గత మూడు రోజులుగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోన్న మొంథా తుఫాను, అక్టోబరు 29 తెల్లవారేసరికి తీరం దాటిందని వాతావరణ శాఖ ధృవీకరించింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.

మంగళవారం సాయంత్రం 7 గంటలకు తీరం వైపు దూసుకొచ్చిన మొంథా తుఫాను బుధవారం అర్థరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా పట్టణ ప్రాంతం నర్సాపూర్ వద్ద తీరాన్ని తాకింది. అనంతరం, ఆగ్నేయం దిశగా ప్రయాణించి బలహీనపడే అవకాశాలుండటంతో బుధవారం రోజంతా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మచిలీపట్నంలో గంటకు 64 కిలోమీటర్ల వేగంతో గాలి వీయగా కావలిలో 210 మిల్లీ మీటర్లు, ఉలవపాడులో 170 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది.
కోనసీమ జిల్లాలో ఈదురు గాలుల వల్ల చెట్లు కూలడంతో ఒక మహిళ మరణించిందని అధికారులకు పోలీసులు తెలియజేసినట్టుగా పీటీఐ వార్తా సంస్థ ప్రకటించింది. తుఫాను కారణంగా దాదాపు ముప్ఫై ఎనిమిది వేల హెక్టార్ల విస్తీర్ణంలోని పంటలు, తోటలు దెబ్బతిన్నాయని; 76వేల మందిని రక్షిత ప్రాంతాలకు తరలించారని పీటీఐ తెలిపింది.
మొంథా తుఫాను నేపథ్యంలో తలెత్తే ప్రకృతి వైపరిత్యాలను అధిగమించడానికి జాతీయ విపత్తు నిర్వాహణ విభాగం 26 ప్రత్యేక దళాలను మోహరించింది. ఇందులో 12 బృందాలు ఆంధ్రప్రదేశ్లో, 6 బృందాలు ఒరిస్సాలో, 3 బృందాలు ఉత్తర తమిళనాడులో తుఫాను పీడిత ప్రాంతాలలో ప్రజలకు పలు రకాల సేవలు అందిస్తున్నాయని కమాండెంట్ గ్యానేశ్వర్ సింగ్ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు. ఛత్తీస్ఘడ్, తెలంగాణలో కూడా బృందాలను జాతీయ విపత్తు నిర్వాహణ విభాగం మోహరించింది. కోస్తా ఒరిస్సా జిల్లాలలో తుఫాను కారణంగా ఇళ్లు పెద్దెత్తున దెబ్బతిన్నాయి. మట్టిచరియలు విరిగి పడ్డాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
