ప్రధాని నరేంద్ర మోదీ, భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పరిపాలనా కాలాన్ని అధిగమించి రికార్డు సృష్టించినట్లుగా పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్నది.
అయితే 1947 నుంచి 1952 వరకు కాలాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఈ లెక్కలు చెబుతున్నారు.
1946లో జరిగిన ఎన్నికలలోనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సంపాదించడంతో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధాని అయ్యారు.
ఇది చరిత్ర. దీనిని మినహాయించి మొదటి సాధారణ ఎన్నికలు జరిగిన 1952ను ప్రామాణికంగా తీసుకొని బీజేపీ ప్రచారం చేస్తోంది.
కాసేపు బీజేపీ ప్రచారాన్ని ప్రామాణికంగా తీసుకుందాం. ఆ లెక్క ఆధారంగా 12 సంవత్సరాల కాలంలో పండిట్ నెహ్రూ కాలంలో ఏం జరిగింది? 12 సంవత్సరాల మోదీ పరిపాలనా కాలంలో ఏం జరిగింది? అన్నది ముఖ్యమైన 14 అంశాల ఆధారంగా పరిశీలిద్దాం.
నెహ్రూ పరిపాలనా కాలం, భారతదేశాన్ని కొల్లగొట్టి అస్థిపంజరం లాంటి స్థితిలో బ్రిటిష్ సామ్రాజ్యం స్వాతంత్య్రాన్ని ప్రకటించింది.
ఈ స్థితిలో దేశ పునర్నిర్మాణం చేయాల్సిన కాలం పండిట్ జవహర్లాల్ నెహ్రూ పరిపాలన. కానీ నరేంద్ర మోదీ పరిపాలనా కాలం, అభివృద్ధి చెందుతున్న భారతదేశ కాలంలో సాగింది. ఈ కీలక అంశాన్ని కూడా ఇద్దరి పరిపాలనలను పోల్చే సందర్భంలో గమనంలో ఉంచుకోవాలి.
ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన..
ఓఎన్జీసీ(1956), బీహెచ్ఈఎల్ (1956), సెయిల్ (1954), ఎస్బీఐ (1955), ఎల్ఐసీ (1956), ఎయిర్ ఇండియా (1953), హెచ్ఏఎల్, ఎన్టీపీసీ, డీవీసీ, ఎన్ఎల్సీ, ఎన్ఎఫ్ఎల్, హెచ్ఎంటీ, ఐటీఐ లాంటి 200 పైగా ప్రభుత్వ రంగ సంస్థలు పండిట్ జవహర్లాల్ నెహ్రూ కాలంలో స్థాపించబడ్డాయి. ప్రభుత్వ రంగ సంస్థలు నూతన దేవాలయాలని పండిట్ నెహ్రూ అభివర్ణించారు.
నరేంద్ర మోదీ 12 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్కటి భారీ ప్రభుత్వ రంగ సంస్థను స్థాపించలేదు.
పైగా “ప్రభుత్వ రంగం పుట్టింది చావడానికే” అని పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించి అనేక సంస్థలను ప్రైవేటీకరణ చేశారు.
ఉన్నత విద్యా సంస్థలు..
ఖరగ్‌పూర్ (1951), బొంబాయి (1958), మద్రాస్ (1959), కాన్పూర్ (1959), ఢిల్లీ (1961)లలో ఐదు ఐఐటీలను స్థాపించారు. కలకత్తా (1961), అహ్మదాబాద్ (1961)లలో ఐఐఎంలను స్థాపించారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) న్యూఢిల్లీలో (1956) స్థాపించారు. 14 కేంద్రీయ విశ్వవిద్యాలయాలను స్థాపించారు. యూజీసీ 1956లో ఏర్పాటు చేయబడింది.
ఎన్ఐటీలు (రీజనల్ ఎడ్యుకేషన్ సెంటర్స్) స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేయబడ్డాయి. ఆ విధంగా అత్యున్నత సాంకేతిక విద్యా సంస్థలు ఆ కాలంలో స్థాపించబడ్డాయి.
నరేంద్ర మోదీ కాలంలో అంతకుముందు ప్రారంభించబడిన వాటికి కొనసాగింపుగా ఏడు ఐఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఐఐఐటీలకు అనుమతులు ఇవ్వడం, అందులో కొన్ని అమలులోకి రావడం జరిగాయి.
బలహీన వర్గాల పిల్లలను ఉన్నత విద్యకు దూరం చేసే జాతీయ విద్యా విధానం(పాలసీ 2020) తీసుకురాబడింది.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(న్యూఢిల్లీ)తో పాటు, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు నెలకొల్పబడ్డాయి.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1956లో స్థాపించబడింది. పారిశ్రామిక కార్మికుల కోసం ఈఎస్ఐ ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సీజీహెచ్ఎస్ 1954లో ఏర్పాటయ్యాయి.
దాదాపు శూన్యంగా ఉన్న స్థితి నుంచి అన్ని రాష్ట్రాలు, అనేక జిల్లాలలో వైద్య ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాలు కల్పించబడ్డాయి.
నరేంద్ర మోదీ కాలంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 15 విభాగాలకు అనుమతులు మంజూరు అయి కొన్ని ప్రారంభం అయ్యాయి.
మెడికల్ సీట్లు 2014లో 54,000 ఉండగా 2024 నాటికి 1.08 లక్షలకు పెరిగాయి. 150 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ 12 సంవత్సరాల కాలంలో ఏర్పాటయ్యాయి.
భారీ డ్యామ్‌లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు..
ఆసియా ఖండంలోనే భారీ ప్రాజెక్టు భాక్రా నంగల్ (పంజాబ్-1963), హిరాకుడ్ (ఒరిస్సా-1957), నాగార్జునసాగర్ (ఏపీ-1955), రిహాండ్ (ఉత్తర ప్రదేశ్-1962), తుంగభద్ర (కర్ణాటక-1953), దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్‌లతో పాటు 50 మేజర్ డ్యామ్‌లు నిర్మించబడ్డాయి. ఫలితంగా మిలియన్ల హెక్టార్లు సస్యశ్యామలం అయినాయి.
నరేంద్ర మోదీ కాలంలో 1960లో ప్రణాళికలు రూపొందించబడిన సర్దార్ సరోవర్ డ్యామ్ 2017లో ప్రారంభించబడింది.
ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లోని రేణుకాజీ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది. అంతకుమించి భారీ ప్రాజెక్టుల ప్రణాళికలు గానీ, నిర్మాణం గానీ లేవు.
పేదలకు భూ పంపిణీ / భూ సంస్కరణలు..
నెహ్రూ కాలంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన జమీందారీ అబాలిషన్ యాక్ట్ 1950-55 తీసుకువచ్చారు.
దీని వెలుగులో దాదాపు అన్ని రాష్ట్రాలు 1.7 లక్షల జమీందారీలను రద్దు చేశాయి. రెండు కోట్ల మంది కౌలుదారులు పట్టాహక్కులు పొందారు.
ల్యాండ్ సీలింగ్ అనేక రాష్ట్రాలలో అమలయింది. భూదాన ఉద్యమం కింద 40 లక్షల ఎకరాల సేకరణ జరిగి 13 లక్షల ఎకరాలు పంపిణీ అయింది.
గ్రామీణ పేదల కోసం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం(1952), పంచాయతీరాజ్ ఫౌండేషన్ (1959) లో జరిగాయి.
నరేంద్ర మోదీ కాలంలో ల్యాండ్ సీలింగ్ అమలు లేదా పట్టాల పంపిణీ జరగలేదు. యూపీఏ ప్రభుత్వ కాలంలో తెచ్చిన భూసేకరణ చట్టంలోని ప్రయోజనాలను హరిస్తూ సవరణలు ప్రతిపాదించింది. అయితే పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో చట్టాన్ని అమలులోకి తీసుకురాలేకపోయింది.
2020 సంవత్సరంలో రైతులకు ఉరితాళ్లు లాంటి మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 750 మంది రైతులు ప్రాణత్యాగం చేశారు.
చివరికి ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ, వ్యవసాయ రంగాన్ని భారీ కార్పొరేట్ సంస్థలకు అప్పగించే క్రమం కొనసాగుతున్నది.
పార్లమెంటు నిర్వహణ..
పండిట్ నెహ్రూ కాలంలో పార్లమెంటు సగటున సంవత్సరానికి 120 నుంచి 130 రోజులు జరిగింది. విస్తృతమైన చర్చలు జరిగాయి.
క్వశ్చన్ అవర్ కచ్చితంగా అమలు జరిగింది. అత్యధికమైన బిల్లులపై సభలో చర్చ జరిగింది. ప్రతిపక్ష పార్టీలకు పూర్తి సమయం కేటాయించబడింది.
నరేంద్ర మోదీ పాలనలో సంవత్సరానికి సగటున 55 నుంచి 70 రోజులు పార్లమెంటు జరిగింది. స్టాండింగ్ కమిటీకి నివేదించబడిన బిల్లులు కేవలం 13 శాతం మాత్రమే.
అదే యూపీఏ ప్రభుత్వ కాలంలో 71 శాతం బిల్లులు స్టాండింగ్ కమిటీకి నివేదించబడ్డాయి. ప్రతిపక్షాలకు చర్చలకు తగిన సమయం ఇవ్వలేదు. పైగా భారతదేశ పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 143 మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేసి అనేక బిల్లులు నామమాత్రపు చర్చతో ఆమోదింపజేసుకున్నది. క్వశ్చన్ అవర్ తరచూ కుదించటం/రద్దు చేయడం జరిగాయి. జీరో అవర్ కుదించబడింది.
పార్లమెంటులో, వివిధ రాష్ట్రాల శాసనసభలలో ప్రతిపక్ష సభ్యులను ప్రలోభపెట్టి, కేసులలో ఇరికించి, భయభ్రాంతులకు గురిచేసి చీలికలు తీసుకొచ్చి బీజేపీలో చేర్చుకోవడం ఒక పథకం ప్రకారం జరుగుతున్నది.
ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టి, తన సొంత పార్టీ లేదా తన అనుయాయుల ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా జరుగుతున్నది. తద్వారా ప్రజాస్వామ్యం పూర్తిగా నిర్వీర్యం చేయబడుతున్నది.
పత్రికా విలేకరుల సమావేశాలు..
పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రతి సమస్య మీద పత్రికా విలేకరుల సమావేశం జరిపేవారు. వారానికి ఒకసారి ప్రెస్ బ్రీఫింగ్ సాధారణంగా జరిగేది.
దేశ, విదేశీ పత్రికా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చేవారు. పత్రికా స్వేచ్ఛను పూర్తిగా సమర్థించారు. ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛలో భారతదేశం ప్రముఖ స్థానంలో ఉండేది.
పండిట్ నెహ్రూ కాలం పత్రికలకు, ప్రజాస్వామ్య జవాబుదారీతనానికి మోడల్‌గా ఉండేది.
నరేంద్ర మోదీ 12 సంవత్సరాల కాలంలో పత్రికా విలేకరుల సమావేశాలు లేవు. చాలా అరుదుగా విదేశీ నేతలతో కలిసి జాయింట్ స్టేట్మెంట్స్ మాత్రం ఇచ్చారు.
తనకు అనుకూలంగా ఉండే మీడియా సంస్థలకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. ప్రపంచ దేశాలలో పత్రికా స్వాతంత్ర్యంలో భారతదేశం 140వ స్థానానికి పడిపోయింది. ఉపా/ఐటీ చట్టాల కింద అనేకమంది పత్రికల వారి మీద, పత్రికా సంస్థల మీద దాడులు, నిర్బంధాలు జరిగాయి.
విదేశీ పర్యటనలు..
పండిట్ జవహర్లాల్ నెహ్రూ 17 సంవత్సరాల కాలంలో 25 నుంచి 30 దేశాల పర్యటనలు చేశారు. అలీన విధాన సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు.
నరేంద్ర మోదీ ప్రపంచ దేశాధినేతలలో అత్యధిక విదేశీ పర్యటనలు చేసిన వారిగా చరిత్రకు ఎక్కారు. 12 సంవత్సరాల కాలంలో 100 విదేశీ పర్యటనలలో 700 రోజులు గడిపారు. 65 దేశాలు తిరిగారు. ముఖ్యంగా అమెరికా 7 పర్యాయాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 7 పర్యాయాలు పర్యటించారు. వారితో పాటు వ్యాపార దిగ్గజాలను భారీ సంఖ్యలో తీసుకువెళ్లారు.
వ్యవసాయ రంగం – రైతుల ఆత్మహత్యలు..
రైతుల ఆత్మహత్యలకు సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 1990 నుంచి మాత్రమే లెక్కించడం ప్రారంభించింది. భారత స్వాతంత్ర్యానంతరం వ్యవసాయం ప్రధానంగా ఆహార భద్రత, హరిత విప్లవం, జమీందారీ అబాలిషన్, గ్రామీణ భూస్వాముల దోపిడీని అరికట్టడం, వ్యవసాయంలో సహకార వ్యవస్థను ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.
నరేంద్ర మోదీ పాలనలో సగటున సాలీనా పదివేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు తెలియజేస్తున్నాయి.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా పంటలకు మద్దతు ధర ప్రకటిస్తామని ఎన్నికల ముందు నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ చేసిన వాగ్దానాలు చివరికి జుమ్లాలుగా మారాయి.
మహిళలపై దాడులు, అత్యాచారాలు..
1950ల నాటికి క్రమబద్ధమైన జాతీయ నేరాల డేటా సేకరణ ప్రాథమిక దశలోనే ఉంది. హిందూ కోడ్ బిల్లులు(1955-56), మహిళలకు విడాకుల హక్కులు, వారసత్వ హక్కులను కల్పించాయి. ఇది ఒక మైలురాయి లాంటి చట్టం.
వరకట్న నిషేధ చట్టం 1961లో అమల్లోకి వచ్చింది. బాల్య వివాహాల నియంత్రణ చట్టం కఠినంగా అమలు చేయబడింది. మహిళల విద్య కోసం జాతీయ మండలి ఏర్పాటు చేయబడింది. సమాజం సంప్రదాయబద్ధంగా ఉండేది. నేరాల నమోదు రేటు చాలా తక్కువగా ఉండేది.
నరేంద్ర మోదీ పాలనలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. మణిపూర్‌లో మహిళలపై జరిగిన అనాగరిక చర్య మన కళ్ల ముందు మెదులుతున్నది. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ బడ్జెట్ ఈ కాలంలో 50 శాతం కుదించబడింది.
ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే ఉపన్యాసాలు..
నెహ్రూ తన ఎన్నికల ప్రచార సభలన్నింటిలోనూ మతోన్మాద పోకడలకు వ్యతిరేకంగా ప్రసంగించారు. ఎన్నడూ మతం ఆధారంగా సమీకరణలకు పాల్పడలేదు.
నెహ్రూ వ్యక్తిగతంగా ఆరెస్సెస్ని చాలా ఘాటుగా విమర్శించారు. మహాత్మా గాంధీ హత్య అనంతరం ఆరెస్సెస్‌ను నిషేధించారు. గాడ్సే లాంటి ఉగ్రవాద చర్యలను గట్టిగా ఖండించారు. లౌకిక, ప్రజాస్వామ్య విలువలు కాపాడారు.
నరేంద్ర మోదీ పాలనలో భారత ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన బీజేపీ నాయకులకు వందకు పైగా నోటీసులు జారీ చేసింది.
ప్రత్యేకంగా నరేంద్ర మోదీ, అమిత్ షాలు 2019, 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారు. ఐక్యరాజ్యసమితి తన నివేదికలో కూడా భారతదేశంలో రెచ్చగొట్టే ఉపన్యాసాల తీరు పెరిగిందని పేర్కొన్నది. బీజేపీ పాలిత నాలుగు రాష్ట్రాలలో లవ్ జిహాద్ చట్టం ఆమోదించబడింది.
దళితులు, ఆదివాసీలపై దాడులు..
1950లో రాజ్యాంగ సవరణ ద్వారా అస్పృశ్యత నివారణ చట్టాన్ని తెచ్చారు. నెహ్రూ వ్యక్తిగతంగా కుల వివక్షను వ్యతిరేకించారు. అస్పృశ్యత (నేరాల) చట్టం 1955లో తీసుకొచ్చారు. భూసంస్కరణల వల్ల షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి చాలా మేలు జరిగింది.
నరేంద్ర మోదీ పాలనలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ తరగతుల వారిపై దాడులు 42 శాతం పెరిగాయి.
హాథ్రస్ గ్యాంగ్ రేప్ 2020లో జరిగితే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబ అనుమతి లేకుండానే బాలిక శవాన్ని పూడ్చిపెట్టడానికి ప్రయత్నం చేసింది.
భీమా కోరెగావ్ కేసు కింద అనేకమందిని జైలుపాలు చేశారు. దళిత కార్యకర్తలు అనేకమందిని ఉపా చట్టం కింద అరెస్టులు చేశారు.
అటవీ రక్షణ..
నెహ్రూ కాలంలో అడవుల జాతీయీకరణ, పరిరక్షణ ప్రభుత్వ విధానంగా ఉండేది. 1952లో భారత అటవీ చట్టం మరింత పదిలం చేయబడింది.
నరేంద్ర మోదీ పాలనలో అటవీ హక్కుల చట్టాన్ని నీరుగార్చారు. గనుల తవ్వకాల ప్రైవేటీకరణతో ఆదివాసీలను నిర్వాసితులను చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం..
1956లో పారిశ్రామిక విధాన తీర్మానం ఆమోదించబడింది. ప్రభుత్వ రంగానికి పెద్దపీట వేశారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఆ కాలంలో స్థాపించబడ్డాయి.
నరేంద్ర మోదీ కాలంలో ఎయిర్ ఇండియాను టాటాకి అప్పగించారు. ఎల్ఐసీలో ఐపీఓ 2022లో అమలు చేశారు. 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఇటీవల ఆమోదించారు.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో పెట్టుబడి ఉపసంహరణకు ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా ఆగింది. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ను 2020లో అమ్మేశారు. పవన్ హన్స్‌ను 2022లో అమ్మేశారు. ఎన్ఐఎన్ఎల్ స్టీల్ రంగాన్ని 2022లో అమ్మేశారు. విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (పెట్టుబడుల ఉపసంహరణ) గత ఆరు సంవత్సరాల కాలంగా జరుగుతున్న ఆందోళనలతో అమల్లోకి రాలేదు.
నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ ద్వారా ప్రజల ధనంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను ప్రైవేట్ వారికి ధారాదత్తం చేస్తున్నారు.
అవినీతి – నల్లధనం..
2014 ఎన్నికల ప్రచార సభలలో అవినీతిని అరికడతానని, ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని నరేంద్ర మోదీ చెప్పారు. ఆ తరువాత ఇది ఒక “ఎన్నికల జుమ్లా” అని స్వయంగా అమిత్ షా అవహేళన చేశారు.
నల్లధనం అరికట్టడం కోసమే పెద్ద నోట్ల రద్దు చేశానని ప్రకటించుకున్నారు. ఫలితంగా ప్రజలు నానా అవస్థలు పడ్డారు. లఘు కుటీర పరిశ్రమలు ధ్వంసం అయ్యాయి. కొద్దిమంది ప్రజలు, బ్యాంకు ఉద్యోగులు ఒత్తిడిని తట్టుకోలేక మరణించారు. కానీ ఆచరణలో నల్లధనం అరికట్టబడలేదు సరిగదా నల్లధనం తెల్లదనంగా మారిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి.
“ఇందు గలడందు లేడని సందేహంబు వలదు చక్రి సర్గోపగతుండు ఎందెందు వెతికిన అందందే కలడు దాన వాగ్రినిన్” అన్నట్లు చెప్పనలవిగానంతగా అవినీతి సర్వవ్యాపితం అయింది.
ఎన్నికల బాండ్ల వ్యవహారం చివరికి సుప్రీంకోర్టు రద్దు చేసేదాకా కొనసాగింది. ఇది భారతదేశ చరిత్రలోనే కానీవిని ఎరుగని అవినీతి, అక్రమ సంపాదనకు పేరు మోసినదిగా అనేక ఆరోపణలు ఉన్నాయి.
కోటానుకోట్ల అవినీతిపరులు బీజేపీలో చేరిన తర్వాత అవన్నీ మూసివేయబడ్డాయి. అందుకే బీజేపీ “వాషింగ్ మెషిన్” అనే పేరుగాంచింది.
కార్మికులు ఉద్యోగులు..
జవహర్లాల్ నెహ్రూ కాలంలో 13 ప్రధాన కార్మిక చట్టాలు ఆమోదించబడ్డాయి. వాటిలో పారిశ్రామిక వివాదాల చట్టం 1947, కనీస వేతనాలు చట్టం-1948, ఈఎస్ఐ యాక్ట్ -1948, ఫ్యాక్టరీ యాక్ట్ -1948, ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్- 1952, అప్రెంటిస్ యాక్ట్-1961, మేటర్నటీ బెనిఫిట్స్ యాక్ట్-1961, మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్-1961 ఉన్నాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ తర్వాత చివరి నెల జీతంలో సగం పెన్షన్ సదుపాయం కల్పించబడింది.
నరేంద్ర మోదీ పాలనలో 29 కార్మిక చట్టాలు రద్దుచేసి కార్మికులను యజమానులకు బానిసలుగా తయారు చేసే క్రూరమైన నాలుగు లేబర్ కోడ్లను అమలులోకి తీసుకొచ్చింది.
వాజ్‌పేయి ప్రభుత్వం ఉద్యోగుల ఓల్డ్ పెన్షన్ పథకాన్ని రద్దుచేసి పెన్షన్ కోసం ఉద్యోగులు డబ్బులు చెల్లించే కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం 2004 సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చారు.
కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయిన చందంగా 1995 ఎంప్లాయిస్ పెన్షన్ స్కీంలో ఉన్న మూడు బెనిఫిట్స్‌ను 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసింది.
హైయర్ పెన్షన్ సమస్యను దుర్భరం చేసింది చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో కొంత మెరుగుదలకు అవకాశం ఏర్పడినా ఆచరణలో దాని ఫలితం విశ్రాంత ఉద్యోగులకు అందకుండా అనేక రకాల ఆటంకాలను కల్పించి లక్షలాది మందికి ఇప్పటికీ ఆ ప్రయోజనం అందకుండా విశ్రాంతి ఉద్యోగులవీధి పాలు చేసింది.
12 సంవత్సరాల కాలంలో దాదాపు 64% ద్రవయోల్బణం పెరిగినప్పటికీ కనీస పెన్షన్ ఇంతవరకు పెంచకుండా ఎందుకు కొరగాని 1000 రూపాయలు మాత్రమే కొనసాగిస్తున్నారు. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక ఉద్యోగులకు చేసిన అతి గొప్ప అపకారం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
