భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టుకు అసాధారణమైన బాధ్యత ఉంది. అది ఒక రాజ్యాంగ న్యాయస్థానం మాత్రమే కాదు. పౌరుల ప్రాథమిక హక్కుల సంరక్షకుడు కూడా.
రాజ్యాంగంలోని అధికరణ 32 ప్రకారం, ఒక పౌరుడి ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడితే, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తగిన ఉపశమనం కల్పించాల్సిన బాధ్యత కలిగి ఉంది.
రాజ్యాంగ సభ చర్చల సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఈ అధికరణ ప్రాముఖ్యతను వివరిస్తూ ఇలా అన్నారు:
“ఈ రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన అధికరణ ఏదని నన్ను అడిగితే, ఈ అధికరణ (ఆర్టికల్ 32) తప్ప మరేదీ చెప్పలేను. ఇది లేకపోతే రాజ్యాంగమే శూన్యమవుతుంది. ఇది రాజ్యాంగానికి ఆత్మ, హృదయం.”
అలాంటి నేపథ్యంలో, జూలై 20న, వేలాది మంది యువ విద్యార్థులపై పోలీసులు, పోలీసుల అనుమతితో కొంతమంది దుండగులు తీవ్రంగా దాడి చేశారని న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పుడు, వారి ప్రాథమిక హక్కులను రక్షించడానికి సుప్రీంకోర్టు ఎందుకు నిరాకరించింది?
అంబేద్కర్ మాటలకు విలువ లేదా?
ఈ కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వీ మోహనలతో కూడిన ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది.
“మా సమయాన్ని వృథా చేయకండి. మీ సమయాన్ని కూడా వృథా చేయకండి. వీడియోలు చూడటానికి మాకు సమయం లేదు.”
2026 నాటికి అంబేద్కర్ మాటలు విలువ కోల్పోయాయా? అయితే, 2026 నాటికి అంబేద్కర్ చెప్పిన మాటలు తమ ప్రాముఖ్యత కోల్పోయాయా?
సుప్రీంకోర్టు తన ప్రాథమిక బాధ్యతకు దూరమవుతోందా? లేక మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేదా? రాజ్యాంగ సభలో అంబేద్కర్ చెప్పిన మరో మాటను సుప్రీంకోర్టు గుర్తు చేసుకోవాలి.
“ప్రాథమిక హక్కులు వ్యక్తిగత స్వేచ్ఛ, భద్రతకు కల్పించిన అత్యంత గొప్ప రక్షణ.” ఆయన ఇంకా ఇలా చెప్పారు.
సుప్రీంకోర్టు వైఖరిలో అస్థిరత..
“ప్రాథమిక హక్కుల లక్ష్యాలు రెండు. మొదటిది ప్రతి పౌరుడు ఆ హక్కులను వినియోగించుకోగలగాలి. రెండోది ఆ హక్కులు ప్రతి ప్రభుత్వ అధికారిపై బంధనంగా ఉండాలి.”
అయితే, ఈ విషయంలో సుప్రీంకోర్టు వైఖరి స్థిరంగా లేదు. తాను ప్రాథమిక హక్కుల సంరక్షకుడినని చెప్పుకుంటూనే, 1950లో రోమేష్ థాపర్ కేసు, 1961లో దర్యావో కేసులో ప్రభుత్వం ఎంత మంచి ఉద్దేశంతో పనిచేసినా, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కనిపిస్తే కోర్టు జోక్యం చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే, 1989లో రామ్‌శరణ్ ఆట్యానుప్రసి కేసులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్) ద్వారా ప్రజల హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని తెలిసినప్పుడు, సాంకేతిక పరిమితులను పక్కనబెట్టి, కోర్టు విచారణ చేపట్టాలని కూడా పేర్కొంది.
న్యాయమూర్తుల రక్షణకు మాత్రం వేగంగా స్పందన..
అయితే, విచిత్రంగా తమ స్వంత న్యాయమూర్తుల విషయంలో మాత్రం సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుంటుంది.
1991లో నడియాద్‌లో ఒక మేజిస్ట్రేట్‌ను పోలీసులు అవమానించినప్పుడు, కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసి, సంబంధిత పోలీసు ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయాలని ఆదేశించింది.
మళ్లీ 1994లో అలహాబాద్ హైకోర్టు ప్రాంగణంలో పోలీసులు న్యాయమూర్తులు, న్యాయవాదులపై దాడి చేసినప్పుడు, వెంటనే పారా మిలిటరీ బలగాలను మోహరించాలని ఆదేశించింది. అనంతరం సీబీఐ దర్యాప్తును కూడా ఆదేశించింది.
ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తనపై, సుప్రీంకోర్టుపై వస్తున్న విమర్శలను పట్టించుకోకపోవచ్చు. కానీ ఆ విమర్శలకు బలమైన ఆధారం ఉంది. అవి న్యాయవ్యవస్థను బలహీనపరచడానికి కాదు. న్యాయ పరిపాలనను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే వస్తున్నాయి.
విద్యార్థుల పట్ల ఎందుకీ నిర్లక్ష్యం?
అందుకే, ఆయన నేతృత్వంలోని ధర్మాసనం ఒకవైపు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి ప్రస్తావించిన ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకంలోని అధ్యాయాన్ని నిషేధించేందుకు మెరుపు వేగంతో స్పందించి, ఆ పుస్తకం ప్రచురణ, పంపిణీ నిలిపివేయాలని, సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించగలుగుతుంది.
కానీ మరోవైపు, ఉన్నత విద్యలో మెరుగైన పరిపాలన కావాలని, నీట్ ప్రశ్నాపత్రం లీక్ వంటి కుంభకోణాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసిన యువ భారతీయులను రక్షించేందుకు మాత్రం సమయం లేదని చెప్పడం అర్థంకాని విషయం.
సామాన్యుల పిల్లలే పోరాడాలా?
ఆ విద్యార్థులు కోరుతున్నది సరైనదే. ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో జవాబుదారీతనం. ఎందుకంటే ఇలాంటి పరీక్షల మోసాలు పదే పదే జరుగుతున్నాయి. వాటి వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోంది. కొంత మంది యువకులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
దేశం దీనిగురించి ఆలోచించిందా? రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, న్యాయమూర్తులు వంటి అధికారంలో ఉన్నవారి పిల్లలు ఎందుకు అత్యుత్తమ విద్యను పొందుతున్నారు?
ఎందుకు వారికి ఉత్తమ ఉద్యోగాలు లభిస్తున్నాయి, వాటిలో చాలావరకు విదేశాల్లో ఉంటున్నాయి? అదే సమయంలో సాధారణ ప్రజల పిల్లలు ఎందుకు తమ భవిష్యత్తు కోసం ఇంత తీవ్రంగా పోరాడాల్సి వస్తోంది?
న్యాయవ్యవస్థపైనే ప్రజల ఆశలు..
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని న్యాయవ్యవస్థ వైపు భారత్ ఆశగా చూస్తోంది?
భారత విద్యా వ్యవస్థ కాలానుగుణ అవసరాలకు సరిపడేలా పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఉంది. అలా చేసినప్పుడే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ప్రస్తుతం కోట్లాది మంది యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తి చేసిన “బొద్దింకలు” వ్యాఖ్యల నుంచే “కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)” అనే ఉద్యమం పుట్టుకొచ్చింది.
అధికారంలో ఉన్నవారి విధానాల కారణంగా నిరుద్యోగులుగా ఉన్న భారత యువతపై ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత వేదనాభరితమైనవిగా నిలిచాయి. ఇలాంటి సందర్భంలో, సుప్రీంకోర్టు 1950లో చెప్పిన తన స్వంత మాటలను ఆయన గుర్తు చేసుకోవాలి.
“ఈ న్యాయస్థానం ప్రాథమిక హక్కుల సంరక్షకుడిగా, హామీదారుగా ఏర్పాటైంది. కాబట్టి, ఆ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు వాటి రక్షణ కోరుతూ వచ్చే దరఖాస్తులను విచారించకుండా ఉండడం, ఈ న్యాయస్థానానికి అప్పగించిన బాధ్యతకు విరుద్ధం.” భారతదేశ ప్రజలు నేడు ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నైతికతను, న్యాయపాలనను కాపాడాలని న్యాయవ్యవస్థ వైపు ఆశగా చూస్తున్నారు. అలా చేయడానికి సుప్రీంకోర్టు తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతను నిర్వర్తిస్తుందని ఆశిద్దాం.
అనువాదం: డి వెంకన్న
(ఈ వ్యాఖ్యానం ప్రచురించే సమయానికి జూలై 20 జంతర్ మంతర్ పరిణామాలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయించాలని, దోషులుగా నిర్ధారణ అయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
