“చరిత్రలో ‘కాలవిభజన’ అనేది ఒక చారిత్రక వాస్తవం కాదు, అదొక నిర్దిష్ట సందర్భంలో ఊహించుకున్న ఒక భావన మాత్రమే; అప్పటి నుంచి దాని రూపాలు మారుతూనే ఉన్నాయి.
దాని ఆధారంగానే ప్రాచీన కాలం, తొలి మధ్యయుగం, చివరి మధ్యయుగం, ఆధునిక కాలం, ఆధునికానంతర కాలం లాంటి వర్గీకరణలు వచ్చాయి.”
ఆధునికత – ఒక సరికొత్త కోణం..
గడిచిన మూడు దశాబ్దాలుగా, ప్రపంచవ్యాప్తంగా చరిత్ర తన శతాబ్దాల నాటి కొన్ని స్థిరమైన నమ్మకాలను నిశ్శబ్దంగా తిరగదోడుతోంది.
21వ శతాబ్దం ప్రారంభం వరకు, మనం నేడు జీవిస్తున్న ప్రపంచం – దీనిని ‘ఆధునికత’ అని, పెట్టుబడిదారీ విధానం, హేతుబద్ధత, సైన్స్, సాంకేతికత, ప్రగతి, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం లాంటి లక్షణాలతో కూడినదని భావిస్తాం – ఇది 17వ శతాబ్దం నుంచి యూరప్‌లో ప్రారంభమైందని అందరూ నమ్మేవారు. ఆ తర్వాత యూరోపియన్ల విస్తరణతో ఇది ప్రపంచమంతటా వ్యాపించిందని భావించేవారు.
కానీ నేడు, ఆధునికతను ఒకే ఒక్క కోణంలో లేదా ఒక నిర్దిష్ట ప్రాంతానికి, కాలానికి పరిమితం చేసి మాట్లాడటం చాలా అరుదుగా కనిపిస్తోంది; దానికి బదులుగా వివిధ రూపాల ‘ఆధునికతలు’ తెరపైకి వచ్చాయి.
మనం జీవిస్తున్న ఈ ప్రపంచం శతాబ్దాలుగా ప్రతి సమాజం, ప్రతి నాగరికత అందించిన భౌతిక సంస్కృతి, ఆలోచనలు, మతాలు, ప్రభుత్వ రూపాలు, వ్యాపారం, ప్రయాణాలు, వలసలు లాంటి వివిధ అంశాల కలయికతో క్రమంగా పరిణామం చెందిందనేది నేటి ఏకాభిప్రాయం.
పెట్టుబడిదారీ విధానం – భిన్న వాదనలు..
పెట్టుబడిదారీ విధానం అనేది కేవలం యూరప్‌కు మాత్రమే పరిమితమైన విషయమనే వాదన కూడా 1990ల నుంచి గాఢమైన పరిశీలనకు గురైంది.
15వ శతాబ్దం నుంచి యూరప్ పెట్టుబడిదారీ విధానం వైపు అడుగులు వేసిందన్న అప్పటివరకు ఉన్న బలమైన అభిప్రాయాన్ని విఖ్యాత చరిత్రకారుడైన ఫెర్నాండ్ బ్రాడెల్ రాసిన ‘నాగరికత – పెట్టుబడిదారీ విధానం: 15 – 18 శతాబ్దాలు’ మూడు సంపుటాల పుస్తకం బలపరిచింది.
ఆండ్రీ గుందర్ ఫ్రాంక్ పునఃశ్చరణ(‘రీ-ఓరియంట్’) అనే ఆలోచనాత్మక పుస్తకంతో ఈ ఆలోచనా విధానంలో మార్పుకు శ్రీకారం చుట్టాడు.
యూరప్ ప్రపంచాన్ని ఆధునికత వైపు, పెట్టుబడిదారీ విధానం వైపు నడిపించిందనే పాత అభిప్రాయాన్ని ఆయన తిరగదోడారు.
18వ శతాబ్దం చివరి వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఓరియంట్(ఆసియా/తూర్పు) దేశాలు ప్రధాన పాత్ర పోషించాయని ఆయన వాదించాడు.
కెన్నెత్ పోమెరాంజ్, జానెట్ ఎల్ అబు-లుఘోడ్, ప్రసన్నన్ పార్థసారథి, సంజయ్ సుబ్రహ్మణ్యం లాంటి పలువురు చరిత్రకారులు, యూరప్ పెట్టుబడిదారీ విధానానికి ప్రధాన కేంద్రంగా మారడానికి చాలా కాలం ముందే, శతాబ్దాలుగా ప్రపంచ దేశాల మధ్య జరిగిన పరస్పర సంబంధాల ద్వారానే పెట్టుబడిదారీ విధానం పరిణామం చెందిందని నిరూపించారు.
ప్రస్తుతం జార్జియో రియల్‌లో ‘పెట్టుబడిదారీ విధానంలో ఆసియా మూలాలు’ అనే అంతర్జాతీయ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్నారు. నిజానికి, ప్రస్తుత చరిత్రకారుల అభిప్రాయాల సంక్షిప్త సారాంశం ఇదే.
కాలవిభజన ఒక యూరోపియన్ భావన..
యూరోపియన్ల సృష్టి అయిన చరిత్రలోని ‘కాలవిభజన’ భావనకు ఏ గతి పట్టనున్నది? 17వ శతాబ్దం చివరలో సాగిన ఈ విభజన క్రమబద్ధంగా ఒక మైలురాయిగా మారింది.
ఇది చరిత్ర అధ్యయనాన్ని పూర్తిగా మార్చేసింది: సుదీర్ఘమైన గతాన్ని బట్టి వర్తమానాన్ని చూడటానికి బదులుగా, అది హేతుబద్ధతతో కూడిన తన సొంత ‘ఆధునికత’ కోణం నుంచి వర్తమానాన్ని చూస్తూ వెనక్కి తిరిగి చూసింది. అలా మిగిలిన కాలాలను ‘మధ్యయుగం’, ‘ప్రాచీన యుగం’ అని విభజించింది.
ఇందులో “మధ్యయుగం” అనేది ఆధునికతకు పూర్తి భిన్నంగా, మతం, మూఢనమ్మకాలతో కూడిన అహేతుకమైన, చీకటి యుగంగా అభివర్ణించబడింది.
వృత్తిపరమైన చరిత్రకారులు ఎన్ని సవరణలు చేసినప్పటికీ, జనాదరణ పొందిన అంచనాలలో మధ్యయుగం అంటే ఒక చీకటి యుగం అనే ముద్ర అలాగే ఉండిపోయింది.
వలసవాదానికి పూర్తి సమర్థన..
ప్రపంచానికి యూరప్ ఇచ్చిన బహుమతి “ఆధునికత” అనే భావనకు ఈ కాలవిభజనే పునాది. యూరప్ తనను తాను “ఆధునికమైనది”గా చిత్రీకరించుకున్న తర్వాత, సృజనాత్మకత, జ్ఞానం, ప్రభుత్వ జోక్యం, హింసల ద్వారా ముందుకు సాగడానికి తన సొంత చీకటి మధ్యయుగ వారసత్వాన్ని తుడిచిపెట్టడం దానికి అనివార్యమైంది.
అలా చేసి, “ప్రగతి” సాధించి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి సరిపడా వనరులను సమకూర్చుకున్న తర్వాత, తన దృష్టిలో ఇంకా మధ్యయుగంలోనే బతుకుతున్న మానవాళిలోని మిగిలిన భాగాల నుంచి ఆ చీకటిని తొలగించడం తన బాధ్యతగా భావించింది; దీనినే వారు “నాగరికతను మప్పే ప్రణాళిక” అని పిలుచుకుంటున్నారు. ఇది వలసవాదానికి సంపూర్ణ సమర్థన తప్ప మరొకటి కాదు.
చరిత్ర అధ్యయనంలో నూతన దృక్పథం..
ఈ కాలవిభజన వెనుక చరిత్రలో కొన్ని కచ్చితమైన విరామాలు లేదా దశలు ఉంటాయనే ఊహ ఉన్నది, ప్రతి దశకూ ఒకదానికొకటి సంబంధం లేకుండా ప్రత్యేక లక్షణాలు ఉంటాయని భావించారు. మరో మాటలో చెప్పాలంటే, చరిత్రను ఒక నిరంతర ప్రక్రియగా అంగీకరించడానికి నిరాకరించడమే.
అయితే, జాక్వెస్ లె గోఫ్ అనే మరో గొప్ప చరిత్రకారుడు చరిత్రను ఇలా ముక్కలు ముక్కలుగా అధ్యయనం చేయడంలోని న్యాయబద్ధతను ప్రశ్నించాడు.
చరిత్రలో కాలవిభజన అనేది వాస్తవం కాదు, అదొక సందర్భానుసారంగా ఊహించుకున్న భావన మాత్రమే అని మనం గుర్తుంచుకోవాలి.
సందర్భం మారుతున్నప్పుడు ఈ కాలవిభజన ఎంతవరకు చెల్లుతుంది లేదా ఎంతవరకు ఉపయోగపడుతుంది?
ఉదాహరణకు, ఇప్పుడు మనం ఎంతో గొప్పగా చెప్పుకునే ఈ ‘ఆధునిక కాలం’ మరో వంద సంవత్సరాల తర్వాత ఆధునికంగా పరిగణించబడకపోవచ్చు, అప్పుడు చరిత్రకు ఎలాంటి కాలవిభజన తగినదిగా ఉంటుంది?
బహుశా అప్పుడు ఒక కొత్త విధానాన్ని ఊహించవచ్చు, లేదా ఎలాంటి విభజనలు లేని ఒక సమగ్రమైన చరిత్ర అధ్యయనం సాధ్యం కావచ్చు.
అనువాదం: కె సత్యరంజన్
(వ్యాసకర్త జెఎన్యూలో చరిత్ర ఆచార్యులుగా పనిచేశారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
