ఇండియాబుల్స్ వ్యవస్థాపకుడు సమీర్ గెహ్లాట్ నుంచి వచ్చిన న్యాయపరమైన నోటీసులను అనుసరించి, హోస్టింగర్ ద్వారా paranjoy.inని ఏకపక్షంగా తొలగించారు.
2026 అక్టోబరు 28న ఉదయం నా వెబ్సైట్ paranjoy.in, media.paranjoy.in, adanifiles.paranjoy.inతో సహా దానికి సంబంధించిన అన్ని సబ్‌డొమైన్‌లను మా వెబ్ హోస్టింగ్ ప్రొవైడర్ హోస్టింగర్(HOSTINGER operations, UAB) అకస్మాత్తుగా ఆఫ్‌లైన్‌లోకి మార్చింది.
పన్నెండు సంవత్సరాల క్రితం రిజిస్టర్ చేయబడిన ఈ వెబ్సైట్- ఒక జర్నలిస్ట్, రచయిత, ప్రచురణకర్త, డాక్యుమెంటరీ సినిమాలు, మ్యూజిక్ వీడియోల రూపకర్తగా దశాబ్దాలుగా నేను చేసిన నా పనికి సంబంధించిన ఆన్లైన్ ఆర్కైవ్‌గా పనిచేస్తుంది.
మొత్తం హోస్టింగ్ ఖాతాను సస్పెండ్ చేయడానికి ముందు హోస్టింగర్ ఎలాంటి ముందస్తు సమాచారం, హెచ్చరిక లేదా స్పందించే అవకాశాన్ని ఇవ్వలేదు.
అక్టోబరు 28న ఉదయం 6:48 గంటలకు నా సహోద్యోగి హోస్టింగర్ “సపోర్ట్”ను సంప్రదించినప్పుడు, ఒక హోస్టింగ్ “స్పెషలిస్ట్” ఈ సస్పెన్షన్ “మోసం/స్కామ్” కోవలోకి వచ్చిన దుర్వినియోగ నివేదిక కారణంగా ట్రిగర్ చేయబడిందని తెలిపారు.
“ఈ విషయంలో సస్పెన్షన్‌ను ఎత్తివేయడం చర్చల ద్వారా సాధ్యం కాదు” అని ప్రకటించారు.
Newsclick.inలో ఏడేళ్లకు పైగా ప్రచురించబడిన ఒకే ఒక కథనాన్ని తొలగించాలని కోరుతూ ఇండియాబుల్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు సమీర్ గెహ్లాట్ నాకు ఎక్స్‌పార్టే(ఏకపక్ష) కోర్టు ఉత్తర్వును అందించిన కొద్ది రోజులకే “మోసం/స్కామ్” అని ముద్ర వేసి మొత్తం రిపాజిటరీని ఇలా అకస్మాత్తుగా మూసివేశారు.
న్యూస్ క్లిక్‌లో ప్రచురించిన నా నివేదికపై ఆరు సంవత్సరాలకు పైగా, ఇండియాబుల్స్, సమీర్ గెహ్లాట్ ఈ న్యాయపరమైన చర్యలను కొనసాగించారు. నేను నా జర్నలిజం నివేదికను కోర్టులో సమర్థించుకున్నాను.
పరిణామక్రమం
మార్చి 11, 2020: 2019 సెప్టెంబరు 30న వెబ్సైట్లో ప్రచురించబడిన ఒక కథనంపై న్యూస్‌క్లిక్, దాని రీడర్స్ ఎడిటర్ ఉర్మిలేష్, ఆ కథనపు సహ-రచయిత సౌరోదిప్తో సన్మాల్, న్యూస్‌క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థలతో పాటు నాపై న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుల ముందు ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ క్రిమినల్ పరువునష్టం దావా(CC No. 1765/2020) దాఖలు చేసింది.
జూన్ 6, 2025 – జూలై 9, 2025: ఫిర్యాదు దాఖలు చేసిన ఐదు సంవత్సరాల తర్వాత, పాటియాలా హౌస్ కోర్టుల జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ 2025 జూన్ 6న పుర్కాయస్థపై విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే నాతో సహా మిగిలిన నలుగురు నిందితులకు భారతీయ శిక్షాస్మృతిలోని 499, 500 సెక్షన్ల కింద సమన్లు జారీ చేశారు. 2025 జూలై 30న హాజరు కావడానికి 2025 జూలై 9న అధికారికంగా సమన్లు జారీ అయ్యాయి.
ఆగస్టు 27, 2026: గెహ్లాట్ తరఫు న్యాయవాది, ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్(ఈఓడబ్ల్యూ) సమర్పించిన స్టేటస్ రిపోర్ట్ వాస్తవిక స్థితిని మార్చిందని పేర్కొంటూ, 24 నుంచి 48 గంటల్లోపు ఆ కథనాన్ని తొలగించాలని కోరుతూ నాకు ఒక లీగల్ నోటీసు పంపారు.
సెప్టెంబరు 2, 2026: నా న్యాయవాది ఆ లీగల్ నోటీసులోని అంశాలకు తగిన వివరణలతో సమాధానం పంపారు.
అక్టోబరు 24, 2026: ఇండియాబుల్స్ నెస్ట్స్ లిమిటెడ్(ప్లయింటిఫ్ నెం.1), సమీర్ గెహ్లాట్ (ప్లయింటిఫ్ నెం.2) న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుల జిల్లా, సెషన్స్ జడ్జిలలో ఒక కోర్టు నుంచి సివిల్ సూట్ నెం. 529/2026(ఇండియాబుల్స్ నెస్ట్స్ లిమిటెడ్ వర్సెస్ అశోక్ కుమార్/జాన్ డో)లో ఎక్స్‌పార్టే యాడ్ ఇంటెరిమ్ ఇంజెక్షన్‌ను పొందారు. ఇందులో నన్ను డిఫెండెంట్ నెం.19గా పేర్కొన్నారు. paranjoy.inలోని కథనాన్ని (షెడ్యూల్ ఏలో ఐటెమ్ ఏ-33గా జాబితా చేయబడింది) తొలగించాలని, డీ-ఇండెక్స్ చేయాలని ఈ ఉత్తర్వు ఆదేశించింది.
అక్టోబరు 25, 2026(ఉదయం 10:13 IST): ఇండియాబుల్స్ నెస్ట్స్ లిమిటెడ్, సమీర్ గెహ్లాట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులు, అక్టోబరు 24 కోర్టు ఉత్తర్వు, సూట్ పత్రాలను నాకు ఇమెయిల్ ద్వారా పంపి, తక్షణమే తొలగించాలని, దానికి అనుగుణంగా నడుచుకున్నట్టు రాతపూర్వక నిర్ధారణను కోరారు.
అక్టోబరు 26, 2026(రాత్రి 11:33 IST): సమీర్ గెహ్లాట్ తన అధికారిక చిరునామా(sameer@indiabulls.com) నుంచి వ్యక్తిగతంగా ఒక ఇమెయిల్ పంపుతూ, paranjoy.in నుంచి ఆ URLని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నేను పాటించకపోతే సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డర్ XXXIX రూల్ 2A ప్రకారం కోర్టును ఆశ్రయిస్తానని బెదిరించారు. ఈ వ్యవహారం తదుపరి 2026 డిసెంబరు 18కి జాబితా చేయబడిందని పేర్కొన్నారు. తేదీ 24.10.2026 నాటి ఉత్తర్వుపై నేను కోర్టులో సవాలు చేసే పనిలో ఉండగానే, అదే రోజున గెహ్లాట్ తరఫు న్యాయవాదులు గూగుల్ ఎల్ఎల్సీకి కోర్టు ఉత్తర్వు తొలగింపు ఫిర్యాదును సమర్పించారు.
అక్టోబరు 28, 2026 (మధ్యాహ్నం 3:16 IST): గూగుల్ సెర్చ్ కన్సోల్ ఒక ఆటోమేటెడ్ నోటీసును([WNC-598900]) పంపింది. google.co.inలోని శోధన ఫలితాల నుంచి నిర్దిష్ట URL (paranjoy.in/article/the-ma…) కనిపించకుండా గూగుల్ బ్లాక్ చేస్తోందని తెలియజేశారు.
లూమెన్ టేక్‌డౌన్ పరిధి
ఈ ఫిర్యాదుకు సంబంధించిన లూమెన్ డేటాబేస్ రికార్డ్ (నోటీస్ ఐడీ: 101001876) తొలగింపు అభ్యర్థన పరిధిని వెల్లడిస్తుంది. ఈ ఫిర్యాదు ది ఎకనామిక్స్ టైమ్స్, బిజినెస్ స్టాండర్డ్, ది కారవాన్, ది డైలీ పయనీర్, బిజినెస్ టుడే, డెక్కన్ హెరాల్డ్, ఈటీ నౌ, ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్, లైవ్‌మింట్, మనీకంట్రోల్, మనీలైఫ్, ఎన్డీటీవీ ప్రాఫిట్, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, అవుట్‌లుక్ బిజినెస్, ది క్వింట్, క్వార్ట్జ్, న్యూస్క్లిక్లతో పాటు ఎక్స్ (గతంలో ట్విట్టర్), ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, స్క్రైబ్డ్ పోస్ట్‌లతో సహా ప్రధాన జాతీయ, అంతర్జాతీయ వార్తా సంస్థల వెబ్సైట్లలోని 52 URLలను లక్ష్యంగా చేసుకుంది.
ఈ ప్రధాన కార్పొరేట్ వార్తా వెబ్సైట్లలోని చాలా నివేదికలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి, లూమెన్ టేక్‌డౌన్ జాబితాలోని ఐటెమ్ 39 అనేది NewsClick.inలో ప్రచురించబడిన అసలు సెప్టెంబరు 30, 2019 నాటి కథనం(newsclick.in/The-Maze-of-Po…).
ఇది ఇప్పటికీ ప్రత్యక్షంగా, అందుబాటులో ఉంది. అయినప్పటికీ paranjoy.in విషయంలో, మొత్తం డొమైన్, నా ఖాతాలో హోస్ట్ చేయబడిన ప్రతి వెబ్సైట్ ఇంటర్నెట్ నుంచి తుడిచిపెట్టేశారు.
హోస్టింగర్ నిరాధార ఆరోపణలు
2026 అక్టోబరు 28న నా ఖాతాను సస్పెండ్ చేసినప్పుడు హోస్టింగర్ పాటియాలా హౌస్ కోర్టు ఉత్తర్వును ఉదహరించలేదు.
బదులుగా, దాని ప్రతినిధి మాట్లాడుతూ “మోసం/స్కామ్” కోసం వచ్చిన దుర్వినియోగ నివేదిక కారణంగా హోస్టింగ్ ఖాతా శాశ్వతంగా సస్పెండ్ చేయబడిందని పేర్కొన్నారు.
ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారమైనది:
వైరస్‌టోటల్ సెక్యూరిటీ అనాలిసిస్: 2026 అక్టోబరు 28న ఉదయం 7:48 నుంచి 7:54 గంటలకు వైరస్టోటల్లో నిర్వహించిన స్వతంత్ర డొమైన్ తనిఖీలు, 92 సెక్యూరిటీ వెండార్లలో 0(సున్నా) వెండార్లు కూడా paranjoy.in లేదా media.paranjoy.inని హానికరమైనదిగా, ఫిషింగ్ లేదా మోసపూరితమైనవిగా గుర్తించలేదని నిర్ధారిస్తున్నాయి.
వైరస్‌టోటల్ paranjoy.inని స్పష్టంగా “వార్తలు, మీడియా” కింద వర్గీకరించింది.
గూగుల్ సేఫ్ బ్రౌజింగ్ స్టేటస్: 2026 అక్టోబరు 28 ఉదయం 7:55 నుంచి 7:56 గంటలకు paranjoy.in, adanifiles.paranjoy.in రెండింటి కోసం గూగుల్ సేఫ్ బ్రౌజింగ్ డయాగ్నస్టిక్ టూల్లో జరిపిన తనిఖీలు “అసురక్షిత కంటెంట్ కనుగొనబడలేదు” అని నిర్ధారించాయి.
నా వెబ్సైట్ paranjoy.in ఎటువంటి ఆర్థిక ఉత్పత్తులను విక్రయించదు, వాణిజ్య పథకాల కోసం నిధులను సేకరించదు లేదా స్కామ్‌గా వర్గీకరించదగిన ఏ కార్యకలాపానికి పాల్పడదు.
ఇది జీవితకాల కృషి ద్వారా నిర్మించబడిన ప్రజా ప్రయోజన జర్నలిజం, పుస్తకాలు, డాక్యుమెంటరీ సినిమాలు, పరిశోధనాత్మక నివేదికల రిపాజిటరీ.
డొమైన్ యజమానికి ఒక్క తనిఖీ లేదా ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా, కల్పిత “మోసం/స్కామ్” దుర్వినియోగ నివేదికపై చర్య తీసుకోవడం ద్వారా, స్వతంత్ర జర్నలిస్టును సెన్సార్ చేయడానికి హోస్టింగర్ తన దుర్వినియోగ-నివేదిక యంత్రాంగాన్ని ఆయుధంగా మలుచుకున్నది.
ఒక నిర్దిష్ట URLని తొలగించాలని లేదా డీ-ఇండెక్స్ చేయాలని కోర్టు ఉత్తర్వు ఆదేశించినప్పటికీ, ముందస్తు నోటీసు లేకుండా మొత్తం డొమైన్‌ను, వందలాది సంబంధం లేని కథనాలు, ఆర్కైవ్‌లు, సబ్‌డొమైన్‌లను తీసివేయడానికి వెబ్ హోస్టింగ్ ప్రొవైడర్‌కు ఎలాంటి చట్టపరమైన లేదా నైతిక హక్కు లేదు.
నేను హోస్టింగర్ నుంచి తక్షణ సమాధానాలు, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తున్నాను.
paranjoy.inపై తప్పుడు “మోసం/స్కామ్” దుర్వినియోగ నివేదికను ఎవరు సమర్పించారు? అది ఏ తేదీ, సమయానికి స్వీకరించబడింది?
వైరస్టోటల్లోని 92 సెక్యూరిటీ వెండార్లు, గూగుల్ సేఫ్ బ్రౌజింగ్ జీరో హానికరమైన లేదా అసురక్షిత కంటెంట్ అని చూపుతున్నప్పుడు, 12 సంవత్సరాల చరిత్ర గల జర్నలిజం పోర్టల్‌ను “మోసం/స్కామ్” సైట్‌గా వర్గీకరించడానికి ముందు హోస్టింగర్ దుర్వినియోగ బృందం ఏ అంతర్గత తనిఖీని నిర్వహించింది?
మొత్తం హోస్టింగ్ ఖాతాను సస్పెండ్ చేయడానికి ముందు నాకు ఎటువంటి ముందస్తు నోటీసు, హెచ్చరిక లేదా ఫిర్యాదు కాపీ ఎందుకు పంపబడలేదు?
జర్నలిజం పనికి సంబంధించిన మొత్తం ఆర్కైవ్ సస్పెన్షన్ “చర్చల ద్వారా సాధ్యం కాదు” అని హోస్టింగర్ స్పెషలిస్ట్ ఏ ప్రాతిపదికన ప్రకటించారు?
2026 అక్టోబరు 24 నాటి ఎక్స్‌పార్టే ఉత్తర్వు నా వెబ్సైట్ టోకు సస్పెన్షన్‌కు సంబంధించి నా న్యాయ సలహాదారులు కోర్టులో తగిన చర్యలు తీసుకునే ప్రక్రియలో ఉండగా, వెబ్ హోస్టింగ్ ప్రొవైడర్ల దొడ్డిదారిన చేపట్టిన ఈ సెన్సార్షిప్ మీడియా స్వతంత్రతకు, ప్రతి భారతీయ పౌరుడి ప్రాథమిక హక్కుగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛకు ప్రమాదకరమైన ఉదాహరణగా నిలుస్తుంది.
భవదీయుడు,
పరంజయ్ గుహ ఠాకుర్తా
(స్వతంత్ర జర్నలిస్ట్, రచయిత, ప్రచురణకర్త; డాక్యుమెంటరీ సినిమాలు, మ్యూజిక్ వీడియోల రూపకర్త)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
