గృహిణులు చేసే శ్రమపై ‘శిశుపాల్ @సిష్ రామ్ వర్సెస్ సూర్జిత్’ కేసులో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, భారత న్యాయ వ్యవస్థలో అరుదుగా, చిరస్మరణీయంగా నిలిచే తీర్పు.
“గృహిణి ఇంటికే కాదు-దేశ నిర్మాణానికీ పునాది”. కుటుంబాల కోసం జీవితాంతం శ్రమిస్తూ, వేతనం, గుర్తింపు లేని కోట్లాది మంది మహిళలకు ఈ తీర్పు ఎంతో విలువైనది.
ఒక రోడ్డు ప్రమాద నష్టపరిహార దావాతో ఈ కేసు ప్రారంభమైంది. కోర్టు కేవలం నష్టపరిహారాన్ని సవరించడానికే పరిమితం కాలేదు.
ఇంటి పరిధిలో చేసే ఉచిత శ్రమను, కనిపించనిది లేదా యాదృచ్ఛికంగా చూడలేమని స్పష్టంగా గుర్తించింది.
“గృహ సంరక్షణ నష్టం” అనే ప్రత్యేక పరిహార విభాగాన్ని సృష్టించి, కనీస విలువను నెలకు ₹30,000గా నిర్ణయించింది.
గృహిణి శ్రమను, పురుషులు తమ హక్కుగా తీసుకుంటున్న నేటి సమాజంలో, సుప్రీంకోర్టు చట్టపరమైన గుర్తింపు ఇవ్వడానికి ప్రయత్నించింది.
ఈ తీర్పు చాలా ముఖ్యమైనది, ప్రత్యేకమైనది. ఎందుకంటే గృహిణుల శ్రమని న్యాయస్థానాలు చారిత్రకంగా ఎలా అంచనా వేశాయి అని నేరుగా ప్రశ్నించింది.
గతంలో ఊహించి నిర్ణయించిన ఆదాయాలు చాలా తక్కువగా ఉండేవి. అవి మహిళలు ప్రతిరోజూ చేసే ఉచిత శ్రమ, బాధ్యతల విస్తృతిని ప్రతిబింబించేవి కావు.
గృహిణి అంటే ఇంటికే పరిమితం కాదు..
గృహిణి అంటే కేవలం వంట చేయడం, ఇంటిని శుభ్రం చేయడం మాత్రమే కాదు. ఆమె పిల్లలను పెంచుతుంది. వృద్ధులను చూసుకుంటుంది. ఇంటి నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది.
అంతేకాదు కుటుంబంలోని ఇతర సభ్యులు ఉద్యోగాలు చేసేందుకు, వారి లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన వాతావరణం కల్పిస్తుంది.
గృహిణి లేకపోవడం వలన కుటుంబం అనుభవించే నష్టాన్ని కేవలం సాంప్రదాయబద్ధమైన “సహచర్య నష్టం”గా మాత్రమే చూడలేమని సుప్రీంకోర్టు సరిగ్గా చెప్పింది.
గృహిణి అందించే సేవలు, సంరక్షణ, భావోద్వేగ మద్దతు, కుటుంబ స్థిరత్వానికి ఆమె చేసే కృషి ఎంతో విలువైనవని ఈ తీర్పు స్పష్టం చేసింది.
దశాబ్దాల వైరుధ్యానికి ముగింపు..
ఈ తీర్పు దశాబ్దాలుగా కొనసాగుతున్న వైరుధ్యాన్ని కూడా ప్రస్తావించింది. గృహిణుల శ్రమపై ఆధారపడిన కుటుంబ వ్యవస్థ, సంపాదించి పెట్టే కుటుంబ సభ్యులపై ఆధారపడే వ్యక్తులుగా గృహిణులను చూస్తున్నారు.
సుప్రీంకోర్టు ఈ దృక్పథాన్ని తిరస్కరించింది. దానిని వేతనం లేని శ్రమగా అభివర్ణించింది.
అయినా, ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలే ఉంది. గృహిణి చేసే శ్రమ, సేవలకు నిజమైన విలువను డబ్బుతో కొలవలేమని కోర్టు పలుమార్లు పేర్కొంది.
అలాంటప్పుడు, నెలకు ₹30,000 అనే మొత్తాన్ని ఎలా నిర్ణయించారు?
భవిష్యత్ మార్గదర్శకత్వం – సవాళ్లు..
ఈ మొత్తాన్ని కోర్టు కనీస ప్రాథమిక విలువగా, గృహిణి చేసే విలువైన కృషికి ప్రతీకగా పేర్కొంది. నష్టపరిహార కేసులలో ఇది ఆచరణాత్మక పరిష్కారంగా ఉండొచ్చు.
అయినప్పటికీ, ఇది కేవలం అంచనా మాత్రమే. అంచనాలను దాటి ముందుకు వెళ్లడంలోనే అసలైన సవాలు ఉంది.
వేతనం లేని శ్రమ, సేవలకు, గృహ నిర్వహణ పనులకు సరైన విలువ కట్టాలంటే, విశ్వసనీయ గణాంకాలు, లోతైన పరిశోధనలు, విస్తృత చర్చ అవసరం.
సుప్రీంకోర్టు ఒక కీలకమైన తొలి అడుగు వేసి, ట్రైబ్యునళ్లకు ఎంతో అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందించింది. అయితే, గృహిణి శ్రమకు ఆర్థిక విలువను గుర్తించడం కేవలం న్యాయస్థానాల బాధ్యతగానే మిగిలిపోకూడదు.
గృహిణులు నిజంగానే దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తే, వారి కృషికి తగిన గుర్తింపు కల్పించే మరింత విశ్వసనీయమైన మార్గాలను, పాలకుల విధానాలు, చట్టాలు కనుగొనాల్సిన అవసరం ఉంది.
అనువాదం: జే. నాగేశ్వరరావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
