2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి.
రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు, వాటి అమలు తీరు, తెలంగాణ ఉద్యమం సందర్భంగా నేతల నినాదాలు; 10 సంవత్సరాల టీఆర్ఎస్(బీఆర్ఎస్) పాలన, ఆ తర్వాత రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన గురించి ఓసారి సమీక్షించుకుందాం.
కేంద్ర ప్రభుత్వ వాగ్దానాలు – బుట్టదాఖలైన హామీలు..
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ చట్టం 2014 ప్రకారం, తెలంగాణ రాష్ట్రానికి సమీకృత ఉక్కు కర్మాగారం ఖమ్మం జిల్లాలోని బయ్యారంలో ఏర్పాటు చేస్తామని స్పష్టంగా పేర్కొన్నారు.
కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కుంటిసాకులు చెప్పి ఆ ప్రాజెక్టును బుట్టదాఖలు చేసింది.
అలాగే ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినప్పటికీ నేటికీ పూర్తిస్థాయిలో దాని నిర్మాణ అభివృద్ధి పనులు జరగలేదు.
కాజీపేటలో రైల్వే కోచ్ నిర్మాణ కర్మాగారం నెలకొల్పుతామని చట్టంలో పేర్కొన్నారు.
తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 60 ఎకరాల స్థలం కూడా కేటాయించింది. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం తొండి చేసింది.
కొత్త రైల్వే కోచ్ల నిర్మాణం దేశంలో అవసరం లేదని చెప్పి మోసం చేసింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ప్రణాళికకు రాష్ట్ర విభజన కంటే ముందే హైదరాబాదులో ఏర్పాటుకు అనుమతి లభించింది. కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం దానికి తిలోదకాలిచ్చింది.
ఆ విధంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చట్ట ప్రకారం, అమలు చేయాల్సిన వాటిని కూడా అమలు చేయకుండా ఉల్లంఘనకు పాల్పడి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన – వైఫల్యాలు..
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలులో కొంత పురోగతి ఉన్నమాట వాస్తవం.
కానీ కీలకమైన ఉపాధికి దోహదపడే బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ నిర్మాణ ప్రాజెక్టులు సాధించుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి ఘర్షణ పడలేదు.
వాటి సాధన కోసం ప్రతిపక్ష పార్టీల మద్దతు తీసుకోవడంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది.
పైగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన అనేక ప్రజావ్యతిరేక బిల్లులకు మద్దతునిచ్చింది. ఇది టీఆర్ఎస్ పాలనలో చెరిగిపోని ఒక మచ్చ.
టీఆర్ఎస్ పాలనలో దాదాపు అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం అనేక రూపాలలో పోరాటాలు, సమ్మెలతో సహా నిర్వహించారు.
ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతుల్లో చర్చలు జరిపి పరిష్కరించాలి. కానీ దీనికి భిన్నంగా బీఆర్ఎస్ వ్యవహరించింది.
మరీ ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల 55 రోజుల సమ్మె సందర్భంగా తీవ్రమైన అణిచివేతకు పాల్పడింది. చట్ట విరుద్ధంగా యూనియన్లు లేవు అని చెప్పి పచ్చి నిరంకుశ వైఖరి తీసుకుంది.
10 సంవత్సరాల పాలనలో కనీస వేతనాలు పెంచలేదు. వివిధ బోర్డుల నియామకం కూడా సక్రమంగా చేయలేదు.
డబుల్ బెడ్ రూమ్ ప్రకటన చేసి, నిర్మాణ పనులు ప్రారంభించినా ఆచరణలో తన పదవీకాలం ముగిసే నాటికి అర్హులందరికీ అందజేయడంలో బీఆర్ఎస్ విఫలమైంది.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరు – ప్రస్తుత పరిస్థితి..
రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారానికి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలనతో విసిగివేసారిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, స్వేచ్ఛావాయువులు పీల్చుకోగలుగుతామని, బంగారు తెలంగాణ వస్తుందని ఆశించారు.
మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, రైతుల రుణమాఫీ తదితర కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళీకృత ఆర్థిక విధానాలనే తాను కూడా ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నది.
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ నియామకాలు రద్దు కాలేదు. విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ బస్సు డిపోలను కూడా ప్రైవేటు వారికి అప్పజెప్పడానికి రంగం సిద్ధం చేసింది.
ఇటీవల మూడు రోజుల సమ్మెలో ఒక కార్మికుడి ఆత్మ బలిదానం తర్వాత కార్మిక సంఘాలతో ప్రభుత్వం ఒక ఒప్పందానికి వచ్చింది. అప్పటిదాకా ఎలాంటి ఆర్థికభారం లేని కార్మిక సంఘాల పునరుద్ధరణను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయలేదు.
వాస్తవ అభివృద్ధి – ప్రజల ఆకాంక్షలు..
రాష్ట్ర నిజమైన అభివృద్ధి కేవలం నగరాల భవనాల్లో లేదు. అది పేదవాడి కడుపు నిండడంలో ఉంది. సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు తాత్కాలిక ఉపశమనం ఇస్తున్న మాట వాస్తవమే.
అయితే విద్య, వైద్య రంగాలను పూర్తిగా ఉచితంగా, అంతర్జాతీయ స్థాయిలో పేదలకు అందుబాటులోకి తెచ్చినప్పుడే నాటి అమరవీరుల ఆశయాలు, నేటి పేద ప్రజల ఆకాంక్షలు పరిపూర్ణంగా నెరవేరుతాయి.
ప్రతి పౌరుడు తలెత్తుకొని తిరగడం, గౌరవప్రదంగా బ్రతకడం ప్రధానమైంది. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవలసిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వాలపై ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
