21వ శతాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా మారుతోంది. డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధ (AI), స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ విస్తరణతో సంప్రదాయ ఉద్యోగాల స్థానంలో కొత్త తరహా ఉపాధి రూపాలు ఏర్పడ్డాయి. వాటిలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందినది “గిగ్ ఎకానమీ” లేదా “ప్లాట్ఫారం ఎకానమీ”.
ఈ వ్యవస్థలో కార్మికులు ఒక సంస్థలో శాశ్వత ఉద్యోగులుగా కాకుండా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పని చేసే స్వతంత్ర సేవా ప్రదాతలుగా (Independent Contractors) వ్యవహరిస్తారు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగినా, కార్మికుల హక్కులు, వేతన భద్రత, సామాజిక భద్రత, పని గంటలు వంటి అంశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఈ నేపథ్యంలో 2026 జూన్‌లో జరిగిన 114వ అంతర్జాతీయ కార్మిక సదస్సు (International Labour Conference) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని ILO Convention No. 193ను ఆమోదించింది. గిగ్ మరియు ప్లాట్ఫారం కార్మికుల హక్కులను అంతర్జాతీయ స్థాయిలో చట్టబద్ధంగా గుర్తించిన తొలి కన్వెన్షన్‌గా ఇది నిలిచింది.
గిగ్ ఎకానమీ అంటే ఏమిటి?
“Gig” అనే పదం మొదట సంగీత కళాకారులు తాత్కాలిక కార్యక్రమాలకు వెళ్లే సందర్భంలో వాడుకలోకి వచ్చింది. తరువాత ఏదైనా తాత్కాలిక, పని-ఆధారిత, ఒప్పంద సేవను సూచించే పదంగా మారింది. గిగ్ ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగి–యజమాని సంబంధం స్పష్టంగా ఉండదు. యాప్ కంపెనీలు కార్మికులను “భాగస్వాములు” లేదా “స్వయం ఉపాధి పొందిన వారు”గా పరిగణిస్తాయి. పని దొరికితేనే ఆదాయం ఉంటుంది. నెలవారీ జీతం ఉండదు.
ప్లాట్ ఫారం కార్మికులు ఎవరు?
డిజిటల్ యాప్ లేదా ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా పని పొందే వారిని ప్లాట్ఫారం కార్మికులు అంటారు. వీరిలో టాక్సీ డ్రైవర్లు, ఆహార డెలివరీ కార్మికులు, కిరాణా సామాను డెలివరీ సిబ్బంది, కొరియర్ డెలివరీ సిబ్బంది, ఫ్రీలాన్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఆన్లైన్ డిజైనర్లు, డిజిటల్ కంటెంట్ సృష్టికర్తలు, గృహ సేవలను యాప్‌ల ద్వారా అందించే కార్మికులు అందరూ ఉంటారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది గిగ్ పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. కరోనా మహమ్మారి కాలంలో, తదనంతరం ఆన్లైన్ సేవల వినియోగం పెరగడంతో గిగ్ కార్మికుల సంఖ్య మరింత పెరిగింది.
భారతదేశంలో గిగ్ ఆర్థిక వ్యవస్థ: భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న గిగ్ మార్కెట్లలో ఒకటి. నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం, రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో గిగ్ కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. యువత, మహిళలు, వలస కార్మికులు ఈ రంగంలో ఎక్కువగా పనిచేస్తున్నారు.
గిగ్ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు:
డిజిటల్ సాంకేతికత అభివృద్ధి చెందినప్పటికీ గిగ్ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ భద్రత లేదు. ఏ సమయంలోనైనా యాప్ అకౌంట్ నిలిపివేయవచ్చు. పని ఎవరికి ఇవ్వాలి? ఎంత చెల్లించాలి? రేటింగ్ ఎలా నిర్ణయించాలి? అకౌంట్ ఎప్పుడు నిలిపి వేయాలి? ఇవన్నీ కంప్యూటర్ అల్గోరిథమ్‌లు నిర్ణయిస్తాయి. కార్మికులకు కారణాలు కూడా తెలియవు. ముందస్తు నోటీసు లేదా అప్పీల్ అవకాశం లేదు. అంతా ఏక పక్షమే. కనీస వేతనానికి హామీ లేదు. పని చేసిన మేరకే ఆదాయం ఉంటుంది. ఆర్డర్లు తగ్గితే ఆదాయం కూడా తగ్గిపోతుంది. సామాజిక భద్రత లేదు. పెన్షన్, బీమా, ప్రమాద బీమా, ప్రసూతి ప్రయోజనాలు, వైద్య రక్షణ వంటి హక్కులు లభించవు. గిగ్ కార్మికులను ఉద్యోగులుగా గుర్తించకపోవడంతో ట్రేడ్ యూనియన్ హక్కులు, సమిష్టి చర్చల అవకాశాలు లేవు. డెలివేరి కి వాడే వాహనం, దాని ఇన్షూరెన్స్, ఇంధనం, నిర్వహణ అంతా వాహన యజమాని అయిన డ్రైవరు దే. శ్రమ చేసేది డ్రైవరు. కానీ కమిషన్ పేరుతో వినియోగ దారులను, డ్రైవరు లను కంపెనీలు లూటీ చేస్తున్నాయి.
ఎందుకు ILO జోక్యం?
ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంఘాలు, న్యాయస్థానాలు, పరిశోధకులు, మానవ హక్కుల సంస్థలు ఒకే అంశాన్ని ప్రస్తావించాయి. “గిగ్ కార్మికులు డిజిటల్ సాంకేతికత వల్ల కొత్త అవకాశాలు పొందుతున్నప్పటికీ, వారి ప్రాథమిక కార్మిక హక్కులు రక్షించబడటం లేదు.” కొన్ని దేశాల న్యాయస్థానాలు గిగ్ కార్మికులను “ఉద్యోగులు”గా గుర్తించగా, మరికొన్ని దేశాలు “స్వతంత్ర కాంట్రాక్టర్లు”గా పరిగణించాయి. ఈ భిన్న పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒకే విధమైన కనీస ప్రమాణాలు అవసర మయ్యాయి. ఈ నేపథ్యంలో ILO సభ్య దేశాలు, యజమానుల ప్రతినిధులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో విస్తృత చర్చలు జరిపి Convention No. 193ను రూపొందించాయి.
కన్వెన్షన్ 193 మైలురాయి: ఈ కన్వెన్షన్ ద్వారా తొలిసారిగా గిగ్ కార్మికుల ప్రత్యేక స్వభావాన్ని గుర్తించారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల బాధ్యతలను నిర్వచించారు. సామాజిక భద్రతను ప్రాథమిక హక్కుగా పరిగణించారు.అల్గోరిథమిక్ నిర్వహణలో పారదర్శకతను కోరారు. సంఘటిత హక్కులు, సమిష్టి చర్చల హక్కును బలోపేతం చేశారు. గిగ్ కార్మికులను ప్రపంచ కార్మిక హక్కుల చట్రంలోకి తీసుకువచ్చారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికి కొత్త అవకాశాలను అందించినప్పటికీ, కోట్లాది గిగ్ కార్మికుల జీవితాలను అస్థిరత, తక్కువ ఆదాయం, సామాజిక భద్రత లేమి వంటి సమస్యలతో నింపింది. ఈ పరిస్థితిని మార్చడానికి ILO రూపొందించిన Convention No. 193 ప్రపంచ కార్మిక చరిత్రలో ఒక మలుపు. ఇది కేవలం ఒక అంతర్జాతీయ ఒప్పందం మాత్రమే కాదు. సాంకేతిక అభివృద్ధి ఫలాలు కార్మికుల హక్కులను హరించకుండా, గౌరవప్రదమైన పని (Decent Work) అందరికీ అందేలా చేయాలనే ప్రపంచ సమాజ సంకల్పానికి ప్రతీక. కన్వెన్షన్ నెం. 193ను ఆమోదించడంతో పాటు, దాని అమలుకు మార్గదర్శకంగా ఒక Recommendationను కూడా ILO ఆమోదించింది. కన్వెన్షన్ చట్టబద్ధమైన కనీస ప్రమాణాలను నిర్దేశిస్తే, రికమెండేషన్ వాటి అమలుకు మరింత వివరణాత్మక సూచనలను అందిస్తుంది.
కన్వెన్షన్ 193 లక్ష్యం:
“డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పనిచేసే ప్రతి కార్మికుడికి గౌరవప్రదమైన పని (Decent Work), సామాజిక భద్రత, సమాన హక్కులు, వివక్ష రహిత వాతావరణం, సంఘటిత హక్కులు, చట్టపరమైన రక్షణను కల్పించడం.” ఇది గిగ్ ఆర్థిక వ్యవస్థను నిరోధించడం కోసం కాదు. సాంకేతిక అభివృద్ధి, కార్మిక హక్కుల మధ్య సమతుల్యతను సాధించడం కోసం రూపొందించబడింది. కన్వెన్షన్ 193 ఈ విధంగా చెప్పింది.
“కార్మికుడి హోదా ఒప్పందంలోని పదాల ఆధారంగా కాదు. వాస్తవంగా పని ఎలా జరుగుతోంది? ఎవరి నియంత్రణలో జరుగుతోంది? అనే అంశాల ఆధారంగా నిర్ణయించాలి. పేరు మార్చడం ద్వారా కార్మిక హక్కులను నిరాకరించకూడదు”. ఈ సూత్రాన్ని “Primacy of Facts” (వాస్తవ పరిస్థితులకే ప్రాధాన్యం) అంటారు.
గిగ్ కార్మికులకు కూడా ఇతర కార్మికులతో సమానంగా ట్రేడ్ యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కు, వాటిలో సభ్యత్వం పొందే హక్కు, నాయకులను ఎన్నుకునే హక్కు, సామూహిక చర్చలు (Collective Bargaining) నిర్వహించే హక్కు ఉంటాయని కన్వెన్షన్ స్పష్టం చేసింది. ప్లాట్ఫారం కంపెనీలు ఈ హక్కులకు అడ్డంకులు సృష్టించరాదు. ప్లాట్ ఫారం సంస్థలు లింగం, కులం, మతం, జాతి, భాష, వికలాంగత, రాజకీయ అభిప్రాయాలు, ట్రేడ్ యూనియన్ సభ్యత్వం కారణాలతో వివక్ష చూపరాదు. అల్గోరిథమ్‌ల రూపకల్పనలో కూడా వివక్ష ఉండకూడదని కన్వెన్షన్ ప్రత్యేకంగా సూచించింది.
గిగ్ కార్మికుల ప్రధాన సమస్యల్లో ఒకటి ఆదాయ అస్థిరత. అందువల్ల పని చేసిన సమయానికి తగిన ప్రతిఫలం,పారదర్శక చెల్లింపు విధానం, చెల్లింపుల వివరాలపై స్పష్టమైన సమాచారం, అక్రమ కోతలకు నిషేధం వంటి అంశాలను సభ్య దేశాలు చట్టాల ద్వారా నిర్ధారించాలని కన్వెన్షన్ కోరింది.
పని గంటలు విశ్రాంతి:
గిగ్ కార్మికులు సర్వ సాధారణంగా రోజుకు 12–16 గంటలు పనిచేస్తున్నారు. విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తోంది. ఈ పని ఒత్తిడి, త్వరగా డెలివేరి చేయాలనే తొందరలో కొన్ని సందర్భాలలో ప్రమాదాలకు కూడా లోనవు తున్నారు. అందువల్ల సభ్య దేశాలు అధిక పని గంటలను నియంత్రించాలి, విశ్రాంతి హక్కును కాపాడాలి, పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతకు చర్యలు తీసుకోవాలి అని కన్వెన్షన్ పేర్కొన్నది.
ఆరోగ్యం, భద్రత:
డెలివరీ కార్మికులు, డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలు, వాతావరణ మార్పులు, కాలుష్యం, శారీరక ఒత్తిడి వంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. కన్వెన్షన్ 193 ప్రకారం సురక్షితమైన పని పరిస్థితులు, ప్రమాద నివారణ చర్యలు, అవసరమైన భద్రతా పరికరాలు, అత్యవసర సహాయం అందుబాటులో ఉండాలని పేర్కొన్నది.
సామాజిక భద్రత:
ఇది కన్వెన్షన్‌లో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. గిగ్ కార్మికులకు కూడా ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, ప్రసూతి ప్రయోజనాలు, వికలాంగత రక్షణ, వృద్ధాప్య పెన్షన్, మరణానంతర కుటుంబ రక్షణ వంటి సామాజిక భద్రతా పథకాలు అందుబాటులోకి తీసుకురావాలని సభ్య దేశాలను కోరుతోంది.
ఆల్గోరిథమిక్ నిర్వహణలో పారదర్శకత:
ఇది ఈ కన్వెన్షన్‌లో అత్యంత ఆధునిక అంశం. ఈరోజు ఏ పనిని ఎవరికి ఇవ్వాలి? ఎంత పారితోషికం ఇవ్వాలి? రేటింగ్ ఎలా నిర్ణయించాలి? అకౌంట్‌ను ఎందుకు నిలిపి వేయాలి? వంటి అన్నింటినీ కంప్యూటర్ అల్గోరిథమ్‌లు నిర్ణయిస్తున్నాయి. కన్వెన్షన్ ప్రకారం అల్గోరిథమ్‌ల ప్రభావం గురించి కార్మికులకు సమాచారం ఇవ్వాలి. పూర్తిగా యంత్ర నిర్ణయాలపై ఆధారపడకూడదు. ముఖ్య నిర్ణయాలకు మానవ సమీక్షకు (Human Review) అవకాశం ఉండాలి. కార్మికులు నిర్ణయాలను ప్రశ్నించే హక్కు కలిగి ఉండాలి. చాలా గిగ్ కార్మికుల అకౌంట్లు కారణం చెప్పకుండా, ముందస్తు నోటీసు లేకుండా, అప్పీల్ అవకాశం ఇవ్వకుండా మూసివేయడం సర్వ సాధారణ మైనాయి. కన్వెన్షన్ ప్రకారం కారణాలు తెలియజేయాలి. సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలి. స్వతంత్ర ఫిర్యాదు వ్యవస్థ ఉండాలి. అప్పీల్ హక్కు కల్పించాలి.
వ్యక్తిగత డేటా రక్షణ:
ప్లాట్ఫారం సంస్థలు కార్మికుల స్థానం (Location), ప్రయాణ వివరాలు, పనితీరు, వ్యక్తిగత సమాచారం వంటి భారీ డేటాను సేకరిస్తాయి. ఈ డేటాను చట్టబద్ధంగా మాత్రమే ఉపయోగించాలి. అనవసరంగా నిల్వ చేయకూడదు. అనుమతి లేకుండా ఇతరులకు ఇవ్వకూడదు. ప్రతి గిగ్ కార్మికుడికి ఫిర్యాదు చేసే హక్కు, నిష్పాక్షిక విచారణ, త్వరిత పరిష్కారం, ప్రతీకార చర్యల నుంచి రక్షణ ఉండాలని కన్వెన్షన్ నిర్దేశిస్తుంది.
సభ్య దేశాల బాధ్యతలు:
కన్వెన్షన్‌ను ఆమోదించిన దేశాలు జాతీయ చట్టాలు రూపొందించాలి. కార్మిక తనిఖీ వ్యవస్థను బలోపేతం చేయాలి. గిగ్ కార్మికుల గణాంకాలు సేకరించాలి. యజమానులు, కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరపాలి. వీటి అమలుపై ILOకు నివేదికలు సమర్పించాలి.
ILO కన్వెన్షన్ నెం. 193 కేవలం గిగ్ కార్మికులకు రక్షణ కల్పించే ఒప్పందం మాత్రమే కాదు. డిజిటల్ యుగంలో కార్మిక హక్కులు కూడా సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా మారాల్సిన అవసరాన్ని ప్రపంచానికి గుర్తుచేసిన పత్రం. యాప్, అల్గోరిథమ్, కృత్రిమ మేధ వంటి సాంకేతిక సాధనాలను వినియోగించుకొని యాజమాన్యాలను దోచుకోవడాన్ని అదుపు చేసి కార్మికులకు గౌరవం, భద్రత, జీవనోపాధిని బలోపేతం చేసే విధంగా ఉపయోగించబడాలనే దిశగా ఈ కన్వెన్షన్ మార్గనిర్దేశం చేస్తుంది.
భారత ప్రభుత్వ వైఖరి:
ILO కన్వెన్షన్ నెం. 193 ఆమోదం ప్రపంచ కార్మిక ఉద్యమంలో ఒక చారిత్రక ఘట్టం. అయితే, ఈ కన్వెన్షన్ ఆమోద ప్రక్రియలో భారత ప్రభుత్వ వైఖరి పెద్ద చర్చకు దారితీసింది. ప్రపంచంలో అత్యధిక గిగ్ కార్మికులు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. అయినప్పటికీ, భారత ప్రభుత్వం ఈ కన్వెన్షన్‌కు అనుకూలంగా ఓటు వేయకుండా Abstain మార్గాన్ని (తటస్థంగా ఉండటం) ఎంచుకుంది. ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. భారతదేశంలో గిగ్ ఆర్థిక వ్యవస్థ గత పదేళ్లలో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఆధారిత ఉపాధి వేగంగా విస్తరించింది. ఈ రంగంలో పనిచేస్తున్న ప్రముఖ సంస్థలు Uber, Ola, Rapido, Porter, Lynk, Swiggy, Zomato, Amazon Flex, Flipkart, Urban Company, Blinkit, Zepto, BigBasket. ఈ సంస్థల ద్వారా లక్షలాది మంది యువత, మహిళలు, వలస కార్మికులు, నిరుద్యోగులు ఉపాధి పొందుతున్నారు. భారతదేశంలో గిగ్ కార్మికుల సంఖ్య వివిధ ప్రభుత్వ, స్వతంత్ర అధ్యయనాల ప్రకారం సుమారు కోటి మంది ఉన్నారని ఒక అంచనా. రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి సృష్టిలో గిగ్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, ఈ ఉపాధిలో స్థిరత్వం లేకపోవడం ప్రధాన సమస్య.
భారత ప్రభుత్వం చెప్పిన కారణాలు:
ILOలో జరిగిన చర్చల సందర్భంగా భారత ప్రభుత్వం ప్రధానంగా ఈ అంశాలను ప్రస్తావించింది. ”ప్రతి దేశ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ప్రతి దేశానికి కార్మిక మార్కెట్, చట్టాలు, సామాజిక పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయని” పేర్కొంది. “Platform Worker“, “Employment Relationship” వంటి నిర్వచనాలపై మరింత స్పష్టత అవసరమని అభిప్రాయపడింది. అమలు విషయంలో ఆందోళనలు లేవనెత్తినది. కన్వెన్షన్‌లోని కొన్ని నిబంధులను వెంటనే అమలు చేయడం అభివృద్ధి చెందుతున్న దేశాలకు కష్ట మవుతుందని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, కార్మిక సంఘాలతో మరింత చర్చలు అవసరమని తెలిపింది. ఆ విధంగా భారత ప్రభుత్వం పచ్చి కార్మిక ద్రోహి అని ప్రపంచ దేశాల ముందు మరొకసారి రుజువు చేసికుంది. తాను లేవనెత్తిన అంశాలు అన్నీ దేశాలకు వర్తిస్తాయి. ILO కన్వెన్షన్ అమలుకు తగిన ఆదేశాలు జారీ చేయాల్సింది సభ్య దేశాలే. కాబట్టి భారత ప్రభుత్వం తాను లేవనెత్తిన అంశాలపై తాను జారీ చేసే ఆదేశాలలో స్పష్టత ఇవ్వవచ్చు. అనేక విషయాలలో రాష్ట్ర ప్రభుత్వాలను కనీసం సంప్రదించకుండా ఏక పక్షంగా రాష్ట్రాల నెత్తిన పెత్తనం చెలాయిస్తున్న చరిత్ర మోడి ప్రభుత్వానిది. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్ లను తెచ్చే ఏ సందర్భంలో కూడా కార్మిక సంఘాలతో చర్చలు జరపలేదు. సంవస్తరానికి ఒక సారి జరపాల్సిన ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ గత 12 సంవస్తరాలలో ఒక్క సారి కూడా జరపలేదు. ఈ ఘన చరిత్ర కలిగిన భారత ప్రభుత్వం ILOలో మాత్రం కార్మిక సంఘాలతో, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించాలని చెప్పడం పెద్ద మోసం. కార్పొరట్ల సేవలో మునిగి ILO కన్వెన్షన్ పై సంతకం చేయకుండా తప్పించుకుంది. భారత ట్రేడ్ యూనియన్ సంస్థలు ఈ వైఖరిని తీవ్రంగా విమర్శించాయి. కన్వెన్షన్ 193కు మద్దతు ఇవ్వాలి. గిగ్ కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం హామీ ఇవ్వాలి. సామాజిక భద్రత కల్పించాలి. యూనియన్ హక్కులను చట్టబద్ధం చేయాలి అని డిమాండ్ చేశాయి.
గిగ్ కార్మికుల ఉద్యమాలు:
ఇటీవలి సంవత్సరాల్లో Swiggy, Zomato డెలివరీ కార్మికులు, Uber,Ola డ్రైవర్లు పలు నగరాల్లో సమ్మెలు, నిరసనలు నిర్వహించారు. ఫలితంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గిగ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాలు లేదా పథకాలను రూపొందించే దిశగా అడుగులు వేశాయి. రాజస్థాన్ గిగ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చట్టాలు చేశాయి. అయితే వాటిలో కూడా గిగ్ కార్మికులకు ILO కన్వెన్షన్‌లో పేర్కొన్న అంశాలు లేవు. ప్రధానంగా కార్మికులుగా రిజిస్టర్ చేసికోవడం పైనే దృష్టి సారించాయి.
భారతదేశం ILO స్థాపక సభ్యదేశాలలో ఒకటి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద గిగ్ ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. ఈ రంగం లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నప్పటికీ, గిగ్ కార్మికులు అస్థిరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. సోషల్ సెక్యూరిటీ కోడ్, ఈ-శ్రమ్ పోర్టల్ వంటి చర్యలు ILO కన్వెన్షన్ నెం. 193 నిర్దేశించిన ప్రమాణాలకు మధ్య పెద్ద అగాధంలా ఉన్నాయి. కన్వెన్షన్‌కు భారత ప్రభుత్వం తటస్థంగా (Abstain) వ్యవహరించడం ఒక విధానపరమైన కార్మిక వ్యతిరేక నిర్ణయం.
ILOలో ఓటింగ్ విధానం ఎలా ఉంటుంది?
ILO ఇతర అంతర్జాతీయ సంస్థలతో పోలిస్తే ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉంది. ప్రతి సభ్య దేశానికి నలుగురు ప్రతినిధులు ఉంటారు. అందులో ఇద్దరు ప్రభుత్వ ప్రతినిధులు, ఒక యజమానుల ప్రతినిధి, ఒక కార్మిక ప్రతినిధి.
ప్రతి ప్రతినిధికి స్వతంత్ర ఓటు హక్కు ఉంటుంది. అందువల్ల ఒకే దేశానికి చెందిన ప్రతినిధులు కూడా భిన్నంగా ఓటు వేయవచ్చు. ఇది ILO యొక్క త్రైపాక్షిక (Tripartite) వ్యవస్థ ప్రత్యేకత. చర్చల అనంతరం జరిగిన ఓటింగ్‌లో కార్మిక ప్రతినిధులలో అత్యధికులు మద్దతు తెలిపారు. అనేక ప్రభుత్వాలు అనుకూలంగా ఓటు వేశాయి. అనేక యజమానుల ప్రతినిధులు కొన్ని నిబంధుల పై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, మొత్తం మీద కన్వెన్షన్ ఆమోదం పొందింది.
మద్దతు తెలిపిన దేశాల వైఖరి:
అనేక యూరోపియన్, లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్, ఆసియా దేశాలు ఈ కన్వెన్షన్‌కు మద్దతు ఇచ్చాయి. వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు. సాంకేతిక అభివృద్ధి కార్మిక హక్కులను దెబ్బతీయకూడదు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ కార్మికుల రక్షణ కూడా బలపడాలని అభిప్రాయపడ్డాయి. గిగ్ కార్మికులు కూడా కార్మికులే.
పేరు ఏదైనా అయినా పని చేస్తున్నారు. ఆదాయం పొందుతున్నారు. సంస్థ నియంత్రణలో పనిచేస్తున్నారు. కాబట్టి వారికి కార్మిక హక్కులు ఉండాలని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒకే కనీస ప్రమాణాలు అవసరం. దేశాని కొక విధానం ఉంటే బహుళజాతి కంపెనీలు చట్టాల్లోని లోపాలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అందుకే కనీస అంతర్జాతీయ ప్రమాణాలు అవసరమని ILO కన్వెన్షన్ ను బల పరచిన దేశాలు అభిప్రాయపడ్డాయి. తదనుగుణంగా అనేక దేశాలు తమ కార్మిక చట్టాలను సవరించే అవకాశం ఉంది. గిగ్ కార్మికులు ప్రపంచవ్యాప్తంగా సంఘటితమై తమ హక్కుల కోసం మరింత సమర్థవంతంగా పోరాడే అవకాశాలు పెరుగుతాయి. కన్వెన్షన్ ఆమోదం తర్వాత దేశాలు దానిని రాటిఫై చేయాలి. దేశీయ చట్టాల్లో మార్పులు చేయాలి. అమలు పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ILOకు కాలానుగుణంగా నివేదికలు సమర్పించాలి.
ILO కన్వెన్షన్ నెం. 193 ఆమోదం గిగ్ కార్మికుల ఉద్యమానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో సాంకేతిక అభివృద్ధి ఎంత ముఖ్యమో, కార్మికుల గౌరవం, భద్రత, హక్కులు కూడా అంతే ముఖ్యమని ప్రపంచ దేశాలు అంగీకరించిన సందర్భం ఇది.
గిగ్ (Platform) ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఉపాధి నిర్మాణాన్ని వేగంగా మార్చు తోంది. ఒక వైపు డిజిటల్ సాంకేతికత కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుండగా, మరోవైపు సంప్రదాయ కార్మిక చట్టాల పరిధికి వెలుపల కోట్లాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ILO ఆమోదించిన Convention No. 193 ప్రపంచ కార్మిక చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. కన్వెన్షన్ అమల్లోకి రావాలంటే, దానిని సభ్య దేశాలు తమ దేశీయ చట్టాల ప్రకారం రాటిఫై (Ratify) చేయాలి. కేవలం ILOలో అనుకూలంగా ఓటు వేయడం వల్ల ఆ దేశంలో కన్వెన్షన్ ఆటోమాటిక్ గా అమల్లోకి రాదు.
ILO కన్వెన్షన్ 193 – భవిష్యత్తులో ప్రాధాన్యం:
ఈ కన్వెన్షన్ ప్రాముఖ్యత కేవలం గిగ్ కార్మికులకే పరిమితం కాదు. భవిష్యత్తులో Artificial Intelligence, Robot ఆధారిత పని, Remote Work, Digital Labour Platforms విస్తరిస్తున్న కొద్దీ ఈ కన్వెన్షన్ మరింత ప్రాముఖ్యత పొందే అవకాశం ఉంది.
ముగింపు:
ILO Convention No. 193 డిజిటల్ యుగంలో కార్మిక హక్కులకు రూపొందించిన తొలి సమగ్ర అంతర్జాతీయ ప్రమాణంగా చరిత్రలో నిలిచిపోతుంది. పారిశ్రామిక విప్లవం కార్మిక చట్టాలకు ఎలా పునాది వేసిందో, డిజిటల్ విప్లవం గిగ్, ప్లాట్ఫారం కార్మికుల హక్కులను పునర్నిర్వచించాల్సిన అవసరాన్ని ప్రపంచానికి గుర్తుచేసింది. “డిజిటల్ ప్లాట్ ఫారమ్‌లు ఎంత ఆధునిక మైనవైనా, వాటి వెనుక శ్రమిస్తున్నది మనిషే. ఆ మనిషి శ్రమకు గౌరవం, భద్రత, న్యాయం కల్పించడమే ILO Convention No. 193 యొక్క అసలు సారాంశం.”
ఆర్. లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
