అలనాటి మహాభారత రాజకీయాలకూ, ఈనాటి ప్రజాస్వామిక భారత రాజకీయాలకూ పోలికలున్నాయంటే నమ్ముతారా? ఎలాగో చూడండి…
పద్దెనిమిది పర్వాలతో, అనేక ఉపాఖ్యానాలతో 80 వేలకు పైగా శ్లోకాలతో ఉన్న మహాభారతంలో అన్నదమ్ముల పిల్లలైన కురుపాండవుల మధ్య వైరం ప్రధాన ఇతివృత్తమైందనీ, అది చివరికి కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిందనీ తెలిసినదే.
ఈ అన్నదమ్ముల వైరం చుట్టూనే అందులోని ప్రధాన పాత్రల వ్యక్తిత్వాలూ, ఆలోచనాధోరణులూ అల్లుకుని ఉంటాయి; ఆ వైరం చుట్టూనే వారి వైఖరులు రూపొందుతాయి.
ఉదాహరణకు, కర్ణుడు, శకుని లాంటి పాత్రలు కురుపాండవుల మధ్య శత్రుత్వాన్ని ఎగదోసే పాత్రలైతే, కౌరవ పక్షంలో ఉంటూనే పాండవ పక్షపాతాన్ని చాటుతూ యుద్ధం వద్దని హితబోధ చేసే పాత్రలు భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మొదలైనవారు.
యుద్ధం పట్ల భిన్న వైఖరులు
అటు పాండవ పక్షంలో కూడా యుద్ధం వద్దనుకునేవారు, యుద్ధం జరిగితీరాలని కోరుకునేవారు; పూర్తిగా యుద్ధ వ్యతిరేకులూ కాకుండా, యుద్ధ వాదులూ కాకుండా మధ్యస్థంగా ఉండేవారు కనిపిస్తారు.
యుద్ధం వద్దనుకునేవారిలో ప్రముఖుడు ధర్మరాజైతే, యుద్ధం జరిగితీరాలని కోరుకున్నవారిలోకి విచిత్రంగా స్త్రీలైన ద్రౌపది, కుంతి వస్తారు.
కృష్ణుడు యుద్ధాన్ని నివారించడానికి రాయబారం జరిపినప్పటికీ ద్రౌపదిలా, కుంతిలా యుద్ధాన్ని కోరుకున్నవాడిలానే కనిపిస్తాడు.
భీముడు యుద్ధాన్ని కోరుకున్నవాడే అయినా అన్న పట్ల విధేయత అతణ్ణి కూడా యుద్ధ విముఖుణ్ణి చేయడం- కృష్ణుడు రాయబారానికి వెళ్ళేముందు పాండవులతో జరిపిన మంతనాల సందర్భంలో కనిపిస్తుంది. ఇక యుద్ధ నివారణకూ, యుద్ధానికీ కూడా అభ్యంతరం లేని ప్రముఖ పాత్రలలో అర్జునుడు ఒకడు.
నాటి కురుక్షేత్రం.. నేటి ఎన్నికల సమరం
ఇప్పటి మన బహుళపక్ష ప్రజాస్వామిక పార్లమెంటరీ రాజకీయాలతో పోల్చి చెప్పుకుంటే, కౌరవులు ఒక పార్టీ, పాండవులు ఒక పార్టీ అవుతారు. కౌరవులది అధికార పక్షమైతే పాండవులది ప్రతిపక్షం. వారి మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం నేటి ఎన్నికల యుద్ధం లాంటిది.
కాకపోతే, ఒక తేడా ఉంది- కురు, పాండవులది దాయాదుల పోరు; ఆపైన రెండు పక్షాలతో బంధుత్వం ఉన్న కుటుంబాలు ఉన్నాయి కనుక, ఏ పక్షంలో చేరడానికైనా మొహమాటపడినవారు కచ్చితంగా ఉంటారు; చివరికి దాని నుంచి బయటపడి ఏదో ఒక పక్షంలో చేరినవారే ఎక్కువమంది.
ఇలాంటివారిని అలా ఉంచితే; పాండురాజు రెండవ భార్య మాద్రికి సోదరుడు, నకుల, సహదేవుల మేనమామ అయిన శల్యుడి ఉదంతం మరో తీరు. అతను సైన్యంతో మద్రదేశం నుంచి కురుక్షేత్రానికి వస్తున్నప్పుడు మార్గమధ్యంలో అతనికి దుర్యోధనుడు చక్కటి వసతి సదుపాయాలనూ, విందు విలాసాలను ఏర్పాటుచేసి తనవైపుకు తిప్పుకుంటాడు.
నేటి మన బహుళపక్ష ప్రజాస్వామిక ఎన్నికల యుద్ధాలకూ, ప్రభుత్వాల ఏర్పాటుకూ మహాభారత గాథతో పోలిక ఇంకా ఎంత చక్కగా కుదురుతోందో చూడండి- మహాభారతం ప్రకారం నాటి కురుక్షేత్ర యుద్ధంలో అటు ఉత్తర, వాయవ్య, ఈశాన్య, పశ్చిమ, దక్షిణాలకు చెందిన అనేక రాజవంశాలు కౌరవుల పక్షంలోనో, పాండవుల పక్షంలోనో చేరి యుద్ధం చేశాయి. అంటే, అవి నేటి ఎన్నికల్లోనూ, ఆ తర్వాతా అధికార పక్షంతోనో, ప్రతిపక్షంతోనో పొత్తు పెట్టుకునే పార్టీల్లాంటివన్నమాట.
కురు, పాండవులు ఉభయులతోనూ ఉన్న బంధుత్వంతోపాటు, దుర్యోధనుడిపై తనకున్న శిష్యవాత్సల్యంతో కూడా మొహమాటం అడ్డువచ్చి ఏ పక్షంలోనూ చేరకుండా యుద్ధానికి దూరంగా ఉండిపోయి తీర్థయాత్రకు వెళ్ళినవాడు కృష్ణుని అన్న బలరాముడొక్కడే కనిపిస్తాడు.
అలాగే, రెండు పక్షాలవారూ తనను చేర్చుకోవడానికి నిరాకరించడంతో యుద్ధానికి దూరంగా ఉండిపోయిన మరో పాత్ర, కృష్ణుని బావమరిది, రుక్మిణి సోదరుడు రుక్మి. యుద్ధంలో లేనివారు ఈ ఇద్దరే నని మహాభారతం చెబుతోంది.
రాజకీయాల్లో పార్టీ విధేయత – నాడు, నేడు
పార్టీ అనేటప్పటికి ‘పార్టీ విధేయత’ అనేది రాజకీయాలలో ఒక కొలమానం అవుతుంది; మళ్ళీ ఆ విధేయత కూడా రకరకాల రూపాలు ధరిస్తుంది.
ఉదాహరణకు, అది కేవలం తాము ముందునుంచీ ఉన్న, లేదా తమను ముందునుంచీ ఆదరించిన పార్టీ పట్ల పాటించే విధేయత కావచ్చు; ఆ పార్టీ నాయకత్వం వ్యవహరించే తీరు కానీ, దాని భావజాలంలో వచ్చిన మార్పు కానీ వ్యక్తిగతంగా తమకు నచ్చకపోయినా పార్టీ పట్ల విధేయతకు కట్టుబడి ఉండడం ఒక రకం; ఆ పార్టీలో ఉంటూనే ఆ పార్టీ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ అవతలి పార్టీ పట్ల పక్షపాతాన్ని చాటుకోవడం ఇంకో రకం.
ఈ రెండు రకాల్లోకీ, కొంచెం హెచ్చు తగ్గుల తేడాతో భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మొదలైనవారు వస్తారు. అయితే, భీష్మ ద్రోణులు స్వయంగా యుద్ధంలో పాల్గొని తామున్న పార్టీ కోసం ప్రాణాలు అర్పించారు కానీ; తనది భిన్నమైన వృత్తి కనుక విదురుడు యుద్ధంలో మాత్రం పాల్గొనలేదు.
అన్నట్టు, ఇంకో విశేషం ఏమిటంటే, నేటి మన ప్రింటు, ప్రసార మాధ్యమాలకు చెందిన జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహించే పాత్ర కూడా ఒకటి మహాభారతంలో ఉంది- అతని పేరు సంజయుడు.
వ్యాసుడు అతనికి ‘దివ్యదృష్టి’ నిచ్చి, కురుక్షేత్రంలో జరిగే యుద్ధాన్ని ఏ రోజూకారోజు దర్శించి హస్తినాపురంలో ఉన్న ధృతరాష్ట్రుడికి వివరించి చెప్పే బాధ్యతను అప్పగిస్తాడు. అలాగని సంజయుడు అధికార పక్షానికి చెందిన మూలవిరాట్టుకే యుద్ధ సమాచారాన్ని అందిస్తున్నప్పటికీ, తన విధి నిర్వహణలో అధికార పక్షానికి బాకాగా వ్యవహరించడు.
న్యాయ, ధర్మాలు పాండవులవైపే ఉన్నాయని మాటిమాటికీ గుర్తుచేస్తూనే ఉంటాడు.
వికర్ణుడు, యుయుత్సుడు.. అవకాశవాద రాజకీయాలు
అన్నట్టు, ఇంకా అంతకన్నా చెప్పుకోవలసిన విశేషం ఇంకొకటి ఉంది. అది నేటి మన రాజకీయాల తీరుతెన్నులకు మరింత స్పష్టంగా అద్దంపడుతుంది.
పార్టీ విధేయతలను అలా ఉంచి; కేవలం అధికారమే లక్ష్యంగా, లేదా అధికార పక్షంతో అంటకాగడమే పరమాశయంగా విలువల పట్ల విధేయతను కూడా గొయ్యి తవ్వి పాతిపెట్టే నేటి అతినీచ, అవకాశవాదపూరిత రాజకీయ ప్రవృత్తిని అది గుర్తుకు తెస్తుంది.
ఈ సందర్భంలో మహాభారతంలోని రెండు పాత్రలను ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి; పైన చెప్పుకున్న అనేక మహాభారత పాత్రలతో పోల్చితే ఈ రెండు పాత్రలూ అంత ప్రసిద్ధమైనవీ కావు; అంత ప్రాముఖ్యమున్నవీ కావు- కానీ, పార్టీ విధానాలు తనకు నచ్చకపోయినా, కీలక సమయంలో దానిని ఎత్తిచూపినా, యుద్ధం సంభవించాక కష్టనష్టాలకు ఎదురొడ్డి తనున్న పార్టీ పట్ల విధేయతను చాటుకోవడానికీ; అంతవరకూ పార్టీలో ఉండి, పార్టీ విధివిధానాలు కానీ, వ్యవహారసరళి కానీ తనకు నచ్చకపోయినా మౌనం వహించి చివరి నిమిషంలో నిస్సిగ్గుగా అవతలి పక్షం వైపు ఫిరాయించే అవకాశవాదానికీ ప్రాతినిధ్యం వహించే పాత్రలు అవి.
మొదటి రకం పాత్ర వికర్ణుడైతే, రెండవ రకం పాత్ర యుయుత్సుడు.
ఈ ఇరువురూ నూరుగురు కౌరవ సోదరులలో భాగమే. వికర్ణుడు ఒకే ఒక సందర్భంలో విలువల పట్ల విధేయతను చాటుకుంటూ, తన వ్యక్తిత్వాన్ని స్థాపించుకుంటూ కౌరవ పక్ష వైఖరిని తప్పు పడతాడు. అది, ధర్మరాజు శకునితో జూదమాడి తన రాజ్యాన్నీ, సోదరులనూ పణంగా పెట్టి ఓడిపోయిన సందర్భంలో.
ఆ తర్వాత ద్రౌపదిని నిండు సభలోకి రప్పించి అవమానించే సందర్భంలో వికర్ణుడు గొంతెత్తి దానిని ప్రశ్నించి గర్హిస్తాడు. అంతే, ఆ ఒకే ఒక్క సందర్భంలో మెరుపులా మెరిసిన పాత్ర అతను. ఆ తర్వాత అతని ప్రస్తావన నాకు తెలిసి ఒక్కసారి మాత్రమే వస్తుంది.
కృష్ణుడు హస్తినాపురానికి రాయబారిగా వచ్చినప్పుడు అతని వసతికి వికర్ణుని గృహాన్ని సిఫార్సు చేయడం కనిపిస్తుంది. కానీ కృష్ణుడు విదురుని ఇంట్లో ఉండడానికి మొగ్గు చూపుతాడు.
చివరిగా వికర్ణుడు కౌరవ పక్షంలో యుద్ధంచేసి చనిపోవడం గురించి మహాభారతం చెబుతుంది. ఆవిధంగా పార్టీ విధానాల పట్ల వ్యతిరేకత ఉన్నా చివరివరకూ పార్టీ పట్ల చెక్కుచెదరని విధేయతతో ప్రాణాలు అర్పించిన అత్యంత విశిష్టపాత్ర వికర్ణుడు.
నా ఉద్దేశంలో భీష్మ, ద్రోణులతో సహా ఎందరో ప్రముఖులకన్నా కూడా ఉన్నత వ్యక్తిత్వాన్ని చాటుకున్న పాత్ర అతను.
అదే యుయుత్సుని విషయానికొస్తే, యుద్ధం ప్రారంభమయ్యేముందు ధర్మరాజు కౌరవ సైన్యాన్ని ఉద్దేశించి, ‘మా పక్షంలోకి ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు, వాళ్ళను నా తమ్ముళ్ళతో సమానంగా ఆదరిస్తా’నని ప్రకటిస్తాడు. అప్పుడు యుయుత్సుడు ‘నేను వస్తా’నని చెప్పి పాండవ పక్షంలోకి ఫిరాయిస్తాడు.
అంతేకాదు, వెళ్ళీ వెళ్ళగానే దుర్యోధనుడి దుర్మార్గాలను ఏకరవు పెడుతూ పాండవుల సుగుణాలను ఘనంగా పొగుడుతూ ధర్మరాజును ఉబ్బేస్తాడు.
నేటి భారత రాజకీయాల్లో యుయుత్స సంతతి
ఇక ప్రస్తుతానికి వస్తే- ప్రత్యేకించి గత పన్నెండేళ్ళ కాలంలో భారత రాజకీయాల్లో ఇలాంటి యుయుత్స సంతతిని తామరతంపరగా చూస్తున్నాం.
దేశవ్యాప్తంగా దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న మాజీ, తాజా ముఖ్యమంత్రులు, మంత్రులు ఈ యుయుత్స సంతతిలోకే వస్తారు. ఇప్పుడు కేంద్రంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న పార్టీని కానీ, దాని భావజాలాన్ని కానీ, దాని పరివార సంస్థలను కానీ మొన్నటివరకు తమ రాజకీయ జీవితంలో వీరు ఎన్నడూ ఆమోదించి నెత్తినపెట్టుకోలేదు; భావజాలపరంగా కూడా దానికి భిన్నమైన రాజకీయాలే నడిపారు. కానీ ఇప్పుడు ఆ పార్టీనీ, దాని భావజాలాన్నీ, దాని రంగునూ, దానికి చెందిన సకల పరివారాన్నీ నెత్తినపెట్టుకుని మోస్తున్నారంటే కారణం, అది అధికారంలో ఉండడమే కాక; తమను అధికారంలో ఉంచగలిగింది కావడమే.
భారతదేశ చరిత్ర అంతా అధికారంలో ఉన్నవారి ప్రాపకం కోసం ఇలా సొంత వ్యక్తిత్వాలకు, విలువలకు, ఉచితానుచితాలకు, సిగ్గెగ్గులకు పాతరేసి గులాముగిరీ చేయడమే ననిపిస్తుంది.
మొగలాయీల పాలనలోనూ, బ్రిటిష్ పాలనలోనూ కూడా ఇదే జరిగింది. ఏ ఎండకా గొడుగుపట్టే ఈ దాస్య ప్రవృత్తే దేశాన్ని పరాయి పాలకుల పాలబడేలా చేసింది.
రాజకీయ నాయకులే కాదు, జర్నలిస్టులు, సినీనటులతో సహా అన్ని రంగాలకు చెందినవారిలో అనేకమంది ఈ యుయుత్స సంతతిలోకే వస్తారు.
పన్నెండేళ్ళకు ముందు మతం గురించి కానీ, మత ప్రాతిపదిక గల జాతీయత గురించి కానీ, దేశభక్తి గురించి కానీ మాట్లాడని వీరంతా ఇప్పుడు వాటి గురించి మాట్లాడుతున్నారంటే కారణం, అవి అధికారంలో ఉండడమే.
ఈ నడమంత్రపు మతవాదులకన్నా ఆ భావజాలం కింద ఆ పరివారంలో ముందు నుంచీ పనిచేస్తూవచ్చిన వారే ఎక్కువ గౌరవనీయులు కారంటారా?
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
