Do the lives of workers count for nothing? Will there be no punishment for the sins of the rulers?
ఒక్కడిని చంపినా హత్యే అవుతుంది. ఇద్దరినీ చంపినా అదీ హత్యే, ఇద్దరినీ విడివిడిగా విచారణ చేయరు.
ఒకే శిక్ష.. అది ఉరిశిక్ష లేదా యావజ్జీవిత కారాగార శిక్ష కావచ్చు. కానీ ఒకేసారి 9 మందిని చంపితే అది హత్యాకాండ. వారికి కూడా ఒకే శిక్ష అవుతుందా?
అంతేకాదు, అందుకు కారకులైన ప్రతి వ్యక్తీ హంతకులే. కానీ అందులో ప్రతి వ్యక్తికీ అదే శిక్ష పడాలి. అంటే విధానపరమైన దుర్మార్గపు హత్యలనే పాపానికి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, వారికి సహాయం చేసిన వారు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు కూడా నేరగాళ్లవుతారు.
క్రిమినల్ లా ప్రకారం, క్రిమినాలజీ సిద్ధాంతాల కింద ప్రతి వ్యక్తికి శిక్ష, ఉరి లేదా మరోటి అమలు చేయవలసిందే.
కానీ అధికార పక్షానికి ఒక శిక్ష, ప్రతిపక్షానికి ఒక శిక్ష, మామూలు మనిషికి మరో శిక్ష. లజ్జ అనే పదం ఎవరికీ లేదు. అప్పుడే కోపం వస్తుంది. జనాగ్రహం శాపమై తగులుతుంది. ఒక్కో కుటుంబంలో ప్రతి సభ్యుడు, బంధువులు కూడా శాపానికి గురవుతారు. ఐపీసీ కాదు, మరొకటి కాదు.. ఈ శాపానికి తిరుగు ఉండదు.
నేరస్తులు అధికారంలో ఉంటే వారి పాపం పెరిగిపోతుంది. తిరుపతి తిరుమల, అలిపిరిలో ప్రాణాలతో బయటపడడం అదృష్టం. కానీ కనీసం పాఠం నేర్చుకోవాలి. ఒక్కరికి మాత్రమే కాదు, మొత్తం కుటుంబానికి ఆ భావన ఉండదు. ఆలోచించరు. బాధపడరు. నేరానికి పశ్చాత్తాపం ఉండదు. సిగ్గు పడవలసిన విషయం ఇది.
ఇంకా ఇంకా నేరాలు చేస్తూ, పాపాలు చేస్తూ, ద్రోహాలు చేస్తూ పరిపాలనలో ఉంటే రాజ్యాంగ హత్యలకు కూడా పార్లమెంట్లో, అసెంబ్లీలో, సుప్రీంకోర్టులో శిక్షలు పడవా? కర్మ ఎవరినీ వదిలిపెట్టదని ఆధ్యాత్మిక ఆలోచనాపరులు అంటారు.
ఇది ఉద్దేశపూర్వక హత్య కాదా?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో కార్మికులు మరణించడం అనేది కేవలం “ఆకస్మిక ప్రమాదం” మాత్రమే కాదు, అది యాజమాన్యం, పాలకుల తీవ్రమైన నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన వల్ల జరిగిన ఘోరం.
చట్టపరంగా ఇది నేరుగా ఉద్దేశపూర్వక హత్య కాకపోయినప్పటికీ, కార్మికుల మరణానికి కారణమైన పాలకుల, అధికారుల బాధ్యతారహిత వైఖరి కచ్చితంగా శిక్షార్హమైన నేరమే.
భారతదేశంలో 2024 జూలై 1 నుంచి పాత ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, 2023 అమల్లోకి వచ్చింది.
సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాల ప్రకారం ఇలాంటి పారిశ్రామిక మరణాలకు ఈ కొత్త నేర చట్టం కింద ఎటువంటి శిక్షలు విధిస్తారో పరిశీలించాలి.
నిర్లక్ష్యం వల్ల మరణం..
పరిశ్రమల్లో తగిన రక్షణ చర్యలు తీసుకోకుండా, అనుభవం లేని సిబ్బందితో ప్రమాదకరమైన పనులు చేయించి మరణాలకు కారణమైతే, కొత్త చట్టం ప్రకారం ప్రధానంగా రెండు రకాల సెక్షన్లు వర్తిస్తాయి.
సెక్షన్ 106(1) బీఎన్ఎస్(పాత చట్టంలో సెక్షన్ 304ఏ ఐపీసీ) – నిర్లక్ష్యం వల్ల మరణం సంభవించడం:
ఉద్దేశపూర్వక హత్య కాకుండా, ఏదైనా ఒక రష్ లేదా నిర్లక్ష్యపూరితమైన చర్య వల్ల ఒక వ్యక్తి మరణానికి కారణమైతే ఈ సెక్షన్ వర్తిస్తుంది.
పరిశ్రమల సందర్భంలో కార్మికులకు కనీస రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం, 6,000 మంది అనుభవజ్ఞులైన కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి, తక్కువ సిబ్బందిపై తీవ్రమైన పని ఒత్తిడి తీసుకురావడం, సేఫ్టీ ఆడిట్ నిర్వహించకపోవడం వంటివి “నేరపూరిత నిర్లక్ష్యం” కిందికే వస్తాయి.
శిక్షలో ఒక పెద్ద మార్పు ఉంది. పాత ఐపీఎస్ 304A కింద గరిష్టంగా కేవలం 2 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే ఉండేది. కానీ కొత్త బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద దీనిని 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానాగా పెంచారు. (ఇది ప్రభుత్వ/యాజమాన్య నిర్లక్ష్యానికి తీవ్రమైన హెచ్చరిక).
హత్య కాని నేరపూరిత నరహత్య..
సెక్షన్ 105 బీఎన్ఎస్(పాత చట్టంలో సెక్షన్ 304 Part-II ఐపీసీ) – హత్య కాని నేరపూరిత నరహత్య:
ఒక చర్య వల్ల అవతలి వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉందని స్పష్టమైన “జ్ఞానం” ఉండి కూడా, ఆ చర్యను నిర్లక్ష్యంగా కొనసాగించడం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమ సందర్భంలో: 1500°C ద్రవరూప ఉక్కుతో పనిచేసే బ్లాస్ట్ ఫర్నెస్ వద్ద తగినంత మంది నిపుణులు లేకపోతే విస్ఫోటనం జరిగి ప్రాణాలు పోతాయని యాజమాన్యానికి స్పష్టమైన సాంకేతిక పరిజ్ఞానం/జ్ఞానం ఉంటుంది.
అటువంటి విషయం తెలిసి కూడా కేవలం ఉత్పత్తి పెంచడం కోసం, ఖర్చులు తగ్గించుకోవడం కోసం భద్రతా ప్రమాణాలను గాలికొదిలేస్తే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానా విధిస్తారు.
సుప్రీంకోర్టు చెప్పినా వినరా?
పరిశ్రమలు, ఆసుపత్రులు, ప్రభుత్వ విభాగాల్లో జరిగే నిర్లక్ష్యపు మరణాలపై సుప్రీంకోర్టు ఇటీవలి కాలంలో అత్యంత కఠినమైన వైఖరిని అవలంబిస్తోంది.
కేవలం కార్మికులను మాత్రమే కాకుండా, నిర్ణయాలు తీసుకునే ఉన్నతాధికారులను, పాలకులను కూడా బాధ్యులను చేస్తూ కోర్టులు తీర్పులు ఇచ్చాయి.
సుశీల్ అన్సాల్ వర్సెస్ స్టేట్ (ఉపహార్ సినిమా థియేటర్ దురంతం కేసు) చారిత్రాత్మక కేసులో, “లాభాల కోసం భద్రతా ప్రమాణాలను పక్కనబెట్టడం అనేది కేవలం సివిల్ తప్పు కాదు, అది సమాజానికి వ్యతిరేకంగా చేసే నేరపూరిత చర్య. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతే, ఆ సంస్థ అధినేతలు ‘మాకు ప్రత్యక్షంగా సంబంధం లేదు’ అని తప్పించుకోలేరు”అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మహదేవప్ప లక్ష్మణ్ వడ్డర్ వర్సెస్ కర్ణాటక రాష్ట్రం: నిర్లక్ష్యపు మరణాలపై సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ: “ఒక ప్రమాదం జరగడానికి ప్రత్యక్ష కారణం ఎవరనేది ముఖ్యం. రక్షణ ఏర్పాట్లు చేయడంలో విఫలమైన సూపర్వైజర్లు, ప్లాంట్ మేనేజర్లు, లైసెన్సింగ్ అధికారులు క్రిమినల్ బాధ్యత నుంచి తప్పించుకోలేరు. ప్రభుత్వ రంగానికి చెందినవారైనా సరే చట్టం ముందు సమానులే.”
భోపాల్ గ్యాస్ దురంతం కేసు పరిణామాలు & తాజా పారిశ్రామిక తీర్పులు: ఇటీవల కాలంలో ఫ్యాక్టరీలలో జరిగే బాయిలర్ పేలుళ్లు, గ్యాస్ లీకేజీలపై సుప్రీంకోర్టు “అబ్సల్యూట్ లయబిలిటీ”(- సంపూర్ణ బాధ్యత) సూత్రాన్ని వర్తింపజేస్తోంది.
దీని ప్రకారం, ఒక ప్రమాదకరమైన పరిశ్రమను నడుపుతున్నప్పుడు, అందులో జరిగే ఏ నష్టానికైనా, మరణానికైనా యాజమాన్యమే సంపూర్ణ బాధ్యత వహించాలి. “మాకు తెలియకుండా జరిగింది” అనే వాదనలు కోర్టుల్లో చెల్లవు.
విశాఖ ఉక్కు ప్లాంట్‌లో జరిగిన అన్యాయ మరణాలు పాలనాపరమైన, నిర్వహణాపరమైన వైఫల్యాల వల్ల జరిగినవే కాబట్టి, బాధ్యులైన వారిపై కొత్త చట్టంలోని బీఎన్ఎస్ సెక్షన్ 106(1), సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసి విచారించే పూర్తి అర్హత ఉంది.
పాత చట్టంతో పోలిస్తే కొత్త న్యాయ సంహితలో నిర్లక్ష్యపు మరణాలకు శిక్షను 2 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు పెంచడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం వ్యవస్థల్లో జవాబుదారీతనాన్ని పెంచడమే.
విధానపరమైన నేరాలు..
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవలంబిస్తున్న విధానాలు, వారి పరస్పర విరుద్ధ ప్రకటనలు ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సుకు పనికి వస్తాయా?
కూటమి నాయకులు పబ్లిక్‌లో చేస్తున్న ప్రకటనలు, క్షేత్రస్థాయిలో వారు తీసుకుంటున్న చర్యలు ఆరోగ్యకరంగా లేవు. కార్మిక సంఘాలు ఈ సమస్యలను తీవ్రంగా ఎత్తిచూపుతున్నాయి. నిందించాల్సింది ప్రభుత్వాన్ని, వారి యంత్రాంగాన్ని తప్పకుండా. నిందల విషయం ఏమయినా హత్యతో సమానమైన దుర్మార్గమే అవుతుంది. భారతీయ శిక్షా స్మృతిలో స్పష్టంగా శిక్షించవలసిన నేరాలనే అనవలసిందే.
కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపినట్టా లేదా?
2026 నాటి అధికారిక నివేదికల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను (ప్రైవేటీకరణ) తాత్కాలికంగా నిలిపివేసింది.
కూటమి ప్రభుత్వం ఒత్తిడి కారణంగా కేంద్రం రూ 11,440 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించింది. అయినప్పటికీ, ప్లాంట్‌ను శాశ్వతంగా ప్రభుత్వ రంగంలో ఉంచేందుకు అవసరమైన సొంత ఇనుప ఖనిజ గనులు కేటాయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా విజయం సాధించలేదు.
నాయుడుగారి మాటలు, సినీ హీరో మాటలు..
మొదటి ఉదాహరణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు. ఆయన కార్మికులపై నిందలు వేస్తూ కార్పొరేట్ సంస్థలతో పోల్చడం అసమంజసంగా ఉన్నాయి.
కేంద్రంలో చక్రం తిప్పగల భాగస్వామిగా ఉన్నప్పటికీ, ప్లాంట్‌కు శాశ్వత రక్షణ అయిన సొంత గనుల కేటాయింపును చంద్రబాబు సాధించలేకపోయారు.
2025 నవంబర్‌లో పబ్లిక్ వేదికలపై చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ నష్టాలకు కార్మికులే కారణమన్నట్టు వ్యాఖ్యానించారు. అంతకన్నా తీవ్రంగా “పని చేయకుండా జీతాలు ఆశిస్తున్నారు, ప్లాంట్‌ను సమర్థవంతంగా నడపడం లేదు” అని ఉద్యోగులను మందలించారు.
స్పష్టంగా ఆయన ప్రైవేట్ అనుకూల ధోరణి ప్రదర్శిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పక్కనే కొత్తగా వస్తున్న ప్రైవేట్ సంస్థ ‘ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్’తో పోల్చారు.
ప్రైవేట్ ప్లాంట్లు ఏడాదిలోనే లాభాల్లోకి వస్తుంటే, ప్రభుత్వ రంగంలోని వైజాగ్ స్టీల్ ఎందుకు నష్టపోతోందని ప్రశ్నిస్తూ, పరోక్షంగా ప్రైవేటీకరణే మార్గమనేది ఆయన ధోరణి.
‘‘భావోద్వేగం’’ ఉపయోగమేనా..
మరోవైపు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో భావోద్వేగాలు నిజమైన వాస్తవాలు ఉన్నాయా లేదా అని ఆలోచించవలసి ఉంటుంది.
గతంలో “విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” అంటూ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వ కఠిన నిబంధనల ముందు మౌనం వహించాల్సి వచ్చింది.
2026 జూన్ నాటి ఉక్కు పరిశ్రమ ప్రమాదం తర్వాత పవన్ కళ్యాణ్ కార్మిక సంఘాలపైనే ఎదురుదాడికి దిగారు. సొంత గనుల కేటాయింపుపై చర్చలకు ఎవరూ ముందుకు రాలేదని ఆరోపిస్తూ, “యూనియన్లు కేవలం భావోద్వేగాలతో కాకుండా లాజికల్‌గా మాట్లాడాలి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి తగినట్లు యూనియన్లు ప్రవర్తిస్తున్నాయి” అని విమర్శించారు.
ప్రైవేటీకరణను వ్యతిరేకించిన తనే, ఇప్పుడు ఉద్యోగుల పోరాటాన్ని రాజకీయ కోణంలో చూడటం వారి ద్వంద్వ విధానానికి నిదర్శనం.
ఆంధ్రప్రదేశ్ వైఫల్యానికి రుజువులు..
ఆంధ్రప్రదేశ్ వైఫల్యానికి రుజువులు అవసరమా? ఇతర రాష్ట్రాలు ఎందుకు విజయం సాధించాయి?
తమిళనాడులో సేలం స్టీల్ ప్లాంట్ విషయంలో భూములు ఇచ్చిన రైతులు, కార్మికులు స్థానిక ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా తీవ్ర ఒత్తిడి తెచ్చారు.
బిడ్డర్లు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఆంధ్రలో రాజకీయ చిత్తశుద్ధి లోపం కనపడుతూనే ఉంది. ఏపీలో ప్రైవేటీకరణ అంశాన్ని అధికార, ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకున్నాయి.
కర్ణాటక (భద్రావతి స్టీల్) విషయంలో ముడిసరుకు హామీ లేకపోవడంతో బిడ్డర్లు వెనక్కి తగ్గారు. ప్రభుత్వం స్థానిక వనరుల రక్షణ, ప్రైవేట్ పెట్టుబడిదారులకు అనుకూలించని మార్కెట్ పరిస్థితులను వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంది.
సొంత గనుల సాధనలో ఏపీ విఫలమైంది స్పష్టం. ఒడిశా లేదా ఎన్ఎండీసీ నుంచి గనులు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో ఏపీ కూటమి విఫలమైంది.
పశ్చిమ బెంగాల్(దుర్గాపూర్) రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ టెండర్లను(ఈఓఐ) మొదటి నుంచీ తీవ్రంగా అడ్డుకుంది. ట్రేడ్ యూనియన్ల బలమైన పట్టుతో కేంద్రం వెనకడుగు వేసింది. కేంద్ర నిధుల కోసం ఏపీ ప్రభుత్వం డిపెండ్ అవ్వడం వల్ల గట్టిగా నిలదీయలేకపోయింది.
జూన్ 2026 : పాలకుల పాపానికి సాక్ష్యం..
2026 జూన్ 8న విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 1500°C ద్రవరూప ఉక్కు కరిగి విస్ఫోటనం చెందడం వల్ల పదిమంది కార్మికులు మరణించారు. ఈ ఘోర ప్రమాదం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిందే.
కార్మిక సంఘాల(సీఐటీయూ, ఐఎన్టీయూసీ) ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. “ప్రైవేటీకరణను తాత్కాలికంగా ఆపామని చెప్తున్న ప్రభుత్వం, అంతర్గతంగా ప్లాంట్‌ను బలహీనపరుస్తోంది. గత కొన్నేళ్లుగా కొత్త నియామకాలు పూర్తిగా నిలిపివేశారు. 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. కేవలం 8,800 మంది కార్మికులతో రోజుకు 18,000 టన్నుల ఉత్పత్తి చేయిస్తూ తీవ్రమైన పని ఒత్తిడికి గురిచేస్తున్నారు.
అనుభవం లేని సిబ్బందితో ప్రమాదకరమైన పనులు చేయించడం వల్లే ఈ ప్రాణాలు అన్యాయంగా కోల్పోయారు.”
ప్రమాదం జరిగిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ ఘటనా స్థలాన్ని సందర్శించారు.
కానీ మాట్లాడిన పద్ధతి ఆ సందర్భానికి తగినట్టు లేదు. అక్కడ కార్మిక సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైందని గుర్తు చేసుకోవాలి.
పరిహారం(రూ. 1.72 కోట్లు శాశ్వత ఉద్యోగులకు, రూ. 45 లక్షలు కాంట్రాక్ట్ ఉద్యోగులకు) ప్రకటించినప్పటికీ, ప్లాంట్ భద్రతను గాలికొదిలేసి, ప్రైవేట్ సంస్థలతో పోలుస్తూ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడమే చంద్రబాబు-పవన్ ల అసలు వైఫల్యమని కార్మిక లోకం మండిపడుతోంది.
నీతిలేదు, చట్టం లేదు, న్యాయం లేదు, రాజ్యాంగం అసలే లేదు.
విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర ప్రమాదం కేవలం ఒక పారిశ్రామిక ప్రమాదంగా చూడదగినది కాదు.
ఇది దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమల భవిష్యత్తు, కార్మికుల భద్రత, పాలనలో బాధ్యత, రాజ్యాంగ నైతికత వంటి ప్రశ్నలను లేపుతున్న విషాద సంఘటన.
ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా విశాఖ ఉక్కు కర్మాగారం తన ఉత్పత్తి ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కానీ ఈ స్థాయిలో కార్మికుల ప్రాణాలను బలిగొన్న ఘటనలు అరుదుగా జరిగాయి.
అందుకే ఈ ప్రమాదాన్ని కేవలం “యాక్సిడెంట్”గా కొట్టిపారేయడం సరికాదు. ప్రమాదాలు ఎక్కడైనా జరగవచ్చు. కొన్నిసార్లు మానవ తప్పిదాలు కారణమవుతాయి.
మరికొన్నిసార్లు సాంకేతిక లోపాలు, నిర్వహణ వైఫల్యాలు కారణమవుతాయి. అయితే ఈ ప్రమాదం వెనుక విధానపరమైన నిర్లక్ష్యం ఉందా? అనేది అసలైన ప్రశ్నగా నిలుస్తుంది.
వ్యయ నియంత్రణ అంటే ‘‘పోనీ చావనీ’’
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ దిశగా సాగుతున్న నేపథ్యంలో గత కొన్నేళ్లుగా వ్యయ నియంత్రణ పేరుతో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అనుభవజ్ఞులైన ఉద్యోగుల సంఖ్య తగ్గించడం, ఖాళీలను భర్తీ చేయకపోవడం, భద్రతా ప్రమాణాలపై పెట్టుబడులు తగ్గించడం వంటి ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి.
ఇటీవల కొన్ని ప్రధాన పత్రికలు, ఉదాహరణకు ఈనాడు, ఆంధ్రజ్యోతి సంపాదకీయాలు కూడా అనేక వివరాలను ప్రస్తావించాయి.
అనుభవం లేని సిబ్బందికి బాధ్యతలు అప్పగించడం, సాంకేతిక నైపుణ్యం తగ్గిపోవడం వంటి విషయాలు ప్రమాదాలకు దారితీసే అవకాశముందని పేర్కొన్నాయి.
కేవలం నియమాలు కాదు; అవి ప్రాణరక్షణ సాధనాలు..
ఉక్కు తయారీ ప్రక్రియలో స్టీల్ మెల్టింగ్ షాప్ అత్యంత కీలకమైన విభాగం.
దాదాపు 1500 నుంచి 1600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉన్న ఉక్కును శుద్ధి చేసి తదుపరి దశలకు తరలిస్తారు.
ఇంత ప్రమాదకరమైన ప్రక్రియలో ప్రతి భద్రతా ప్రమాణం తప్పనిసరిగా అమలు కావాలి.
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, నాణ్యత తనిఖీలు, ముడి పదార్థాల పరిశీలన, పరికరాల నిర్వహణ, భద్రతా కవర్లు, అత్యవసర నియంత్రణ వ్యవస్థలు- ఇవన్నీ కేవలం నియమాలు కాదు; అవి ప్రాణరక్షణ సాధనాలు.
అయితే ప్రమాదం జరిగిన లాడిల్‌కు తప్పనిసరిగా ఉండాల్సిన భద్రతా కవర్ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పర్జింగ్ ప్రక్రియకు అవసరమైన పరికరాల కొరత ఉందనే వాదనలు వస్తున్నాయి. ఇవన్నీ నిజమైతే, ఈ ప్రమాదం కేవలం సాంకేతిక వైఫల్యం కాదు; అది పరిపాలనా వైఫల్యం.
ఇక్కడ రాజ్యాంగ నైతికతను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత రాజ్యాంగం కేవలం ప్రభుత్వాలను నడిపించడానికి రూపొందించిన పత్రం కాదు; అది ప్రతి పౌరుడి గౌరవం, భద్రత, జీవించే హక్కును పరిరక్షించడానికి నిర్మించిన విలువల వ్యవస్థ.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి వ్యక్తికి జీవించే హక్కును హామీ ఇస్తుంది. ఆ హక్కు కేవలం శ్వాసించే హక్కు కాదు; సురక్షితమైన పని వాతావరణంలో జీవించే హక్కు కూడా.
ఒక కార్మికుడు ఉదయం విధులకు వెళ్లి సాయంత్రం సురక్షితంగా తన కుటుంబం వద్దకు చేరుకోవడం ప్రభుత్వాల, యాజమాన్యాల ప్రాథమిక బాధ్యత.
అది వేలాది కుటుంబాల ఆశ..
విశాఖ ఉక్కు కర్మాగారం కేవలం ఒక పరిశ్రమ కాదు. అది వేలాది కుటుంబాల ఆశ. అది అనేక మంది అమరుల త్యాగాలతో నిర్మించబడిన ఆంధ్రుల స్వాభిమాన చిహ్నం.
అటువంటి సంస్థలో భద్రతా ప్రమాణాలు నిర్లక్ష్యం చేయబడితే, అది కేవలం పరిపాలనా తప్పిదం కాదు; అది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే చర్య.
మరో కీలక అంశం ముడి పదార్థాల సమస్య. సొంత ఇనుప ఖనిజ గనులు లేకపోవడం వల్ల విశాఖ ఉక్కు కర్మాగారం భారీ వ్యయ భారం మోస్తోంది.
స్థానికంగా లభించే ఖనిజ వనరులను ప్రభుత్వ రంగ సంస్థకు అందించకుండా, ఇతర ప్రైవేట్ సంస్థలకు కేటాయించడం వల్ల సంస్థ ఆర్థికంగా బలహీనపడుతోందనే విమర్శలు ఉన్నాయి.
ఈ అదనపు వ్యయం ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయల భారంగా మారుతోంది.
అదే నిధులు సాంకేతిక ఆధునీకరణకు, భద్రతా పరికరాలకు, నైపుణ్య సిబ్బంది నియామకాలకు వినియోగించబడితే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది.
బాధాకరమైన విషయం ఏమిటంటే, ప్రమాదంలో సహచరులను కోల్పోయిన కార్మికుల బాధ, మనోవేదన.
మండే ఉష్ణోగ్రతల మధ్య, ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తి కొనసాగించే కార్మికులు తమ కళ్లముందే సహోద్యోగులను కోల్పోయినప్పుడు, వారి బాధను రాజకీయ కోణంలో చూడడం మానవత్వానికి విరుద్ధమని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ రంగ పరిశ్రమలకు భవిష్యత్తు లేదా?
విశాఖ ఉక్కు ప్రమాదం ఇప్పుడు కేవలం దర్యాప్తు అంశం కాదు.
ఇది ప్రభుత్వ రంగ పరిశ్రమల భవిష్యత్తు, కార్మిక భద్రత, పారదర్శక పాలన, రాజ్యాంగ బాధ్యతలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అంశం.
నిజంగా బాధ్యులు ఎవరో దర్యాప్తు తేల్చాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, కార్మికుల ప్రాణాల కంటే ఏ విధానం, ఏ ఆర్థిక లెక్కలు, ఏ ప్రైవేటీకరణ లక్ష్యాలు గొప్పవి కావు.
ఉక్కును తయారు చేసే భట్టీల కంటే వేడిగా మండేది కార్మికుడి చెమట. ఆ చెమటను గౌరవించని వ్యవస్థ చివరికి తన నైతిక హక్కును కోల్పోతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
