“స్వేచ్ఛను కోరడం మాత్రమే కాదు, దాని కోసం త్యాగం చేయడానికి సిద్ధపడటమే నిజమైన దేశభక్తి”.
భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్ వంటి మహా నాయకుల పేర్లు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.
అయితే వారి వెంట నడిచిన, అదే లక్ష్యం కోసం జైళ్లలో చిత్రహింసలు అనుభవించిన, చివరకు తమ ప్రాణాలను అర్పించిన అనేకమంది విప్లవ వీరులు చరిత్రలో తగినంతగా గుర్తింపు పొందలేదు. మహావీర్ సింగ్ రాథోర్ అలాంటి అమర వీరుల్లో ఒకరు.
ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్ ప్రాంతంలో 1904 సెప్టెంబర్ 16న మహావీర్ సింగ్ రాథోర్ జన్మించారు. ఆయన నౌజవాన్ భారత్ సభ, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్(హెచ్ఎస్ఆర్ఏ) వంటి విప్లవ సంస్థలతో కలసి పని చేశారు
భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్, దుర్గాభాభి వంటి విప్లవకారులకు సహాయం చేసిన ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం లాహోర్ కుట్ర కేసులో అరెస్టు చేసి చివరకు అండమాన్ సెల్యులార్ జైలుకు తరలించింది. అక్కడ రాజకీయ ఖైదీలపై జరుగుతున్న అమానుష వైఖరిని నిరసిస్తూ ఆయన నిరాహార దీక్ష చేపట్టారు.
బ్రిటిష్ అధికారులు బలవంతంగా ఆహారం అందించే ప్రయత్నాన్ని ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు. ఆ క్రమంలో ఆయన ఆరోగ్యం విషమించి 1933 మే 17న అమరుడయ్యారు.
జననం, దేశభక్తి వాతావరణంలో బాల్యం..
మహావీర్ సింగ్ 1904 సెప్టెంబర్ 16న అప్పటి ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో జన్మించారు. నేడు అది కాస్గంజ్ జిల్లాలో ఉంది. చిన్న వయస్సులోనే ఆయనలో బ్రిటిష్ పాలనపై వ్యతిరేకత పెరిగింది. ఆయన విద్యాభ్యాసం కొనసాగుతున్న సమయంలో ఆరో తరగతి నుంచే స్వాతంత్ర్యోద్యమ ప్రభావానికి ఆకర్షితులయ్యారు.
యువకుడిగా ఎదిగే నాటికే స్వాతంత్ర్యం ఆయన జీవిత లక్ష్యంగా మారింది. మహావీర్ సింగ్ కాన్పూర్‌లోని డీఏవీ కాలేజీలో చదువుతున్న సమయంలో విప్లవకారులతో పరిచయం ఏర్పడింది. ఆ కాలంలో కాన్పూర్ ఉత్తర భారతదేశంలోని రాజకీయ, కార్మిక, విప్లవ కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా ఉంది. యువకులలో స్వాతంత్ర్యం, సామాజిక సమానత్వం, వలస వాద వ్యతిరేకత వంటి భావాలు బలంగా నాటుకున్నాయి.
ఈ వాతావరణంలో మహావీర్ సింగ్ శివ వర్మ, జయదేవ్ కపూర్, తరువాత భగత్‌సింగ్ తదితర విప్లవ కారులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఆయన “ప్రతాప్” అనే మారు పేరుతో విప్లవ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
భగత్‌సింగ్, ఆయన సహచరులు యువతను రాజకీయంగా చైతన్య పరచడానికి నౌజవాన్ భారత్ సభను నిర్మించారు.
ఈ సంస్థ ఉద్దేశ్యం కేవలం బ్రిటిష్ పాలనను తొలగించడం మాత్రమే కాదు. యువతలో మత సామరస్యం, సామాజిక సమానత్వం, వలస వాద వ్యతిరేకత, శాస్త్రీయ దృక్పథం, దేశభక్తి, ప్రజల రాజకీయ చైతన్యం వంటి భావాలను పెంపొందించడం వంటి లక్ష్యాలతో పని చేసింది. మహావీర్ సింగ్ ఈ సంస్థలో చురుకుగా పని చేశారు.
భగత్‌సింగ్ సహచరుడిగా మహావీర్ సింగ్..
మహావీర్ సింగ్ భగత్‌సింగ్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవాడు. భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్, దుర్గాభాభి వంటి విప్లవకారులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మహావీర్ సింగ్ ఎంతో సహాయపడ్డాడు.
లాహోర్‌లోని మోజాంగ్ హౌస్ నుంచి భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్, దుర్గాభాభి తప్పించుకునే క్రమంలో మహావీర్ సింగ్ వారికి తోడ్పడ్డాడు.
ఇది అత్యంత సాహసోపేతమైనది. బ్రిటిష్ పోలీసులు విప్లవకారుల కోసం విస్తృతంగా గాలిస్తున్న సమయంలో, వారిని దాచడం లేదా తప్పించడానికి సహాయపడటమంటే అరెస్టు, చిత్రహింసలు, జైలు, మరణశిక్ష వంటి ప్రమాదాలను ఎదుర్కోవడానికి సిద్ధపడటమే. మహావీర్ సింగ్ ఆ ప్రమాదాలన్నిటికి సిద్ధపడి ఆ సాహసం చేశాడు.
మహావీర్ సింగ్ మరో ముఖ్యమైన సంస్థ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్(హెచ్ఎస్ఆర్ఏ)తో కూడా సంబంధాలు కలిగి ఉన్నాడు. 1928లో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ కొత్త రూపంలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ గా మార్పు చెందింది.
భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్, రాజ్‌గురు, భగవతీ చరణ్ వోహ్రా తదితర విప్లవ వర్గం కేవలం భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేయడమే కాకుండా, దేశాన్ని సామాజిక-ఆర్థిక అసమానతల నుంచి విముక్తి చేయాలనే లక్ష్యాలతో పనిచేసింది. మహావీర్ సింగ్ ఆ విప్లవ వర్గంలో మరొక యువకుడు.
లాహోర్ కుట్ర కేసు, జీవిత ఖైదు..
బ్రిటిష్ ప్రభుత్వం విప్లవోద్యమాన్ని అణచివేయడానికి అనేక అక్రమ కేసులు నమోదు చేసింది. భగత్‌సింగ్ తదితరులపై నమోదైన లాహోర్ కాన్స్పిరసీ కేస్(లాహోర్ కుట్ర కేసు) అందులో అత్యంత ప్రధానమైనది.
మహావీర్ సింగ్ కూడా ఈ కేసులో నిందితుడిగా అరెస్టయ్యారు. ఆయన వలస పాలకుల న్యాయస్థానాన్ని నిజమైన న్యాయస్థానంగా గుర్తించడానికి నిరాకరించారు. ఆయన ఇతర సహచరులు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయ ప్రక్రియపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. వారి దృష్టిలో కోర్టు స్వతంత్ర న్యాయవ్యవస్థ కాదు.
వలస పాలనలో ఒక భాగం. అందుకే వారు విచారణను రాజకీయ వేదికగా వినియోగించుకున్నారు.
లాహోర్ కుట్ర కేసులో మహావీర్ సింగ్‌కు జీవిత ఖైదు విధించారు. ఆయనను మొదట లాహోర్ జైలులో, తరువాత 1930లో బళ్లారి సెంట్రల్ జైలుకు, ఆ తరువాత మద్రాస్ జైలుకు తరలించారు.
1933 జనవరిలో ఆయనను అండమాన్‌లోని పోర్ట్ బ్లెయిర్ సెల్యులార్ జైలుకు పంపించారు. ఇది సాధారణ విషయం కాదు. అండమాన్ జైలు అంటే అప్పటి రాజకీయ ఖైదీలకు అత్యంత కఠినమైన శిక్షగా ఉండేది. అండమాన్‌లోని సెల్యులార్ జైలు ప్రధానంగా రాజకీయ ఖైదీలను ఇతర ఖైదీల నుంచి వేరుచేసి, వారు సంఘటితంగా ప్రతిఘటించకుండా అణచివేసేందుకు ఉపయోగించబడింది.
ఖైదీలకు ఒంటరి నిర్బంధం, కఠిన శ్రమ, నాణ్యత లేని ఆహారం, అమానుష వైఖరి, శారీరక శిక్షలు, మానసిక వేధింపులు ఉండేవి.
1932లో బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో రాజకీయ ఖైదీలను అండమాన్‌కు తరలించింది. 1933 నాటికి సుమారు వంద మంది రాజకీయ ఖైదీలు అక్కడ నిర్బంధించబడ్డారు. అండమాన్ సెల్యులార్ జైలులో రాజకీయ ఖైదీలకు సాధారణ నేరస్తుల కంటే భిన్నమైన హోదా, మెరుగైన ఆహారం, వైద్య సదుపాయాలు, చదువుకునే అవకాశం, పుస్తకాలు, పత్రికలు, మానవీయ జైలు పరిస్థితులు, శారీరక అవమానాల నుంచి రక్షణ వంటి హక్కులు ఉండాలని రాజకీయ ఖైదీలు డిమాండ్ చేశారు. వారిలో మహావీర్ సింగ్ ఒకరు.
1933 అండమాన్ జైలులో నిరాహార దీక్ష, ప్రాణ త్యాగం..
సెల్యులార్ జైలులోని రాజకీయ ఖైదీలు 1933లో తమ డిమాండ్ల కోసం నిరాహార దీక్ష ప్రారంభించారు. నిరాహార దీక్షను అణచివేయడానికి జైలు అధికారులు బలవంతంగా ఆహారం అందించేవారు. ఖైదీని అదుపులోకి తీసుకుని, ముక్కు ద్వారా ఒక రబ్బరు గొట్టాన్ని లోపలికి పంపి ద్రవ ఆహారాన్ని అందించేవారు. ఇది చాలా ప్రమాదంతో కూడుకున్న ప్రక్రియ.
1933 మే 17న మహావీర్ సింగ్‌కు బలవంతంగా ఆహారం అందించే ప్రయత్నం జరిగింది. అతను తీవ్రంగా ప్రతిఘటించాడు. దాంతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, షాక్ లక్షణాలు, గుండె పట్టుకోవడం వంటి సమస్యలతో పరిస్థితి విషమించింది. చివరకు ఆయన ప్రాణాలు కోల్పోయారు.
బలవంతంగా ఆహారం ఎక్కించడంతో ఆహారం ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల ఆయన మరణించాడని ఆ తర్వాత తేలింది.
1933లో అండమాన్ జైలులో నిరాహార దీక్ష కారణంగా మహావీర్ సింగ్‌తో పాటు మోహిత్ మోయిత్రా, మోహన్ కిశోర్ నమదాస్ అనే మరో ఇద్దరు రాజకీయ ఖైదీలు కూడా ప్రాణాలు కోల్పోయారు.
బ్రిటిష్ ప్రభుత్వం భగత్‌సింగ్‌ను 1931లో ఉరితీసింది. ఆయనతో కలిసి పనిచేసిన మహావీర్ సింగ్ మరో రెండు సంవత్సరాలు జైలు జీవితం కొనసాగించి, చివరకు 1933లో అండమాన్ సెల్యులార్ జైలులో మృతి చెందాడు.
ఒకరు ఉరితాడుకు బలయితే, మరొకరు జైలు అకృత్యాలతో బలి అయ్యాడు. వారి లక్ష్యం భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించడం. భగత్ సింగ్, మహావీర్ సింగ్ లాంటి యువ కిశోరాలు ఎందరో దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగాలు చేశారు. వారందరి త్యాగాల ఫలితమే నేటి భారతదేశం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
