The Silence of the Educated: Whose Loss?
Illustration: AI-generated editorial image, not a photograph of an actual event.
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC) నియోజకవర్గానికి తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇది కేవలం ఓటు వేసి గెలిపించే సాధారణ ఎన్నిక లాంటిది కాదు. సమాజంలో మార్పు కోరుకునే మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువ పట్టభద్రులు తమ గొంతును చట్టసభల్లో వినిపించడానికి దొరికే ఒక గొప్ప అవకాశం. వరంగల్, ఖమ్మం, నల్గొండ అనే మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని లక్షలాది మంది చదువుకున్న వారి ప్రాతినిధ్యానికి ఇది ప్రధాన వేదిక.
ఇప్పుడు ఈ నియోజకవర్గానికి 2027 ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అయితే ఓటర్ల నమోదు ప్రారంభమై రోజులు గడుస్తున్నా, పట్టభద్రులలో ఉండాల్సినంత ఆసక్తి, ఉత్సాహం కనిపించడం లేదు. చదువుకున్న వారి నియోజకవర్గంలోనే ఓటరు నమోదు వేగం తగ్గడం ఇప్పుడు చర్చలకి దారి తీస్తోంది.
2026 ఓటరు నమోదు వివరాలు:
2021 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మొత్తం 5,05,565 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. ఈ 5.05 లక్షల సంఖ్యనే ప్రస్తుతం 2026 నమోదు ప్రక్రియకు ప్రధాన ప్రామాణికంగా తీసుకుంటున్నారు.నమోదు ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 24 నాటికి 2,93,821 దరఖాస్తులు అధికారులకు అందాయి. అందిన దరఖాస్తుల్లో అధికారుల పరిశీలన పూర్తి చేసుకుని ఆమోదం పొందినవి కేవలం 21,390 మాత్రమే. అక్టోబర్ 27 నాటికి అధికారులకు అందిన మొత్తం దరఖాస్తుల సంఖ్య 3,75,814 కు చేరింది.
2021తో పోలిస్తే వ్యత్యాసం – తేడా ఎంతంటే?
2021 ఎన్నికల నాటి మొత్తం ఓటర్ల సంఖ్యతో, ప్రస్తుతం అందిన దరఖాస్తులను పోల్చి చూస్తే స్పష్టమైన తేడా కనిపిస్తోంది.
తగ్గిన దరఖాస్తుల సంఖ్య: 2021 లో ఉన్న 5,05,565 ఓటర్లతో పోలిస్తే 2026 అక్టోబర్ 27 నాటికి అందిన 3,75,814 దరఖాస్తులను తీసివేస్తే ఇంకా 1,29,751 దరఖాస్తులు తక్కువగా ఉన్నాయి.
దరఖాస్తుల నిష్పత్తి: 2021 మొత్తం ఓటర్ల సంఖ్యను 100 శాతంగా తీసుకుంటే, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు 74.3 శాతం మాత్రమే.
లోటు శాతం: ఇంకా 25.7 శాతం మంది (అంటే ప్రతి 100 మంది పాత ఓటర్లలో సుమారు 26 మంది) ఇప్పటివరకు మళ్లీ దరఖాస్తు చేసుకోలేదు.
అక్టోబర్ 27 నాటికి వచ్చిన 3,75,814 అనేది దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య మాత్రమే గానీ, ఓటు హక్కు లభించిన వారి సంఖ్య కాదు. అధికారులు పత్రాలను పరిశీలించి ఆమోదించిన తర్వాతే వీరందరికీ ఓటు హక్కు లభిస్తుంది. ధ్రువపత్రాల లోపాల వల్ల కొన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి , తుది ఓటర్ల సంఖ్య ఈ దరఖాస్తుల సంఖ్య కంటే తగ్గే అవకాశం ఉంది.
విద్యావంతుల నిశ్శబ్దం:
వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రులకు డిగ్రీ పట్టాల విలువ తెలుసు, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాముఖ్యత తెలుసు. అయినప్పటికీ 2026 ఓటరు నమోదు ప్రక్రియలో వారు చూపిస్తున్న ఉదాసీనత వెనుక ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరకపోవడం, ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తే ప్రధాన కారణాలు.
నిరుద్యోగ భృతి హామీ నెరవేరకపోవడం:
ఎన్నికల సమయంలో చదువుకున్న నిరుద్యోగులకు ప్రతి నెలా నిరుద్యోగ భృతిగా ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈ హామీ ఎంతో ఆశను కలిగించింది.
అయితే ఏళ్లు గడుస్తున్నా నిరుద్యోగ భృతికి సంబంధించిన దరఖాస్తులు తీసుకోలేదు, నిధులు కూడా కేటాయించలేదు. ఈ హామీ కేవలం ఓట్ల కోసమే ఇచ్చారనే భావన పట్టభద్రులలో బలపడింది. దానివల్ల "మా సమస్యలను పట్టించుకోని పరిపాలన కోసం ఓటు నమోదు చేసుకోవడం ఎందుకు?" అని నిరుద్యోగుల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగిపోయింది.
ఉద్యోగ నోటిఫికేషన్లు, భర్తీలో ఆలస్యం:
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను వేగంగా భర్తీ చేస్తామని, ప్రతీ ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అప్పట్లో బిఆర్ఎస్ ,తర్వాత కాంగ్రెస్ పార్టీలు హామీ ఇచ్చాయి. ఈ హామీలతో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలొస్తాయని ఆశపడ్డారు.
కానీ ఆచరణలోకి వచ్చేసరికి గ్రూప్స్, టీచర్ పోస్టులు ,మిగిలిన నోటిఫికేషన్లు పదే పదే వాయిదా పడుతున్నాయి. వేల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న యువతకు ఈ ఆలస్యం ఇబ్బందులు కలిగిస్తూనే ఉంది. ఏళ్ల తరబడి ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగ పట్టభద్రులు ఎన్నికల వ్యవస్థపై నమ్మకం కోల్పోయారు.
ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల పెండింగ్:
పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆసరాగా నిలిచే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డాయి. కాలేజీ యాజమాన్యాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులకి సమస్యలు పెరిగిపోతున్నాయి.
దీనివల్ల చదువు పూర్తి చేసిన విద్యార్థులకు కాలేజీలు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. చేతిలో డిగ్రీ సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలకు అప్లై చేయలేక, Form-18కు పత్రాలు జత చేయలేక పట్టభద్రులు ఇబ్బంది పడుతున్నారు. ఫీజులు చెల్లించలేక అవస్థలు పడుతున్న విద్యావంతులు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారు.
సీపీఎస్ (CPS) రద్దు – పాత పింఛన్ విధానం (OPS) పునరుద్ధరించకపోవడం:
ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ముందు పాత పింఛన్ విధానాన్ని (OPS) పునరుద్ధరిస్తామని చెప్పిన పాలకులు, అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని పక్కన పెట్టారు.
రిటైర్మెంట్ తర్వాత తమ జీవితానికి ఎలాంటి ఆర్థిక భద్రత లేదని ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పదే పదే హామీలు ఇచ్చి మాట మార్చడం వల్ల ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఈ అసంతృప్తి కారణంగానే చాలామంది ఉపాధ్యాయులు ఈసారి ఓటు నమోదుపై ఆసక్తి చూపడం లేదు.
పిఆర్సి (PRC) ,డీఏ (DA) బకాయిల ఆలస్యం:
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వేతన సవరణ (PRC) అమలు చేయడం ,రావాల్సిన పెండింగ్ డీఏలను (Dearness Allowance) విడుదల చేయడంలో ఆలస్యం జరుగుతోనే ఉంది. ధరలు విపరీతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు సమయానికి అందడం లేదు.తమ న్యాయమైన హక్కుల కోసం ఉద్యోగ సంఘాలు రోడ్లపైకి వచ్చి పోరాడాల్సి వస్తోంది. కష్టపడి పనిచేస్తున్న తమ సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం భావిస్తోంది. ఈ ఆర్థిక బకాయిల ఆలస్యం ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల,ఎమ్మెల్సీ లుగా గెలిచే పార్టీ అభ్యర్థుల పట్ల నమ్మకం లేకుండా చేస్తోంది.
కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించకపోవడం:
వివిధ ప్రభుత్వ శాఖలు, గురుకులాలు, విద్యాసంస్థల్లో వేలాది మంది కాంట్రాక్ట్, పార్ట్-టైమ్ మరియు అవుట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. తమను రెగ్యులర్ చేస్తారని, సమాన పనికి సమాన వేతనం ఇస్తారని వీరంతా ఏళ్ల తరబడి ఆశగా ఎదురుచూస్తున్నారు.కానీ ఇచ్చిన హామీలు ఆచరణకు నోచుకోకపోవడంతో వీరికి ఉద్యోగ భద్రత కరువైంది. తక్కువ జీతాలతో కుటుంబాలను పోషించుకోలేక అవస్థలు పడుతున్నారు. చదువుకున్న తమ శ్రమకు తగిన గుర్తింపు, భద్రత ఇవ్వని పాలక వ్యవస్థ పట్ల ఈ ఉద్యోగులు నమ్మకం కోల్పోయారు.
ఈ రాజకీయ అసంతృప్తులను పక్కన పెడితే, ఓటు నమోదు చేసుకోవాలనుకునే పట్టభద్రులకు రకాల ఇతర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అప్లికేషన్ (Form-18) తో పాటు డిగ్రీ సర్టిఫికేట్లు, ఐడీ కార్డులు జత చేయాలి. అయితే ఈ డిగ్రీ సర్టిఫికేట్ పై గెజిటెడ్ ఆఫీసర్‌తో సంతకం (Attestation) చేయించడం చాలామందికి పెద్ద సమస్యగా మారింది. ఉద్యోగాలు చేసేవారికి, పల్లెల్లో ఉండే వారికి ఆఫీసర్లు సమయానికి దొరక్కపోవడంతో చాలామంది అప్లై చేయడం మధ్యలోనే ఆపేస్తున్నారు.
మరొకవైపు కంప్యూటర్ లేదా ఫోన్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు వెబ్సైట్ స్లో అవ్వడం, సర్టిఫికేట్ల ఫోటోల సైజు కుదించడం రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దరఖాస్తు ఓకే అయిందో లేదో కూడా సరిగ్గా తెలియడం లేదు. దీనికి తోడు అక్టోబర్ చివరి నాటికి వచ్చిన 3.75 లక్షల దరఖాస్తులను అధికారులు ఇంకా తనిఖీ చేసి ఆమోదించకపోవడం వల్ల కూడా ఓటర్ నమోదు చాలా నెమ్మదిగా సాగుతోంది. గతంలో 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన పాత ఓటర్ల జాబితాను ఇప్పుడు పూర్తిగా రద్దు చేస్తారు. కాబట్టి ఆ పాత ఓటర్లు కూడా ఈసారి తప్పనిసరిగా కొత్తగా ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనపై చాలా మందికి అవగాహన లేక కూడా ఈ నమోదు ప్రక్రియకి దూరంగా ఉంటున్నారు.
నిజానికి ప్రభుత్వం పట్ల,ఇప్పటివరకు గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థుల పట్ల ఉన్న అసంతృప్తి వల్లే ఓటర్లు అసలు తమ ఓటుని నమోదు చేసుకోవాలన్న విషయం పై ఆసక్తి చూపడం లేదు. ఓటు ఉన్నా,లేకపోయినా,వేసినా,వేయకపోయినా వచ్చే మార్పు ఉండదన్న నిర్లిప్త ధోరణే దీనికి కారణం.
సామాజిక – రాజకీయ ప్రభావం(Social & Political Impact):
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు తక్కువగా నమోదు కావడం అనేది కేవలం సంఖ్యలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది రాబోయే ఎన్నికల ఫలితాలను, సమాజంలో మన సమస్యలపై నిలదీసే గొంతులను దెబ్బతీసే ప్రమాదకరమైన విషయం.
ప్రధాన రాజకీయ పార్టీల ఆధిపత్యం – స్వతంత్ర అభ్యర్థుల అవకాశాలు దెబ్బతినడం:
ఓటర్ల నమోదు సంఖ్య తగ్గిపోవడం వల్ల ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్రంగా పోటీ చేసే అభ్యర్థుల గెలుపు అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయి. సాధారణంగా విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు పోటీ చేసినప్పుడు, స్వతంత్ర అభ్యర్థులు తమకు సొంతంగా వచ్చే ఓట్లపైనే పూర్తిగా ఆధారపడతారు.
కానీ విద్యావంతులు ఓటరు నమోదుకు దూరంగా ఉన్నప్పుడు, డబ్బు, అధికారం, ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్న పెద్ద రాజకీయ పార్టీలు మాత్రమే ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకుంటాయి. పార్టీలు తమ కార్యకర్తల ద్వారా తమ సొంత మద్దతుదారుల ఓట్లను మాత్రమే పక్కాగా నమోదు చేయించుకుంటాయి. దీనివల్ల సమాజ శ్రేయస్సు కోసం పోటీ చేసే స్వతంత్రులకు సాధారణ ఓట్లు పడవు, దాంతో వారు పోటీ నుంచే తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
చట్ట సభల్లో ప్రజా సమస్యల నిర్లక్ష్యం:
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాన్ని కేవలం రాజకీయ పార్టీల పోటీ కోసం మాత్రమే కాదు,పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలను శాసనమండలిలో గట్టిగా ప్రశ్నించడం కోసం రూపొందించారు. కానీ విద్యావంతులే ఓటర్ల జాబితాలో లేకపోతే, ఏ పార్టీ జెండా మోయని మంచి స్వతంత్ర నాయకులు గెలిచే అవకాశం కోల్పోతారు.
కేవలం పార్టీ అధిష్టానం చెప్పినట్లు వినే అభ్యర్థులే గెలిస్తే, చట్టసభల్లో నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న అసలు సమస్యల గురించి మాట్లాడేవారే ఉండరు. విద్యావంతులు ఓటుకు దూరమైతే పరిపాలించే వారిలో జవాబుదారీతనం పూర్తిగా తగ్గిపోతుంది.
తక్కువ ఓటింగ్ శాతం – స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం తగ్గిపోవడం:
ఓటర్ల నమోదు తగ్గితే తుది ఓటర్ల జాబితా కూడా చిన్నదిగా మారుతుంది. దీనివల్ల ఎన్నికల రోజున పోలింగ్ శాతంలో వచ్చే చిన్న మార్పు కూడా అభ్యర్థుల గెలుపోటములను సులభంగా మార్చేస్తుంది.
గతంలో లక్షలాది మంది ఓటర్లు ఉన్నప్పుడు స్వతంత్ర అభ్యర్థులకి ఓట్ల సంఖ్య, వాటి ప్రభావం ఉండేది. ఇప్పుడు విద్యావంతులు ఓటుకి దూరంగా ఉంటే రాజకీయ పార్టీలు తమకి అనుకూలంగా దీన్ని మార్చుకుంటాయి. కానీ ఇప్పుడు ఓటర్లు తక్కువగా ఉండటం వల్ల, కొన్ని వేల ఓట్లను ప్రభావితం చేయగల రాజకీయ పార్టీలే విజయాన్ని సులభంగా కైవసం చేసుకుంటాయి. ఇది ప్రజల నిజమైన తీర్పును కాకుండా, కేవలం పార్టీల బలప్రదర్శనకి మాత్రమే సంకేతంగా ఉంటుంది.
ప్రభుత్వంపై ఎంత కోపం ఉన్నా, ఓటు నమోదు చేసుకోకపోతే మన సమస్యలను నిలదీసే హక్కునే కోల్పోతాం. మన కోసం గొంతు ఎత్తే సరైన నాయకుడిని ఎన్నుకోవాలన్నా, మార్పు తీసుకురావాలన్నా ఓటు హక్కు తప్పనిసరి. కాబట్టి ప్రతీ ఒక్క పట్టభద్రుడు చివరి తేదీ నవంబర్ 6 లోపే ఓటరుగా నమోదు చేసుకుని తమ చైతన్యాన్ని చాటుకోవాలి.
* * *
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
