అధికార దౌత్య సంబంధాల గురించి కాకుండా, ప్రజల మధ్య సంబంధాల గురించి మాత్రమే గతంలో సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, సీనియర్ నేత దత్తాత్రేయ హోసబలే వ్యాఖ్యానించినట్లు సునీల్ అంబేకర్ వివరణ ఇచ్చారు.
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ప్రజల మధ్య సంబంధాలు ఏర్పడాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నాయకుడు సునీల్ అంబేకర్ బుధవారం(జూన్ 17న) చెప్పారు.
పొరుగు దేశాల ప్రభుత్వాల మధ్య జరిగిన సంప్రదింపులు “విఫలమయ్యాయని” ఆయన అన్నారు.
“ఇంతవరకు ప్రభుత్వాలు, సైన్యాలు, ఏజెన్సీల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మేము నమ్మకాన్ని కోల్పోయాం. కాబట్టి ప్రజల మధ్య సంబంధాలు చాలా ముఖ్యం” అని పుణే యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం కార్యక్రమంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అంబేకర్ చెప్పినట్లు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) కథనం తెలియజేసింది.
గతంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, నాయకుడు దత్తాత్రేయ హోసబలే చేసిన వ్యాఖ్యలు అధికార దౌత్య సంబంధాల గురించి కాదని, ప్రజల మధ్యన సంబంధాల గురించి చెప్పారని అంబేకర్ వివరణ ఇచ్చారు.
“సర్ సంఘచాలక్ (ఆర్ఎస్ఎస్ చీఫ్) చేసిన వ్యాఖ్యలు ప్రజల మధ్య సంబంధాల గురించి మాత్రమే. ప్రభుత్వాలు చర్చలు జరుపుతాయా లేదా అన్నది జాతీయ శ్రేయస్సు, అనేక సున్నితమైన అంశాలతో కూడిన కఠినమైన దౌత్యంతో ముడిపడి ఉంది” అని అంబేకర్ పేర్కొన్నారు.
పాక్ పాలకుల పట్ల నమ్మకం లేదు..
భారత్లో పాకిస్తాన్ సైన్యం, రాజకీయ నాయకత్వం పట్ల విశ్వాసం పూర్తిగా సన్నగిల్లిందని, కాబట్టి ఈ ప్రతిష్టంభన తొలగాలంటే ప్రజల మధ్య సంబంధాలే ఉత్తమ మార్గమని మే నెలలో పీటీఐ వీడియోలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ ఆర్ఎస్ఎస్ నాయకులు హోసబలే అన్నారు.
ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ జూన్ 14న హోసబలే వ్యాఖ్యలను సమర్థిస్తూ, “విభజన జరగకపోయి ఉండవలసిందని” పాకిస్తాన్లో అనేక మంది ప్రజలు నమ్ముతున్నారని అన్నారు.
ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనిని అనేక మంది పాకిస్తాన్ జర్నలిస్టులు “ప్రశంసిస్తున్నారని” కూడా భగవత్ చెప్పినట్లు హిందుస్తాన్ టైమ్స్ కథనం తెలియజేసింది.
“పాకిస్తాన్లో అనేక మంది ప్రజలు భారత్ విభజన తప్పని భావిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ చేపడుతున్న పనులను అనేక మంది జర్నలిస్టులు ప్రశంసిస్తున్నారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా అక్కడి ప్రజల్లో బలమైన భావన ఏర్పడుతోంది. ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ కలిసి జీవిస్తే బాగుంటుందని వారంటున్నారు” అని భగవత్ వివరించారు.
దౌత్య నిర్ణయాలు ప్రభుత్వానికే వదిలేయాలి..
ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ్ అయిన అంబేకర్ బుధవారం మాట్లాడుతూ- విదేశాంగ విధాన నిర్ణయాలను, ముఖ్యంగా సంఘర్షణ లేదా అసాధారణ పరిస్థితులు ఉన్న సమయంలో ప్రభుత్వానికే వదిలివేయడం ఉత్తమమని అన్నారు.
“ఇతర దేశాలకు సంబంధించిన అంశాలు తలెత్తినప్పుడు, రాజకీయ విభేదాలను పక్కన పెట్టాలి. తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయాలి, జాతీయ శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది” అని అంబేకర్ చెప్పారు.
ఆర్ఎస్ఎస్ ఒక సామాజిక, సాంస్కృతిక సంఘం అయినందున అవసరం అనుకున్నప్పుడల్లా తన అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తూనే ఉంటుందని ఆయన తెలిపారు.
రెండు దేశాల మధ్య ప్రస్తుతం వైద్యపరమైన పర్యటనలు, వ్యాపారాలతో సహా పరస్పర రాకపోకలు కొనసాగుతున్నాయని, ఇలాంటి ఇష్టాగోష్ఠులు భాగస్వామ్య చారిత్రక, సాంస్కృతిక జ్ఞాపకాలను పరిరక్షించడానికి సహాయపడతాయని అంబేకర్ గుర్తుచేశారు.
“ప్రజల మధ్య చర్చలు చాలా ముఖ్యం, అవి కొనసాగాలి. దానిని రాజకీయ దౌత్యంగా చూడరాదు” అని అంబేకర్ అన్నట్లు పీటీఐ తెలియజేసింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
