ది డైలీ స్టార్(టీడీఎస్): దక్షిణాసియాలో ముస్లిం గుర్తింపు, మహిళల ప్రజా–రాజకీయ అధికారం చుట్టూ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే పదహారో శతాబ్దపు చాంద్ బీబీ కథను నేటి పరిస్థితులకు సాధారణంగా అన్వయించే కథగా మార్చకుండా ఆమె కథ మన ప్రస్తుత కాలంతో ఎలా సంభాషిస్తుంది అని మీరు భావిస్తున్నారు?
సారా వహీద్: చాంద్ బీబీని నేటి కాలానికి సరళమైన ప్రతీకగా మార్చకుండా ఉండటంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను.
పదహారో శతాబ్దం మనం జీవిస్తున్న నేటి ప్రపంచం కాదు. చాంద్ బీబీ జీవితం రాజవంశాలు, రాజదర్బార్లు, సైనిక శక్తి, పర్షియన్ సాంస్కృతిక–రాజకీయ సంప్రదాయాలు, భారతీయ రాజకీయ సంస్కృతులతో కూడిన ప్రపంచంలో సాగింది. అందువల్ల ఆమె జీవించిన ప్రపంచాన్ని ఆధునిక ప్రజాస్వామ్యం, జాతీయవాదం, స్త్రీవాదం లేదా మైనారిటీ రాజకీయాల వంటి నేటి భావనలకు పూర్తిగా కుదించలేం.
కానీ చరిత్రకారులు గతం గురించి అడిగే ప్రశ్నలను వర్తమానమే ప్రభావితం చేస్తుంది.
హిందూ జాతీయవాద రాజ్యం ముస్లింలను గతం నుంచే కాకుండా వర్తమానం నుంచే తుడిచివేయాలని చూస్తున్న సమయంలో నేను ఈ పుస్తకం రాశాను.
భారతదేశంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారిపై నిఘా పెడుతున్నారు. వారిని హింసిస్తున్నారు. వారి ఇళ్లను లాక్కుంటున్నారు.
అంతేకాక రాజకీయ నాయకుల నుంచి వారిపై జాతి నిర్మూలనకు పిలుపులు పెరుగుతున్నాయని మనం వింటున్నాం.
భారతదేశంలో ముఖ్యంగా ముస్లిం మహిళలను చారిత్రక పాత్రధారులుగా అదృశ్యంగా ఉంచుతూనే వారిని తరచుగా అణచివేతకు, మతపరమైన వివాదాలకు, రక్షణకు, అనుమానానికి లేదా ద్వేషానికి ప్రతీకలుగా చిత్రీకరిస్తున్నారు. వారిని ప్రముఖంగా చూపినప్పుడు కూడా వారిని మినహాయింపులుగానే పరిగణిస్తున్నారు.
అయితే చరిత్రను నిర్మించిన క్రియాశీలక వ్యక్తులుగా మాత్రం వారిని కనిపించకుండా చేస్తున్నారు.
దక్షిణాసియాలోని ముస్లిం మహిళలు చరిత్రను భరించడమే కాకుండా చరిత్రను సృష్టించారని చాంద్ బీబీ కథ మనకు గుర్తు చేస్తుంది. వారు పాలించారు, సంప్రదింపులు జరిపారు, రక్షించారు, సలహాలిచ్చారు, నిర్మించారు, బోధించారు, జ్ఞాపకాలను భద్రపరిచారు, రాజకీయ జీవితాన్ని తీర్చిదిద్దారు.
షాహీన్ బాగ్ నిరసనలకు కేంద్రబిందువు..
2019–2020లో షాహీన్ బాగ్‌లో దీనికి మనం ఒక స్పష్టమైన ఉదాహరణను చూశాం.
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ముస్లింల పట్ల వివక్ష చూపుతోందని, వారి పౌరసత్వ హక్కులకు ముప్పు కలిగిస్తోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో షాహీన్ బాగ్ వ్యతిరేక సీఏఏ నిరసనలకు కేంద్రబిందువుగా మారింది.
దానికి ప్రతిస్పందనగా సాధారణ ముస్లిం మహిళలు షాహీన్ బాగ్‌లో అసాధారణమైన ఐక్యతా ప్రదర్శనకు శ్రీకారం చుట్టి శక్తివంతమైన ప్రజా రాజకీయ పాత్రధారులుగా ముందుకొచ్చారు.
వారు పౌరసత్వం, రాజ్యాంగ హక్కులు, చారిత్రక జ్ఞాపకం, నైతిక అధికారాన్ని ఆధారంగా చేసుకున్న భాషలో తమ నిరసనను వ్యక్తం చేశారు.
దక్షిణాసియాలో ముస్లిం మహిళల రాజకీయ ప్రతిఘటనకు చరిత్రలో ఎంతో లోతైన, సుదీర్ఘమైన మూలాలు ఉన్నాయని చాంద్ బీబీ కథ మనకు గుర్తు చేస్తుంది.
ఆమె కథ చరిత్రను రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా ఆయుధంగా మార్చుకుంటున్నామో కూడా ప్రశ్నిస్తుంది.
నేడు భారతదేశంలో మొఘల్ చరిత్రపై తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. దాన్ని కించపరచడం, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం కూడా కనిపిస్తోంది.
అయితే మన దృష్టిని మొఘల్ చక్రవర్తుల నుంచి దక్కన్లో మొఘల్ విస్తరణను ప్రతిఘటించిన ఒక ముస్లిం మహిళ వైపు మళ్లిస్తే పరిస్థితి ఎలా మారుతుంది?
చాంద్ బీబీని ఏ ఒక్క సిద్ధాంతపరమైన కథనంలోనూ సులభంగా ఇమడ్చలేం.
ఆమె ముస్లిం —కానీ మొఘల్ కాదు. ఆమె రాజవంశానికి చెందిన పాలకురాలు —కానీ సామ్రాజ్యవాద విస్తరణకు వ్యతిరేకంగా నిలిచారు. ఆ సంక్లిష్టత వల్లనే ఆమె ఇప్పుడు ముఖ్యమైనది.
గతం ఎల్లప్పుడూ దానిని ఉపయోగించుకునే ఆధునిక రాజకీయ ప్రయోజనాల కంటే మరింత సంక్లిష్టమైనదని ఆమె మనకు నేర్పిస్తుంది.
ఆమె కథ వర్తమానానికి ఒక సరళమైన పాఠాన్నే ఇవ్వదు బదులుగా అది మనకు మరింత సుసంపన్నమైన చారిత్రక ఊహాశక్తిని కూడా ఇస్తుంది.
ఇది ముస్లిం స్త్రీలను దీర్ఘకాలంగా తెలివితేటలు, సార్వభౌమత్వం, ధైర్యం, శక్తిని ప్రదర్శించిన పూర్తిగా సంక్లిష్టమైన వ్యక్తులుగా గుర్తుంచుకోవాలని కోరుతుంది.
చరిత్ర కేవలం పాత పత్రాల్లో మాత్రమే ఉండదు..
ది డైలీ స్టార్ (టీడీఎస్): చాంద్ బీబీ గురించి ఇన్నేళ్లు పరిశోధించి, ఆమెతో మమేకమైన తర్వాత ఇప్పుడు మీరు ఏ అంశంపై పని చేస్తున్నారు?
సారా వహీద్: ఒక విధంగా చెప్పాలంటే నేను ఇప్పటికీ చాంద్ బీబీతో కలిసి నడుస్తూనే ఉన్నాను. ఆమె నాకు అనేక విలువైన విషయాలను అందించారు.
ముస్లిం స్త్రీల సార్వభౌమత్వం, దక్కన్, చారిత్రక జ్ఞాపకశక్తి, అధికారిక ఆర్కైవ్లకు వెలుపల కూడా మనుగడ సాగించే జ్ఞాన రూపాల గురించి మరిన్ని ప్రశ్నలను ఆమె నా ముందుంచారు.
ప్రత్యేకంగా అనేక పొరలతో కూడిన సామూహిక జ్ఞాపకానికి దక్కన్ ఎలా ఒక సజీవ నిలయంగా మారిందో మరింతగా రాయాలనే ఆసక్తి నాకు ఉంది. అక్కడి దర్గాలు, చారిత్రక కట్టడాలు, మహిళల కథలు, కుటుంబ ఆర్కైవ్‌లు, మౌఖిక సంప్రదాయాలు, హైదరాబాద్ వంటి సంస్థాన రాజ్యాలు అంతరించిన తర్వాత కూడా మిగిలిపోయిన వాటి జ్ఞాపకాలు, ప్రభావాలు —ఇవన్నీ నాకు ఎంతో ఆసక్తికరమైన అంశాలు.
కుటుంబాలు తరతరాలుగా దాచుకున్న కథలు, పాటల్లో నిలిచిపోయిన జ్ఞాపకాలు, భక్తి–ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో సజీవంగా ఉన్న కథనాలు, మన కళ్లముందే కనిపించే స్థానిక భూదృశ్యాలు—ఇవన్నింటిలో దాగి ఉన్న చరిత్రను మనం ఎలా అర్థం చేసుకోవాలి?
అధికారిక ఆర్కైవ్లలో చోటు దక్కని ప్రజలు తమ గురించి తాము కాపాడుకున్న జ్ఞానాన్ని, జ్ఞాపకాలను కొట్టిపారేయకుండా అదే సమయంలో చరిత్ర రచనలోని కచ్చితత్వాన్ని, పరిశోధనా ప్రమాణాలను ఎలా నిలబెట్టుకోవాలి?
నాకు అనిపించేది ఏమిటంటే చరిత్ర కేవలం పాత పత్రాల్లో మాత్రమే ఉండదు. అది మనుషుల జ్ఞాపకాల్లో ఉంటుంది. వారు పాడుకునే పాటల్లో ఉంటుంది. వారు తరతరాలకు చెప్పుకునే కథల్లో ఉంటుంది.
ఒక సమాధి దగ్గర మిగిలిన నిశ్శబ్దంలో ఉంటుంది.
ఒక పాత కోట గోడల్లో, ఒక నగర వీధిలో, ఒక కుటుంబం దాచుకున్న పాత పత్రంలో కూడా ఉంటుంది.
చరిత్ర నుంచి ఒకరిని చెరిపివేయడం అంటే వారి జ్ఞాపకాన్ని పూర్తిగా అంతం చేయడం కాదని చాంద్ బీబీ కథ నాకు నేర్పింది. కొన్నిసార్లు అధికారిక చరిత్ర తలుపులు మూసుకున్నా జ్ఞాపకం మరో దారి వెతుక్కుంటుంది.
ఒక తరం చెప్పిన మాట మరో తరానికి చేరుతుంది.
ఒక పాటలో ఒక పేరు మిగులుతుంది. ఒక ప్రదేశం ఒక కథను తనలో దాచుకుంటుంది. అలా మరుగునపడ్డ గతం మళ్లీ మన ముందుకు వస్తుంది.
అందుకే నా తదుపరి రచన కూడా బహుశా ముస్లిం మహిళల కథలు, హైదరాబాద్, జ్ఞాపకం, అలాగే జాతీయవాద చరిత్రలోని చెరిపివేతకు సవాలు చేసే చరిత్రలను రాయడం వెనుక ఉన్న రాజకీయాల గురించే కొనసాగుతుంది.
ఎందుకంటే చరిత్రలో కనిపించకుండా పోయిన స్వరాలను తిరిగి వినిపించడం అంటే గతాన్ని మాత్రమే తిరిగి పొందడం కాదు.
ఎవరి జ్ఞాపకాలు చరిత్రగా పరిగణించబడాలి, ఎవరి కథలు మరుగునపడాలి అనే అధికారాన్ని కూడా ప్రశ్నించడం. చాంద్ బీబీ కథ నాకు మిగిల్చిన అతిపెద్ద ప్రశ్న అదే.
ఈ వ్యాసం నాలుగు భాగాలుగా ప్రచురితమైంది, ఇది చివరి భాగం. మొదటి, రెండవ, మూడవ భాగం కోసం 1, 2, 3 వీటి మీద క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
