గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2022లో సింగ్ను విడుదల చేయాలని డిమాండ్ చేసిన సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ చవాంకేకు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ మద్దతు ఇచ్చారు. ఆ సమయంలో మాఝీ బీజేపీ శాసనసభ్యుడిగా ఉన్నారు.
న్యూఢిల్లీ: 1999లో ఆస్ట్రేలియాకు చెందిన క్రైస్తవ మిషనరీ గ్రహం స్టెయిన్స్, ఆయన ఇద్దరు మైనర్ కుమారుల హత్య కేసులో ప్రధాన దోషి దారా సింగ్ను జైలు నుంచి ముందస్తుగా విడుదల చేయాలన్న అభ్యర్థనను ఒడిశా ప్రభుత్వం తిరస్కరించినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదించింది.
రాష్ట్ర శిక్షా సమీక్షా బోర్డు, “ఈ దశలో అతని(దారా సింగ్) ముందస్తు విడుదలను సిఫార్సు చేయడానికి తాము సుముఖంగా లేము” అని పేర్కొంది.
అంతకుముందు, కియోంఝర్ జిల్లా అధికారుల నుంచి అదే మేరకు ఒక ప్రతిపాదన అందిన తర్వాత, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సింగ్ విడుదలను సిఫార్సు చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు, బోర్డు నివేదిక..
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పాలిత రాష్ట్రంలో బోర్డు తీసుకున్న తాజా వైఖరి, సింగ్ ముందస్తు విడుదల పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని ఆగస్టు 19న సుప్రీంకోర్టు బోర్డును కోరిన తర్వాత వెలువడింది.
“జిల్లా అధికారుల నివేదికలో నిర్దిష్ట సిఫార్సు లేదు, అది అసంపూర్ణంగా ఉంది. పైన పేర్కొన్న వాస్తవాలు, పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ఈ దశలో అతని ముందస్తు విడుదలను సిఫార్సు చేయడానికి బోర్డు సుముఖంగా లేదు” అని బోర్డు తన ఆగస్టు 31 నాటి కార్యకలాపాలలో పేర్కొంది.
ఆగస్టు 15న, సింగ్ విడుదల ప్రతిపాదనకు సంబంధించి “దారా సేన”కు చెందిన సుమారు 200-250 మంది కెయోంఝర్ జిల్లా జైలు వెలుపల గుమిగూడి, రెచ్చగొట్టే నినాదాలు చేశారని ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక పేర్కొంది.
నెత్తురోడిన కియోంఝర్ ఘాతుకం..
1999లో, సింగ్ ఒక గుంపును నడిపించి, స్టెయిన్స్, అతని ఇద్దరు కుమారులు నిద్రిస్తున్న వాహనానికి నిప్పు పెట్టాడు. కుష్ఠురోగుల కోసం ఆశ్రమం నడుపుతున్న స్టెయిన్స్, అతని ఇద్దరు కుమారులు కాలి బూడిదయ్యారు.
2003లో, ఖోర్ధాలోని విచారణ న్యాయస్థానం సింగ్కు మరణశిక్ష విధించగా, మరో 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ తర్వాత ఒడిశా హైకోర్టు సింగ్ మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది.
ఒక ముస్లిం వ్యాపారి, మరో క్రైస్తవ మిషనరీకి సంబంధించిన మరో రెండు హత్య కేసుల్లో కూడా సింగ్కు శిక్ష పడి, యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2022లో సింగ్ను విడుదల చేయాలని డిమాండ్ చేసిన సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ చవాంకేకు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ మద్దతు ఇచ్చారు. ఆ సమయంలో మాఝీ బీజేపీ శాసనసభ్యుడిగా ఉన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
