21 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత ధ్రువీకరణ తేదీకి ముందు మూడు సంవత్సరాల లోపు ఎవరైనా అలాంటి కార్యకలాపాలలో పాల్గొనడాన్ని గుర్తించినట్లయితే వారు చురుకుగా అందులో కొనసాగుతున్నట్టు పరిగణించబడుతుంది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరుగుతున్న అసమ్మతి దృష్ట్యా నియామకాల కోసం నిబంధనలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది.
“ప్రభుత్వ మార్పు” లేదా “స్థాపించబడిన వ్యవస్థలో” మార్పుల కోసం నిరసనలు తెలుపుతున్న వారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందకుండా నిషేధం విధించింది.
ప్రభుత్వ శాఖల్లో ప్రత్యక్ష నియామకం ద్వారా ఎంపికైన అభ్యర్థుల కోసం శీల ధ్రువీకరణ (క్యారెక్టర్ వెరిఫికేషన్) నిబంధనల మార్గదర్శకాలను ఆదిత్యనాథ్ ప్రభుత్వం అక్టోబర్ 28న సవరించినట్టు ‘ది హిందూ’ కథనం వెల్లడించింది.
“హింసాత్మక చర్యల ద్వారా ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో మార్పులు” కోరుతున్న సంఘాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని ఇందులో పేర్కొంది.
హింసాత్మక పద్ధతులు ప్రోత్సహిస్తే అనర్హత
“హింసాత్మక పద్ధతుల ద్వారా ‘విద్యమాన్ వ్యవస్థ'(స్థాపించబడిన వ్యవస్థ)ను మార్చాలని ఉద్దేశించి లేదా ప్రతిజ్ఞ చేసిన సంఘంలో ఏ అభ్యర్థినైనా సభ్యులుగా గుర్తించినట్లయితే, రాష్ట్ర ఉపాధికి వారు అనర్హులుగా పరిగణించబడతారు.
రాజకీయ సిద్ధాంతం అనేది ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా చేయడానికి ప్రాతిపదిక కాదు. కానీ హింస ద్వారా బలవంతంగా అధికారాన్ని మార్చాలని ‘సంకల్పిత్ ఉద్దేశ్య్'(సంకల్పంతో ఉన్న ఉద్దేశం) ఉన్న సంఘాలతో సంబంధం ఉన్నవారిని అనర్హులుగా పరిగణిస్తారు” అని ఆ సర్క్యులర్ పేర్కొంది.
ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు, బోర్డులు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు ఈ శీల ధ్రువీకరణ నిబంధనలు వర్తిస్తాయి.
ఎవరైతే 21 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత ధ్రువీకరణ తేదీకి మూడు సంవత్సరాలలోపు ఇలాంటి కార్యకలాపాలలో పాల్గొన్నట్టు గుర్తించినట్లయితే వారు అందులో చురుకుగా కొనసాగుతున్నట్టు భావించబడుతుంది.
అయితే ఈ కాలంలో అభ్యర్థి వ్యవహారశైలి, మానసిక స్థితిలో “నిజాయితీగా, సానుకూలంగా మార్పు వచ్చినట్లు సరైన పత్రాలతో కూడిన సాక్ష్యాధారాలు” ఉన్నట్లయితే పునఃపరిశీలించడానికి అధికారులకు ఈ మార్గదర్శకాలు అనుమతిస్తాయి.
సీఎం ఆదిత్యనాథ్ విమర్శల నేపథ్యం
కాక్రోచ్ జనతా పార్టీ, ఏఐఎస్ఏ, ఇతర విద్యార్థి సంఘాల నిరసనలపై ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ విమర్శలు చేసిన కొన్ని వారాలకే ఈ ప్రకటన వచ్చింది.
“ప్రజాస్వామ్యంలో అధికారానికి మార్గం ప్రజల తీర్పు నుంచి వస్తుందే కానీ, గందరగోళం నుంచి కాదు. బంగ్లాదేశ్ మాదిరిగా భారత్లో అధికార మార్పిడి కలలు కంటున్న శక్తులు దేశ నిర్మాణానికి కృషి చేయడానికి బదులుగా అరాచక పనిముట్లను యువత చేతుల్లో పెట్టాలని చూస్తున్నాయి” అని ఆయన అన్నారు.
“అధికార మార్పిడి” తమ ఉద్దేశమని, బంగ్లాదేశ్ జెన్-జీ యువత “మార్గం చూపించిన విధానం”తో తాను ప్రేరణ పొందినట్లు ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ఢిల్లీ ప్రెస్ క్లబ్లో చెప్పిన మాటలకు స్పందనగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరం
సమాజ్వాదీ పార్టీ అధికార ప్రతినిధి అశుతోష్ వర్మ ఈ మార్పులపై స్పందిస్తూ, “ఇవి పిరికి ప్రభుత్వ నిబంధనలు. అధికార మార్పిడి అంటే అర్థం ఏమిటి? అది వ్యవస్థలో మార్పు కాదు, అది అధికారంలో మార్పు” అని చెప్పినట్టు పీటీఐ కథనం తెలియజేసింది.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి సురేంద్ర రాజ్పుత్ కూడా కొత్త నిబంధనల పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
“యువత నిరసన వ్యక్తం చేస్తే అది హింస కాదు. వారు దీక్ష చేస్తే అది హింస కాదు. పేపర్ లీకులకు వ్యతిరేకంగా వారు నిరసన తెలిపితే, అదీ హింస కాదు” అని ఆయన అన్నారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
