2025 మార్చి 28న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అంతర్జాతీయ వ్యాపారవేత్తలతో మాట్లాడుతూ, ఒక విషయం స్పష్టంగా చెప్పారు.
“చైనా నిజమైన బహుపాక్షికతను నమ్ముతుంది. అందరికీ లాభం చేకూర్చే, అందరినీ కలుపుకుపోయే ఎకనామిక్ గ్లోబలైజేషన్ను ప్రోత్సహిస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అందరికీ తెరిచి ఉంచడానికే చైనా కట్టుబడి ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే చైనా తన తలుపులు బయట ప్రపంచానికి మూసేయదు. తాను అభివృద్ధి చెందుతూ, మిగతా దేశాలకు కూడా కొత్త అవకాశాలు ఇవ్వాలని చూస్తోంది” అని షీ జిన్‌పింగ్ అన్నారు.
ఎకనామిక్ గ్లోబలైజేషన్ ఎందుకు ముఖ్యం?
ప్రపంచంలో ఉత్పత్తి విధానాలు, టెక్నాలజీ మారుతున్నాయి. కానీ దేశాల మధ్య అభివృద్ధి ఒకేలా లేదు. దీనివల్ల పెట్టుబడిదారీ విధానంలోని సమస్యలు ఒక దేశం నుంచి ప్రపంచం మొత్తానికి పాకుతున్నాయి. దీన్ని అలాగే వదిలేస్తే అసమానతలు పెరుగుతాయి. ఆర్థిక సంక్షోభాలు మళ్లీ మళ్లీ వస్తాయి.
చరిత్ర ఏం చెబుతోంది?
ఓపెన్ మార్కెట్ అమలు చేస్తున్న దేశాలు ముందుకెళ్లాయి. మార్కెట్ మూసివేసిన దేశాలు వెనకబడ్డాయి. కాబట్టి సరైన దారి ఏంటంటే ఓపెన్ మార్కెట్ విధానం.
అందర్నీ కలుపుకుపోయే, సహకారంతో కూడిన, అందరికీ లాభం చేకూర్చే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్మించడం. అప్పుడే కొత్త అవకాశాలు పుడతాయి.
చైనీస్ మోడరనైజేషన్కు ఓపెన్నెస్ ఎందుకు కావాలి?
చైనా ఇప్పుడు బలమైన దేశంగా మారే కీలక దశలో ఉంది. “చైనీస్ మోడరనైజేషన్” ద్వారా దేశాన్ని పునరుజ్జీవింపజేయాలని చూస్తోంది. దీనికి ఓపెన్‌గా ఉండటం, అందరితో కలిసి లాభపడటం తప్పనిసరి.
ప్రపంచం గందరగోళంగా ఉంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మీద ఒత్తిడి పెరుగుతోంది.
ఈ సమయంలో చైనా తన దేశీయ మార్కెట్‌ను బలోపేతం చేసుకుంటూ – అదే సమయంలో బయట ప్రపంచంతో వాణిజ్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. దీన్నే “డ్యూయల్ సర్క్యులేషన్” అంటున్నారు. దేశం లోపల, బయట రెండూ బ్యాలెన్స్‌గా నడవాలి.
అభివృద్ధి చెందిన దేశాలు ముందుగా పారిశ్రామికీకరణ పూర్తి చేసి, టెక్నాలజీలో ముందు ఉండటం వల్ల ఇప్పటిదాకా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించాయి.
తమకు అనుకూలంగా రూల్స్ రాసుకున్నాయి. అవసరమైతే రూల్స్ మార్చేశాయి. దీనివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇబ్బంది పడ్డాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
చైనా, ఇండియా లాంటి ఎమర్జింగ్ దేశాలు పైకి వస్తున్నాయి. దాంతో పాత పద్ధతులు పనిచేయట్లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఫైనాన్షియల్ రిస్కులు, నిరుద్యోగం, నెమ్మదించిన వృద్ధి కనిపిస్తున్నాయి.
సమస్యను అర్థం చేసుకొని మారాల్సింది పోయి, ఆ దేశాలు తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి గ్లోబలైజేషన్ను తప్పుబడుతున్నాయి. యూనిలేటరలిజం, ప్రొటెక్షనిజం వైపు వెళ్తున్నాయి.
కొత్త అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు పరిష్కారం ఏమిటంటే, అందరినీ కలుపుకుపోయే, నాణ్యమైన, ఓపెన్ వరల్డ్ ఎకానమీని నిర్మించడమే. మానవాళి ఉమ్మడి అభివృద్ధి కోసం నాలుగు విషయాలు కావాలి:
ఇంటిగ్రేషన్, కనెక్టివిటీ: దేశాలన్నీ కలిసిపోవాలి.
మ్యూచువల్ లెర్నింగ్: ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలి.
మ్యూచువల్ ప్రమోషన్: కలిసి పైకి రావాలి.
కామన్ డెవలప్మెంట్: ఉమ్మడి అభివృద్ధి.
“బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్” ద్వారా చైనా ఇదే చేస్తోంది. శాంతి, సహకారం, ఓపెన్నెస్, మ్యూచువల్ లెర్నింగ్, మ్యూచువల్ బెనిఫిట్ అనే “సిల్క్ రోడ్ స్ఫూర్తి”ని ప్రమోట్ చేస్తోంది.
చైనా ఏం కోరుకుంటుంది?
తన అభివృద్ధితో పాటు ప్రపంచానికి కొత్త అవకాశాలు ఇవ్వాలని చైనా చూస్తోంది. మార్కెట్ యాక్సెస్ పెంచడం, ఇతర దేశాలతో కలిసి డెవలప్ అవ్వడం, హై-క్వాలిటీ ఎకానమీని నిర్మించడం దీని లక్ష్యం.
అంతిమంగా ప్రపంచం మార్కెట్ మూసుకుపోతే అందరూ నష్టపోతారు. ఓపెన్ మార్కెట్ విధానం ద్వారానే అందరికీ అవకాశాలు వస్తాయి. చైనా చెబుతున్న ఓపెన్ వరల్డ్ ఎకానమీ అంటే ఇదే.
అనువాదం: ఏవీ రావు
సౌత్ చైనా సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
