స్వతంత్ర భారతదేశంలో నాటి హైదరాబాద్ సంస్థానం విలీనమై 2026 సెప్టెంబరు 17తో 78 ఏళ్లు నిండుతాయి. విలీనాన్ని వ్యతిరేకిస్తూ అప్పటి హైదరాబాద్ సంస్థానాధీశుడు నిజాం నవాబు తన సొంత సైన్యం రజాకార్ల ద్వారా సాగించిన వేధింపులు, దౌర్జన్యాలు, అరాచకాలు, అణచివేతలు, దాడులు, చివరకు హింసకు వేలాది మంది బలయ్యారు.
అయితే ఈ అణచివేత, విధ్వంసాలకు కేవలం చివరి నిజాం, రజాకార్లు మాత్రమే కారణం కాదు. ఆ వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్న చిన్న సంస్థానాధీశులు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, దొరలు, పటేల్, పట్వారీలు(వీరిలో ప్రధానంగా రెడ్డి, వెలమ, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు చెందిన వారు) కూడా ప్రధాన కారణంగా ఉన్నారు. నిజాం వ్యవస్థ ఈ స్థానిక పెత్తందార్ల పునాదులపైనే నిలబడి ఉండేది.
నిజాంల ఆగమనం, చారిత్రక నేపథ్యం..
కవి, పరిపాలకుడు మహ్మద్ కులీ కుతుబ్ షా “భూమిపై స్వర్గం నమూనాగా” హైదరాబాద్ నగరాన్ని 1591లో స్థాపించారు. ఆయన ప్రేమించిన గాయని, నృత్య కళాకారిణి భాగమతికి కానుకగా “భాగ్నగర్” పేరుతో ఈ కొత్త నగరాన్ని స్థాపించారు.
ఆ తర్వాత ఔరంగజేబు 1687లో దండయాత్ర వల్ల విజయం సాధించడంతో ఆయన గవర్నర్‌ను “నిజాం” అని పిలిచేవారు. అక్కడి నుంచి నిజాం పరిపాలన మొదలై వంశపారంపర్యంగా 1724 నుంచి 1948 వరకు హైదరాబాద్ స్టేట్‌ను పరిపాలించారు. వారి పరిపాలన తొలుత తెలంగాణ ప్రాంతానికే పరిమితం కాగా తర్వాత కాలక్రమేణా ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్, బీడ్, నాందేడ్, పర్భనీ, ఇటు కర్ణాటకలో ఉన్న బీదర్, గుల్బర్గా, ఉస్మానాబాద్ జిల్లాల వరకు హైదరాబాద్ సంస్థానాన్ని విస్తరించి పరిపాలనను కొనసాగించారు.
సికింద్రాబాద్ ఆవిర్భావం, స్థానిక సంస్థానాల మద్దతు..
అప్పటి పరిస్థితులు, అవసరాల మేరకు 1798లో రెండవ నిజాంతో బ్రిటిష్ వారు ఒప్పందం కుదుర్చుకోవడంతో 1806లో సికింద్రాబాద్ ఏర్పడింది.
మొదటి స్వాతంత్ర్య పోరాటం 1857 తర్వాత బ్రిటిష్ దళాల కోసం సికింద్రాబాద్ నిర్మాణాన్ని 1867లో పూర్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మొత్తం ఐరోపా ప్రజలకు బస ఏర్పాటు చేయడానికి కావల్సినంతగా నిర్మించారు. ఆ రోజుల్లో సికింద్రాబాద్ ప్రాంతంలో ఎక్కువగా ఆంగ్లో ఇండియన్లు, పార్సీలు నివసించేవారు. సికింద్రాబాద్‌ను 1964లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడం జరిగింది.
మరోవైపు హైదరాబాద్ రాజ్యంలోని గద్వాల, వనపర్తి, కొల్లాపూర్ లాంటి చిన్న సంస్థానాలు నిజాంకు కప్పం కడుతూ స్థానికంగా తమ సొంత పెత్తనం చెలాయించేవి. వారు కూడా నిజాం వ్యవస్థను కాపాడే ప్రయత్నంలో పేదల అణచివేతకు మద్దతు ఇచ్చారు.
భూస్వామ్య దోపిడీ, సాయుధ పోరాట నేపథ్యం..
స్వతంత్ర భారతదేశంలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ మొండిగా గట్టి పట్టుదలతో వ్యవహరించిన నిజాం నవాబు పరిపాలనకు ముగింపు పలకడానికి ముందు హైదరాబాద్ రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అనేక పోరాటాలు జరిగాయి, ముఖ్యంగా తెలుగు భాష పరిరక్షణ, గ్రంథాలయ ఉద్యమాలు బాగా ప్రచారం పొందాయి.
అదే సమయంలో నిజాం పాలనలో భూమిపై పూర్తి పెత్తనం దొరలు, భూస్వాముల చేతిలోనే ఉండేది. వారు పన్నులు వసూలు చేసే అధికారులుగా వ్యవహరిస్తూ, పేద రైతులు, దళితులు, బడుగు వర్గాల వారిచేత బలవంతంగా ‘వెట్టి చాకిరి'(ఉచిత శ్రమ) చేయించుకునేవారు.
పేదల భూములను లాక్కోవడం, ఆడబిడ్డలను వేధించడం, కౌలు రైతులను చిత్రహింసలకు గురిచేయడం లాంటివి స్థానిక పెత్తందార్ల కనుసన్నల్లోనే జరిగేవి.
తెలంగాణ చరిత్రను గమనిస్తే, 1946లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటం ముందు నిజాంకు వ్యతిరేకంగా మొదలుకాలేదు. అది విసునూరు రామచంద్రారెడ్డి, జన్నారెడ్డి ప్రతాపరెడ్డి లాంటి స్థానిక దొరల దౌర్జన్యాలకు, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పేద రైతులు చేసిన పోరాటం. చాకలి ఐలమ్మ భూమి పోరాటం, దొడ్డి కొమురయ్య అమరత్వం లాంటివి ఈ పెత్తందార్ల అణచివేతకు వ్యతిరేకంగా పుట్టినవే.
అయితే కమ్యూనిస్టుల నాయకత్వంలో పేదలు ఏకమై తమ భూములను లాక్కుంటున్నారని భయపడిన స్థానిక దొరలు, భూస్వాములు తమ ఆస్తులను రక్షించుకోవడానికి నిజాం ప్రైవేట్ సైన్యమైన రజాకార్లతో చేతులు కలిపారు.
రజాకార్ల దాడులకు స్థానిక సమాచారం అందించడం, వారికి వసతి కల్పించి విప్లవకారుల ఆచూకీ చెప్పడం ద్వారా పేదల అణచివేతలో ఈ భూస్వాములు కూడా ప్రత్యక్షంగా భాగస్వాములయ్యారు.
ఆపరేషన్ పోలో, సమిష్టి దౌర్జన్యానికి ముగింపు..
నిజాం బలవంతపు చర్యలు, స్థానిక పెత్తందార్ల దౌర్జన్యాలు మితిమీరడంతో వాటిని ప్రతిఘటిస్తూ ఒకవైపు కమ్యూనిస్టుల సాయుధ పోరాటం, అధికార వాంఛతో కాంగ్రెస్ ఉద్యమం ఉధృతమయ్యాయి. అధికార దాహంతో కొట్టుమిట్టాడుతున్న నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం అంత సులభంగా జరిగిన ప్రక్రియ కాదు.
“ఆపరేషన్ పోలో” పేరుతో జరిగిన సైనిక చర్యకు మొదట 1948 మార్చి 1వ తేదీన బీజాలు పడ్డాయి. అదే రోజున మొదటి సైనిక యూనిట్ సరుకులు, సిబ్బందితో హైదరాబాద్ శివారు ప్రాంతానికి చేరుకుంది.
ఆ తర్వాత బీహార్ డోగ్రా రెజిమెంట్లు, మే 20న శ్రీనగర్ నుంచి ట్యాంకులతో సిక్కుల రెజిమెంట్ చేరుకోవడంతో, ఆగస్టు 1, 1948 నాటికి వేల సంఖ్యలో సైనిక దళాలు చేరుకొని జూన్ 1948 నాటికి “ఆపరేషన్ కబడ్డీ” కోసం రంగం సిద్ధం చేసి నలువైపుల నుంచి హైదరాబాద్ స్టేట్‌ను చుట్టుముట్టారు.
ఇలా ఒకవైపు అంతర్గతంగా కమ్యూనిస్టుల ఒత్తిడి, బయట నుంచి సైనికుల ఒత్తిడికి తలొగ్గి నిజాం నవాబు చివరికి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి 1948 సెప్టెంబర్ 17వ తేదీన అంగీకరించారు. దీంతో అంతవరకు స్వతంత్రంగా రాచరికపు పరిపాలనలో ఉన్న హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో భాగమైపోయింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
