన బహిరంగ విలేకరుల సమావేశంలో మోదీ ఒక జర్నలిస్ట్ నుంచి ప్రశ్నను స్వీకరించారు.
తన ప్రభుత్వ హయాంలో మైనారిటీల హక్కులు, వాక్ స్వాతంత్ర్యం గురించి వాల్ స్ట్రీట్ జర్నల్ విలేకరి సబ్రినా సిద్ధిఖీ అడిగిన ఆ ప్రశ్న తర్వాత- ఆమెను లక్ష్యంగా చేసుకొని హిందుత్వ రాజకీయ నాయకులు, మద్దతుదారులు ఆన్లైన్లో తీవ్రమైన వేధింపులకు, దాడులకు పాల్పడ్డారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
