Protesters celebrate after Union Education Minister Dharmendra Pradhan resigns, at Jantar Mantar in New Delhi
‘జెన్-జీ’ (1997 నుంచి 2012 మధ్య జన్మించిన తరం) యువత చేపడుతున్న నిరసనలు సంప్రదాయ రాజకీయ శైలికి భిన్నంగా ఉన్నాయి.
ఇన్‌స్టా- డిజిటల్ సంస్కృతి, సెటైర్ (వ్యంగ్యం), మీమ్ కల్చర్, అల్గారిథమ్ పదాలు, ఇంటర్నెట్ పాప్ కల్చర్ కలగలిసిన కొత్త తరహా నినాదాలు ఇందులో కనిపిస్తున్నాయి.
ట్రోల్స్ నుంచి ఉద్యమాల దాకా సాగిన ఈ జెన్-జీ ఉద్యమం దేశ చరిత్రలోకి చేరింది.
బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు విద్యా వ్యవస్థలో లోపాలతో విద్యార్థి లోకం విసుగుచెందింది.
వారు జంతర్ మంతర్ వేదికగా దేశంలోని నీట్, సీబీఎస్ఈ, యూజీసీ-నెట్, తదితర పోటీ పరీక్షలలో జరిగిన లీకేజీలపై తమ తీవ్ర అసహనాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శించారు.
అందరినీ ఆకట్టుకునేలా వారు వ్యంగ్యంగా నిరసన తెలిపిన తీరు యావత్ ప్రజానీకం దృష్టిని మళ్లించింది.
సెటైరికల్తోనే ఉద్యమం ప్రారంభం..
2026 మే నెలలో కోర్టు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి.
“చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాలు లేక సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాలయాపన చేస్తూ, వారి ప్రయోజనాల కోసం పరితపిస్తున్నారు. వీరు బొద్దింకలు, పరాన్నజీవులు” అని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. దీంతో నిరాశలో ఉన్న యువత, విద్యార్థి లోకం మొత్తం మీమ్స్ ద్వారా ప్రతిస్పందించారు.
‘అవును, మేం ఈ వ్యవస్థ వల్ల నిరుద్యోగులుగా మారాం. నాణ్యమైన విద్య అందక నిరాశ, నిస్పృహలో ఉన్నవారి గొంతుకగా నిలుస్తున్నాం’ అని వారు పేర్కొన్నారు.
దీనికి ప్రతిస్పందనగా అభిజిత్ దీప్కే సెటైరికల్‌గా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఐడీ ఓపెన్ చేశారు.
కొన్ని వారాలలోనే దేశ యువతను ఈ ఐడీ 2 కోట్లకు పైగా ఆకర్షించి డిజిటల్ కౌంటర్‌గా ఉద్యమానికి బీజం వేసిన సందర్భం ముందుకు వచ్చింది.
ఇంటర్నెట్ నుంచి రోడ్లపైకి వచ్చిన యువత ఈ ట్రోల్స్, మీమ్స్ ద్వారా జంతర్ మంతర్ వేదికగా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
దేశ విద్యా వ్యవస్థలోని అక్రమాలను, లోపాలను సరిదిద్దడమే లక్ష్యంగా వారు ముందుకు సాగారు.
దేశ్ బచానే నికలే హై ఆవో హమారే సాత్ చలో..
జంతర్ మంతర్‌లో విద్యార్థి, యువ నినాదాలు ఎంతో స్ఫూర్తితో పాటు అందరినీ కదిలించేలా ముందుకు వచ్చాయి.
‘దేశ్ బచానే నిక్లే హై, ఆవో హమారే సాత్ చలో..’ అంటూ వారు నినదించారు. దేశాన్ని కాపాడుకోవడానికి మేము కదిలాము, మాతో పాటు మీరూ కలిసి రండి అని పిలుపునిచ్చారు.
ఈ విద్యా వ్యవస్థలో లోపాలు నిగూఢంగా పేరుకుపోయాయి. దేశాన్ని వెనక్కు తీసుకెళ్తున్న ఈ విద్యా విధానాలు నశిస్తేనే దేశం బాగుపడుతుంది.
అప్పుడే దేశం ముందుకు వెళ్తుందనే స్పృహను రగిలించారు. అందర్నీ కదిలించడానికి ఇచ్చిన ఈ నినాదం, వారి గొంతుక ఎంతో ఆకట్టుకుని ఆలోచింపజేసింది.
సర్ఫరోషీ కీ తమన్నా అబ్ హమారే దిల్ మే హై..
భారత స్వాతంత్ర్యోద్యమంలో విప్లవకారులను ఉత్తేజపరిచిన దేశభక్తి గీతం ఇది.
చంద్రశేఖర్ ఆజాద్, రాంప్రసాద్ బిస్మిల్, భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసే సందర్భంగా పాడుకున్న గొప్ప పాట ఇది.
ఢిల్లీ జంతర్ మంతర్‌లో విద్యార్థులు ఈ గీతాన్ని గుండెలకు హత్తుకొని నినాదాల రూపంలో మార్చారు.
‘దేశ భవిష్యత్తు కోసం, విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం మేము పోరాడుతాం. పరీక్షల లీక్‌లు ఇకపై చెల్లవు. వాటిని మేము ఇకపై సహించము’ అని స్పష్టం చేశారు.
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అంటూ గర్జించారు.
బోల్ రే సాథీ హల్లా బోల్..
సఫ్దర్ హష్మీ స్ట్రీట్ థియేటర్ ద్వారా జన నాట్య మంచ్‌కు ప్రాణం పోసి శ్రామిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై నినదించిన సందర్భంలో ‘హల్లా బోల్’ నినాదం పుట్టింది.
‘మిత్రమా గొంతు విప్పి అన్యాయంపై మౌనాన్ని వీడి ప్రతిఘటించు’ అనేదే ఈ నినాదం అర్థం. ఈ పేపర్ లీక్ పోరాటంలో విద్యార్థులంతా ఒక్కటై ఈ మేల్కొల్పే నినాదాన్ని ఇచ్చారు.
లీక్‌ల ప్రభుత్వం ఇకపై కొనసాగకూడదని వారు స్పష్టం చేశారు. మోదీ సర్కార్ ఇకపై కొనసాగకూడదని, విద్యార్థుల హక్కుల కోసం అందరూ ఒకటే గర్జిస్తామని హెచ్చరించారు.
‘బోల్ రే సాథీ హల్లా బోల్’ అంటూ ఢిల్లీ నగర వీధుల్లో అందరి నోటా ప్రతిధ్వనించేలా మారుమోగించారు.
కౌన్ బనాయా హిందుస్థాన్ – భారత్ కే మజ్దూర్ కిసాన్..
“భారతదేశ కార్మిక, కర్షకులు ఈ దేశాన్ని నిర్మించింది . కానీ కొంతమంది దేశ సంపదను హరిస్తూ మా భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. దీనిని మేం ఇక సహించము. అందరికీ విద్య, ఉపాధి, వైద్యం కచ్చితంగా అందించాల్సిందే. అది మా హక్కు, మా వాటా, అది మాకు ఇవ్వాల్సిందే” అంటూ వారు నినదించారు.
ఈ దేశ సంపద సృష్టికర్తలైన వారికే సంపద దక్కే సోషలిజమే తమ భవిష్యత్తని వారు స్పష్టం చేశారు. దానికోసమే తమ పోరాటాలు వర్ధిల్లుతాయని ఎంతో విశ్వాసంతో పోరాట పటిమను ప్రదర్శించారు.
కేవలం విద్యార్థుల కోసం మాత్రమే ఈ పోరాటం కాదు. దేశంలోని కష్టజీవులు అందరి కోసం అని గొప్ప సంఘీభావ దృక్పథంతో ఈ ఉద్యమం కదిలింది.
కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ లోక్‌సభలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ చర్యల మీద తీవ్ర విమర్శలు చేశారు. “పేపర్ లీక్‌లు చేసేవారు, అత్యాచారాలు చేసేవారు, అవినీతిపరులు, ఈ దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసేవారు బీజేపీలోనే ఉన్నార”ని మండిపడ్డారు. వ్యవస్థను కొల్లగొట్టేవారు, మతోన్మాదం రెచ్చగొట్టేవారు, రాజ్యాంగ మౌలిక సూత్రాలను నాశనం చేసేవారు కూడా ఇందులోనే ఉన్నారన్నారు.
నిరుద్యోగ భారతాన్ని సృష్టించేవారు, రేపిస్టులకు రక్షణ కల్పించేవారు, కష్టజీవుల సంపదను కొల్లగొట్టేవారు, సామాజిక న్యాయాన్ని బద్దలు కొట్టే వారంతా బీజేపీలోనే ఉన్నారని దుయ్యబట్టారు.
ఢిల్లీ పోలీసులు నిరసన తెలుపుతున్న యువతపై అత్యంత పైశాచికంగా లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్, బుల్లెట్లు ఉపయోగించారు. అయినా సరే విద్యార్థులు అత్యంత వ్యంగ్యంగా, సంతోషంగా “వాహ్ క్యా గునాహ్ హువా” (ఎంతటి నేరం జరిగింది) అంటూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను అడిగారు.
స్వాతంత్య్రోద్యమంలో భగత్ సింగ్ నుంచి వచ్చిన ఇంక్విలాబ్ శబ్దం ఎంత తెగింపు నిచ్చిందో మనకు తెలుసు. నేటి జెన్ జీ యువతలోనూ అదే తెగింపు కనిపిస్తోందని, వారు అత్యంత వ్యంగ్యంగా నినాదాలు ఇచ్చారని ఎంపీ దీపేందర్ సింగ్ పొగడారు.
ఎంపీ ప్రియాంక గాంధీ కూడా జెన్ జీ యువత గురించి, మోదీ నేతృత్వంలోని కపటత్వం గురించి మాట్లాడారు.
ప్రధాని పగలు యువతపై దాడి చేయించి, రాత్రిపూట ఇన్‌స్టా రీల్స్‌లో ఫోజులిస్తూ యువత మనసును గెలవాలని ప్రయత్నం చేశారని ఆమె విమర్శించారు.
“మీరు కెమెరా దృష్టితో, ఆ కోణంతో ఆలోచించడం మానుకోండి. విద్యార్థులపై దృష్టి పెట్టి వారి మనసును గెలిచే కోణంలో ప్రయత్నం చేయండి. వారి సమస్యలకు పరిష్కారం చూపే కోణంలో ఆలోచించండి” అంటూ ఆమె చురకలు అంటించారు.
పేపర్ లీక్ కర్ గయా బందర్ – బాల్ నరేందర్ బాల్ నరేందర్..
నిత్యం 56 ఇంచుల ఛాతీ ఉన్న పెద్ద మనిషిగా చెప్పుకునే మోదీకి విద్యార్థులు సెటైర్లు వేశారు. 56 ఇంచుల కోతి పేపర్ లీక్‌ల ప్రభుత్వం నడుపుతోందని, ఆ కోతే బాల్ నరేందర్ అంటూ విమర్శించారు.
పేపర్ లీక్‌ల వ్యవహారాన్ని బాల్ నరేందర్ అరికట్టలేకపోతున్నారని చురకలు అంటిస్తూ నినాదాలు చేశారు. విద్యలో అక్రమాలు పెరుగుతున్నా ఏమీ ఎరుగనట్టు ఈ కోతి సర్వనాశనం చేస్తోందని ఆరోపించారు. అందుకే ‘పేపర్ లీక్ కర్ గయా బందర్’(కోతి పేపర్ లీక్ చేసింది) అని నినదించారు.
కూచీ – పూచీ తుమ్ కహా హో… రిజైన్ దేదో..
పోరాటాలంటే కేవలం నినాదాలు, నిరసనలు మాత్రమే అనుకుంటాం. కానీ అనేకమంది యువతీ యువకులు, విద్యార్థులు తమ పుట్టినరోజు వేడుకలను కూడా జంతర్ మంతర్ వేదికగానే జరుపుకున్నారు.
“కూచీ పూచీ ముఝే అచ్ఛా నహీ లగ్ రహా.. ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తీఫా గిఫ్ట్ దేదో” అంటూ వారు వినూత్నంగా ప్లకార్డులు ప్రదర్శించారు.
పుట్టినరోజు బహుమతిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కావాలని కోరారు. తమ నిరసనల డిమాండ్‌ను బహుమతిగా ఇవ్వాలని వారు ఎంతో వినూత్నంగా అడిగారు.
ఈ ఉద్యమం సెటైరికల్‌గా కొత్త కొత్త ఆలోచనలు, నినాదాలతో ముందుకెళ్లింది. పోరాట స్వరూపాలను మార్చి దేశం మొత్తం వ్యాపించేలా ఇది అందరినీ ఆకట్టుకుంది.
పార్లమెంట్ మార్చ్ అనంతరం వేలాది మంది విద్యార్థులు తమ ర్యాలీలో నలిగిపోయిన పాదరక్షలను ఒకచోట చేర్చారు. ఢిల్లీ పోలీసుల దాడులను గుర్తు చేసేలా వాటిని ప్రదర్శించారు. హృదయం కృంగిపోయేటువంటి ఈ సంఘటనలను చిత్రించి తమ వినూత్న నిరసన రూపంగా చూపారు.
పోరాట స్వరూపాలను మార్చేసి కొత్త పద్ధతిలో సెటైర్లు, ట్రోల్స్ ద్వారా ఉద్యమాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లవచ్చని వీరు నిరూపించారు. ఈ పద్ధతిలో అందరినీ ఆకట్టుకోవచ్చు, ఐక్యతను సాధించవచ్చని స్పష్టం చేశారు. పోరాడి ఏదైనా సాధించవచ్చు అనే అచంచల విశ్వాసాన్ని ఈ జెన్ జీ ఉద్యమం కలిగించింది.
ఈ సమాజంలో ఆకలికేకలు, అసమానతలు నెలకొని ఉన్నాయి. పీడితులపై పడి పీడించే దోపిడీ దొంగల ఆగడాలను ఇంకెంత మాత్రం సహించము అనే భావన యువతలో, విద్యార్థులలో పెరుగుతోంది. ఈ సానుకూల మార్పు సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కచ్చితంగా దోహదపడుతుంది.
శ్రీ శ్రీ అన్నట్టు…
‘నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి’ అని పిలిచినట్టుగా దేశ యువత కదిలారు. వ్యవస్థతో వారు తలపడ్డారు.
‘కదం తొక్కుతూ, పదం పాడుతూ, హృదంతరాళం గర్జిస్తూ పదండి పోదాం’ అని పిలిచినట్టుగా ఢిల్లీ జంతర్ మంతర్‌కు కదిలారు. అన్ని నిర్బంధాలను ఛేదించి లాఠీలు, తూటాలు, దాడులను వారు ఎదురొడ్డి నిలబడ్డారు. తలబడ్డారు, చివరకు విజయం సాధించారు.
కొంతమంది కుర్రవాళ్ళు ముందు యుగపుదూతలు
పావన నవజీవన బృందావన నిర్మాతలు..
వీరే గత మే 16 నుంచి జూలై నెల చివరి వరకు 36 రోజుల పాటు ఉద్యమాన్ని నడిపారు. ఈ విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపారు. వాటిని ప్రక్షాళన చేయాలని వీరు గట్టిగా పోరాడారు.
గత 12 సంవత్సరాల నుండి పాలిస్తూ తమకు తిరుగులేదని పాలకులు బరితెగించారు. వారు కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన, మహిళా, యావత్ ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారు. కొంతమందికే దేశ సంపదను మళ్లిస్తున్నారు. అటువంటి అధికార వ్యవస్థపై విద్యార్థులు గర్జించి పోరాడారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించారు. వారు అనుకున్నది సాధించారు.
వీరే భవిష్యత్తును నిర్మించే శక్తులు. వారికే సెల్యూట్. ఇంక్విలాబ్ జిందాబాద్..
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
