బ్రిటిష్ సామ్రాజ్యవాద చరిత్ర రచనలు ముస్లిం మహిళలను అంతఃపురానికే పరిమితమైన, రాజకీయంగా క్రియాశీలత లేని, పురుషుల లైంగిక దృష్టికి లోనయ్యే వ్యక్తులుగా చిత్రించాయి.
భారతీయ జాతీయవాద చరిత్ర రచనలు కూడా చాలావరకు ఇదే దృక్కోణాలను వారసత్వంగా స్వీకరించాయి. ఫలితంగా ముస్లిం మహిళలు చరిత్రలోని అంచులకు నెట్టివేయబడ్డారు.
మరోవైపు హిందూ జాతీయవాద చరిత్ర రచనలు ముస్లిం రాజకీయ అధికారాన్నే విదేశీదిగా, ముప్పుగా చిత్రించాయి.
ఇక ముస్లిం జాతీయవాద చరిత్ర రచనలు కూడా తరచుగా రాజులు, రాజవంశాలు, సామ్రాజ్యాలనే గుర్తుచేసుకున్నాయి; కానీ మహిళలు చలాయించిన సార్వభౌమ రాజకీయ అధికారాన్ని మాత్రం విస్మరించాయి. చాంద్ బీబీ కథ మాత్రం ఈ అన్ని చరిత్ర రచనల దృక్కోణాలనూ ధిక్కరిస్తుంది.
దక్కన్‌ను కేంద్రంగా ఉంచి చూస్తే..
ది డైలీ స్టార్ (టీడీఎస్): పదహారో శతాబ్దపు భారతదేశ చరిత్ర గురించి సాధారణంగా మనకు తెలిసిన కథనం ఎక్కువగా మొఘల్ కేంద్రంగానే ఉంటుంది.
అయితే చాంద్ బీబీని, దక్కన్ సుల్తానతులను మొఘల్ సామ్రాజ్యానికి చివరికి లొంగిపోయిన సరిహద్దు ప్రాంతాలుగా కాకుండా ఆ కాలపు రాజకీయ చరిత్రలో కేంద్ర పాత్రధారులుగా చూస్తే ఆ నాటి దక్షిణాసియా రాజకీయ చరిత్రను మనం అర్థం చేసుకునే విధానంలో ఎలాంటి మార్పు వస్తుంది?
సారా వహీద్: చాంద్ బీబీని దక్కన్‌ను చరిత్రకు కేంద్రంగా ఉంచి చూస్తే పదహారో శతాబ్దపు దృశ్యం పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది.
దక్కన్ సుల్తానతులు మొఘల్ చరిత్రలో తమ వంతు కోసం ఎదురుచూస్తున్న చిన్నచిన్న రాజ్యాలు కావు. అవి ఉపఖండంలోని తూర్పు, పశ్చిమ తీరాల మధ్య విస్తరించిన దక్షిణ ద్వీపకల్పం లోతట్టు ప్రాంతాల వరకు విస్తరించిన విశాలమైన దక్షిణ-మధ్య భారత రాజకీయ ప్రపంచాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్న శక్తివంతమైన రాజ్యాలు.
దక్కన్ ప్రాంతం భారతదేశ భూభాగంలో దాదాపు నాలుగో వంతు విస్తీర్ణాన్ని కలిగి ఉంది. దాని చుట్టూ మూడు ప్రధాన సామ్రాజ్య శక్తులు ఉన్నాయి— ఉత్తరాన మొఘల్ సామ్రాజ్యం, పశ్చిమ తీరంలో పోర్చుగీసులు, దక్షిణాన విజయనగర సామ్రాజ్యం.
ఇక్కడ దక్కన్ సుల్తానతుల విస్తీర్ణం, ప్రాధాన్యం ఎంత పెద్దదో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆధునిక యుగానికి పూర్వం ప్రపంచంలోని ప్రధాన రాజకీయ కేంద్రాల్లో దక్కన్ సుల్తానతులు కూడా ఒకటి.
అహ్మద్‌నగర్, బీజాపూర్, గోల్కొండ, బీదర్, బీరార్ సుల్తానతుల భూభాగాలు కలిపి చూస్తే అవి యూరప్‌లోని ఫ్రాన్స్ వంటి పెద్ద రాజ్యాల విస్తీర్ణానికి ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉన్న విశాలమైన రాజకీయ ప్రపంచాన్ని ఏర్పరచాయి.
బహుళ సాంస్కృతిక ప్రాంతం దక్కన్..
దక్కన్ ఒక విశ్వనాగరిక, బహుళ సాంస్కృతిక ప్రాంతం. సముద్ర వాణిజ్యంతో ముడిపడి ఉన్న హిందూ మహాసముద్ర ప్రపంచంతో దానికి బలమైన సంబంధాలు ఉండేవి.
భూభాగం ఆధారంగా విస్తరించిన మొఘల్ సామ్రాజ్యంతో పోలిస్తే దక్కన్ ప్రపంచం సముద్ర మార్గాలతో మరింతగా అనుసంధానమై ఉండేది.
దక్కన్‌లోని రాజదర్బార్ల రాజకీయ, సాంస్కృతిక జీవనాన్ని పర్షియన్, దక్కనీ, మరాఠీ, తెలుగు, కన్నడ, అరబిక్, సంస్కృత సంప్రదాయాలతో పాటు ఆఫ్రికన్, అరబ్, తుర్కిక్, స్థానిక రాజకీయ సంస్కృతులు కూడా ప్రభావితం చేశాయి.
ఆఫ్రికన్ సైనిక ఉన్నతవర్గాలు, పర్షియా నుంచి వలస వచ్చినవారు, మరాఠా సామంత నాయకులు, సూఫీ సంప్రదాయాలు, దేవాలయాల నెట్‌వర్క్‌లు, వ్యాపారులు, కవులు, సైనికులు, రాజదర్బార్లలోని మహిళలు— వీళ్లందరూ కలిసి దక్కన్ రాజకీయ జీవితాన్ని తీర్చిదిద్దారు.
అహ్మద్‌నగర్, బీజాపూర్, గోల్కొండ, బీదర్, బీరార్ ఏ మాత్రం అంచున ఉన్న ప్రాంతాలు కావు. అవి వాస్తుశిల్పం, సాహిత్యం, సంగీతం, సైనిక శక్తి, దౌత్యం, మతపరమైన జీవితం వంటి అనేక రంగాలకు చైతన్యవంతమైన కేంద్రాలుగా విలసిల్లాయి.
చాంద్ బీబీ కథ మన చరిత్రను చూసే దృష్టికోణాన్నే మార్చాల్సిన అవసరాన్ని మన ముందుకు తెస్తుంది—విజయాలు, ఆక్రమణల చరిత్రగా కాకుండా, వాటికి ఎదురైన ప్రతిఘటన చరిత్రగా కూడా చూడాల్సిన అవసరం ఉంది.
1595లో అక్బర్ సైన్యాలు అహ్మద్‌నగర్ వైపు దండెత్తినప్పుడు, చాంద్ బీబీ కేవలం ఒక కోటను మాత్రమే కాపాడలేదు. ఆమె మొఘల్ సార్వభౌమాధికారానికి గట్టి ప్రత్యర్థిగా కూడా నిలిచారు.
మొఘల్ సైన్యాల దాడిని తిప్పికొట్టడమే కాకుండా సామ్రాజ్య సైన్యాన్ని చర్చలకు వచ్చేలా చేశారు. అలాగే మొఘల్ విస్తరణకు వ్యతిరేకంగా ఏకమవ్వాలని ఇతర దక్కన్ పాలకులకు విజ్ఞప్తి చేశారు.
కొద్దికాలం మాత్రమే అయినా అత్యంత కీలకమైన ఆ సమయంలో తన నాయకత్వంలో దక్కన్ సుల్తానతులను ఒక ఉమ్మడి సామ్రాజ్యవ్యతిరేక పోరాటం కోసం ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
ఇక్కడ కూడా ఆ రాజకీయ ప్రపంచం ఎంత విస్తృతమైనదో ప్రత్యేకంగా గుర్తించాలి. 1600 నాటికి దక్కన్ సుల్తానతుల విస్తృత ప్రాంతీయ కూటమి మొత్తం దాదాపు 7 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇవి జనాభా అధికంగా ఉన్న, సంపన్నమైన, సైనికంగా శక్తివంతమైన రాజ్యాలు. అంతేకాదు హిందూ మహాసముద్ర వాణిజ్య ప్రపంచంతో, పర్షియన్ సాంస్కృతిక-రాజకీయ ప్రపంచంతో బలమైన సంబంధాలు కలిగిన స్వతంత్ర రాజ్యాలు.
సార్వభౌమ పాలకురాలిగా చాంద్ బీబీ..
వారి సంపదకు ప్రధాన ఆధారాలు వ్యవసాయం, వస్త్ర ఉత్పత్తి, గుర్రాల వ్యాపారం, నౌకాశ్రయాలు –సముద్ర మార్గాలపై ఉన్న ప్రాప్యత. తూర్పు దక్కన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న వజ్రాల గనులు కూడా ఈ సంపదలో కీలక భాగం.
ఈ వజ్రాల వ్యాపారం దక్కన్‌ను ప్రపంచవ్యాప్తంగా సాగిన వాణిజ్య, మార్పిడి వ్యవస్థలతో అనుసంధానించింది. అందుకే మొఘలులకు దక్కన్‌పై అంతటి ఆసక్తి ఉండేది. అహ్మద్‌నగర్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి అక్బర్ విపరీతమైన సైనిక, ఆర్థిక వనరులను వెచ్చించాడు.
చాంద్ బీబీ కూడా మొఘల్ సార్వభౌమాధికారానికి సవాలు విసిరిన విధానాల్లో ఒకటి ఆమె దౌత్య వ్యవహారాల్లో కనిపిస్తుంది.
పోర్చుగీసు వైస్రాయ్‌కు రాసినప్పుడు తనను తాను ‘సుల్తాన్’గా సంబోధించుకున్నారు. ఈ చర్య ద్వారా ఆమె తనను స్వతంత్ర సార్వభౌమ పాలకురాలిగా ప్రకటించుకున్నారు.
అదే సమయంలో శక్తివంతమైన పోర్చుగీసు సముద్ర, సామ్రాజ్య శక్తులతో దౌత్య సంబంధాలు నడిపించే హక్కు మొఘల్ సామ్రాజ్యానికే ఉందనే దాని దౌత్యపరమైన ఏకాధిపత్యానికి ఆమె సవాలు విసిరారు.
దాదాపు ఒక శతాబ్దం తర్వాత మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన జీవితంలోని చివరి ఇరవై ఆరు సంవత్సరాలను దక్కన్ యుద్ధాలలో గడిపాడు.
ఔరంగజేబు 1707లో అహ్మద్‌నగర్ సమీపంలోని భింగార్లో మరణించాడు. చాంద్ బీబీ ఊహాశక్తిని స్త్రీల మౌఖిక సంప్రదాయాల ద్వారా పోషించిన అదే భూభాగం దక్కన్లో మొఘల్ సామ్రాజ్య ఆశయం అలసిపోయి అంతమైన స్థలంగా మారింది.
ఇవి ఆధునిక పూర్వ ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన, అత్యధిక జనాభా కలిగిన, వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతాలలో ఒకదానిపై ఆధిపత్యం కోసం జరిగిన పోరాటాలు.
అందువల్ల చరిత్రను చూసే దృష్టి ‘మొఘలులు దక్షిణం వైపు తమ సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారు?’ అనే ప్రశ్న నుంచి ‘దక్కన్ తన స్వంత రాజకీయ నిబంధనలపై మొఘల్ విస్తరణను ఎలా ప్రతిఘటించింది, ఎలా చర్చలు జరిపింది, తన సార్వభౌమాధికారాన్ని ఎలా నిర్వచించుకుంది?’ అనే ప్రశ్న వైపు మారుతుంది. ఈ మార్పు ఎంతో కీలకమైనది.
ఎందుకంటే దక్షిణాసియా చరిత్రను ఒకే సామ్రాజ్య కథనంగా కాకుండా పరస్పరం పోటీపడిన అనేక రాజకీయ ప్రపంచాల సమాహారంగా చూడటానికి ఇది అవకాశం కల్పిస్తుంది.
అనేక ప్రాంతీయ రాజకీయ వ్యవస్థలే..
ది డైలీ స్టార్(టీడీఎస్): దక్షిణాసియా చరిత్ర రచనలో ప్రస్తుతం ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తోంది— ఒకే జాతీయ కథనానికి పరిమితం కాకుండా ప్రాంతీయమైన, బహుళత్వంతో కూడిన గతాలను తిరిగి వెలుగులోకి తీసుకురావడం.
ఈ మార్పులో మీ పుస్తకం ఎక్కడ నిలుస్తుంది? అలాగే బంగ్లాదేశ్ సహా దక్షిణాసియా పాఠకులు తమ చరిత్రలోని అనేక పొరలను, పరస్పర విభేదాలు– వివాదాలతో కూడిన గతాన్ని అర్థం చేసుకోవడంలో దక్కన్ చరిత్ర ప్రత్యేకంగా ఎందుకు ముఖ్యమైనది?
సారా వహీద్: సామ్రాజ్యవాద, అతిజాతీయవాద, మతపరమైన సంకుచిత భావజాలాలు దక్షిణాసియా సమాజాల సమిష్టి ఆలోచనా ప్రపంచాన్ని ఇంతగా ప్రభావితం చేస్తున్న ఈ సమయంలో ప్రాంతీయ చరిత్రలను తిరిగి వెలుగులోకి తీసుకురావాలనే విస్తృతమైన ప్రయత్నం కూడా సాగుతోంది.
దక్షిణాసియా గతాన్ని ఎక్కువగా నిర్ణయించింది ఒక్కో సామ్రాజ్యం కాదు. ఒకదానితో ఒకటి ముడిపడుతూ పరస్పరం అతివ్యాప్తి చెందిన అనేక ప్రాంతీయ రాజకీయ వ్యవస్థలే. ఆ రాజకీయ వ్యవస్థలు నేటి దక్షిణాసియాలో మనం చూస్తున్న దేశాలు, సరిహద్దులు, రాజకీయ నిర్మాణాల కంటే పూర్తిగా భిన్నమైన రీతుల్లో తమ రాజకీయ ప్రపంచాలను ఊహించుకున్నాయి. ఆ గతాలను నేటి జాతీయ, సామ్రాజ్య, మతపరమైన విభజనల చట్రాల్లో ఇమడ్చడం సాధ్యం కాదు.
చాంద్ బీబీని ఎప్పుడూ ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష అనే పరిమితుల్లో బంధించలేం. ఆమె జీవితం పర్షియన్, దక్కనీ, మరాఠీ, తెలుగు, కన్నడ, అరబిక్, ఇస్లామిక్, భారతీయ, షియా, సున్నీ, సూఫీ, ఆఫ్రికన్, అరబ్, తుర్కిక్ సంప్రదాయాలతో పాటు స్థానిక సంస్కృతులు ప్రభావితం చేసిన దక్కన్ ప్రపంచంలో సాగింది. అందువల్ల ఆమె జీవితాన్ని హిందూ–ముస్లిం అనే ద్వంద్వ విభజనలోనో, కేవలం మొఘల్ కథనంలోనో లేదా ఆధునిక జాతీయవాద కథనంలోనో ఇమడ్చలేం. అందుకే చాంద్ బీబీ మనకు అంత ముఖ్యమైన వ్యక్తి.
చరిత్రలో కొత్త విషయాలు వెలుగులోకి..
దక్కన్ అనేది అనేక భాషలు, ప్రజా సమూహాలు, రాజకీయ సంప్రదాయాలు పరస్పరం కలుసుకున్న ప్రాంతం. అక్కడ ముస్లిం రాజవంశాలు పాలించినప్పటికీ వారి పాలన అనేక సమాజాలు, విభిన్న మతపరమైన ప్రపంచాలు, ప్రాంతీయ సంస్కృతులతో కలిసి సాగింది.
బంగ్లాదేశ్ పాఠకులకు ఈ విషయం ఎంతో లోతైన ప్రాధాన్యం కలిగి ఉందని నేను భావిస్తున్నాను. బౌద్ధ, హిందూ, ముస్లిం, పర్షియన్ సాంస్కృతిక ప్రభావాలు, బెంగాలీ సంప్రదాయాలు, వలసవాదం, జాతీయవాదం, ప్రాంతీయ, ప్రాంతాంతర పరిణామాలు— ఇలా అనేక పొరలతో కూడిన చరిత్ర బంగ్లాదేశ్‌కు కూడా ఉంది.
దక్కన్‌ను ఒకే కథలో ఇమడ్చలేనట్టే, బెంగాల్ చరిత్రను కూడా ఒకే జాతీయ లేదా మతపరమైన కథనానికి పరిమితం చేయలేం.
చాంద్ బీబీని, దక్కన్ చరిత్రను తిరిగి వెలుగులోకి తీసుకురావడం ద్వారా దక్షిణాసియా చరిత్రను మరింత విస్తృతమైన దృక్కోణంతో అర్థం చేసుకునే అవకాశం మనకు లభిస్తుంది. అది ఒకే దేశం, ఒకే సామ్రాజ్యం లేదా ఒకే మతం చుట్టూ తిరిగిన చరిత్ర కాదు. పరస్పరం అనుసంధానమై, ఒకదానితో ఒకటి ముడిపడిన గతాలను మోస్తున్న అనేక ప్రాంతాల సమాహారంగా రూపుదిద్దుకున్న చరిత్ర.
ఈ పుస్తకం పాఠకులను మనకు అలవాటైన చరిత్ర కథనాలను దాటి చూడమని కోరుతుంది. ఇప్పటివరకు చరిత్రలో అంచులకు నెట్టివేయబడిన ప్రాంతాలు, వ్యక్తులను కేంద్రంగా చేసుకుని చరిత్రను చూడటం ప్రారంభిస్తే మనకు కనిపించకుండా పోయిన ఎలాంటి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి? అనే ప్రశ్నను ఆలోచించమని ఆహ్వానిస్తుంది.
చాంద్ బీబీ కథ మనకు ఒక విషయాన్ని గుర్తుచేస్తుంది. దక్షిణాసియా గతం ఎప్పుడూ అనేక భాషలు, అనేక ప్రాంతాలు, అనేక మతపరమైన పొరలతో కూడినదే.
అదే సమయంలో అది ఎప్పుడూ రాజకీయంగా వివాదాస్పదమైన, పరస్పరం పోటీపడే శక్తులతో కూడిన ప్రపంచమే.
ఈ వ్యాసం నాలుగు భాగాలుగా ప్రచురితం అవుతోంది, ఇది మూడవ భాగం. మొదటి రెండవ భాగం కోసం 1, 2 వీటి మీద క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
