Independent Candidates Who Upended Political Equations
Illustration: AI-generated editorial image, not a photograph of an actual event.
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ నియోజకవర్గం తెలంగాణ రాజకీయాల్లో అత్యంత చైతన్యవంతమైన స్థానాల్లో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ స్థానానికి జరిగే ఎన్నికలు కేవలం సాధారణ రాజకీయ పార్టీల మధ్య సాగే సార్వత్రిక పోరు మాత్రమే కాదు; ఉద్యోగావకాశాలు, విద్యావ్యవస్థ, ప్రజాస్వామ్య సూత్రాలపై స్పందించే విద్యార్థులు, నిరుద్యోగులు ,మేధావుల ఆశలు-ఆకాంక్షలకు ఒక ప్రతిరూపంగా నిలుస్తాయి.
సాధారణంగా ప్రతి ఎన్నికల్లోనూ అధికార, ప్రతిపక్ష సంప్రదాయ రాజకీయ పార్టీలు తమ అంగబలాన్ని, అర్థబలాన్ని ఉపయోగించి విజయం సాధించవచ్చు. అయినప్పటికీ, ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులు చూపుతున్న ప్రభావం అత్యంత కీలకమైనది. తమ సొంత గళంతో, పట్టుదలతో వేలాది సంఖ్యలో ఓట్లను రాబట్టుకుంటూ, ప్రతి ఎన్నికలోనూ ప్రధాన రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే స్థాయిలో పట్టభద్రుల నమ్మకాన్ని గెలుచుకుంటూ ఉన్నారు.
గెలుపు తలుపు తట్టలేకపోయినా, లక్షలాది ప్రాధాన్యత ఓట్లను గెలుచుకుని ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇవ్వడం వెనుక శ్రమించే స్వతంత్రుల పోరాట పటిమ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజల అసంతృప్తిని నేరుగా వేదికపైకి తేవడంలోనూ, నిరుద్యోగ సమస్యల నుంచి ప్రభుత్వ వైఫల్యాల వరకు సూటిగా ప్రశ్నించడంలోనూ వీరు ప్రదర్శించే చొరవే ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. రాజకీయ వ్యవస్థలో ఒక గట్టి ప్రత్యామ్నాయ శక్తులుగా ఎదిగిన ఈ స్వతంత్ర అభ్యర్థులు, తాము గెలవకపోయినా ఎన్నికల రాజకీయ స్వరూపాన్నే మార్చేశారన్నది అంగీకరించాల్సిన వాస్తవం.
ప్రధాన స్వతంత్ర అభ్యర్థుల పోరాట పటిమ:
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎంతోమంది స్వతంత్రులు బరిలో నిలిచినా, కొందరు మాత్రం తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని రాజకీయ సమీకరణాలను తలకిందులు చేశారు.
తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్):
ఈ నియోజకవర్గ రాజకీయాల్లో స్వతంత్ర అభ్యర్థుల సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పిన ప్రధాన వ్యక్తి తీన్మార్ మల్లన్న. జర్నలిస్టుగా, సామాజిక కార్యకర్తగా ప్రజలకు సుపరిచితుడైన ఆయన, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఎండగట్టారు.
ప్రభుత్వం విడుదల చేయాల్సిన ఉద్యోగ నోటిఫికేషన్లలో జాప్యం, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారాలు, నిరుద్యోగ యువత పడుతున్న మానసిక వేదనలను తన ప్రధాన అస్త్రాలుగా మలచుకున్నారు. సాంప్రదాయ రాజకీయ పార్టీల అంగబలం, ఆర్థిక వ్యవస్థలను తట్టుకుంటూ కేవలం సోషల్ మీడియా, పబ్లిక్ వాక్‌లు, యువత మద్దతుతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్నీ చుట్టివచ్చారు. చదువుకున్న గ్రాడ్యుయేట్లలో నిశ్శబ్దంగా ఉన్న ఆగ్రహాన్ని ఒక బలమైన ఓటు బ్యాంకుగా మార్చడంలో ఆయన విజయం సాధించారు.ఆయన సాధించిన 83,000 కంటే ఎక్కువ మొదటి ప్రాధాన్యత ఓట్లు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలోనే స్వతంత్రుల పరంగా ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి సరిసమానంగా ఓట్లను సాధించి, లెక్కింపు ప్రక్రియను చివరి రౌండ్ వరకు తీసుకెళ్లి అధికార పార్టీ అభ్యర్థి విజయానికి తీవ్ర ఇబ్బందులు సృష్టించారు. గెలుపు కోటాను మొదటి రౌండ్లో ఎవరూ చేరుకోలేకపోవడానికి ప్రధాన కారణం మల్లన్న సాధించిన భారీ ఓటింగ్ శాతమే. ఈ పోరాటం తర్వాతనే ప్రధాన పార్టీలన్నీ స్వతంత్ర శక్తుల ప్రభావాన్ని గుర్తించి, తమ భవిష్యత్తు రాజకీయాన్ని పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది తర్వాత అక్కడ విభేదాలతో బయట పడిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ తనకి ఆ అవకాశం ఇచ్చింది కూడా స్వతంత్ర అభ్యర్థికి తనకి ఉన్న బలాన్ని గమనించే అన్న విషయం ఒప్పుకోవాల్సిందే. అలాగే ఒకసారి స్వతంత్ర అభ్యర్థి నుండి రాజకీయ పార్టీల వైపుకి అభ్యర్థుల ప్రస్థానం మారాక, వారు కేవలం రాజకీయ ప్రయోజనాలకే ఎలా ప్రాధాన్యత ఇస్తారో కూడా మల్లన్న ఉదంతంతో స్పష్టం అయ్యింది.
పింగిలి శ్రీపాల్ రెడ్డి :
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా (పీఆర్టీయూ మద్దతుతో) బరిలోకి దిగిన పింగిలి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థులను సైతం ఓడించి శాసనమండలికి ఎన్నికై సరికొత్త సంచలనం సృష్టించారు. ఉపాధ్యాయ నియోజకవర్గం అనేది సాధారణ గ్రాడ్యుయేట్ స్థానం కంటే మరింత ప్రత్యేకం; అక్కడ పోటీ చేసే వ్యక్తులు ఉపాధ్యాయుల రోజువారీ సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. శ్రీపాల్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రచారాల కంటే కూడా ఉపాధ్యాయుల ఆత్మగౌరవం మరియు హక్కుల సాధనకే ప్రాధాన్యమిచ్చారు.
ఆయన ప్రచారంలో ఉపాధ్యాయులకు సంబంధించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు, పీఆర్సీ సకాలంలో అమలు, పండిట్ ,పిఈటి పోస్టుల అప్‌గ్రేడేషన్ వంటి అత్యంత కీలకమైన డిమాండ్లను ముందుంచారు. ప్రధాన పార్టీలు తమ అధికార బలాన్ని ఉపయోగించినప్పటికీ, 19 రౌండ్ల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో దాదాపు 13,969 ఓట్లు సాధించి పింగిలి శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. పార్టీ జెండాల కంటే ఉపాధ్యాయ సంఘాల ఐక్యత, వ్యక్తిగత సంబంధాలు ఏ స్థాయిలో విజయాన్ని ఖాయం చేస్తాయో నిరూపించిన బలమైన స్వతంత్ర శక్తులలో ఈయన ఒకరు.
విశ్వవిద్యాలయాల ,నిరుద్యోగ జేఏసీ నాయకులు:
కాకతీయ యూనివర్సిటీ ,మహాత్మా గాంధీ యూనివర్సిటీ వేదికలుగా ఎదిగిన పలువురు యువనాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో స్వతంత్రులుగా పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. వీరికి ఎలాంటి రాజకీయ వెనుకబలం లేకపోయినా, డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి హైదరాబాద్, వారంగల్ కోచింగ్ సెంటర్లలో మగ్గుతున్న వేలాది మంది నిరుద్యోగుల ఆక్రోశమే ప్రధాన బలమైంది. "మా ఓటు – మా భవిష్యత్తు" అనే నినాదంతో వీరు ప్రతి లైబ్రరీ, హాస్టల్ గది తలుపులు తట్టారు.
ఈ యువ స్వతంత్ర అభ్యర్థులు ప్రతి ఒక్కరూ 2,000 నుండి 8,000 వరకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లను సొంతం చేసుకోగలిగారు. ఒక్కొక్కరిగా చూస్తే ఈ ఓట్లు తక్కువగా కనిపించినా, వీరందరి ఓట్లను కలిపితే దాదాపు 30,000 నుండి 40,000 వరకు ఓటింగ్ నమోదైంది. ఈ భారీ చీలిక కారణంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత రౌండ్లోనే విజయం సాధించే అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. యువత ఆలోచనల్లో మార్పు తేవడానికి, ప్రత్యక్ష రాజకీయాన్ని సవాలు చేయడానికి ఈ విశ్వవిద్యాలయాల పోరాట యోధుల ప్రచారం ఎంతో దోహదపడింది.
స్వతంత్ర అభ్యర్థుల ఓటింగ్ ప్రభావం:
గ్రాడ్యుయేట్ శాసనమండలి ఎన్నికలు సాధారణ అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల విధానానికి ఎంతో భిన్నంగా జరుగుతాయి. సాధారణ ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే విజేతగా నిలుస్తారు. కానీ, ఎమ్మెల్సీ పోరులో ‘ఏక ప్రాధాన్యత ఓటింగ్ విధానం'అమలులో ఉంటుంది. ఈ పద్ధతి ప్రకారం, గెలవాలనుకునే అభ్యర్థి కేవలం మెజారిటీ సాధిస్తే సరిపోదు; మొత్తం చెల్లిన ఓట్లలో కనీసం 50% ప్లస్ 1 ఓటు (మ్యాజిక్ ఫిగర్ ) సాధించడం అత్యంత తప్పనిసరి.
స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున బరిలోకి దిగి, తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడం వల్ల మొదటి ప్రాధాన్యత ఓట్లు విపరీతంగా చీలిపోతాయి. స్వతంత్రుల దాటికి ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఏ ఒక్కరికీ తొలి రౌండ్లోనే 50% ప్లస్ కోటా ఓట్లు దక్కడం దాదాపు అసాధ్యంగా మారేది. దీనివల్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ 2 నుండి 3 రోజుల పాటు సుదీర్ఘంగా సాగి, ఎలిమినేషన్ రౌండ్లకు దారితీసేది. తక్కువ ఓట్లు వచ్చిన స్వతంత్ర అభ్యర్థులను ఒక్కొక్కరిగా తొలగిస్తూ, వారి రెండవ ప్రాధాన్యత ఓట్లను ఇతరులకు బదిలీ చేసే ప్రక్రియలోనే చివరి విజేత ఎవరనేది ఖరారయ్యేది. ఈ సంక్లిష్ట పరిస్థితిని కల్పించడంలో స్వతంత్రులు అత్యంత కీలకమైన భూమిక పోషించారు.
స్వతంత్ర అభ్యర్థుల ప్రచారం కేవలం ఓట్ల వేటకే పరిమితం కాలేదు; అది ప్రధాన రాజకీయ పార్టీల సాంప్రదాయ ఎన్నికల శైలినే మార్చివేసింది. సాధారణంగా పార్టీలు కుల, ప్రాంతీయ సమీకరణలు లేదా సాంప్రదాయ ఓటు బ్యాంకులను నమ్ముకుని రాజకీయం చేసేవి. కానీ, స్వతంత్రులు నేరుగా నిరుద్యోగం, సకాలంలో జాబ్ నోటిఫికేషన్లు రాకపోవడం, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల, టీఎస్పీఎస్సీ నిర్వహణ లోపాలు వంటి సమస్యలపై గళం విప్పడంతో పెద్ద పార్టీల అజెండా సైతం మారిపోయింది.
స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం పెరిగిన కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం రక్షణ తీరులో పడ్డారు. వారు కూడా స్వతంత్రులు లేవనెత్తిన డిమాండ్లను తమ ప్రచారంలో భాగంగా చేర్చుకోక తప్పలేదు. తమ ఎన్నికల మేనిఫెస్టోలలో ఏటా జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని, నోటిఫికేషన్లు భర్తీ చేస్తామని, నిరుద్యోగ భృతి అందిస్తామని బహిరంగంగా హామీలు ఇచ్చే స్థాయికి స్వతంత్ర అభ్యర్థుల ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ రకంగా, ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకీ లొంగకుండా ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని ,ప్రతిపక్షాలను నిలదీసే బలమైన ప్రజా వేదికగా ఎమ్మెల్సీ ఎన్నికలను స్వతంత్రులు మలచగలిగారు.
ప్రధాన రాజకీయ పార్టీలతో పోలిస్తే స్వతంత్ర అభ్యర్థులకు కోట్లాది రూపాయల నిధులు లేదా భారీ అనుబంధ సంఘాల అంగబలం ఉండవు. ఈ లోటును పూడ్చుకోవడానికి స్వతంత్రులు డిజిటల్ మీడియా మరియు సోషల్ మీడియా ను ప్రచార అస్త్రాలుగా మలుచుకున్నారు. ప్రత్యక్ష ప్రసారాలు క్లిష్టమైన సమస్యలపై చర్చలు, విశ్లేషణల ద్వారా నిరుద్యోగ యువత మరియు పట్టభద్రుల దృష్టిని తమవైపు తిప్పుకున్నారు.
సోషల్ మీడియా క్యాంపెయినింగ్‌తో పాటు, విశ్వవిద్యాలయాల హాస్టళ్లు, డిగ్రీ లేదా ఇంజనీరింగ్ కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల వద్ద స్వయంగా క్యాంపెయిన్ చేసేవారు. ఓటర్లతో నేరుగా చర్చించడం ద్వారా ఓటర్ల మనస్సుల్లో తాము 'ప్రశ్నించే గొంతుకగా' నిలుస్తామనే నమ్మకాన్ని కలిగించారు. ఈ వ్యూహం ఫలితంగానే పార్టీల అంగబలం, అర్థబలాలను తట్టుకుని స్వతంత్రులు వేలాది స్థిరమైన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లను సాధించగలిగారు.
రాబోయే వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన రాజకీయ పార్టీలపై తమకున్న అనుకూలతలను ప్రచారాస్త్రాలుగా మార్చుకుని ఏ విధంగా ముందుకు సాగాలి.
రాజకీయ పార్టీల అభ్యర్థులు గెలిచిన తర్వాత తమ పార్టీ అధిష్టానం ఆదేశాలకు, రాజకీయ కట్టుబాట్లకు మాత్రమే లోబడి పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వ లోపాలను లేదా సొంత పార్టీ విధానాలను మండలిలో ప్రశ్నించే ధైర్యం వారికి ఉండదు. స్వతంత్ర అభ్యర్థులు దీనినే తమ ప్రధాన అనుకూలతగా మార్చుకోవాలి. "మేము ఏ పార్టీ అధిష్టానానికి గులాం కాము; కేవలం పట్టభద్రులు, నిరుద్యోగులు మరియు ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి మాత్రమే కట్టుబడి ఉండే నిర్భయ గొంతుకము" అనే స్పష్టమైన సందేశాన్ని చదువుకున్న ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లాలి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ‘ ప్రాధాన్యత ఓటింగ్ విధానం'లో జరుగుతాయి కాబట్టి, ఓటర్లు పార్టీ జెండాల కంటే అభ్యర్థి వ్యక్తిత్వాన్ని, నిష్పాక్షికతను చూసి ఓటు వేస్తారు. ప్రధాన పార్టీల వద్ద ఉండే భారీ నిధులు, అంగబలానికి పోటీగా స్వతంత్రులు తమ డిజిటల్ నెట్‌వర్క్‌ను మరియు క్షేత్రస్థాయి సంబంధాలను సమర్థవంతంగా వాడుకోవాలి. సోషల్ మీడియా ద్వారా నిరుద్యోగ యువతను చైతన్యపరుస్తూ, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు, కళాశాలలు మరియు ఉపాధ్యాయ సంఘాలను నేరుగా కలిసి తమ "మొదటి ప్రాధాన్యత ఓటు"ను అడగాలి.
వరంగల్-నల్గొండ-ఖమ్మం నియోజకవర్గం ఎప్పుడూ మూస రాజకీయాలకు లొంగని చైతన్యవంతమైన వేదిక. గతంలో బీఆర్ఎస్ ఉద్యమ నేపథ్యంతో అధికారాన్ని దక్కించుకున్నా, తీన్మార్ మల్లన్న, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి స్వతంత్రులు సాధించిన లక్షలాది ఓట్లు ఈ ప్రాంత పట్టభద్రుల తిరుగుబాటు తత్వానికి అద్దం పట్టాయి. రాబోయే ఎన్నికలలో స్వతంత్రులు కేవలం ఓట్ల చీలికకే పరిమితం కాకుండా, తమ పక్కా ప్రణాళిక మరియు ప్రజాపక్ష గొంతుకతో బరిలోకి దిగితే ప్రధాన పార్టీల ఆధిపత్యాన్ని తలకిందులు చేసి చదువుకున్న యువత నిజమైన నిరసన స్వరాన్ని శాసనమండలికి చేర్చడం ఖాయం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
