ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వస్తున్న విప్లవానికి కారణమవుతున్న ఈ కేంద్రాలు విద్యుత్ ఖర్చులను పెంచుతున్నాయని, నీటి సరఫరాపై ఒత్తిడిని పెంచుతున్నాయని, స్థానిక సమాజాలపై భారం మోపుతున్నాయని ఆందోళనలు పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో 2026 జూన్ 14న భారీ కొత్త డేటా సెంటర్ల నిర్మాణాన్ని ఒక సంవత్సరం పాటు నిలిపివేసిన తొలి అమెరికా రాష్ట్రంగా న్యూయార్క్ నిలిచింది. ఈ నగర మేయర్ సోషలిస్ట్ జోహ్రాన్ మమ్దానీ అనే విషయం తెలిసిందే.
ఏఐకి మద్దతు ఇవ్వడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఎలా నిర్వహించాలనే దానిపై పెరుగుతున్న జాతీయ చర్చలో ఈ తాత్కాలిక నిషేధం న్యూయార్క్‌ను అగ్రస్థానంలో నిలుపుతుంది.
టెక్నాలజీ కంపెనీలు కొత్త డేటా సెంటర్లను నిర్మించడానికి పోటీ పడుతుండగా, డజన్ల కొద్దీ రాష్ట్రాల్లోని చట్టసభ సభ్యులు, నియంత్రణ సంస్థలు విద్యుత్ గ్రిడ్లు, యుటిలిటీ బిల్లులు, స్థానిక సమాజాలపై వాటి ప్రభావాన్ని పరిమితం చేసే చర్యలను పరిశీలిస్తున్నాయి.
“డేటా సెంటర్ల అభివృద్ధి వలన యుటిలిటీ బిల్లులు పెరగడం, మన సహజ వనరులు క్షీణించడం, న్యూయార్క్ వాసులకు అనిశ్చితి ఏర్పడటం లాంటి ప్రమాదాలు పొంచి ఉన్నందున, ఈ చర్యలు తీసుకోవడం నా బాధ్యత” అని న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ అన్నారు.
పెద్ద డేటా సెంటర్లకు ఉన్న అమ్మకపు పన్ను మినహాయింపులను రద్దు చేయడానికి తాను చట్టాన్ని కూడా తీసుకువస్తానని ఆమె తెలిపారు.
ప్రభుత్వ చర్యలు, తాత్కాలిక నిషేధం..
50 మెగావాట్లు లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్‌ను వినియోగించే డేటా సెంటర్లకు ఈ నిర్మాణ నిషేధం వర్తిస్తుందని గవర్నర్ కార్యాలయ అధికారులు తెలిపారు.
తాత్కాలిక నిషేధ కాలంలో, ఇప్పటికే పూర్తయినట్లుగా భావించినవి కాకుండా మరే ఇతర విచక్షణాయుత అనుమతులను రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ శాఖ జారీ చేయదని గవర్నర్ కార్యాలయం తెలిపింది.
దానికి బదులుగా, కొత్తగా ఆన్‌లైన్‌లోకి వచ్చే డేటా సెంటర్లు “స్థిరమైన ప్రమాణాలకు” కట్టుబడి ఉండేలా చూసేందుకు, అలాగే రాష్ట్రంలో డేటా సెంటర్ల నిర్మాణం, నిర్వహణ వల్ల కలిగే పర్యావరణ ప్రభావాలను పరిశీలించేందుకు ఒక సాధారణ పర్యావరణ ప్రభావ నివేదికను రూపొందించాలని హోచుల్ రాష్ట్ర అధికారులను ఆదేశించారు.
హోచుల్ కార్యాలయం ప్రకారం, రాష్ట్రం ఆ ప్రమాణాలను ఖరారు చేసిన తర్వాత నిషేధాన్ని ఎత్తివేస్తారు.
తీవ్ర వ్యతిరేకతను రేకెత్తిస్తున్న డేటా సెంటర్లు..
న్యూయార్క్ శాసనసభ గత నెలలో డేటా సెంటర్లపై నియంత్రణలు విధించేందుకు ఉద్దేశించిన ఒక బిల్లును ఆమోదించింది. కానీ అది ఇంకా హోచుల్ సంతకం కోసం పంపలేదు.
ఈ బిల్లు 20 మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ను వినియోగించే డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుంది. దీనివల్ల నాటి కార్యనిర్వాహక ఉత్తర్వు కంటే దీని పరిధి విస్తృతమైంది.
హోచుల్ కార్యాలయంలోని అధికారులు ఈ బిల్లును సంక్లిష్టమైనదిగా అభివర్ణించారు. రాష్ట్ర శాసనసభతో దీనిపై పనిచేయడానికి కొంత సమయం పడుతుందని కూడా వారు తెలిపారు.
డేటా సెంటర్ ఆపరేటర్ డిజిటల్ రియల్టీ(డీఎల్ఆర్ఎన్), ఈ చర్య పెట్టుబడులను న్యూయార్క్ వెలుపలికి తరలించే అవకాశం ఉందని రాయిటర్స్‌కు తెలిపింది.
“బాధ్యతాయుతమైన వృద్ధికి తోడ్పడే పరిష్కారాల కోసం విధాన రూపకర్తలతో కలిసి పనిచేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. కానీ ఒక సంవత్సరం పాటు నిలిపివేయడం సరైన విధానం కాదు.”
ఎన్టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్ సీఈఓ డగ్ ఆడమ్స్ మాట్లాడుతూ, ఉద్యోగాలు, ఆర్థిక పెట్టుబడుల నుంచి పర్యావరణ వనరుల వినియోగం వరకు డేటా సెంటర్ల స్థానిక ప్రభావాన్ని ఆపరేటర్లు మరింత మెరుగ్గా వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
“ఈ పెరిగిన పరిశీలన, డేటా సెంటర్లు స్థానిక సమాజాలపై ఎలా ప్రభావం చూపుతాయో మరింతగా అర్థం చేసుకోవాలనే ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది. మేము ఆ సంభాషణను స్వాగతిస్తున్నాము.”
మరో డేటా సెంటర్ ఆపరేటర్ అయిన ఈక్వినిక్స్(ఈక్యూఐఎక్స్ఓ), వ్యాఖ్యల కోసం ప్రయత్నిస్తే స్పందించలేదు.
నియంత్రణల దిశగా ఇతర రాష్ట్రాలు..
అమెరికాలో డేటా సెంటర్ల విస్తరణ దేశంలోని చాలా ప్రాంతాలలో విద్యుత్ డిమాండ్‌ను, విద్యుత్ బిల్లులను పెంచుతూ, స్థానిక రాజకీయ వ్యతిరేకతను రేకెత్తిస్తోంది.
ఇటీవలి రాయిటర్స్/ఇప్సోస్ పోల్ ప్రకారం, ప్రతి ముగ్గురు అమెరికన్లలో ఒకరు మాత్రమే డేటా-సెంటర్ నిర్మాణ వేగాన్ని ఆమోదిస్తున్నారు. చాలా మంది తమ సొంత ప్రాంతంలో ఒకదాన్ని నిర్మించడాన్ని వ్యతిరేకిస్తారు.
విద్యుత్ బిల్లులు, పర్యావరణంపై డేటా సెంటర్ల ప్రభావాలను అరికట్టడానికి డజన్ల కొద్దీ రాష్ట్ర శాసనసభలు బిల్లులను ప్రవేశపెట్టాయి. పూర్తి తాత్కాలిక నిషేధాన్ని విధించిన మొదటి రాష్ట్రం మాత్రం న్యూయార్క్.
ఏప్రిల్‌లో, మైనే గవర్నర్ జానెట్ మిల్స్ ఆ సౌకర్యాలపై అదే విధమైన నిలుపుదల విధించే బిల్లును వీటో చేశారు.
న్యూయార్క్ స్వతంత్ర గ్రిడ్ ఆపరేటర్ ఇటీవలి నివేదిక ప్రకారం, మే నెల నాటికి, డేటా సెంటర్లతో సహా 12 గిగావాట్లకు పైగా అత్యధిక శక్తిని వినియోగించే లోడ్లు రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం కావడానికి వరుసలో ఉన్నాయి. ఒక గిగావాట్ విద్యుత్తు సుమారు 750,000 ఇళ్లకు శక్తిని అందించగలదు.
అమెరికా ఇంధన శాఖ డేటా ప్రకారం, దేశంలో గృహ విద్యుత్ రిటైల్ ధర అత్యంత ఖరీదైన నగరాల్లో న్యూయార్క్ ఎనిమిదో స్థానంలో ఉంది.
టెక్సాస్, ఒహాయో లాంటి రాష్ట్రాలతో పోలిస్తే, రాష్ట్రంలో భూమి ఖరీదైనదిగా ఉండటం, విద్యుత్ సరఫరా కొరత కారణంగా డేటా సెంటర్లపై ఆసక్తి చాలా వరకు పరిమితంగా ఉన్నప్పటికీ, న్యూయార్క్ సర్వర్ వేర్‌హౌస్‌ల నుండి కొంత ఆసక్తిని ఆకర్షించింది.
డేటా సెంటర్ మ్యాప్ ప్రకారం, రాష్ట్రంలో ప్రస్తుతం 130కి పైగా డేటా సెంటర్లు ఉన్నాయి. వర్జీనియాలో 600కి పైగా, టెక్సాస్‌లో సుమారు 500 ఉన్నాయి.
వాషింగ్టన్ నుంచి జాస్పర్ వార్డ్ అందించిన నివేదిక, లైలా కెర్నీ, కోర్ట్నీ రోజెన్, వాలెరీ వోలోక్విసి, డెబోరా సోఫియా అందించిన అదనపు నివేదిక ఆధారంగా ఈ వార్త ప్రచురించబడింది.
అనువాదం: ఆర్ లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
